పందెం

సాయంత్రం దాదాపు ఆరు కావొస్తోంది. ఒక బీరు కొనుక్కుని, స్విమ్మింగ్ పూల్ పక్కన వేసున్న కుర్చీల్లో ఒక దాన్ని ఎంచుకుని, సాయంత్రపు నీరెండని చూస్తూ హాయిగా కూర్చుందామనుకున్నాను. చుట్టూ అందమైన తోట. రంగు రంగుల అజీలియా పూలు, ఎత్తయిన పోక చెట్లూ. గాలి వీచినపుడల్లా పోక చెట్ల మట్టలు గల గల లాడుతూ, మంటల్లో తగలబడుతున్నట్టు చిట పట శబ్దాలు చేస్తున్నాయి. బార్ నుంచి ఒక బీర్ కొనుక్కొని పూల్ వైపు నడిచాను.

బోలెడన్ని కుర్చీలు, తెల్లటి టేబుళ్ళూ రంగు రంగుల పెద్ద గొడుగుల కింద వేసి ఉన్నాయి. స్విమ్‍సూట్స్‌లో ఉన్న ఆడా మగా వాటి కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. పూల్‍లో నలుగురు ఆడపిల్లలు, షుమారొక డజను మంది అబ్బాయిలూ రబ్బర్ బంతితో ఆడుకుంటూ సంతోషంతో సందడి సందడిగా ఉన్నారు.

వాళ్ళనే చూస్తూ నిలబడ్డాను. ఆ అమ్మాయిలు ఈ హోటల్లో బస చేసిన ఇంగ్లీష్ పిల్లలు. చూస్తే తెలుస్తోంది. అబ్బాయిలు, ఎవరో తెలీదు కాని, బహుశా అమెరికన్ నావికులు కావొచ్చు. ఈ రోజు ఉదయమే హార్బర్‍లో అమెరికన్ యుద్ధనౌక ఒకటి ఆగింది.

వెళ్ళి నాలుగు ఖాళీ కుర్చీలున్న ఒక పసుప్పచ్చ గొడుగు కింద కూచుని గ్లాసులో బీరు పోసుకుని, సిగరెట్ వెలిగించాను. హాయిగా ఉంది ఇలా కూర్చొని తాగడం. హాయిగా ఉంది పూల్‍లో ఆడుకుంటూన్న పిల్లల్ని చూడడం.

అబ్బాయిలు అమ్మాయిలకు బానే దగ్గరయినట్టున్నారు. అందరూ హుషారుగా ఆడుకుంటున్నారు. అబ్బాయిలు నీళ్ళ లోపలికి వెళ్ళి అమ్మాయిల కాళ్ళు పట్టి వాళ్ళను తిప్పి పడేస్తున్నారు.

ఇంతలో ఒక పొట్టి ముసలి వ్యక్తి పూల్ అంచుమీదుగా నడుస్తూ రావడం గమనించాను. శుభ్రమైన తెల్లని సూట్‍లో ఉన్నాడు. గెంతుతున్నట్టుగా ఎత్తెత్తి అంగలు వేస్తూ నావైపు వచ్చాడు. నెత్తిన వెడల్పాటి లేత రంగు పనామా టోపీ.

నా పక్కన ఆగి, ఎగుడు దిగుడు గారపళ్ళు చూపిస్తూ స్నేహంగా నవ్వాడు.

“డిస్ సీట్, కెన్ ఐ ప్లీస్?”

“కూచోండి. దాన్దేముంది.”

కుర్చీని జాగ్రత్తగా పరీక్షించి కాలి మీద కాలేసుకుని కూచున్నాడు. తెల్లని అతని షూస్‍కి గాలి పారడానికి కాబోలు రంధ్రాలున్నాయి.

“డిస్ ఈవెనింగ్ ఫైన్. అఫ్‍కోర్స్, జమైకాలో అన్ని సాయంత్రాలు చక్కగానే ఉంటాయి” అన్నాడు. అతని యాస ఇటాలియనా లేక స్పానిష్షో తెలియలేదు కానీ, తప్పకుండా దక్షిణ అమెరికా మనిషే అనుకున్నాను. అరవై అయిదు-ఆరూ ఏళ్ళుండొచ్చనుకుంటాను.

“అవును, చాలా బావుంది” అన్నాను.

“వీళ్ళంతా ఎవరు? ఈ హోటల్‍లో బస చేసినవారు కారు” అన్నాడు పూల్‍లో యువతీ యువకుల్ని చూపిస్తూ.

“వాళ్ళు ట్రైనింగ్ కోసం వచ్చిన అమెరికన్ నావికులు అనుకుంటా.”

“అవును, అమెరికన్సే. ప్రపంచంలో ఇంత గోల అమెరికన్స్ కాక ఎవరు చేస్తారు? మీరు అమెరికన్ కాదు, యేస్?” అన్నాడు.

“కాదు, నేను అమెరికన్‍ని కాదు.”

ఇంతలో పూల్ నుంచి ఒక నావికుడు వచ్చి మా టేబుల్ ముందు నీళ్ళు కారుతూ నిల్చున్నాడు. అతనితోపాటే ఒక ఇంగ్లీష్ అమ్మాయి కూడా ఉంది.

“ఈ కుర్చీలో కూర్చోవచ్చా?” అన్నాడు మర్యాదగా.

“కూర్చోండి.”

“థాంక్స్” అతను కుర్చీలో కూచుని ఉండచుట్టిన తన తువ్వాలు విప్పి అందులోంచి ఒక సిగరెట్ పాకెట్, లైటర్ తీసి పక్కన ఉన్న అమ్మాయికి సిగరెట్ ఆఫర్ చేశాడు. ఆమె తిరస్కరించింది. నాకూ, అతనికీ ఆఫర్ చేశాడు. నేను థాంక్స్ చెప్పి తీసుకున్నాను. అతను మాత్రం “టాంక్ యూ, నా దగ్గర చుట్ట ఉంది” అని కేస్ లోంచి చుట్ట ఒకటి బయటకు తీశాడు. సన్నని కత్తెర తీసి, చుట్ట ముందు భాగాన్ని లాఘవంగా కత్తిరించాడు.

“నే వెలిగిస్తా ఉండండి” అమెరికన్ అబ్బాయి వెలిగించబోయాడు తన లైటర్‍తో.

“ఈ గాలిలో అది పనిచేయదు.”

“పని చేస్తుంది. ప్రతీసారీ పని చేస్తుంది” అన్నాడా అబ్బాయి.

పొట్టి వ్యక్తి తల పక్కకు పెట్టి నావికుడిని చూశాడు. “ప్రతీసారీ?” అన్నాడు చాలా నెమ్మదిగా.

“అవును. నేనైతే ఎప్పుడూ ఫెయిల్ కాలేదు వెలిగించడంలో.”

పొట్టి వ్యక్తి తల ఇంకా పక్కకే వొంగివుంది. చూపు ఆ నావికుడి మీదే ఉంది ఇంకా. “వెల్, అయితే ఈ మహా గొప్ప లైటర్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదంటావు?”

“అవును” అన్నాడా అబ్బాయి. పంధొమ్మిది, ఇరవయ్యేళ్ళుంటాయేమో. మొహాన గోధుమ రంగు మచ్చలు. కోటేరు ముక్కు. ఛాతీ మీద పల్చగా ఎర్రని వెంట్రుకలు, అక్కడ కూడా మచ్చలున్నాయి. చిరునవ్వుతో లైటర్‍ని వెలిగించడానికి సిద్ధంగా పట్టుకుని బొటన వేలుని దాని మీద పెట్టాడు, చిరునవ్వుతో.

“ఒక్క నిమిషం” పొట్టి వ్యక్తి చుట్ట పట్టుకున్న చేతిని ఎత్తి ట్రాఫిక్ పోలీసులా చెయ్యి అడ్డంగా పెట్టాడు. “జిస్… ఉన్ మినీట్” ఆ అబ్బాయినే చూస్తూ అన్నాడు. “చిన్న పందెం వేసుకుందామా అయితే? నీ లైటర్ వెలుగుతుందో లేదో?”

“సరే, వేసుకుందాం” అన్నాడా యువకుడు.

“వేస్తావా పందెం?”

“ఆ, వేస్తాను. పందాలు నాకిష్టమే.”

పొట్టి వ్యక్తి చుట్టని తీసి పరీక్షగా చూస్తున్నాడు. నిజం చెప్పొద్దూ, నాకతని ప్రవర్తన ఏమీ నచ్చడం లేదు. ఈ మొత్తం వ్యవహారం ఆ యువకుడిని అవమానించడానికే అనిపిస్తోంది. అదే సమయంలో అతనేదో దాస్తున్నాడనీ అనిపిస్తోంది.

“నాకూ పందాలు కాయడం ఇష్టమే. అయితే కొంచెం పెద్ద పందెం కాద్దాం.”

“ఒక్క నిమిషం. పెద్ద పందాలు నేను కాయలేను. ఒక క్వార్టర్ కాస్తాను. లేదా మహా అయితే ఒక డాలర్. అంతకంటే కాయను” అన్నాడా యువకుడు.

“జిస్ ఫర్ ఫన్, సరదాగా పందెం వేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వద్దు, నా రూముకు పోదాం. అక్కడ ఈ గాలి బాధ ఉండదు. పది అవకాశాలు ఇస్తాను నీకు నా చుట్ట వెలిగించడానికి నీ ఫేమస్ లైటర్‍తో. ఏవంటావ్? వేద్దామా పందెం?”

“సరే వేస్తాను. ఒక డాలర్.”

“నో, మంచి పందెం కాస్తా నేను. నా దగ్గర డబ్బుకి కొదవ లేదు. హోటల్ బయట నా కారుంది. డట్ ఈస్ అ కాడిలాక్. మీ దేశం కారే.”

ఆ యువకుడు కుర్చీలో వెనక్కి జారగిలబడి నవ్వాడు. “ఇంత ఖరీదైన పందాలు నావల్ల కాదు.”

“ఏం పర్లేదు. ఒక్క సారి కూడా ఫెయిల్ కాకుండా పదిసార్లూ నువ్వు చుట్ట వెలిగిస్తే ఆ కారు నీదే. కాడిలాక్ నీకిష్టమా కాదా?”

“ఇష్టమే, సరే ఈ పందానికి నేనొప్పుకుంటున్నా.”

“మరి నువ్వేం కాస్తావు పందెం? నువ్వు ఇవ్వలేనంత వస్తువేమీ అడగను నేను. సరేనా?” చుట్టకి చుట్టి ఉన్న ఎర్రటి కాగితాన్ని జాగ్రత్తగా వూడదీశాడు.

“ఏం పందెం కాయను?”

“నీకు సులభంగా ఉండేట్టుగానే.”

“సరే.”

“నువ్వు ఇవ్వగలిగే చిన్న వస్తువేదైనా తీసుకుంటాను, అదీ నువ్వు ఓడిపోతేనే.”

“అంటే? ఎలాటిది?”

“అంటే… నీ ఎడమ చేతి చిటికెనవేలు లాంటిది.”

“ఏంటీ? నా…?”

“అవును. నువ్వు గెలిస్తే కాడిలాక్ కారు తీసుకుపో. నేను గెలిస్తే నీ చిటికెనవేలు తీసుకుంటా.”

“నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా తీసుకుంటారు నా చిటికెనవేలు అసలు?”

“కత్తితో కోసి.” తాపీగా అన్నాడు పొట్టి వ్యక్తి

“ఓ మైగాడ్, పిచ్చా మీకు? నేనింకా ఏదో ఒక డాలర్ అనుకున్నా.”

పొట్టి వ్యక్తి కుర్చీలో వెనక్కి వాలి చేతులు పైకి చాపి భుజాలెగరేశాడు. “వేల్, వేల్, వేల్. నీ గొప్ప లైటర్ వెలుగుతుందంటావు, కానీ పందెం కట్టడానికి మాత్రం ఒప్పుకోవు. ఇలా అయితే వదిలేద్దామా?”

ఆ యువకుడు నిశ్శబ్దంగా కూచున్నాడు. తన సిగరెట్ వెలిగించుకోనే లేదని అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టుంది. సిగరెట్ పెదవుల మధ్య ఉంచుకుని, చేతుల్ని గుండ్రంగా మూసి లైటర్‍తో వెలిగించుకున్నాడు. నెమ్మదిగా స్థిరంగా పసుపు రంగు మంట సిగరెట్‍ను తాకి ఎర్రగా మార్చింది. గుండ్రంగా మూసిన ఆ చేతుల మధ్యకి కొంచెం కూడా గాలి చొరబడలేక పోయింది.

“నేను కూడా వెలిగించుకోవచ్చా?” అడిగాను.

“అయ్యో, క్షమించండి, మర్చేపోయాను” అంటూ మర్యాదగా నిలబడి మరీ నా సిగరెట్ కూడా వెలిగించాడు.

“థాంక్ యూ. అంతా బాగానే ఉందా ఇక్కడ మీకు” అన్నాను.

“యా, అంతా బానే ఉంది” అన్నాడు.

కొంచెం సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ యువకుడిని తన పందెం ప్రతిపాదనతో డిస్టర్బ్ చేయడంలో పొట్టి వ్యక్తి సఫలమయ్యాడు. కాసేపు స్థిరంగానే కూచున్నా, అతనిలో ఏదో అశాంతి మొదలయింది. అటూ ఇటూ కుర్చీలు మారాడు. చేతుల్తో ఛాతీ రుద్దుకున్నాడు కాసేపు. వీపు మీద, మెడ మీద చేత్తో తట్టుకుంటూ ఆలోచించాడు. చివరికి ఒక కుర్చీలో కూలబడి మోకాళ్ళ మీద చేతుల్తో టకటకా కొడుతూ కూచుండి పోయాడు కాసేపు. పాదాలు నేల మీద చిన్న చప్పుడుతో తడుతున్నాయి.

“మరోసారి చెప్పండి. మీ గదిలోకి వెళ్ళి వరసగా పదిసార్లు మీ చుట్టని నా లైటర్‍తో వెలిగిస్తే మీ కాడిలాక్ కారు నాకు ఇస్తారు. ఒక్కసారి మిస్ అయినా నా చిటికెన వేలు మీరు కట్ చేసి తీసుకుపోతారు. అంతేగా?”

“సరిగా అదే మన పందెం. నీకు భయమేసిందనుకున్నాను.”

“ఒకవేళ నేను ఓడిపోతే ఏం చెయ్యాలి? నా చేతిని పట్టుకుని వేలు కోసేస్తారా మీరు?”

“కాదు, అలా అయితే నేను కోసే టైముకి నువ్వు చెయ్యి వెనక్కి లాక్కునే అవకాశం ఉంది. పందెం మొదలయ్యే ముందుగానే నీ చేతిని టేబుల్‍కి కట్టేస్తాను. లైటర్ వెలగడం మిస్ కాగానే కత్తితో వేలు కోసేస్తాను.”

“కాడిలాక్ కారు ఎప్పటిది?”

“ఏంటీ?”

“కారు ఏ సంవత్సరం మోడల్?”

“అదా? పోయినేడాదే కొన్నాను. కొత్తది. నౌ మోడల్.”

యువకుడు పక్కనున్న ఇంగ్లీష్ యువతి వైపు ఒకసారి చూశాడు. “ఓకే, నేను పందానికి సిద్ధం.”

“గుడ్ గుడ్” పొట్టి వ్యక్తి చప్పట్లు కొట్టాడు. తర్వాత నా వైపు చూసి “యూ ప్లీస్ కమ్ సర్! మీరు ఈ పందానికి… అదీ అదేంటీ? ఆఁ, రిఫరీగా ఉంటే బాగుంటుంది.”

“నాకసలు ఈ పందెం చాలా చెత్తగా తోస్తోంది. నాకిది నచ్చలేదు” అన్నాను.

“నాక్కూడా” అంది ఇంగ్లీష్ యువతి మొదటి సారిగా నోరు విప్పి. “చాలా మూర్ఖం ఇది.”

“అతని వేలు కత్తిరించడం గురించి నువ్వు నిజంగానే అంటున్నావా?” పొట్టి వ్యక్తి వైపు చూశాను.

“ఆహా, సీరియస్ గానే అంటున్నా. అతడు గెలిస్తే నా కాడిలాక్ కూడా సీరియస్‍గానే ఇస్తానంటున్నా. సరే పదండి అందరూ నా గదికి వెళ్దాం” లేచి నిలబడి యువకుడి వైపు చూశాడు.

“బట్టలు మార్చుకుంటావా?”

“లేదు, ఇలాగే వస్తాను.”

అతడు లేచి తోటలో నుంచి హోటల్ లోకి దారి తీశాడు. ఒక రకమైన పైశాచికానందంతో గబగబా అడుగులు వేస్తున్నాడు. “నా గది ఆ చివర ఉంది” అన్నాడు మేము అడక్కుండానే. ఒక చోట ఆగి “అదిగో, బయట పార్కింగ్‍లో ఉంది చూడండి. అదే నా కారు” అన్నాడు.

లేత ఆకుపచ్చ రంగు కాడిలాక్ కారు మెరిసిపోతోంది.

“బాగుంది కారు” అన్నాడు యువకుడు.

“సరే పద, దాని ఓనరెవరో తేలుద్దాం” అని మెట్లెక్కి పై ఫ్లోర్‍కి దారి తీశాడు.

తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళాం. అందమైన డబుల్ బెడ్‍రూమ్. మంచం మీద ఆడవాళ్ళ నైట్‍గౌన్ పడి ఉంది.

“పందెం మొదలు పెట్టబోయే ముందు, కొంచెం మార్టినీ తాగుదాం” అన్నాడు. కాక్‍టైల్ కలపడానికి కావలసిన డ్రింక్సూ, గ్లాసులూ, ఐసూ అన్నీ టేబుల్ మీద సిద్ధంగానే ఉన్నాయి. ఎవరో తలుపు తట్టారు. హోటల్లో పని చేసే మెయిడ్ బయట నిల్చుని ఉంది.

“వచ్చావా?”అంటూ ఆమెకి ఒక పౌండ్ నోటు తీసిచ్చాడు. “ఉంచుకో.”

“నాకో చిన్న పని చేసి పెడతావా? మేము సరదాగా ఒక ఆట ఆడబోతున్నాం. దానికి రెండు మూడు వస్తువులు కావాలి. కొన్ని మేకులు, ఒక సుత్తి, మాంసం కొట్టే కత్తి. కత్తి కిచెన్‍లో అడుగు. ఇవన్నీ తెచ్చి పెడతావా?”

“మాసం కొట్టే కత్తా? నిజంగానే?” కళ్ళు పెద్దవి చేసింది.

“అవును, నిజంగానే. పోయి తీసుకురా ప్లీస్.”

“సరే, ట్రై చేస్తాను” వెళ్ళిపోయింది.

పొట్టి వ్యక్తి అందరికీ మార్టినీలు పోసి ఇచ్చాడు. ఆ యువకుడు, ఇంగ్లీష్ యువతి, నేను, పొట్టి వ్యక్తి అందరం నెమ్మదిగా చప్పరిస్తున్నాం. అసలు ఇదంతా ఏమిటో నాకర్థం కావట్లేదు. నిజంగానే ఈ పిల్లాడు ఓడిపోయి, చిటికెనవేలుని పోగొట్టుకుంటే, అర్జెంట్‍గా అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. అదీ అతను గెలవని ఆ కాడిలాక్ కారులో. అసలు అదంతా కాదు, ఈ పందెం ఎంత మూర్ఖంగా ఉంది?

“అసలు ఇదంతా చాలా సిల్లీగా లేదూ? ఈ పందెం?” అన్నాను.

“అవును, వెరీ సిల్లీ” వంతపాడింది ఆ ఇంగ్లీష్ పిల్ల. “నువ్వు ఓడిపోతే?”

“ఏం పర్లేదు” ఆ కుర్రాడు కొట్టిపారేశాడు. అప్పటికే ఒక లార్జ్ అవగొట్టేసి ఉన్నాడు. “ఏం పర్లేదు. అసలు ఇంతవరకూ నా లైఫ్‍లో ఎడమ చేతి చిటికెనవేలుకంటూ ఒక్క ఉపయోగం కూడా చూళ్ళేదు. ఈ పందెం నాకు ఓకే.”

పొట్టి వ్యక్తి నవ్వి, పిచర్ తీసుకొని మార్టినీ రెండో రౌండ్ పోయడంలో పడ్డాడు.

“పందెం మొదలు పెట్టడానికి ముందు, కారు తాళాలను రిఫ్… అదే రిఫరీ ముందు పెడుతున్నాను” అని జేబులోంచి కారు తాళం తీసి నాముందు పెట్టాడు. “కారు పేపర్లు అన్నీ కార్లోనే ఉన్నాయి.”

హోటల్ పని పిల్ల సుత్తి, కాసిన్ని మేకులు, కత్తీ పట్టుకొచ్చింది.

“తెచ్చావా? గుడ్, టాంక్ యూ టాంక్ యూ. ఇంక నువ్వెళ్ళొచ్చు” అని ఆమె వెళ్ళేదాకా ఆగి వాటిని మంచం మీద పెట్టాడు.

“కాస్త హెల్ప్ చేయండి టేబుల్ జరపడానికి” అంటూ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అదొక మామూలు రాత బల్ల. దాని మీద ఉన్న కాగితాలు, ఇంకు, రైటింగ్ పాడ్ అవన్నీ తీసి పక్కన పెట్టాడు. “కుర్చీ, కుర్చీ” అంటూ కుర్చీని దాని దగ్గరకు జరిపి మేకులు, సుత్తి టేబుల్ మీదకు చేర్చాడు. ఈ పన్లన్నీ అతడు ఉత్సాహంగా పిల్లల పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నంత శ్రద్ధగా చేస్తున్నాడు. మిగతా ముగ్గురమూ మార్టినీ గ్లాసులు చేత బట్టుకుని అతన్నే గమనిస్తున్నాం.

రెండు మేకుల్ని ఒకదానికొకటి టేబుల్ మీద ఆరంగుళాల దూరంలో పెట్టి, మేకుల్ని సగంపైగా టేబుల్ లోకి కొట్టాడు. మేకులు ఊగకుండా గట్టిగా ఉన్నాయో లేదో కదిపి చూశాడు. ఎవరైనా చూస్తే ఈ వెధవ ఇంతకు ముందు ఈ పని చాలా సార్లు చేసే ఉంటాడు అనుకుంటారు, అనుకున్నాను. “ఇప్పుడు మనకు కావలసిందల్లా, ఒక తాడు” అని అటూ ఇటూ చూసి దాన్ని కూడా సంపాదించాడు. చాలా నైపుణ్యంతో చేస్తున్నాడు ప్రతీ పనీ.

“ఓకే, నీ చేతిని ఆ రెండు మేకుల మధ్య పెట్టు. ఈ తాడుతో మేకులను కడతాను. అప్పుడు నీ చెయ్యి కదలకుండా ఉంటుంది.”

కుర్రాడు చేతిని టేబుల్ మీద పెట్టగానే, తాడుని ముందు అతని మణికట్టు మీదుగా చుట్టి, రెండు మేకుల్ని కలుపుతూ గట్టిగా కట్టాడు. ఇహ ఆ కుర్రాడు చేతిని కదిలించగలిగే ప్రశ్నే లేదు. వేళ్ళు మాత్రం కదల్చగలడు. “పిడికిలి బిగించి ఒక్క చిటికెనవేలును మాత్రం బయటకు పెట్టండి.”

“ఓకే, మనం రెడీ ఇప్పుడు. నీ కుడిచేత్తో లైటర్ వెలిగించు. రిఫరీగారూ, మీరు స్టార్ట్ చెప్పాలి. ఒక్క నిమిషం” అని బెడ్ మీదకి గెంతి కత్తి తెచ్చి ఆ కుర్రాడి చిటికెనవేలు మీద ఒక పది అంగుళాల దూరంలో పట్టుకున్నాడు. ఆ కుర్రాడు కుర్చీలో నిశ్శబ్దంగా కూచున్నాడు, కత్తి వైపు చూస్తూ. ఆ అమ్మాయి అతని కుర్చీ వెనకే నిల్చుంది.

“సిద్ధమా?” అడిగాను కుర్రాడిని. తలూపాడు. పొట్టి వ్యక్తి వైపు చూశాను. కత్తిని టేబుల్ మీదనుంచి రెండడుగులు పైకెత్తి చూపిస్తూ, తను సిద్ధమేనన్నట్టు చూశాడు. కుర్రాడు కనుబొమ్మలు కొద్దిగా ముడేశాడంతే.

“సరే, మొదలు పెట్టండి.”

“నేను వెలిగించేటపుడు అంకెలు గట్టిగా లెక్క పెడతారా ప్లీజ్?”

“సరే.”

ఆ యువకుడు కుడి చేతి బొటనవేలితో లైటర్‍కి ఉన్న బుల్లి చక్రాన్ని తిప్పి వెలిగించాడు. పసుపు రంగు మంట చుట్ట మొదలుని తాకి వెలిగించింది.

“ఒకటి.”

పొట్టి వ్యక్తి మంటను వేలితో ఆర్పేసి రెండో తడవ కోసం చూశాడు. కుర్రాడు రెండోసారి కూడా వెలిగించాడు. ఇద్దరూ లైటర్‍నే చూస్తున్నారు. పొట్టి వ్యక్తి మాత్రం కత్తి పట్టుకునే ఉన్నాడు.

“మూడు.”

“నాలుగు.”

“ఐదు.”

“ఆరు.”

“ఏడు.”

ఏడో సారి కూడా లైటర్ చుట్టను వెలిగించింది. ఆ కుర్రాడి బొటన వేలు ప్రతిసారీ లైటర్ మంటను ఆర్పేసి మళ్ళీ వెలిగిస్తోంది. అంతా బొటన వేలితోనే. ఎనిమిదోసారి బొటనవేలుతో తిప్పి లైటర్ వెలిగించాడు. మంట వచ్చి చుట్టను తాకి వెలిగించింది.

“ఎనిమిది” అంటుండగా తలుపు తెరిచిన చప్పుడైంది.

అందరం అటు చూశాం. తలుపు దగ్గర నిలబడి ఉంది ఒక సన్నపాటి స్త్రీ. నల్లటి జుట్టు. లోపలికి వస్తూనే పొట్టి వ్యక్తి వైపు చూసి “కార్లోస్, కార్లోస్” అంటూ అతని వైపు పరిగెత్తి చేతిలోని కత్తి లాగేసుకుని మంచం మీదకు విసిరేసింది. అతని సూట్ కాలర్ పట్టుకుని వూపేస్తూ, గబ గబా కోపంగా స్పానిష్ లాంటి భాషలో వేగంగా అరుస్తూ మాట్లాడింది. ఎంత వేగంగా అతన్ని ఊపేసిందంటే, అతను మాకు సరిగా కనపడకుండా పోయాడు. కళ్ళు తిరిగిపోయాయి అతనికి. ఆమె నెమ్మదించి అతన్ని మంచం మీదికి తోసింది. మంచం చివర కూచుని మెడ మీద తల సరిగా ఉందా లేదా చూసుకుంటున్నాడు పొట్టి వ్యక్తి.

“ఐ యామ్ సారీ, టెరిబ్లీ సారీ. ఇలా జరిగి ఉండకూడదు” చక్కని ఇంగ్లీష్‍లో మాట్లాడింది మాతాఒ.

“చాలా ఘోరం ఇది. ఇదంతా నా తప్పే. పది నిమిషాలు ఇతన్ని వదిలి అలా హెయిర్ సెలూన్‍కి వెళ్ళొచ్చానో లేదో, మళ్ళీ ఇదే పనిలోకి దిగాడు” అపరాధభావంతో అంది. “ఇతను చాలా ప్రమాదకరమైన మనిషి. మేముండే చోట దాదాపు 47మందికి ఇలా చిటికెన వేళ్ళు కత్తిరించాడు తెల్సా? పదకొండు కార్లు పోగొట్టుకున్నాడు. అతన్ని మాయం చేసేస్తామని అక్కడ అందరూ బెదిరింపులకు దిగడంతో ఇక్కడికి తీసుకొచ్చాను.”

మాకు మాటల్లేకుండా పోయాయి.

“మేము ఏదో చిన్న పందెం వేసుకున్నాం” గొణిగాడు పొట్టి వ్యక్తి కూచున్న చోటు నుంచే.

“మీతో కారు పందెం కాశాడు కదూ?”

“అవును, కాడిలాక్ కారు.”

“అసలు ఇతనికి కారే లేదు. ఆ కారు నాది. చాలా సిగ్గు పడుతున్నాను ఇతను ఇలా చేసినందుకు.”

ఎంత మంచి స్త్రీ ఈమె అనిపించింది. “ఇదిగోండి మీ కారు తాళంచెవి” టేబుల్ మీద పెట్టాను.

“వూరికే చిన్న పందెం…” ఇంకా గొణుగుతూనే ఉన్నాడు అతను .

“అతని దగ్గర పందెం కాయడానికి ఏమీ మిగల్లేదు. ఈ లోకంలో అతని సొంతానికంటూ ఏమీ లేదు. నిజానికి అదంతా నేను గెలుచుకున్నాను అతని దగ్గర నుంచి. అందుకోసం చాలా టైము పట్టిందీ, కష్టమూ పడ్డాను, కానీ మొత్తానికి అంతా నా సొంతమైంది” నవ్వింది.

ఆ నవ్వులో విషాదముంది. ముందుకు వచ్చి కారు తాళం తీసుకోడానికి టేబుల్ మీదకి చేయి చాపింది.

ఆ చేతికి ఒక వేలే మిగిలి ఉంది. బొటనవేలు కాక.

(మూలం: Man from the south)