ద్రావిడ భాషలలో దేశిచ్ఛందస్సు: భిన్నత్వములో ఏకత్వము

పరిచయము

వేయి సంవత్సరములకన్న ఎక్కువగా తమిళ, కన్నడ, తెలుగు భాషలలో ఛందోబద్ధములైన పద్యములను కవులు వ్రాసినారు. అట్టివి కావ్యములలో, శిలాశాసనములలో మనము చదువవచ్చును. ఈ వ్యాసములో ఈ మూడు భాషలలోని దేశి ఛందస్సులయందలి సామ్యములు, భేదములను తెలుప దలచినాను. ఈ వ్యాసము ఈ భాషల ప్రాచీనత్వపు తరతమములను ఉద్దేశించినది కాదు. ఈ మూడు భాషలలో దేశి ఛందస్సు ఒకే మార్గములో సాగలేదు. తమిళములో తొల్గాప్పియమ్ [1] అనే పుస్తకములో ఛందస్సు ప్రస్తావన ఉన్నది. ఈ గ్రంథపు కాలమును సరిగా నిర్ణయించలేము. క్రీ.పూ. 2వ శతాబ్దమునుండి క్రీ.శ. 5వ శతాబ్దము మధ్యకాలములో ఇది వ్రాయబడినది. దీని రచయిత కూడ ఒకరు కాదనియు, పలువురని పండితుల అభిప్రాయము. కన్నడ తెలుగు ఛందస్సులు సంస్కృత మార్గములో సాగినది. ఇంతకు ముందు తెలిపినట్లు కన్నడ తెలుగు భాషలలోని ఛందశ్శాస్త్రములలో కనీస పరిమాణము (metreme) గురు లఘువులు.

తమిళ ఛందస్సు

తమిళములో ఈ కనీస పరిమాణము అశై. ఈ అశై రెండు విధములు. నేరశై అనునది గురు లఘువులు. మిగిలిన భాషలలోని ఛందస్సులలోని కనీస పరిమాణము ఒక అక్షరమైన గురులఘువులయితే తమిళములోని అశై రెండు అక్షరములుగా కూడ ఉండవచ్చును. దీనిని నిరై అశై అంటారు. ఈ నిరై అశై II (లలము), IU(లగము). ఈ నేర్, నిరై అశై బీజములకు పదే పదే వాటిని చేర్చుటవలన కొత్త గణములు పుట్టుతాయి. వాటిని శీర్ అంటారు. నేర్ (U, I), నిరై (II, IU) లను కలిపేటప్పుడు నేర్ మధ్యలో వచ్చినప్పుడు గురువును మాత్రమే తీసికొంటారు. నేర్ చివరనున్నప్పుడు మాత్రమే అది గురు లఘు స్వరూపములను రెంటిని తీసికొంటాయి. ఈ విషయములను నేను ఇంతకుముందే విపులముగా చర్చించి యున్నాను.

రెండు అశై శీరులు నాలుగు విధములు:

తేమా (నేర్+నేర్)
పుళిమా (నిరై+నేర్)
కూవిళమ్ (నేర్+నిరై)
కరువిళమ్ (నిరై+నిరై)

వీటిని చివర ఉండే మా, విళమ్ అక్షరములతో మా-శీర్, విళమ్-శీర్ అనుట వాడుక.

మూడు అశై శీరులు ఎనిమిది విధములు:

తేమాంగాయ్ (నేర్+నేర్+నేర్)
పుళిమాంగాయ్ (నిరై+నేర్+నేర్)
కూవిళంగాయ్ (నేర్+నిరై+నేర్)
కరువిళంగాయ్ (నిరై+నిరై+నేర్)
తేమాంగని (నేర్+నేర్+నిరై)
పుళిమాంగని (నిరై+నేర్+నిరై)
కూవిళంగని (నేర్+నిరై+నిరై)
కరువిళంగని (నిరై+నిరై+నిరై)

వీటిని చివర ఉండే కాయ్, కని అక్షరములతో కాయ్-శీర్, కని-శీర్ అనుట వాడుక.

ఇవి గురులఘువులను చేర్చి రెండు అక్షరముల, మూడు అక్షరముల గణములను అమర్చడము వంటిది. కాని ఈ సామ్యము అంతవఱకే! దీనిని కొనసాగింపరాదు. ఎందుకంటే రెండు అశై శీరులలో రెండు నుండి నాలుగు అక్షరములు ఉంటాయి. మూడు అశై శీరులలో మూడు నుండి ఆఱు అక్షరములు ఉంటాయి. ఇది గురులఘువుల చేరికకు భిన్నము. ఈ విషయమును ఇక్కడ ఎందుకు చెప్పుతున్నానంటే కొందఱు తేమాంగాయ్ శీరును మ-గణము అని, కరువిళంగనిని న-గణము అని వివరిస్తారు. అది తప్పు.

కన్నడ తెలుగు భాషల దేశి ఛందస్సు

కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి [2]. అవి: బ్రహ్మ గణములు, విష్ణు గణములు, రుద్ర గణములు. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు. ఈ పేరులే సుమారు ఆఱవ శతాబ్దపు మతంగముని వ్రాసిన సంగీత గ్రంథము బృహద్దేశిలో, సుమారు క్రీ.శ. 1000 నాటి జయకీర్తి ఛందోనుశాసనములో వాడబడినవి. నాగవర్మకు బహుశా ఇవి శృంగారమును సూచించునవి అని తోచియుండవచ్చును. అతడు వీటికి బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములు అని త్రిమూర్తుల పేరులను పెట్టినాడు, ఇవి త్రిమూర్తుల అంశములని వీటిని అంశ గణములు అంటారు. నేడు ఈ పేరులే వాడబడుచున్నవి. తెలుగులోని సూర్య, ఇంద్ర, చంద్ర గణములు బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములనుండి వచ్చినవే. ప్రతి వర్గమునుండి ఎక్కువ మాత్రలు ఉన్న రెండు గణములను తొలగించినారు తెలుగు లాక్షణికులు. తెలుగులో వీటిని ఉపగణములు అంటారు. ఆఱవ శతాబ్దము నాటికే ఈ విభజన క్రీ.శ. 571 ఎఱ్ఱగుడిపాడులోని ఎఱికల్ ముత్తురాజు శాసనములోని సీసపద్యములో స్పష్టము [3].

ఇక్కడ మఱొక విషయమును ప్రస్తావించాలి. నాగవర్మ ఛందోంబుధిలో అంశగణములను ఉదాహరణ రూపములో మాత్రమే తెలిపినాడు. ఇవి గురువుల ప్రస్తారమువలన జనించినను వీటికి దాని సంబంధమైన పేరులను వాడలేదు. కాని తెలుగులోని మొదటి లక్షణగ్రంథమైన కవిజనాశ్రయపు కర్త వీటిని సంస్కృత గణముల పేరుతో వాడినాడు. అంతేకాక ఇవి ఏవిధముగా జనించినదన్న విషయమును కూడ తెలుపలేదు.

భ ర త నగ నల సలంబులు
వరుసనె నియ్యాఱు నెన్న – వాసవ గణముల్
మరి నహము లినగణంబులు
సరవిం దక్కినవి యెల్లఁ – జంద్రగణంబుల్ – రేచన కవిజనాశ్రయము.

తఱువాతి కాలములో విన్నకోట పెద్దన [4], అప్పకవి [5] ఉపగణ ప్రస్తార విశేషములను తెలిపినారు. నా ఉద్దేశములో దేశి ఛందస్సుకు అత్యవసరమైన ఉపగణములను సంస్కృత ఛందస్సులోని గణములద్వారా తెలుపుటలో దేశిచ్ఛందస్సు ప్రాధాన్యత తగ్గినదని. అందుకే నేను దేశి ఛందస్సులోని గణములను నాగవర్మవలె ఉదాహరణముల ద్వారా తెలిపినాను. కాని ఈ ఉదాహరణముల ఎన్నికలో సంస్కృత ఛందస్సు గణస్వరూపము కూడ విదితమైనది. మచ్చుకు ‘న’యన అనగా న-గణము, ‘సల’లూక అనగా సలము.

బ్రహ్మ గణములు: గంగా (UU), గాల (UI), సరసీ (IIU), నయన (III); ఇందులో గాల, నయన సూర్య గణములు.

విష్ణు గణములు: మాతంగీ (UUU), సగరేశీ (IIUU), రాధికా (UIU), నగనదీ (IIIU), తారేశ (UUI), సలలూక (IIUI), భార్గవ (UII), నలపుర (IIII); ఇందులో మాతంగీ, సగరేశీ తప్ప మిగిలినవి ఇంద్ర గణములు.

తమిళ ఛందస్సులో ఎదురునడక

తమిళ ఛందస్సును మళ్ళీ పరిశీలిద్దామా? నేర్ లోని గురు లఘువులు, నిరై లోని రెండు లఘువులు సంస్కృత, కన్నడ, తెలుగు ఛందస్సులోని బీజాక్షరములవంటివే. కాని నిరై లోని లగము ఎదురు నడక కలిగిన గణము. కన్నడ తెలుగు ఛందస్సులలో ఇవి లేవు, ఇట్టి పదములు ఆరంభములో రావు. కాని తమిళములో లగారంభము సామాన్యము. ఉదాహరణముగా అవన్ (వాడు), అవళ్ (ఆమె) సర్వనామములు. నిలా (చంద్రుడు), మలర్ (పువ్వు) వంటి పదములు కూడ లగారంభములే. ఇట్టివి ఎన్నియో పదములు తమిళములో ఉన్నాయి. ఇవి నిరైకు సరిపోతాయి. కావున నిరైలోని IU తో ప్రారంభమయ్యే శీరులు అన్నియు ఎదురు నడక కలిగినవే. ఇది తమిళ ఛందస్సునకు అవసరము. కాబట్టి పుళిమా, పుళిమాంగాయ్, పుళిమాంగని, కరువిళమ్, కరువిళంగాయ్, కరువిళంగని శీరులలో IU తో ప్రారంభమయ్యే శీరులు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి లగా (IU), జయంత (IUI), యశోదా (IUU), జగద్ధితా (IUIU), జలోద్భవ (IUII), యుగాధీశా (IUUU), లతాసూన (IUUI). ఇక్కడ యలతో ఆరంభమయ్యే పదములు లేనందువలన లతాసూన అనే పదమును వాడినాను (IUU + I = I + UUI).

భిన్నత్వములో ఏకత్వము

ఈ నేపథ్యముతో ఇప్పుడు మూడు చిత్రములను పరిశీలిద్దామా? ఇందులో తమిళ (మొత్తము చిత్రము), కన్నడ (ఎఱుపు రంగు లోనివి), తెలుగు (ఊదా రంగు లోనివి) దేశి ఛందస్సులలోని గణములు.


చి-1. తమిళములోని తేమా, పుళిమా గణములు, ఎఱ్ఱని రంగులోనివి కన్నడ భాషలోని బ్రహ్మ గణములు; లేత ఊదారంగులోనివి తెలుగు సూర్య గణములు.

మొదటి చిత్రములో బ్రహ్మ గణములను (సూర్య గణములను) చూపినాను. మొదటి పంక్తిలోని UU, UI గణముల ముందు మఱొక లఘువును ఉంచితే మనకు యశోదా (IUU), జయంత (IUI) గణములు లభిస్తాయి. ఇదే ఫలితము రెండవ పంక్తిలోని గణములలోని రెండవ లఘువుకు బదులు ఒక గురువును ఉంచినప్పుడు కూడ దొఱుకుతుంది. మొదటి పంక్తిలోని గణములు తేమాలోని శీరులు. రెండవ పంక్తిలోని నాలుగు గణములు పుళిమాయందలి నాలుగు శీరులు.


చి-2.తమిళములోని కూవిళమ్, కరువిళమ్, తేమాంగాయ్, పుళిమాంగాయ్ గణములు, ఎఱ్ఱని రంగులోనివి కన్నడ భాషలోని విష్ణు గణములు; లేత ఊదారంగులోనివి తెలుగు ఇంద్ర గణములు.

రెండవ చిత్రములో విష్ణు గణములు ఎఱ్ఱ రంగు దీర్ఘ చతురస్రములో చూపబడినవి. అందులో మాతంగీ (UUU), సగరేశీ (IIUU) గణములను తొలగిస్తే మనము తెలుగులోని ఇంద్ర గణములను ఊదా పెట్టెలో చూడగలము. మొదటి పంక్తిలోని గణములు తమిళములోని కూవిళమ్ శీరులు. వీటికి ముందు ఒక లఘువును చేర్చి వ్రాసినప్పుడు మనకు రెండవ పంక్తిలోని మిగిలిన నాలుగు కరువిళమ్ శీరులు లభిస్తాయి. అదే విధముగా మూడవ పంక్తిలోని గణములు తమిళములోని తేమాంగాయ్ శీరులు. వీనిముందు ఒక లఘువును ఉంచి వ్రాసినప్పుడు మనకు పుళిమాంగాయ్ లోని నాలుగు అదనపు శీరులు కనబడుతాయి.


చి-3. తమిళములోని కూవిళంగాయ్, కరువిళమంగాయ్, తేమాంగని, పుళిమాంగని, తేమాందన్బూ, పుళిమాందన్బూ గణములు, ఎఱ్ఱని రంగులోనివి కన్నడ భాషలోని రుద్ర గణములు, లేత ఊదారంగులోనివి తెలుగు చంద్ర గణములు.

సామాన్యముగా తమిళ ఛందస్సులోని వృత్తములను మా, విళమ్, కాయ్ శీరులతో నిర్వచించ వీలగును. అరుదుగా మాత్రమే కని శీరులు, పూ శీరులు వాడుతారు. మూడవ చిత్రములో కన్నడములోని రుద్ర గణములు, తెలుగులోని చంద్ర గణములు, తమిళములోని కూవిళంగాయ్, కరువిళంగాయ్, తేమాంగని, పుళిమాంగని, తేమాందన్బూ, పుళిమాందన్బూ శీరులను చూపినాను. ఇందులోని కాయ్ శీరులను మాత్రమే వారు వృత్తములలో ఎక్కువగా వాడుతారు.

లగాది గణములను కూడ పరిగణించినప్పుడు, మొదటి చిత్రములోని గణముల సంఖ్య 4+2, రెండవ చిత్రములోని గణముల సంఖ్య 8+4, మూడవ చిత్రములోని గణముల సంఖ్య 16+8. అనగా ఈ గణముల సంఖ్య 6, 12, 24. ఐదు గురువుల ప్రస్తారము చేసినప్పుడు ఈ గణముల సంఖ్య 32+16 = 48. లగాది గణముల సంఖ్య మాత్రమే గ్రహించినప్పుడు మనకు 2, 4, 8, 16 గణములు లభిస్తాయి.

పద్యముల నిర్మాణము

ఉపగణములతో తెలుగులో ద్విపద, తరువోజ, ఉత్సాహ, అక్కరలను ప్రాసతో, అక్షరసామ్య యతితో ఉండే జాతులుగా పేర్కొన్నారు. సీసము, ఆటవెలఁది, తేటగీతులను ప్రాస నియతముకాని, అక్షరసామ్య యతి, ప్రాస యతులతో ఉండే ఉపజాతులుగా పేర్కొన్నారు. ఇంకను షట్పదలాటి కొన్ని ఛందములను పేర్కొనినను, వాటిని కవులు ఉపయోగించలేదు. కన్నడములో అంశ గణములతో త్రిపది, షట్పది, అక్కర, ఉత్సాహ, ఛందోవతంస, చౌపది, ఉత్సాహ ఛందములను వాడియున్నారు. ముఖ్యముగా త్రిపది, పిరియక్కర (మహాక్కర), షట్పది, ఉత్సాహ కన్నడ కావ్యములలో ప్రయోగించబడినవి.

తమిళములో వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా వంటి ఛందములను పూర్వకవులు వాడినారు. తేవారము, కంబరామాయణము వంటి కావ్యములలో వృత్తములు వాడబడినవి. వారు వీటిని విరుత్తమ్ అంటారు. నిజముగా ఇవి తెలుగు కన్నడ ఛందస్సులోని జాతులవంటివి. వీటికి ద్వితీయాక్షర ప్రాస, అక్షరసామ్య యతి, సామాన్యముగా పాదాంత విరామ యతి ఉంటాయి. ఇవి సంస్కృతమునందలి వృత్తములవంటివి కావు. ఉదాహరణముగా తేమా/కూవిళమ్/తేమా/కూవిళమ్/తేమా/కూవిళమ్/కూవిళమ్ గణములతో ఒక ఏడు శీరుల వృత్తము ఉన్నదనుకొందాము. ఇక్కడ తేమా స్థానములో గంగా (UU) లేక గాల (UI) సాధ్యము. అదే విధముగా కూవిళమ్ స్థానములో భార్గవ (UII) లేక రాధికా (UIU) గణములను వాడ వీలగును. చివరి అక్షరము గురువుగా ఉంచి ఈ అమరికను 64 విధములుగా వ్రాయ వీలగును. అందులో ఒక్కటి మత్తకోకిలకు సరిపోయే అమరిక: గాల-భార్గవ-గాల-భార్గవ-గాల-భార్గవ-రాధికా (UI-UII-UI-UII-UI-UII-UIU). తేవారములో ఇట్టి మత్తకోకిలకు సరిపోయే విరుత్తము ఉన్నది. కన్నడ తెలుగు లాక్షణికులు, కవులు సంస్కృతమునందలి వృత్తములను అదే రీతిగా యతి ప్రాసలతో అంగీకరించినారు. వారికి క్రొత్త వృత్తములను కనుగొనుటకు అవసరము లేదు. కాని తమిళములో సంస్కృతములోని వృత్తములవలె ఎన్నియో వృత్తములు విధవిధమైన శీరుల అమరికతో ఉన్నాయి. వీటినిగుఱించి మఱెప్పుడైనా చర్చిస్తాను.

ముగింపు

తెలుగు, కన్నడ, తమిళ భాషలలోని దేశిచ్ఛందస్సులలో ఎన్నియో సామ్యములు ఉన్నవి. కన్నడ తెలుగు భాషలలో లగాది గణములు నిషిద్ధము, తమిళములో అవి అంగీకృతము. తమిళ ఛందస్సు ఒక పెద్ద వర్గమయితే, అందులోని ఉపవర్గము కన్నడ ఛందస్సు, ఆకన్నడ ఛందస్సులోని ఒక ఉపవర్గము తెలుగు ఛందస్సు. మాతృష్కా బొమ్మలవంటివి ఇవి! కన్నడ తెలుగు కవులు సంస్కృతములోని వృత్తములను తమ ఛందస్సులలో ఒక భాగముగా అంగీకరించుకొని ఆవృత్తములలో పద్యములను అల్లినారు. తమిళములో వారి దేశి ఛందస్సులోని గణములతో కొన్ని సంస్కృత వృత్తపు ఛాయలను కల్పించుకొనినారు. ఈ మూడు ద్రావిడ భాషల దేశిచ్ఛందస్సుల భిన్నత్వములో అంతర్లీనమైన ఒక ఏకత్వము గలదు.


గ్రంథసూచి

  1. Tolkappiyam in English – V Murugan, Institute of Asian Studies, Chennai, 2000.
  2. ఛందోంబుధి, ప్రథమ నాగవర్మ, (Ed.) H S రామస్వామి అయ్యంగార్, శ్రీవత్సా ప్రెస్, మదరాసు, 1946.
  3. తెలుగులో దేశిచ్ఛందస్సు, సంగభట్ల నరసయ్య, ఆనందవర్ధన ప్రచురణలు, ధర్మపురి, 1991.
  4. కావ్యాలంకారచూడామణి, విన్నకోట పెద్దన, వేదం వేంకటరాయ శాస్త్రి and brothers, మదరాసు, 1936.
  5. అప్పకవీయము, కాకునూరి అప్పకవి, వావిళ్ళ రామస్వామి and sons, మదరాసు, 1934.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...