[సర్ జార్జ్ హెచ్. డార్విన్ ప్రకారం ఒకప్పుడు చందమామ భూమికి చాలా దగ్గరగా ఉండేది. సముద్ర కెరటాలు దాన్ని దూరంగా నెట్టివేశాయి: ఆ కెరటాలు నేలమీది సముద్రాల్లో చందమామ వల్ల కలిగినవే. వాటి వల్లే భూమి తన వేగాన్ని కోల్పోయింది.]
నాకెంత బాగా గుర్తుందో… ముసిలి కఫవఫక గర్వంగా చెప్పేడు – మీ కెవ్వరికీ ఏదీ గుర్తులేదు, కాని నాకు అన్నీ బాగా జ్ఞాపకం. ఒకప్పుడు చందమామ మా నెత్తిమీదే ఉండేది. అది ఎంత పెద్దదనుకున్నారు! నిండుపున్నమి రాత్రుళ్ళు కూడా పగళ్ళలా ఎంతో వెలుగుతో నిండిపోయి ఉండేవి. కాకపోతే, ఆ వెలుగులో వెన్నలా పగటిపూట వెలుగుకి ఒక చాయ తక్కువుండేది. అంతే! అంత దగ్గరగా చందమామను చూస్తుంటే మనమీద పడి ఒత్తేస్తుందేమో అన్న భయం వేసేది. అమావాస్య రోజున ఆకాశంలో గాలికి ఎగిరిపోతున్న నల్లని గొడుగులా ఉండేది. మళ్ళీ శుక్లపక్షం రాగానే, క్రమంగా పెరుగుతూ దాని కొమ్ములు క్రిందకి ఎంత దగ్గరగా వచ్చేవంటే, ఏ కొండ కొమ్ముకో అవి చిక్కుకుపోతాయేమో అనిపించేది. ఆ రోజుల్లో, చందమామ పదహారు కళలూ ఇప్పటిలా ఉండేవి కావు. సూర్యుడి నుండి దూరంలో తేడాలు ఉండడం వల్ల, దాని కక్ష్యలోనో, కోణంలోనో దేనిలో ఒకదానిలో మార్పులు ఉండేవి. అవిప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు. కాని, భూమీ చందమామా ఒకదానికొకటి మరీ దగ్గరగా ఉండేవేమో, నిముష నిముషానికీ గ్రహణాలు వస్తుండేవి: సహజంగానే. ఈ రెండు భీకర ఆకారాలూ ఎలా తిరిగేవో గాని, ఎప్పుడూ ఏదో ఒకటి, రెండో దాని నీడలోకి వస్తూండేది. దానివల్ల ఒకసారి చంద్రగ్రహణం వస్తే, రెండోసారి సూర్యగ్రహణం వస్తూండేది.
చందమామ కక్ష్య సంగతి అంటారా? అది అప్పుడూ దీర్ఘవృత్తాకారంలోనే ఉండేదనుకోండి. ఒకసారి బాగా దగ్గరకి వచ్చేద్, ఇంకోసారి బాగా దూరమయ్యేది. ఒక్కోసారి పున్నమినాడు చందమామ భూమికి మరీ దగ్గరగా వచ్చినప్పుడు కెరటాలు ఎంత పోటెక్కేవంటే, చందమామ అందులో మునిగిపోవడం వెంట్రుకవాసిలో తప్పిపోయేది. మీకు అతిశయోక్తిలా కనిపిస్తే, కొన్ని గజాలు అనుకోండి. అయితే మరి మీరు చందమామ మీదకి ఎక్కేరా? అని అడగొచ్చు. ఆహాఁ! ఎన్నో సార్లు ఎక్కేము. మీరు చెయ్యవలసిందల్లా పడవలో దానికి దగ్గరగా తెడ్లు వేసుకుంటూ వెళ్ళి, సరిగ్గా దాని క్రిందకి రాగానే, ఒక నిచ్చెన దానికి తగిలించడం, గబగబా మీదకి ఎగబ్రాకడం. అంతే!
కొన్నాళ్ళకి చందమామ అలా అలా దూరం అవుతూ, అది భూమికి అతిదగ్గరగా ఉండే చోటు తగరం చరియలదాకా పోయింది. ఆ రోజుల్లో, మా దగ్గర గుండ్రంగా చదునుగా ఉండే జీలుగుబెండుతో చేసిన నాటు పడవలుండేవి. వాటిల్లో అక్కడికి చేరుకునే వాళ్ళం. అవి మరీ అంత చిన్నవేం కావు. వాటి మీద చాలామందిమి ప్రయాణం చేసేవాళ్ళం: నేను, సరంగు వహదవహద, అతని భార్య, నా చెవిటి మేనబావ, అప్పుడప్పుడు క్షలతలక్ష- ఆమెకప్పుడు సుమారు పన్నెండేళ్ళు ఉంటాయేమో. రాత్రుళ్ళు కెరటాల జోరు లేకుండా సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నీళ్ళు మిలమిలా ఎంత మెరిసిపోయేవంటే, పాదరసమేమో ననిపించేది. అలాంటి సమయంలో మేము చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళం. చందమామ లేతగులాబీరంగులో ఉండి నీటి మీదకి లేస్తుంటే ఎంత సమ్మోహనంగా ఉండేదో చెప్పలేం. మేమే కాదు, చేపలూ, ఆక్టోపుస్‍లు, కుంకుమరంగు మెడుసాలూ కూడా నీటి మీదకి తేలివచ్చేవి చంద్రుడి ఆకర్షణకు లొంగిపోయి. ఇక చిన్న చిన్న పీతలు, కణవలు, నాచు అయితే చెప్పక్కరలేదు. అవి సముద్రం అలలమీద నుండి విడిపోయి చందమామ మీద పడిపోయేవి. అలా గుంపులు గుంపులుగా మెరుస్తూ సున్నం వేసిన చూరుకి వేలాడుతున్నట్టు గాలిలో వేలాడేవి. వాటికి అరటి ఆకులు ఊపుతూ టాటా చెబుతుండే వాళ్ళం.
మేం ఏం చేసేవాళ్ళమంటే – మా పడవలో ఒక నిచ్చెన ఉండేది. ఒకరు దాన్ని పట్టుకునేవారు. మరొకరు దాని చివరి మెట్టుకి ఎక్కేవారు. మూడోవారు తెడ్లు వేస్తూ సరిగ్గా చందమామ క్రింద చేరుకునేలా చూసేవారు. అందుకనే అంతమంది అవసరం అయ్యేది. (నేను కేవలం ముఖ్యమైన వాళ్ళ పేర్లే చెప్పేను.) నిచ్చెనపైకి ఎక్కిన వాళ్ళు, చందమామ దగ్గరకి రాగానే, ‘ఆపాలి, ఆపాలి, లేకపోతే నా బుర్ర ఢాం అని కొట్టుకుంటుంది’ అని గట్టిగా అరిచేవాళ్ళు. రంపంపళ్ళలా సూదిగా, ఎగుడుదిగుడుగా మొనదేరిన కొనలతో నెత్తి మీదకి పెద్ద చందమామ వేగంగా వస్తూ కనిపిస్తుంటే, మీకైనా అదే అనిపిస్తుంది. ఇప్పటి పరిస్థితి వేరు. అప్పట్లో చందమామ పొట్టలాంటి అడుగువైపు, భూమికి దగ్గరగా రాసుకుంటూ పోతుందేమోనని అనిపించే కిందవైపు చాలా పదునైన పొలుసుల లాంటి అంచులతో నిండి ఉండేది. అది అచ్చం చేప పొట్టలా ఉండడమే కాదు, దాని వాసన కూడా అలాగే ఉండేది. జ్ఞాపకం చేసుకుంటే, అది పచ్చిచేపలా కాకపొయినా, కుంపటిమీద కాల్చిన బుడతమాగ చేపలా వాసన వేసేదని గుర్తు.
నిజం చెప్పాలంటే, నిచ్చెన చివరిమెట్టు ఎక్కిన తర్వాత, నిటారుగా నిలబడి, మీరు చేతులు పైకి ఎత్తి చందమామను తాకవచ్చు. మేము జాగ్రత్తగా నిలబడి కొలుచుకున్నాం కూడా. (అప్పట్లో అది దూరంగా జరిగిపోతుందన్న అనుమానం మాకు ఏమాత్రం రాలేదు.) అయితే, మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఒకటుంది: అది మీరు చేతులు ఎక్కడ పెడుతున్నారన్నది. నే నెప్పుడూ గట్టిగా బిగువుగా ఉండే పొలుసులాంటి భాగాన్నే ఎంచుకునే వాణ్ణి. (ఎప్పుడూ ఐదుగురారుగురం ఒక జట్టుగా చందమామ మీదకి ఎక్కే వాళ్ళం.) ముందు ఒక చేత్తో గట్టిగా ఒక ఆధారాన్ని పట్టుకుని పట్టుకుని, తర్వాత రెండో చెయ్యి వేసి పట్టుకునే వాడిని. వెంటనే నా కాళ్ళక్రింద నిచ్చెనా, పడవా కదిలిపోవడం తెలిసేది. వేగంగా కదుల్తున్న చందమామ భూమ్యాకర్షణ నుండి నన్ను తప్పించేది. అవును. చందమామ ఆకర్షణ శక్తి ఎంత బలంగా ఉండేదంటే, అది నన్ను తనమీదకి లాక్కునేది. ఈ విషయం ఒక ఆకర్షణ నుండి రెండవదాని ఆకర్షణలోకి వెళ్ళగానే అనుభవం లోకి వచ్చేది. కాకపోతే, మీరు ఒక్కసారి ఆ చందమామ మీది ఆధారాన్ని రెండు చేతులతో పట్టుకున్నాక, కాళ్ళు మీదకి ఎగరేసి, చందమామ మీదకు పిల్లిమొగ్గ వేసినట్టు ఒక గెంతు గెంతాలి. భూమి మీంచి చూస్తే మీరు అక్కడ తలక్రిందులుగా వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ, మీకు అక్కడ సహజంగా, కాళ్ళు కిందకీ తల మీదకీ ఉన్నట్టే ఉంటుంది. మీకు చిత్రంగా కనిపించేది ఒక్కటే – మీరు తలెత్తి పైకి చూస్తే, ఇప్పుడు మెరుస్తూ సముద్రము, పడవ, తక్కిన వస్తువులూ తీగకి వేలాడుతున్న ద్రాక్షగుత్తుల్లా నెత్తి మీద కనిపిస్తాయి.
నే చెప్పేనే, మా చెవిటి బావ అని, వాడికి ఈ దూకడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. మామూలుగా అంత మోటుగా ఉంటాయా వాడి చేతులు, చందమామను తాకగానే (ఎప్పుడూ వాడే అందరికంటే ముందు దూకేవాడు) ఎంతో చాకచక్యంగా, సున్నితంగా పనిచేసేవి. ఎక్కడ పట్టుకుంటే వాడు సులభంగా దూకగలడో ఆ చోటును ఇట్టే పట్టేసేవి. వాడికి ఏ పొలుసూ అక్కర్లేదు, వాడు కేవలం అరచేతులు ఆనించి చందమామ మీదకు దూకగలడని నాకనిపించేది. ఒకోసారి, చందమామే ముందుకు వంగి వాణ్ణి అందుకుందుకు చేతులు చాచిందేమో అనిపించేది.
మా బావకి తిరిగి భూమి మీదకి రావడంలోనూ అంత నైపుణ్యమే ఉంది: తిరిగిరావడం వెళ్ళడం కంటే కష్టమైన వ్యవహారం. వచ్చేటప్పుడు, చందమామ మీద మనం చేతులు మీదకి చాచి ఎంత ఎత్తుకి ఎగరగలిగితే అంత ఎత్తుకి ఎగరాలి (అదే భూమి మీదనుండి చూసినపుడు చేతులు పైకి చాచి క్రిందకి ఈదుతున్నట్టు కనిపిస్తుంది). అది భూమి మీదనుండి ఎగిరినట్టే ఉంటుంది గాని, మనకి సహాయంగా నిచ్చెన ఏదీ ఉండదు. అక్కడ చందమామ మీద నిలబెట్టడానికి ఏదీ ఉండదు. అందుకని వాడు ఏం చేసేవాడంటే, చందమామ మీద తలక్రిందులుగా (శీర్షాసనం వేసినట్టు) నిలబడి, అక్కడనుండి చేతులతో బలంగా చందమామని తోసినట్టు తోసి, భూమి మీదకి ఒక్క దూకు దూకేవాడు. మేము పడవమీంచి వాడిని గమనిస్తే, గాలిలో నిటారుగా నిలబడి, వాడు చందమామని వాడి చేతుల్లో పట్టుకున్నట్టూ, వాడే చేతులతో తట్టి దాన్ని ఎగరేస్తున్నట్టూ కనిపించేది. వాడి కాళ్ళు మేము అందుకోడానికి అనువుగా రాగానే వాడి పాదాలు పట్టుకుని పడవలోకి లాగేసే వాళ్ళం.
మీరు చందమామ మీదకి ఏం పని ఉండి వెళ్ళేరని అని మీలో ఎవరైనా అడగవచ్చు. చెప్తాను. మేము అక్కడ పాలు సేకరించటానికి ఒక పెద్ద గరిట, బాల్చీ పట్టుకుని వెళ్ళే వాళ్ళం. చందమామపాలు చాలా చిక్కగా ఉంటాయి. మీగడంత చిక్కగా. అక్కడి నేల మీది గరుకైన పొలుసుల మధ్య భూమి నుంచి వస్తువులు పులిసిపోవడంవల్ల తయారైన పాలు అవి. చందమామ భూమికి దగ్గరగా, అడవుల్లోంచి, సరస్సులలోంచి, విశాలమైన పచ్చిక బయళ్ళమీంచీ వెళ్ళినప్పుడు ఎగిరి దానిమీద పడ్దవి. వాటిలో ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజలవణాలు, బూడిదా ఉంటాయి. పొక్కులు గట్టిన చందమామ ఉపరితలం మీద మనం చెయ్యవలసింది ఒక్కటే: పొలుసుల్లా కనిపిస్తున్న వాటిక్రింద గరిట పెట్టి లోడుకోవడమే. అది అప్పుడు ముద్దగా ఉంటుంది. అది అలా వాడటానికి పనికిరాదని మీకు వేరే చెప్పాలా? దాన్ని శుద్ధి చెయ్యవలసి ఉంటుంది. అందులో చెత్త చాలా ఉంటుంది. విశాలమైన ఎడారులమీంచి చందమామ ప్రయాణిస్తున్నప్పుడు అక్కడినుండి వచ్చే వేడి గాలులకి ఈ పులిసిపోత జరుగుతుంది. పైన చెప్పినవన్నీ అందులో కరిగిపోవు. కొన్ని అతుక్కుపోయి ఉంటాయి. అతుక్కుపోయే వాటిలో చేతిగోళ్ళు, నరాలు, మేకులు, నత్తపెంకులు, గింజలు, తొడిమలు, చిల్లపెంకులు, చేపలు పట్టడానికి వాడే గాలాలూ అప్పుడప్పుడు దువ్వెనలూ కూడా కనిపిస్తుంటాయి. అందుకనే, ఆ ముద్దని సేకరించిన తర్వాత, దానిని వడపోసి శుభ్రం చెయ్యాలి.
అయితే అసలు కష్టం అది కాదు – అది భూమి మీదకి తీసుకు రావటం. అందుకని, ఏం చేసేవాళ్ళమంటే, గరిటని వడిసెలలా ఉపయోగిస్తూ ఒక్కొక్క గరిటెడు పాలూ గాలిలోకి రెండు చేతుల్తోనూ ఎగరేసే వాళ్ళం. ఆ ముద్ద ఎగిరి పైకప్పుకి అంటుకునేది. ఇక్కడ పైకప్పు అంటే భూమి మీది సముద్రమన్నమాట. ఒక్కసారి సముద్రం మీద పడితే, తేలుతూ ఉండే ముద్దని పడవలోకి లాక్కోడం అంత కష్టం కాదు. ఈ విషయంలోకూడా మా బావగాడు ప్రత్యేకమైన నైపుణ్యం చూపించేవాడు. వాడికి మంచి బలం, గురీ ఉండేవి. పడవలో నిలబడి బాల్చీ ఎత్తి పట్టుకుంటే, మొదటి ప్రయత్నంలోనే అందులోకి సూటిగా పడేలా విసరగలిగేవాడు. నేను అప్పుడప్పుడు గురి తప్పుతుండేవాడిని. ఒకోసారి ఆ ముద్ద చంద్రుడి ఆకర్షణశక్తి దాటలేక, తిరిగి నా మొఖం మీదే పడిపోతుండేది.
మా బావకున్న నైపుణ్యాల సంగతి నేనింకా పూర్తిగా చెప్పనే లేదు. చందమామ పొలుసుల నుండి పాలు సేకరించడం వాడికి చిన్నపిల్లలాట. ఒక్కోసారి, గరిటకు బదులు ఉత్త చేతుల్నే పొలుసుల క్రింద జొప్పించేవాడు. వాడి ఆటకి ఒక వరుసా వావీ ఉండేది కాదు. ఎవ్వరూ వెళ్ళని చోట్లకి వెళుతుండేవాడు, ఒక్కొక్కదాని మీంచి గెంతుకుంటూ. అక్కడికి వాడేదో చందమామతో చమత్కారాలు చేస్తున్నట్టు, లేదా దానికి గిలిగింతలు పెడుతున్నట్టూ. ఆడమేక పొదుగు దగ్గర చెయ్యి పెడితే పాలు కారినట్టు, చిత్రంగా, వాడు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ పాలు ఊరుతూ బయటకి వచ్చేవి. తక్కిన వాళ్ళందరం చేసేదల్లా ఒక్కటే: వాడెక్కడికి వెళితే, మేమూ అక్కడికే వెళ్ళడం; వాడు ఎక్కడ చెయ్యి నొక్కిపెట్టేడో అక్కడ మేము కూడా గరిటలు పెట్టడం; ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఏదో కాకతాళీయంగా నొక్కుతున్నట్టు పొలుసుల్లాంటి చోట్లను నొక్కేవాడు. వాడికో పద్ధతి ఉన్నట్టు మాకనిపించేది కాదు.
వాడు కొన్నిచోట్ల కేవలం సరదాకి ముట్టుకుందుకే చెయ్యి పెట్టినట్టు పెట్టేవాడు. చందమామ చర్మం మీది పొలుసుకూ పొలుసుకూ మధ్యనో, లేకపోతే, ఏ పొలుసులూ లేకుండా లేతగా ఉండేచోటో, చందమామ చర్మం మీద చెయ్యి పెట్టేవాడు. ఇసుకలో ముందుకు దూకి కాలివేళ్ళు జొప్పిస్తామే, అలా, ఒక్కోసారి ఒకే గెంతు వేసి వాడి కాలి బొటనవేళ్ళు మాత్రం సరిగ్గా ఆ పొలుసు కిందకి దూరేలా దూకేవాడు. (వాడెప్పుడూ కాళ్ళకు చెప్పులు లేకుండానే చందమామ మీదకి దూకేవాడు). అలా బొటనవేళ్ళు దూర్చడం వాడికి మహా సంతోషంగా ఉండేది. అలా గెంతుతున్నప్పుడు వాడి కూతలు వింటూంటే మాకు వాడి ఆనందం ఇట్టే తెలిసిపోయేది.
చందమామ పైన నేల అన్ని చోట్లా పొలుసులుగా ఉండదు. అక్కడక్కడ రంగు వెలిసి బోసిపోయినట్టు, కొన్ని చోట్ల అడుగువేస్తే జారిపోయేట్టూ కూడా ఉండేది. ఏయే చోట్లలో మెత్తగా ఉండేదో అక్కడ మా బావ పిల్లి మొగ్గలు వెయ్యడమో, పక్షిలా ఎగురుకుంటూ పరిగెత్తడమో చేసేవాడు – చందమామ మెత్తని ఒంటిమీద తన కాలూ చేయీ ముద్రలు వెయ్యాలనుకునే వాడిలా. ఒకసారి వాడు అలా బయలుదేరితే, వాడి జాడ మాకు దొరికేది కాదు. చందమామ మీద మేము ఎన్నడూ వెతకనివి, అసలు అలాంటి కోరికే మాకు కలగనివీ చాలా చోట్లు ఉన్నాయి. సరిగ్గా అలాంటి చోట్లకి మా బావ మాయమయ్యేవాడు. నా అనుమానం ఏమిటంటే, ఆ పిల్లిమొగ్గలూ చేతితో నేలని తట్టడాలూ అలా ఆ రహస్యప్రదేశాలలోకి మాయమైపోడానికి ముందు తయారీ అని.
తగరం చరియలకు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినపుడు మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉండేది. మా తలలో, మెదడుకి బదులు ఏ చేపలో ఉన్నట్టు, అవి చందమామ ఆకర్షణకి పైకి తేలిపోతున్నట్టూ చిత్రమైన అనుభూతి కలిగేది. అలా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. మా సరంగు భార్య సంగీతం వినిపించేది తన తీగలవాయిద్యంతో. ఆ రాత్రుళ్ళలో, పొడవైన ఆమె చేతులు మలుగుచేపల్లా తెల్లగా కనిపించేవి; ఆమె బాహుమూలాలు నల్లగా సీ అర్చిన్‍లలా మార్మికంగా ఉండేవి. ఆమె వాదన మాత్రం మనోహరంగా, హృదయాలను కదిలించేది. ఆ మధురమైన బాధ తట్టుకోలేక పోయేవాళ్ళం. మాకు సంగీతం లోని లయ వల్ల కాక, ఆ బాధనుండి తట్టుకోలేక కన్నీళ్ళు వచ్చేవి.
స్వచ్ఛమైన మెడూసాలు సముద్రతలం మీదకి తేలి వచ్చి క్షణకాలం ఆ సంగీతానికి ఆటలాడి, చంద్రుడి వైపు దూకుతూ పోయేవి. అదంత సులభం కాకపోయినా, చిన్నారి క్షలతలక్ష వాటిని గాలిలోనే అందుకుందుకు ప్రయత్నిస్తూ ఉండేది. ఒకసారి వాటిని అందుకుందుకు చేతులు బాగా చాచి ఎగిరింది. ఆ ఎగరడంలో చంద్రుడి ఆకర్షణ లోకి పోయింది. అసలే మనిషి సన్నమేమో, భూమ్యాకర్షణశక్తికి చందమామ ఆకర్షణశక్తిని దాటడానికి ఒక రాయో, రెండు రాళ్ళో బరువు తక్కువైంది. దాంతో, తక్కిన మెడుసాలతో పాటే తనూ సముద్రం మీద వేలాడసాగింది ఎటూ కాకుండా. భయం వేసి ముందు ఏడవడం మొదలు పెట్టినా, తర్వాత నవ్వుతూ ఎగురుతున్న గుల్లపురుగులను, నెత్తాలు చేపలనూ పట్టుకోడం ప్రారంభించింది వినోదానికి. కొన్నిటిని నోటితో పట్టుకుని నమలడం ప్రారంభించింది. మేము ఆ పిల్లను గమనిస్తూ చాలా కష్టపడి తెడ్లు వెయ్యవలసి వచ్చింది.
ఇంతలో చందమామ గ్రహణంలోకి వెళ్ళిపోయింది, దానితోపాటే గాలిలో ఎగురుతున్న ఆ జలసంపదని, క్షలతలక్షని, రైలుపెట్టెల్లా పొడుగ్గా వేలాడుతున్న సముద్రపు నాచుని తనవైపు లాక్కుంటూ. గడ్డిపరకల్లాంటి ఆమె రెండు పిలకలూ గాలిలో ఎగురుతున్నాయి చందమామ వైపుగా. అంతసేపూ ఆమె గాలిలో కాళ్ళు కొట్టుకుంటూ విదిలించుకుందుకు ప్రయత్నం చేస్తోంది. తన కాలి బూట్లు ఎప్పుడో జారిపోయాయి. మేజోళ్ళు కాళ్ళనుండి జారి వేలాడుతున్నాయి భూమి ఆకర్షణకి. నిచ్చెన ఎక్కి మేము అందుకుందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఎగురుతున్న చేపల్ని తినాలన్న ఆ పిల్ల ఆలోచన మంచిదయింది. దానితో, ఆ పిల్ల కొంచెం బరువు పెరిగి భూమి వైపు కొద్దిగా జరిగింది. నిజానికి అక్కడ వేలాడుతున్న అన్ని వస్తువుల్లోనూ ఆమే అన్నిటికంటే పొడుగు. నత్తలూ సముద్రపు నాచూ ఆమె వైపుకి ఆకర్షించబడ్డాయి. దానితో ఆమె చుట్టూ గుల్లలు, తాబేలు డిప్పలు, రకరకాలైన చిన్న మొక్కలూ బెరళ్ళూ అంటుకున్నాయి. ఆమె చుట్టూ ఎంత దట్టంగా ఇవన్నీ అల్లుకుంటుంటే, ఆమె బరువు పెరుగుతూ చందమామ ఆకర్షణకి అంతంతగా దూరమవుతూ వచ్చి వచ్చి చివరకి సముద్రం మీద పడి అందులో మునిగిపోయింది.
మేము వెంటనే పడవ నడుపుకుంటూ వెళ్ళి ఆమెని బయటకు లాగి రక్షించాం. ఆమె శరీరమంతా అయస్కాంతశక్తితో నిండిపోయింది. దానితో ఆమె ఒంటికి అంటుకున్న వాటన్నిటినీ పెరకడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. లేతగా ఉండే ప్రవాళాలు ఆమె తలచుట్టూ అల్లుకుపోయాయి. జుత్తులోకి దువ్వెన వేసిన ప్రతిసారీ అందులోంచి రకరకాల చేపలు జలజల రాలేవి. రెప్పలకి నత్తగుల్లలు అంటుకుని కళ్ళు మూసుకుపోయాయి. చేతులకీ, మెడకీ స్క్విడ్‍లు అల్లుకుపోయాయి. ఆమె తొడుక్కున్న గౌను సముద్రపు నాచుతోను, స్పంజ్‍తోనూ నేసినట్టయింది. మేము చాలా వరకు ఒంటి నుండి ఊడబెరకగలిగేం కాని, చాలా వారాల వరకూ ఆ పిల్ల చిన్న చిన్న మొప్పలని, మట్టిగొట్టుకుపోయిన పెంకుల్నీ చిప్పల్నీ ఒంటినుండి తీస్తూనే ఉండేది. జాగ్రత్తగా చూస్తే ఆమె ఒళ్ళు వీటన్నిటితో ముడుతలు పడినట్లు కనిపించేది.
దీనిని బట్టి, భూమీ చందమామా దాదాపు సమానంగా ఉండే వాటి ఆకర్షణతో వాటి రెండింటి మధ్య జాగాని తమ అదుపులో ఎలా ఉంచుకొనాలనుకునేవో మీకు ఈపాటికి కొంతయినా అర్థం అయ్యుండాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి: ఉపగ్రహం నుండి భూమి మీదకి దిగిన ప్రతి వస్తువుకీ కొంతసేపు చందమామ ఆకర్షణ కొంత ఇంకా మిగిలే ఉండేది. ఇంత పెద్ద శరీరం, బరువూ ఉన్న నాకు కూడా, చందమామ మీదకి వెళ్ళి వచ్చిన ప్రతిసారీ భూమి మీది ఎగుడు దిగుళ్ళకు అలవాటు పడటానికి కొంత సమయం పట్టేది.
కాళ్ళు ఇంకా ఆకాశం లోనూ, తల నేల వైపూ ఉండి వేలాడుతుంటే, కెరటాల కుదుపులకి అటూ ఇటూ తూగుతూ, తక్కిన వాళ్ళు నా భుజాలు పట్టుకుని క్రిందకి లాగి, నిలకడగా నిలబెట్టవలసి వచ్చేది. వాళ్ళు నన్ను ‘పట్టుకో! మమ్మల్ని గట్టిగా పట్టుకో!’ అని అరిచేవాళ్ళు. అందుకుందుకు నేను చేసే ప్రయత్నంలో, గుండ్రంగా, గట్టిగా ఉండే సరంగు వహదవహద భార్య రొమ్ములు నా చేతికి తగిలేవి. అవంటే నాకు చందమామ అంటే ఉన్నంత ఇష్టం, బహుశా అంతకంటే ఇంకా ఎక్కువేనేమో. అలా తాకినప్పుడల్లా వాటిని అలానే వదలకుండా పట్టుకుని, ఆమె నడుము చుట్టూ రెండో చెయ్యి వేసి పడవలోకి ఒక దూకు దూకేవాణ్ణి. అలా ధడ్‍మని పడవలోకి దూకగానే, సరంగు వహదవహద, నా ముఖం మీద ఒక బాల్చీడు నీళ్ళు గుమ్మరించి, నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చేవాడు.
సరంగు భార్యతో నా ప్రేమకథ అలా మొదలైంది. దానితోపాటే నా బాధానూ. ఆమె ఎప్పుడూ ఎవర్ని తదేకంగా గమనిస్తోందో తెలుసుకుందుకు నాకు అట్టే సమయం పట్టలేదు: మా బావ చేతులు చందమామని అందుకోగానే, నేను ఆమె వంక చూసేవాడిని. ఆ చెవిటివాడికి చందమామ మీద ప్రతి చిన్న చోటూ తెలుసునన్న ఆలోచన ఆమె కళ్ళలో కోరికలు రేపుతున్నట్టు అర్థమయ్యేది. వాడు చందమామ మీద ఎవరికీ తెలియని ప్రదేశాలలోకి మాయమైనప్పుడు, ఆమె ముళ్ళమీదో సూదులమీదో ఉన్నట్టు ఎంతో అశాంతికి గురయ్యేది. అప్పుడు నాకు మా బావ అన్నా, ఆమెకి చందమామ అన్నా, ఎందుకు అసూయ కలుగుతోందో అర్థమయింది. ఆమె కళ్ళు వజ్రాల్లా ఉండేవి; చందమామ వైపు చూసినప్పుడల్లా నిప్పుల్లా మెరుస్తూ, ‘నీకు వాడి పొందు దొరకదు!’ అని హెచ్చరిస్తున్నట్టు అనిపించేది. నేను పరాయివాణ్ణి అనిపించేది.
అయితే, ఈ వ్యవహారంలో ఏదీ పట్టించుకోనిది, అర్థం చేసుకోనిదీ నా చెవిటి బావ ఒక్కడే. వాణ్ణి చందమామనుండి – ఇంతకు ముందు చెప్పినట్టు – కాళ్ళు పట్టుకుని క్రిందకి దింపడానికి ప్రయత్నించినపుడు, సరంగు వహదవహద భార్య ప్రేమావేశం ఆపుకోలేక పోయేది. వెండిలా, తళతళా మెరిసే ఆమె రెండు చేతులతో వాణ్ణి చుట్టేసి, వాడి బరువునంతా తన శరీరంతో ఓపటానికి ప్రయత్నించేది. నా గుండె కలుక్కుమనేది. (నేను ఆమె శరీరానికి అతుక్కున్నప్పుడు, ఆమె శరీరం మెత్తగా, స్నేహపూర్వకంగానే ఉండేది. కానీ మా బావని పట్టుకున్నప్పటిలా ఒత్తిడితో, ప్రేమతో పట్టుకున్నట్టు ఉండేది కాదు.) వాడు నిర్లిప్తంగా, చందమామ మీద అనుభవించిన బ్రహ్మానందంలో ఇంకా తేలుతూ ఉండేవాడు.
నేను సరంగు వైపు చూసేవాడిని, అతను తన భార్య ప్రవర్తనని గమనిస్తున్నాడో లేదో తెలుసుకుందామని; ఉప్పునీటిలో నాని, నల్లగా ముడుతలు తేలిన అతని ముఖంలో, ఎన్నడూ ఏ విధమైన భావనా కనిపించేది కాదు. అందర్లోకీ చివర దిగేవాడు ఆ చెవిటివాడే కావటం, తను దిగటం పడవ అక్కడ నుండి కదలడానికి సంకేతం కావడంతో, సరంగు వహదవహద పడవ అడుగున దాచిన తీగలవాయిద్యాన్ని ఎంతో వినయంగా తన భార్య చేతికి ఇచ్చేవాడు వాయించమని. ఆమె దానిమీద కొన్ని సంగతులు వేసి వినిపించేది. మా బావనుండి ఆమెను ఆ వాయిద్యం వేరు చేసినంతగా, మరేదీ వేరు చెయ్యగలిగేది కాదు. అప్పుడు నేను సన్నని గొంతుతో ఒక విరహగీతాన్ని అందుకునే వాడిని. దాని భావం సుమారుగా – చంచలమైన ప్రతి చేపా నీటిలో తేలుతూనే ఉంది, తేలుతూనే ఉంది; మరణించిన ప్రతి చేపా అగాధాల్లోకి జారిపోతుంది; మా బావ తప్ప తక్కిన వారందరూ దానికి తలూపేవారు.
ప్రతి నెలా చందమామ దూరంగా జరగడం ప్రారంభించగానే, ప్రపంచం ఏదీ పట్టకుండా, మా బావ ఏకాంతంలోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ పున్నమి వస్తోందంటేనే వాడిలో ఉత్సాహం ఉరకలు వేసేది. చందమామ మీదకి మేము వంతులవారీగా వెళ్ళేవాళ్ళం. ఆ సారి వెళ్ళడం నా వంతు కాదు. నేనూ, సరంగు భార్యా ఇద్దరం పడవలో మిగిలేట్టు ముందుగా ప్రణాళిక వేసేను. కానీ, మా బావ చందమామ మీదకి ఎక్కగానే, సరంగు భార్య ‘ఈ సారి నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉంది’ అంది.
అలా అంతకు ముందెన్నడూ జరగలేదు. సరంగు భార్య చందమామ మీదకి ఎప్పుడూ వెళ్ళలేదు. సరంగు ఏమీ అనలేదు. సరికదా, ‘అయితే వెళ్ళు’ అంటూ ఆమెను నిచ్చెనమీంచి తనే స్వయంగా ఎత్తి మీదకి తోసేడు. మేం అందరం అతని సాయం చెయ్యడం ప్రారంభించేం. నేను ఆమెను వెనక నుండి పట్టుకున్నాను. నా చేతుల్లో ఆమె మెత్తగా, నున్నగా తగిలింది. నా ముఖంతో చేతులతో ఆమెను పైకి ఎత్తడానికి ప్రయత్నించేను. ఆమె చందమామ ఆకర్షణశక్తి పరిధిలోకి వెళుతోందని గ్రహించగానే, మనసు మనసులో లేదు. ‘అయితే, నేను కూడా కాసేపు సాయం చెయ్యడానికి వస్తాను’ అనిచెప్పి ఆమెను అనుసరించబోయేను.
‘నువ్వు ఇక్కడే ఉండు. చెయ్యవలసిన పని చాలా ఉంది’ అని సరంగు ఆజ్ఞాపించేడు, గొంతు పెంచకుండానే. దానితో పటకారులో చిక్కుకున్నట్టు నేను వెనక్కి తగ్గాను. ఆ క్షణంలో అందరికీ, ఒకరి ఉద్దేశ్యాలు మరొకరికి స్పష్టం అయివుండాలి. ఆ విషయం నేను అప్పుడు గ్రహించలేకపోయాను. ఇప్పటికీ అనుమానమే: నేను అందరి ఆంతర్యాలు సరిగ్గా అవగాహన చేసుకున్నానా అని. సరంగు భార్య మాత్రం ఎప్పటినుండో మా బావతో ఏకాంతంగా చందమామ మీద గడపాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. (కనీసం వాడు ఒక్కడే అక్కడికి వెళ్ళకుండా చూడడానికి.) మా బావతో అంగీకారం కుదిరి ఉంటే, ఆమెకి అంతకంటే పెద్ద కోరికే ఉండి ఉండాలి: చందమామ మీద ఎక్కడో ఎవరికీ కనిపించకుండా వాళ్ళిద్దరూ నెల్లాళ్ళు గడపటం. కానీ, మా బావ చెవిటివాడు కావడం వల్ల, ఆమె చెప్పినదేదీ అర్థం చేసుకునైనా ఉండకపోవచ్చు, లేదా, ఆమె మనసులోని కోరికలకి లక్ష్యం తనే అన్న విషయం గ్రహించి ఉండకపోవచ్చు. మరి సరంగు సంగతి? అతనికి భార్యని వదిలించుకోవడంకన్నా మించింది మరొకటి ఏముంటుంది? నిజానికి, ఆమె అక్కడ చిక్కుకున్నాక, కోరికల గుఱ్ఱాలకి పగ్గాలు తప్పించి అన్నిరకాల వ్యసనాల్లో మునిగిపోయాడు. అతను తన భార్యని ఎందుకు చందమామ మీదకి వెళ్ళవద్దని అడ్డుపెట్టలేదో అప్పుడు అర్థం అయింది మాకు.
కానీ అతనికి ముందే తెలుసా, చందమామ కక్ష్య దూరంగా జరిగిపోతుందని? తక్కిన వాళ్ళం ఎవరమూ ఎందుకూ ఆ సంగతి పసిగట్టలేకపోయాం? మా చెవిటి బావకి మాత్రం, (మాకెవరికీ తెలియని రహస్యవిషయాలన్నీ తెలిసినట్టే) ఆ పున్నమితో చందమామకి శాశ్వతంగా టాటా చెప్పవలసి వస్తుందని, మళ్ళీ అక్కడికి వెళ్ళలేడనీ అంతరాంతరాల్లో తెలుసునేమో! అందుకనే, అక్కడి రహస్య ప్రదేశాల్లో గడిపి, సరిగ్గా భూమి మీదకి రావలసిన సమయంలో బయటపడ్డాడు. పాపం, సరంగు భార్యకి అతన్ని అనుసరించడానికి కుదరలేదు: ఆ ఎగుడు దిగుడు చోట్లలో ఆమె దిక్కుతోచక అటూ ఇటూ అనేకసార్లు తిరగడం మేము గమనించేము. అటు తిరిగీ ఇటు తిరిగీ, మధ్యమధ్యలో ఆగుతుండేది, మా వంకా, మా పడవ వంకా ‘అతను కనిపించేడా’ అని అడగడానికి చూస్తున్నట్టు కనిపించేది.
ఆ రాత్రి నిజంగా వింతగా ఉంది. సముద్రం ప్రతి పున్నమి రేయీ ఉండేట్టు బిగువుగా, విల్లులా ఆకాశంవైపు వంగినట్టు ఉండక, నీరసంగా చేతులు వేలాడేసుకుని, బులబులాగ్గా జారిపోయినట్టు, చందమామ తన అయస్కాంతశక్తి కోల్పోయినట్టూ కనిపించేయి. వెన్నెల కూడా ఎప్పటిలా తెల్లగా మెరుస్తూ లేదు. రాత్రి చీకట్లు కూడా మునపటికంటే చిక్కగా ఉన్నాయి. అక్కడి మా మిత్రులిద్దరూ జరుగుతున్న మార్పుల్ని పసిగట్టే ఉంటారు. నిజానికి, వాళ్ళు మావంక బిగుసుకుపోయి చూసినపుడు, వాళ్ళ కళ్ళల్లో భయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందరినోటంటా ఒక్కసారిగా, ‘చందమామ దూరం అయిపోతోంది’ అన్న మాటలు వెలువడ్డాయి.
మా మాటలు ఇంకా పూర్తవలేదు, మా బావ చందమామ మీద పరిగెడుతూ కనిపించాడు. అతనికి ఇప్పుడు ఆశ్చర్యమూ భయమూ రెండూ లేవు. క్రింద చేతులు మోపి, ఎప్పటిలాగే పిల్లిమొగ్గవెయ్యడానికి పైకి ఎగిరాడు. అయితే, ఈసారి అలా ఎగిరినవాడు ఎగిరినట్టుగానే వేలాడుతూ ఉండిపోయాడు, చిన్నారి క్షలతలక్షలా. భూమికీ, చందమామకీ మధ్య క్షణకాలం తలక్రిందులుగా వేలాడి, ప్రవాహానికి ఎదురుగా ఈదుతున్నట్టు చేతులు కష్టం మీద కదుపుతూ, ఎలాగైతేనేం మళ్ళీ నేల మీదకి నెమ్మదిగా దిగాడు.
తక్కినవాళ్ళు కూడా చందమామ మీదనుండి దిగడానికి అతన్ని అనుకరించడానికి ప్రయత్నించేరు. ఎవరికీ అప్పటి వరకు తాము సేకరించిన పాలను తీసుకురావాలన్న ధ్యాస లేదు. సరంగు కూడా వాళ్ళని ఆ విషయం గురించి దెబ్బలాడలేదు. అప్పటికే చాలాసేపు నుండి ఎదురు చూస్తున్నారేమో, దూరం అవుతున్నకొద్దీ దాటడం కష్టమైపోతుందని అతనిలాగే దూకి ఈదడం ప్రారంభించారు. అందరూ గాలిలో ఆధారం దొరక్క తడుముకుంటూ వేలాడుతున్నారు. ‘ఓ తెలివితక్కువ దద్దమ్మల్లారా! ఒకరినొకరు అంటిపెట్టుకోండి!’ అని సరంగు గట్టిగా కేకలేశాడు. అది విన్నాక, నావికులందరూ ఒక జట్టుగా, ఒక వస్తువులా దగ్గరగా కూడుకుని, సమిష్ఠిగా ప్రయత్నించి భూమి ఆకర్షణ శక్తి పరిధి లోకి వచ్చేరు. అంతే, దబదబమంటూ సముద్రంలోకి జలపాతం దూకినట్టు శరీరాలు ఒకదాని వెనక ఒకటి రాలిపడ్డాయి.
పడవలు వాళ్ళని రక్షించడానికి వెళ్ళబోయాయి. ‘ఆగండి! అందులో సరంగు భార్య కనిపించడం లేదు’ అన్నాను నేను. సరంగు భార్య కూడా దూకడానికి ప్రయత్నించింది గాని, వెండిలా తెల్లని తన అరచేతులు గాలిలో ఊపుకుంటూ, మధ్యలో చందమామకి కొన్ని గజాల దూరంలో తేలుతూ ఉండిపోయింది. నిచ్చెన ఎక్కి, ఆమె పట్టుకుందుకు ఏదో ఒక ఆధారం ఇద్దామని ఆమె వాయిద్యాన్ని చేతికి అందించడానికి విఫల ప్రయత్నం చేశాను. ‘నేను ఆమెను అందుకోలేక పోతున్నాను. ఆమెను ఎలాగైనా రక్షించాలి’ అని వాయిద్యాన్ని చూపిస్తూ పైమెట్టు మీద ఎగరడానికి ప్రయత్నించేను. నెత్తిమీద చందమామ మునపటిలా లేదు. మరింత చిన్నదిగా కనిపిస్తోంది; నా చూపులు దాన్ని తరిమేస్తున్నట్టు మరింత దూరంగా జరుగుతోంది. ఖాళీ అయిన జాగాలో ఆకాశం లోతుగానూ నక్షత్రాలతో నిండీ కనిపిస్తోంది. రాత్రి నామీద అనంతంగా శూన్యాన్ని గుమ్మరించినట్లైంది. అందులో నేను మునిగిపోయి భయంతో కదలిక లేకుండా ఉండిపోయాను.
‘నాకు ధైర్యం చాలదు’ అనుకున్నాను: ‘నేను పిరికివాడిని, అందుకే గెంతలేకపోతున్నాను’ అనీ అనుకున్నాను. అనుకుని ఒక్కసారిగా గెంతాను. ఆకాశంలో పట్టుదలతో ఈదుకుంటూపోయి ఆ వాయిద్యాన్ని ఆమె అందుకుందుకు వీలుగా చాచేను. నా వైపుకి రావడానికి బదులు ఆమె దూరంగా జరిగిపోతుంటే, ముందు అందమైన ముఖం, తర్వాత వీపూ కనిపించేయి.
‘నన్ను గట్టిగా హత్తుకో’ అని అరిచేను. అప్పటికే నేను ఆమెను దాటిపోయాను. ‘నన్ను గట్టిగా అదుముకుంటేనే ఇద్దరం క్రిందకి దిగగలం!’ అని చెప్పి నా సర్వశక్తుల్నీ ఆమెను దగ్గరకి తీసుకుందుకు కేంద్రీకరించాను. నా అనుభూతి నంతటినీ ఆమె బిగికౌగిలికే వినియోగించాను. ఎంతగా మైమరచిపోయానంటే, బరువనేది లేకుండా తేలుతున్న ఆ స్థితినుండి, నేనామెని చందమామవైపుకి లాగుతున్నానన్న విషయం గమనించలేదు. నిజంగా గమనించలేదా? మొదటినుండీ నా ఆలోచనే అది కాదా? నేను సవ్యంగా ఆలోచించే లోపు, అసంకల్పితంగా, నెల్లాళ్ళపాటు ‘నీకు తోడుగా ఉంటాను’ అనబోయి, ‘నిన్నంటిపెట్టుకుని ఉంటాను’ అన్నాను. సరిగ్గా ఆ క్షణంలో, చందమామ మీద ఇద్దరం పడి, కౌగిలి వీడి, ఆ చల్లని రాళ్ళమీద చెరోపక్కకీ దొర్లిపోయాం.
చందమామ మీదకి వెళ్ళినప్పుడల్లా నాకు ఆకాశంలోకి చూడడం అలవాటు. ఈసారీ అలాగే ఆకాశంలోకి చూశాను. ఎప్పటిలా, అనంతమైన సముద్రం ఆ చివరనుండి ఈ చివరి వరకు పైకప్పులా కనిపిస్తుందని ఊహించాను. ఈసారి ఇంకా దూరంగా, మరింత సన్నగా, దాని కొండ శిఖరాలు, తీరాలు, అంచులతో స్పష్టంగా కనిపించింది. పడవలు ఎంతో చిన్నగా, వాళ్ళు ముఖాలు మరింత చిన్నగా, వాళ్ళ కేకలు వినీ వినిపించనట్టుగా ఉన్నాయి. నాకు ప్రక్కనే చిన్న శబ్దం అయింది. సరంగు భార్య తన వాయిద్యాన్ని అందుకుని శృతి చేసుకుంటోంది. ఒక తీగ బాధగా పలికింది.
సుదీర్ఘమైన నెల ప్రారంభమయింది. భూమిచుట్టూ చందమామ నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. ఆకాశంలో వేలాడుతున్న భూమి మీద, మాకు పరిచయం ఉన్న తీరాలు కనిపించడం లేదు. చెప్పలేని లోతున్న సముద్రాలు, అగ్నిపర్వతాల్లా మండుతున్న ఎడారులు, మంచుతో నిండిన ఖండాలు, సరీసృపాలతో నిండిన మహారణ్యాలు, రాతిగోడల్లా నిలబడి ఉన్న మహాపర్వతాలు, వాటిని అక్కడక్కడ తొలుస్తూ ఉధృతంగా పారుతున్న మహానదులు, చిత్తడి చిత్తడి నగరాలు, సమాధులతో నిండిన శ్మశానాలు, మట్టితో, బురదతో నిండిన సామ్రాజ్యాలూ కనిపించేయి. అంతదూరం నుండి అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. ఈ సరికొత్త అనుభూతి పాతవాటిని సైతం కొత్తగా చూపిస్తోంది. విశాలంగా, సమానదూరాల్లో, దట్టంగా పెరిగిన ఒకేలా కనిపిస్తున్న పచ్చిక బయళ్ళలో, ఏనుగుల గుంపులూ మిడతలదండ్లూ పరిగెడుతున్నాయి.
నిజానికి నేను ఆనందంగా ఉండవలసిన సమయమది. నేను ఎప్పటినుండో కలలు కన్నట్టు, ఆమెతో నేను ఒంటరిగా ఉన్నాను. చందమామతోనూ, ఆమెతోనూ మా బావ అనుభవించిన ఏ సాన్నిహిత్యాన్ని చూసి నేను అసూయ పడ్డానో, అదిప్పుడు నా స్వంతం. కేవలం నా ఒక్కడిదే! ఒక నెల్లాళ్ళపాటు, చంద్రుడి మీద రాత్రీ పగలూ ఏ ఆటంకాలూ మమ్మల్ని వేరు చేయకుండా గడపొచ్చు. ఈ తలం మీద చిక్కటి పాలవెల్లువ మాకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. వగరైన, దాని వింతవాసన మాకు కొత్త కాదు. చందమామ మీద విశాలమైన మైదానాలన్నీ తిరిగాం. మనిషన్నవాడెవడూ చూడని కొత్త కొత్త ప్రదేశాలు చూశాం. చందమామకు ఆవల కనిపించే నక్షత్రాలనన్నిటి గురించీ ఆలోచించాం. అవి వెలుగుతో నిండి, ఆకాశపు కొమ్మకి పండిన పెద్ద పండ్లలా కనిపించేయి. అన్నీ నేను ఊహించినదానికంటే ఎంతో గొప్పగా ఉన్నాయి.
అయినప్పటికీ, అది ప్రవాస జీవితమే.
తలెత్తి పుట్టిన ఆ భూమి వైపు చూశాం.
నేనెప్పుడూ భూమి గురించే ఆలోచించేవాడిని. ఆ నేలవల్లే మేము మేముగా పుట్టి, మేముగా తయారయ్యాము. చందమామ మీద, భూమినుండి వేరుపడి, నేను నేను కానట్టూ, ఆమె ఆమె కానట్టూ అనిపించేది నాకు; భూమికి తిరిగి ఎంత వేగం తిరిగి వెళ్ళిపోతానా అనిపించేది. భూమిని పోగొట్టుకున్నానన్న బాధతో వణికిపోయాను. సరంగు భార్యపట్ల నే కలలుగన్న ప్రేమ, అనుభవమూ మేమిద్దరం భూమికీ, చందమామకీ మధ్య, ఒకటిగా తిరుగుతూ చంద్రతలం మీద పడినప్పుడే తీరిపోయింది. భూమినుండి దూరమైన నా ప్రేమ, తను పోగొట్టుకున్న గుండెలు పగిల్చే జ్ఞాపకాలతో నిండి ఉంది: ఆ చోటూ, ఆ వాతావరణం, ఇక్కడికి రావడానికి ముందూ, ఆ తర్వాతా…
నాకు ఇలా అనిపిస్తోంది. మరి ఆమెకో? అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, నా మనసు భయంతో నిండిపోయింది. ఆమె కూడా భూమి గురించి నేను ఆలోచించినట్టు ఆలోచిస్తే మంచిదే. చివరకి ఆమె నన్ను అర్థం చేసుకుందని అనుకోవచ్చు; కానీ, అది మరొకదానికి కూడా సంకేతం – నా ఆలోచనలన్ని వృధా అని, ఆమె ఆలోచనలన్నీ ఇంకా మా బావమీదే ఉన్నాయనీ. కానీ ఆమెకి ఏ ఆలోచనలూ కలుగలేదు. భూమివంక తలెత్తయినా చూడలేదు. భయంతో, ఆమె తన వాయిద్యాన్ని మీటుకుంటూ, శోకగీతాలు మనసులోనే పాడుకుంటూ, బంజరుభూములవైపు నడిచిపోతుండేది. తప్పని ఈ తాత్కాలిక చంద్రవాసానికి ఆమె రాజీపడినట్టు కనిపించింది. నేను నా పగవాడిపై గెలిచినట్టా? లేదు. నేను ఓడిపోయాను. అలాంటి ఇలాంటి ఓటమి కాదు. నా బావ చందమామని మాత్రమే ప్రేమించేడని తెలుసుకుని తాను కూడా అందులో, ఆ మానవాతీతమైన ప్రేమలో తనూ భాగం కావాలని కోరుకుంది.
చందమామ భూమిని చుట్టి రావడం పూర్తవడంతో మేము మళ్ళీ తగరపు చరియలను సమీపించాము. వాటిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది: అంత చిన్నగా ఉంటాయని పీడకలల్లోకూడా అనుకోలేదేమో. అంత చిన్నవిగా కనిపించడానికి బహుశా వాటి దూరం కారణం కావొచ్చు. బురదగుంటలా కనిపిస్తున్న సముద్రం వైపు, మా మిత్రులు మళ్ళీ బయలుదేరారు. నిచ్చెనలవల్ల ఉపయోగం లేదని తెలిసి వాటిని వెంట తీసుకురాలేదు. వాటికి బదులు, అడవిలో దొరికే పొడవాటి గడకర్రలు తీసుకువచ్చారు. ప్రతివాళ్ళ చేతుల్లో చివర కొక్కెమో, పంట్రకోలో ఉన్న పొడవైన గడకర్ర ఉంది. బహుశా దానితో చివరిసారిగా అందినంత వరకు పాలముద్దలు గోకుదామనో, లేదా ఇక్కడ చిక్కిపోయిన మా ఇద్దరు నిర్భాగ్యులకీ సాయం చేద్దామనో. కానీ, త్వరలోనే ఏ గడకర్రా చంద్రుడిని చేరగలిగినంత పొడుగు లేదని వాళ్ళకి అర్థం అయింది. అందుకని అవి వెనక్కి పడిపోయాయి, నీటిలో తేలుతూ. ఈ గందరగోళంలో, కొన్ని పడవలు నిలకడ తప్పి తలక్రిందులైపోయాయి. ఇంతలో మరొక పడవ నుండి అన్నిటికన్నా పొడవైన బొంగు పైకి లేవడం ప్రారంభించింది. బహుశా అది వెదురుదో, లేక కొన్ని వెదురుబొంగులు ఒకటిగా కలిపి కట్టినదో. దాన్ని పైకి లేపాలంటే వాళ్ళు చాలా నెమ్మదిగా పడవ నడపవలసి వస్తుంది. ఎందుకంటే, అది మరీ ఎక్కువ తూగితే సన్నగా ఉండటం వలన ఆ వెదురుకర్ర విరిగిపోవచ్చు. కనుక తమకున్న కౌశలాన్ని, శక్తినీ ఉపయోగించి పడవ తూగిపోకుండా, నిటారుగా నిలబెట్టేరు.
అకస్మాత్తుగా, ఆ వెదురుబొంగు చివర గరుకుగా ఉన్న చందమామ ఉపరితలాన్ని తాకగలదని అర్థమయింది. మేము చూస్తుండగానే అది రాసుకుంటూ వెళ్ళి ఒక క్షణకాలం నిశ్చలంగా ఆగింది. ఏమాత్రం కుదుపు వచ్చినా పట్టు తప్పిపోయి, తూగి, మళ్ళీ అదే చోటుకి తగిలి, దాని తాకిడికి మళ్ళీ వెనకకి పోతోంది. ఇంతలో నేనూ గుర్తించాను; సరంగు భార్యా గుర్తించింది మా బావని; మరొకరు అయే అవకాశం లేదు. వెదురుబొంగుకి చివర గారడీ చేస్తున్నట్టు అతను చందమామతో చిట్ట చివరిగా ఆటాడుతున్నాడు. ఆ నైపుణ్యానికి చందమామని దూరంగా నెట్టివెయ్యడం తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అనిపిస్తుంది. అలా దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్న చందమామకి తాను సహాయం చేస్తున్నట్టూ తను కోరుకుంటున్న దూరపు కక్ష్యలోకి దాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టూ కనిపిస్తుంది. ఆ ఆలోచన కూడా మా బావ ఆలోచనలకి తగిందే: ఎందుకంటే, చందమామ ప్రకృతికి, దాని గమనానికి, దాని ఆనందానికీ విరుద్ధమైన కోరికలు అతనిలో కలగవు. చందమామ తననుండి దూరంగా పోదామనుకుంటే, ఆమె దగ్గరగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాడో, దూరంగా ఉన్నప్పుడు కూడా అంత ఆనందమూ అనుభవించగలడు.
ఇలాంటి పరిస్థితులలో సరంగు వహదవహద భార్య మాత్రం ఏమి చెయ్యగలదు? ఇలాంటి క్షణంలోనే ఆ చెవిటివాడిపట్ల తన ప్రేమ క్షణికావేశంలో కలిగినది కాదని, అది ఎన్నటికీ తిరుగులేనిదనీ ఋజువు చేసింది. నా బావ దూరంగా ఉండే చందమామనే ప్రేమిస్తే, తను కూడా దూరంగా ఆ చందమామ మీదే ఉండిపోదలుచుకుంది. ఆమె ఎప్పుడైతే ఆ వెదురుబొంగువైపు కాలు కదల్చలేదో, ఆమె ఆంతర్యం వెంటనే నాకు అర్థం అయింది. ఆమె తన వాయిద్యాన్ని భూమివైపుకి చూపిస్తూ ఆకాశంలోకి ఎత్తి పట్టుకుని తీగలు మీటసాగింది. ఆమెను నా కంటి కొసలనుండి గమనిస్తూ, గమనిస్తూ ఉన్నాను. నిజానికి నేను ఆ వెదురుగడ చంద్రతలాన్ని తాకగానే ఒక్కదూకు దూకి దాన్ని అందుకున్నాను. పాములా దాని కణుపులవెంట మోచేతులూ మోకాళ్ళూ కదుపుతూ భూమి మీదకి చేరుకోవాలన్న ఆత్రంతో, అసలు నేనక్కడికి ఎందుకు వెళ్ళానో అన్న విషయం కూడా మరచిపోయి దిగడం ప్రారంభించాను. బహుశా నేను వెళ్ళిన కారణమూ దాని దురదృష్టకర పరిణామమూ కూడా నాకు గుర్తున్నాయేమో; నేను గడ మీదకి ఎక్కడం వలన గడ వాలిపోయి, ఇక అక్కడనుండి నేను ఏ ప్రయత్నమూ చెయ్యనక్కర లేకుండానే భూమి మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నా తొందరపాటువల్ల, గడ ముక్కముక్కలుగా విరిగి, భూమి ఆకర్షణకు గురై, నేను సముద్రంలోకి పడిపోయాను – తల ముందూ, కాళ్ళు వెనకా.
నేను హాయిగా తిరిగి వచ్చి, నా పుట్టిన నేలను తాకడంతో, నా ఆలోచనలు ఆమెను పోగొట్టుకున్న విషాదంలో మునిగిపోయాయి. నేను కోరుకుంటున్న కొద్దీ దూరమైపోయిన ఆమె కోసం, నా కళ్ళు చందమామను వెదకడం ప్రారంభించాయి. ఆమె నాకు కనిపించింది. నేను ఎక్కడ ఆమెను విడిచిపెట్టేనో అక్కడే ఉంది. నాకు సరిగా నెత్తి మీద, సముద్రపుటొడ్డున ఇసుకలో కూచుని ఉంది. ఆమె ఏమీ మాటాడలేదు. ఆమె ఇప్పుడు చంద్రుడి రంగులో కలిసిపోయింది. ఆమె తన వాయిద్యం పక్కన నిలబెట్టుకొని ఒకచేత్తో తీగెలు మీటుతూ పాడుతోంది. ఇప్పుడు ఆమె ఎదురుగా కూచుని వాయిద్యాన్ని శృతి చేసుకుంటున్నట్టు ఆమె ఆకారం కళ్ళకి కనిపిస్తోంది. అమావాస్యకి నల్లగా చదునుగా కనిపించిన చందమామ, తొలిసారి ఆకాశంలో నెలబాలుడుగా కనిపించగానే ఆమెకోసం వెతకడం ప్రారంభిస్తాను. చందమామ కళలు పెరుగుతున్న కొద్దీ ఇంకా స్పష్టంగా ఆమెను గాని, ఆమెకు చెందిన వస్తువునో గాని, అన్ని వందల వేల త్రోవల్లో ఏదో ఒకదానిలో చూడగలనని ఊహిస్తుంటాను. ఆమె తనలో ఉండిపోవడం వల్లనే చందమామ, చందమామ కాగలిగింది. పున్నమి రాగానే, రాత్రల్లా కుక్కలు చందమామనే చూస్తూ మొరుగుతుంటాయి. వాటితో పాటే నేనూ.
(The distance of the moon, 1965.)