దుఃఖమెప్పుడూ పాత నేస్తమే
ఆనందాలే అనుకోని అతిథుల్లా
అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి.
నిదుర మరచింది లేదు
కలలే కనులకు దూరమయి
కలత పెడుతుంటాయి.
గాయాలకు కుట్లు వేద్దామని కూలబడతామా
సరిగ్గా అప్పుడే దారాన్ని దాచిపెడతారు
వెన్నెల వస్తుందని ఎదురు చూస్తుండగానే
ఆకాశాన్ని ఎవరో దోచుకెళతారు.
నీ కథా ఇలాంటిదే కదా?
నీకొక రహస్యం చెప్పనా
వణికే చేతులతో ఈ విషాదాంత కథని
రాసింది నేనే.
నిన్ను చుట్టి ఉన్న
అనేకానేక వలయాలకావల
అదిరే పెదవులతో కథను చదువుతున్న
పాఠకుడినీ నేనే!