స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా?

డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు ఈమాట నవంబరు 2013 సంచికలో కుమారసంభవ కావ్య కర్తృత్వ విషయ నిర్ణయముపై వ్రాసిన నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసానికి నా స్పందన ఈ వ్యాసము. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము, నన్నెచోడుడు: 1. ప్రబంధయుగములో గాని, దాని తఱువాత గాని జీవించి ఉండుటకు వీలుకాదు, 2. కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందు కుమారసంభవమును వ్రాసినాడని చెప్పడం మాత్రమే.

ఒక పద్యముపైన మానవల్లి రామకృష్ణకవి వ్రాసిన వ్యాఖ్య నాధారము చేసికొని, అది తెనాలి రామకృష్ణకవి (తె.రా.క) వ్రాసిన కందర్పకేతువిలాసములోని ఒక పద్యమునకు అనుకరణగా నున్నందువలన, నన్నెచోడుడు తె.రా.క. పిదప కాలము వాడని ఆయన నిర్ణయించారు. కొన్ని పద్యముల మూలములను త్రవ్వి వివరంగా మనకు చూపించిన తీరు, వారి శక్తి సామర్థ్యాలు హర్షనీయమే.

నన్నెచోడుడు 16వశతాబ్ది తఱువాతివాడా?

ముందుగా మనము నన్నెచోడుడు తె.రా.క. పిదప కాలము వాడని, అంటే పదహారవ శతాబ్దము లేక దాని తఱువాతి కాలము వాడని అనుకొంటే వచ్చే పర్యవసానములేమిటో గమనిస్తాను.

  1. నన్నెచోడుడు కుమారసంభవ[1] కావ్యావతారికలో తాను కరికాలచోళుని వంశమునకు చెందినవాడని గర్వముగా చెప్పుకొన్నాడు.

కలుపొన్న విరులఁ బెరుఁగం
గలుకోడి రవంబు దిశలఁ గలయఁగఁ జెలగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘు పరాక్రముడఁ డెంకణాదిత్యుండన్ (1.54)

చోళ రాజులు సుమారు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండి సుమారు క్రీస్తు శకము పదమూడవ శతాబ్దమువఱకు దక్షిణభారతదేశమును పరిపాలించారు. పాండ్యరాజులు క్రీ.శ. 1279లో చోళసామ్రాజ్యమును తమ వశము చేసికొన్న పిదప చోళుల పరిపాలన అంతమయినది. అట్టి పక్షములో పదహారవ శతాబ్దములో నన్నెచోడుడు ఎక్కడినుండి వచ్చాడు అనే ప్రశ్న వస్తుంది గదా? అది మాత్రమే గాక, విజయనగర రాజుల పరిపాలనలో చోళరాజులు ఇప్పటి దక్షిణాంధ్రములో ఉన్నట్లు చరిత్రలో దాఖలాలు గాని, శాసనాలు గాని లేవు. ఉన్న పక్షములో నన్నెచోడుని గుఱించిన చర్చలో ఎప్పుడో ఈ విషయము బయటపడి ఉండేది.

  1. నన్నెచోడుడు కు.స. కావ్యమును తన గురువైన జంగమ మల్లికార్జునునికి అంకిత మిచ్చాడు.

రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
త్కవి భువి నన్నెచోడుఁ డటె, కావ్యము దివ్యకథం గుమార సం
భవ మటె, సత్కథాధిపతి భవ్యుఁడు జంగమ మల్లికార్జునుం
డవిచలితార్థ యోగధరుఁ డట్టె, వినం గొనియాడఁ జాలదే (1.57)

పదహారవ శతాబ్దము, దాని పిదప కాలములో వీరశైవుల ఆధిక్యము దక్షిణాంధ్రములో అంతగా లేదు, అలాటి గురువు ఉండినట్లు కూడ మనకు ఆధారాలు లేవు.

ఇందువల్ల మనకు తెలిసే విషయమేమంటే — కరికాలచోళుని వంశములో పుట్టి, జంగమ మల్లికార్జునుని గురువుగా బొందిన నన్నెచోడుడు — పదహారవ శతాబ్దము పిదప, నిజానికి పదమూడవ శతాబ్దము పిదప జీవించి ఉండడం సంభవం కాదని అనిపిస్తున్నది.

కుమారసంభవము లోని కొన్ని ఛందోంశములు

  1. తెలుగు కవులు కావ్యారంభములో సామాన్యముగా శ్రీకారముతో శార్దూలవిక్రీడితమునో లేక ఉత్పలమాలనో వాడుతారు. కాని కాలిదాసాది కవులవలె నన్నెచోడుడు కావ్యారంభములో స్రగ్ధరావృత్తమును వ్రాసినాడు. దీనికి కారణము ఇతడు తెలుగులో ఆదికవియో లేక ఆదికవులలో ఒక్కడుగా నుండాలి.

స్రగ్ధరకు గణములు – మ/ర/భ/న/య/య/య. నన్నెచోడుడు స్రగ్ధరలో వ్రాసిన మొదటి పద్యముపైన ఎన్నో అభిప్రాయములు గలవు. అవి:

1. తన పేరైన మానవల్లి రామకృష్ణకవి యందలి మ. ర. అక్షరములతో ఈ వృత్తమును వ్రాసినాడని అందువలన మానవల్లి రామకృష్ణకవియే కు.స. కావ్య రచయిత అని ఒక వాదము ఉంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే.

2. మగణ-రగణములు ప్రక్కప్రక్కన ఉంటే మరణము సంభవించునని, అందువలననే నన్నెచోడుడు యుద్ధములో చనిపోయాడని అందువలన స్రగ్ధరావృత్తమును కావ్యారంభములో వాడుట శ్రేయస్కరము కాదని అధర్వణ ఛందస్సు లోని ఒక పద్యము రావూరు దొరసామిశర్మ ఛందోరీతులలో[2] కనిపిస్తుంది. ఆ పద్యము ఇది:

మగణమ్ముఁ గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
బగు నిక్కమండ్రు మడియఁడె
యగుననియిడి తొల్లి టేంకణాదిత్యుఁ డనిన్

అధర్వణుడు సుమారు క్రీ.శ. 1300-1400 మధ్యనుండిన వాడు[3]. అసలు ఆ పద్యము అధర్వణుడు వ్రాయలేదని ఇంకొక వివాదము ఉన్నది. ఇటువంటి పద్యమే భైరవకవి రచించిన కవిగజాంకుశము అనే గ్రంథములో[4] ఉన్నది. ఈ కావ్యాన్ని కూడా మానవల్లి కవిగారే పరిష్కరించారు. ఆ పద్యాన్ని తీసుకుని కొంతగా మార్చి అధర్వణుడికి ఆపాదించి తద్వారా తన సిద్ధాంతానికి అనువుగా వాడుకున్నారని, అందువల్లనే ఈ పద్యపు తాళపత్ర ప్రతి ఎవరికీ చూపలేదని, రామకృష్ణకవిపై ఆరోపణ చేశారు. కొర్లపాటి శ్రీరామమూర్తి[4] ఇలాగంటారు: “ఇది (అధర్వణఛందము) ప్రసిద్ధమైన ఛందమే కాని నేడు లభించదు. ఇతర లక్షణగ్రంథములలో దీని పద్యములు 30 వఱకు లభించెను. రావూరి దొరసామిశర్మ అందిచ్చిన సమాచారమునందును “మగణమ్ముఁ గదియ రగణము” అను పద్యము లేదు. అంతే కాదు అది ముద్రితాముద్రిత లక్షణగ్రంథములందు మృగ్యము.” ముందు ఈ పద్యము అధర్వణఛందములో నున్నదని చెప్పిన దొరసామిశర్మకూడా తఱువాత తన అభిప్రాయమును మార్చుకొన్నారు.

ఎన్నో కట్టు కథలు ఉన్నట్లు ఈ మ/ర గణములపైన కూడ ఒక చాటువు ఉండి ఉండవచ్చును. అది నిజముగా అధర్వణ ఛందములో నున్నదా లేదా అనే విషయము కూడ నన్నెచోడుని కాల చర్చకు అనవసరము. నన్నెచోడుడు ఆదికవులలో ఒకడు కాబట్టి, అతనికి నచ్చిన వృత్తాన్ని అతను ఎన్నుకున్నాడు. కాలిదాసాదులు శార్దూలవిక్రీడిత, స్రగ్ధరా వృత్తములను వాడినారు. పంపకవి ఉత్పలమాలను వాడాడు. నన్నెచోడుడు స్రగ్ధరను ఎన్నుకున్నాడు.

  1. కవిరాజవిరాజితమనే వృత్తమునకు ఆ పేరు ఏ విధముగా వచ్చింది?

సంస్కృతములో, కన్నడములో ఇది హంసగతిగా చెలామణి అయినది. నన్నెచోడుడు తాను కవిరాజశిఖామణి అని ప్రకటించుకొన్నాడు ‘రవికులశేఖరుండు కవిరాజశిఖామణి…’ పద్యంలో కాబట్టి నన్నెచోడుడే దీనికి కవిరాజవిరాజితము అనే పేరునుంచినాడా అనే సందేహం కూడ కలుగుతుంది. (బహుశా పోతన వ్రాసిన పలికెడిది భాగవతమట… అనే పద్యము ఈ పద్యమునకు అనుసరణయే ఏమో?)

  1. అదే విధముగా మంగళమహాశ్రీవృత్తము కూడ కవిజనాశ్రయములో ఉదహరించబడినది.

ఈ వృత్తము సంస్కృతములో గాని, కన్నడములో గాని లేదు. మఱి తెలుగులో ఎవరు వ్రాసినారు? చోడుని తఱువాత తిక్కన కూడ ఈ వృత్తమును స్త్రీపర్వములో వాడాడు. కు.స.లో ఈ వృత్తము కూడ ముద్రాలంకారయుక్తమై ఉన్నది. ఇది లయగ్రాహిలోని ఒక పంచమాత్రను త్యజించగా లభించిన వృత్తము. లయగ్రాహిలోని యతి ప్రాసయతి, మంగళమహాశ్రీ యందలి యతి అక్షరసామ్య యతి. దేశి కవిత్వమును ఆదరించిన నన్నెచోడుడు ఈ వృత్తమును సృష్టించి యుండవచ్చును గదా? దీని వివరములు మఱొక వ్యాసంలో ప్రస్తావించాను. గమనించగలరు.

  1. నన్నెచోడుడు ఎన్నో పద్యములను ముద్రాలంకారముతో వ్రాసినాడు.

పద్యపు పేరును (మత్తేభవిక్రీడితము, తేటగీతి, ఇత్యాదులు) పద్యములో ఒక పదముగా వ్రాసినప్పుడు అది ముద్రాలంకారము అవుతుంది. సంస్కృతములో, కన్నడములో మానిని వృత్తపు పేరు మదిరా. నన్నయ కాలానికి మాత్రమే ఇది మానిని అన్నపేరుతో స్థిరపడింది. కాని కు.స.లో మానినీవృత్తము ముద్రాలంకారముతో నున్నది అయినప్పటికీ, నన్నెచోడుడు ఈ పద్యమునకు సూటిగా మానిని అని వృత్తపు పేరును వాడినది గమనార్హము. ఈ ముద్రాలంకారమును కన్నడ కవులు తరచుగా తమ కావ్యములలో[5] వాడారు. ముద్రాలంకారముతో మత్తేభవిక్రీడితమును పంపకవి రెండు మారులు, రన్నకవి ఒక మారు వాడారు. ఉదాహరణముగా పంపభారతము నుండి ఒక పద్యము-

మసకం కాయ్పు జవం జవంగమిదిరొళ్ నోడల్కగుర్వాగె మాం-
దిసిమీ వందుదు కొందుదొందు భయదిం విప్రర్ తెరళ్దోడె తా-
పసరం బెర్చిసి తొళ్ది బేళ్వరణియం కొండాశ్రమక్కింతు బే-
వసమం మాడువుదాయ్తదొందు విభవం మత్తేభవిక్రీడితం (8.37)

(జేతవనములో ఏనుగుల కోలాహలమును వర్ణించే ఘట్టమిది. బలము బలముతో ఎదుర్కొంటున్నదంటాడు కవి. చూచుటకు భయంకరముగా నున్నది. ఇదిగో ఏనుగు వచ్చింది, దానిని అడ్డు పడండి అంటూ బ్రాహ్మణులు పరిగెత్తగా యజ్ఞమునకు కూడబెట్టిన కాష్ఠములను తీసికొని ఆశ్రమములో కోలాహలము చేస్తూ ఆటలాడాయి ఏనుగులు. )

ఈ ఆచారమును నన్నెచోడుడు కూడ గణ్యముగా వాడినాడు క్రింది పద్యములో:

హృదయాహ్లాదముతోడఁ బాయక సదా నైక ప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం
బది దాక్షాయణి సూచి కౌతుకరతైకా లీన భావాభిలా
షదృగత్యుజ్జ్వల దీధితుల్ నెఱపె నీశానాననాబ్జంబుపైన్ (1.101)

మఱొక విషయము. ఈ పద్యరచనలో నన్నెచోడుడు తమిళములోని క్రింది పద్యమును అనుసరించినట్లున్నది –

பிடியத னுருவுமை கொளமிகு கரியது
வடிகொடு தனதடி வழிபடு மவரிடர்
கடிகண பதிவர வருளினன் மிகுகொடை
வடிவினர் பயில்வலி வலமுறை யிறையே

పిడియద నురువుమై కొళమిహు కరియదు
వడిహొడు తనదడి వళిబడు మవరిడర్
కడిహణ పదివర వరుళినన్ మిహుహొడై
వడివినర్ పయిల్వలి వలముఱై యిఱైయే. (తిరుజ్ఞానసంబందర్ – తేవారం – 1.123.5)

(మృదువుగనుండి, విరాజిల్లు ఛత్రము తమకు సౌందర్యమును చేకూర్చునని తలచు ధన్యజీవులు వసించు వలివలమునందు వెలసిన భగవానుడు, ఉమాదేవి ఆడగజరూపమును, తాను మగ గజరూపమును దాల్చి తన పాదపద్మములకు వందనమొసగు భక్తులయొక్క విఘ్నములను తొలగించు గణపతికి జన్మనిచ్చిన గొప్ప దయామూర్తి!)

సంభోగము ద్వార గణపతి జననము తమిళ సంప్రదాయపు అలంకారం. నన్నెచోడుడు తన రాజ్యానికి సమీపంలోనే ఉన్న తమిళ పద్యాన్ని తీసుకుని దానిని మరింత సుందరంగా ముద్రాలంకారంలో చెప్పాడు. ఇంత గొప్ప కవి. తె.రా.క. పద్యానికి హీనమైన అనుకరణ చేసివుండడం నమ్మదగినట్టుగా లేదు. కుమారసంభవము కాలిదాస రచనలనుండి సంగ్రహించినది కాదని కూడా ఇందువలన తెలుస్తుంది.

  1. నన్నెచోడుని క్రౌంచపదవృత్త పరిశీలన.

మునుపు ఒక వ్యాసంలో క్రౌంచపదమును గుఱించి వివరంగా చర్చించి ఉన్నాను. ఇక్కడ ఒకసారి క్లుప్తంగా పరిశీలిస్తాను. క్రౌంచపదవృత్తములో మనము రెండు విషయాలను గమనించాలి: 1. క్రౌంచపదపు గణములు, 2. క్రౌంచపదపు యతులు. వీటిని అవగాహన చేసికొనుటకు ఆంధ్రచ్ఛందోవికాసము[6] సహాయముతో ఇచ్చిన క్రింది పట్టిక ఉపయోగపడుతుంది. గణములకు బదులు చతుర్మాత్రలు ఇవ్వబడినవి (/ చిహ్నము సంస్కృత యతియైన పదవిచ్ఛేదనమును సూచించును).

-సంస్కృతము (పింగళ ఛందస్సు, వృత్తరత్నాకరము) – UII UU / UII UU / IIII IIII / IIII IIU
-సంస్కృత వృత్తరత్నాకరము (తెలుగు లిపి) – UIIUUIU / IIUIU / IIIIIIII / IIIIU
-వ్యాఖ్యాత శ్రీనాథుడు – UIIUU / UIIUI / UIIIIII / IIIIIIIU

-కన్నడము (నాగవర్మ) – ప్రథమార్ధములో ప్రాసయతి (UII UU) – (UII UU) / (IIII IIII) / (IIII IIU).
-గుణచంద్రుని ఛందస్సారము – ప్రాసయతి లేదు UIIUIIU / IIUIU / IIIIIIII / IIIIU.

-తెలుగు క్రౌంచపదము (సంస్కృత హంసపదము – జయకీర్తి) – (UII UU) (UII UU) (IIII IIII) (IIII UU)

కవిజనాశ్రయము, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము – ప్రాసయతి (1, 6), అక్షరయతి (1, 11, 19).
అప్పకవీయము, రంగరాట్ఛందము – ప్రాసయతి లేదు, అక్షరయతి (1, 11, 19)

నన్నెచోడుడు – ప్రాసయతి (1, 6), అక్షరయతి (11, 19)
తిక్కన – కవిజనాశ్రయమువలె
ఎఱ్ఱన – ప్రాసయతి లేదు, అక్షరయతి (1, 6, 11, 19)
తిమ్మన – ప్రాసయతి లేదు, అక్షరయతి (1, 11, 19)

నన్నెచోడుడు మినహా క్రౌంచపదవృత్తమును వ్రాసిన మొదటి తెలుగు కవి కవిత్రయములోని రెండవవాడైన తిక్కన సోమయాజి. స్త్రీపర్వములో ఎన్నో విశేష వృత్తములను తిక్కన వ్రాశాడు. అందులో క్రౌంచపదము కూడ ఒకటి. ఆ పద్యము-

కౌరవసేనా – వీరులు లావుం – గడిమియుఁ జలమును – గడఁక యెలర్పన్
ధీరత సొంపుం – గ్రూరత బెంపుం – దెగువయు నెఱపఁగ – దెరలక వీఁకన్
బోరనఁ ద్రోవం-గా రభసం బే-పును గలితనమును – బొలుపు వహింపన్
వారు భయంబుం – గూరుటకుం గా-వలసెను రుధిరము – వదనము సేర్పన్ (1.166)

ఇందులో ప్రతి పాదములో పూర్వార్ధములో ఐదు అక్షరాల తఱువాత ప్రాసయతి, ఉత్తరార్ధములో 11, 19 అక్షరములతో అక్షరసామ్య యతి ఉన్నది. ఈ ప్రయోగము చాల ముఖ్యమైనది. తిక్కన లాక్షణికుడా కాదా అన్న సంగతి వివాదాంశం. కాని ఇతని పద్యాలలో కవిజనాశ్రయములోని క్రౌంచపదపు లక్షణములు నిస్సంశయముగా కనిపిస్తాయి. ఏ ఛందోగ్రంథమునుండి ఈ నియమములను తిక్కన గ్రహించాడో మనకు తెలియదు. అది కవిజనాశ్రయమయితే, నా అభిప్రాయము ప్రకారం కవిజనాశ్రయకర్త తిక్కనకంటె ముందు జీవించినాడు. అంతే కాకుండా తెలుగులో మొదటి ఛందోగ్రంథకర్త కూడా, ఎందుకంటే ఇతని కవిజనాశ్రయపు ప్రణాళిక నాగవర్మ కన్నడములో వ్రాసిన ఛందోంబుధిని అనుసరించి ఉన్నది.

  1. క్రౌంచపద లక్షణములను మార్చినది ఎవరు?

సంస్కృతములో క్రౌంచపదపు పాదములో చివరి మూడు అక్షరములు స-గణమునకు (IIU) సరిపోతాయి. కాని తెలుగులో ఈ స-గణమునకు బదులు రెండు గురువులు ఉన్నాయి. స-గణమునకు గాని గగమునకు గాని లయ ఒక్కటే. వృత్తపు లయ చెడదు. అయినా ఏ లాక్షణికుడు గాని, ఇలా వృత్తపు గణములను కారణము లేక తారుమారు చేయడు. అదియునుగాక క్రౌంచపదము ఒక తాళవృత్తము. ఇది బృహద్దేశివంటి సంగీతగ్రంథాలలో కూడ ఉదహరించబడినది. కాబట్టి ఇలా ఎవరో తమ కావ్యములో వ్రాసియుండాలి. అది తిక్కన మాత్రము కాదు. ఎందుకంటె తిక్కన స్వతహాగా వృత్తములను కల్పించినట్లు కాని, లక్షణములను మార్చినట్లు కాని మనకు ఆధారములు లేవు. ఇలా మనము ఒక్కొక్కరిని తొలగిస్తే, మిగిలినది నన్నెచోడుడు మాత్రమే. ఈ చర్చ ఇక్కడ ఎందుకు అవసరము?

మొట్టమొదటగా ఒకే పద్యములో ప్రాసయతి, అక్షరయతి ఇందులో ఎదురవుతుంది. లయగ్రాహివంటి వృత్తాలలో ప్రాసయతి మాత్రమే, స్రగ్ధరవంటి వృత్తాలలో సామాన్య యతి మాత్రమే ఉంటే రెండు ఇక్కడ మాత్రమే మొట్టమొదట సారిగా కనబడుతుంది. కన్నడములో నాగవర్మ ఛందోంబుధిలో[7] యతులను చెప్పినా అది ఉపయోగకారి కాదు, ఎందుకంటే కన్నడములో అక్షరసామ్య యతి లేదు. పదవిచ్ఛేదన యతి మాత్రమే ఉంది. అది కూడా పాటించరు. మానవల్లి రామకృష్ణకవి సీసపద్యపు మూసను నన్నెచోడుడు వాడినాడని చెప్పినా, అది అంత బలవత్తరమైన కారణముగా నిలువదు. ఎందుకంటే సీస పద్యములో ప్రాసయతి ఐచ్ఛికము, నియతము కాదు. నా ఉద్దేశములో క్రౌంచపదయతి నిర్ణయములో నన్నెచోడుడు కంద పద్యాన్ని అనుసరించాడు. కందమును ఒక ద్విపదగా తలిస్తే అందులో ప్రతి పాదములో ప్రాస యతి ఉన్నది (మొదటి, నాలుగవ గణములకు), సామాన్య యతి ఉన్నది (నాలుగవ, ఏడవ గణములకు). అంటే సామాన్య యతి పాదపు నడుమ ఆరంభిస్తుంది, మొదటి అక్షరముతో కాదు. ఈ చిక్కుకు పరిష్కారమును చోడుడు ఆరంభములో ప్రాసయతి, తఱువాత మధ్యనుండి అక్షరసామ్య యతి ద్వారా సాధించాడు. ఇక్కడ చోడునికి రెండు విధములైన మార్గములు ఉన్నవి – 1. అక్షరసామ్య యతిని స్రగ్ధరలాటి వృత్తములవలె మొదటి అక్షరముతో నుంచుట, 2. కందమువలె అక్షరసామ్య యతిని పాదము మధ్య అక్షరముతో నుంచుట. తఱువాతి లాక్షణికులు, కవులు మొదటి త్రోవను తీసికొనగా, చోడుడు రెండవ భిన్నమైన మార్గమును అనుసరించినాడు.

16వ శతాబ్దము తఱువాత కాలానికి కవిజనాశ్రయము, అనంతుని ఛందము[8] లాటి ఛందోగ్రంథములు అందుబాటులో ఉండినాయి. అన్నిటిలో సామాన్యయతి మొదటి అక్షరము పైన అని చెప్పబడినది. తిమ్మనవంటి కవులు ప్రాసయతిని పాటించలేదు, కాని అందఱు సామాన్య యతిని మొదటి అక్షరముపైననే ఉంచినారు. కావున నన్నెచోడుడు క్రౌంచపద వృత్తమును అలా వ్రాసి ఉండడానికి అవకాశమే లేదు. అలా వ్రాసి ఉంటే అతనికి ఛందశ్శాస్త్రములో విజ్ఞత లేదు అనిపిస్తుంది. కాని నన్నెచోడుడు చిత్రకవిత్వాది విద్యలలో మార్గదర్శి. కావున అతడు 16వ శతాబ్దము పిదప ఉన్నాడన్నది వీలు కాదు.

  1. సామాన్య శకటరేఫములతో ప్రాస సాంకర్యము ఎప్పుడు మొదలైనది?

నన్నయభట్టు ప్రాస సాంకర్యము చేయలేదు, ముఖ్యముగా సామాన్య శకటరేఫములతో. నన్నయ కాలములో బహుశా ర-కార, ఱ-కారముల మధ్య ఉచ్చరణ భేదము ఉండి ఉంటుంది. ఈ భేదము తిక్కన కాలమునకే తగ్గిపోయినది. తరువాతి కాలములో పండితులు కూడ దీనికి భేదము చెప్పలేక పోయిన స్థితి వచ్చి ఱ-కారముతో ఉండే పదాలకు పట్టికలను తయారు చేశారు. కాని నన్నయ కాలములో ర, ఱ లకు భేదము ఉండినది, కావుననే ఈ అక్షరాల మధ్య ప్రాస సాంకర్యము లేదు. నన్నెచోడుని కు.స. లో కూడ ఇట్టి ప్రాస సాంకర్యము లేదు. తిక్కన కాలానికి మాత్రమే ర,ఱలకు ప్రాససాంకర్యం కలిగింది. నన్నెచోడుడు కూడ అలాటి ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అతడు తిక్కనకు పూర్వీకుడు అని చెప్పడానికి వీలవుతుంది.

(సాధు, శకట రేఫములకు ప్రాసలేమికి కారణము తెలిసికొనవలయు ననుకొంటే, దానిని తమిళ భాషలో[9] వెదకాలి. వేయి సంవత్సరాలకు ముందు ఱ-కారపు ఉచ్చరణ తమిళ భాషలో ట-కారమునకు, త-కారమునకు మధ్య ఉండేది. అది క, చ, ట, త, ప అక్షరములవలె ఒక పరుషాక్షరముగా పరిగణించబడేది. దానికి సరియైన అనునాసికము తమిళ భాషలోని రెండవ న-కారము (ன). ఱ-కారముతో ఈ న-కారమును చేర్చగా వచ్చిన అక్షరమును ఇప్పుడు కూడ ణ-కార డ-కారములతో ఉచ్చరిస్తారు (ఉదా. ఇన్ఱు – இன்று – ఇణ్డ్రు). అదే విధముగా ద్విరుక్త ఱ-కారమును నేడు కూడ ట్ర-కారముగా ఉచ్చరిస్తారు తమిళములో (ఉదా. కుఱ్ఱం – குற்றம் – కుట్రం). తమిళము ద్వార ఈ శకటరేఫము కన్నడ, తెలుగు భాషలలో ప్రవేశించినది.)

  1. నన్నెచోడుని చక్రబంధపు వివరణలు సమంజసములు కావు.

ఇప్పుడు నన్నెచోడుని చక్రబంధమును పరిశీలిస్తాను. వెలుపలినుండి మూడవ వలయములోని అక్షరములు – ము-క-లం-సే-షై-క. దీనిని సేషైకముకలం అని వ్రాద్దామా? స-కారమును శ-కారముగా మార్చినప్పుడు అది శేషైకము కలం అని అవుతుంది. పదార్థము రెండు విధములు – స్థావరము, జంగమము. శేషము అనగా నాగుపాము, అది జంగమము. నాగుపాము నడక దీనిని చక్కగా ప్రతిబింబిస్తుంది. నేరుగా చెప్పక అర్థాంతరముగా తన గురువు పేరు చెప్పాడు, అది ఒకే గురువు అని శేష+ఏకము అని.


కు.స. చక్రబంధము

ఈశ్వరుడు కూడ ఒక్కడే. ఈశ్వరునికి, తన గురువుకు ఉండే అభేదత్వమును కూడ శేషైకము అను పదము సూచిస్తున్నది. ఆ ఈశ్వరుడు శేషాభరణుడే కదా? ఇక కలం పదము, కల అంటే సంస్కృతములో రేతస్సు అని అర్థము కూడ ఉన్నది. కు.స. కథలో శివుని రేతస్సుకు కూడ ఒక ప్రత్యేక స్థానము గలదు. అనగా అర్థాంతరముగా కథను కూడ తెలిపాడు ఇందులో. కృతిభర్త నామము (శేష), కృతియొక్క కథానాయకుడు (ఏకము) కృతి కథను (కలం) ఈ మూడు విషయములు కూడ ఈ సే(శే)షైకముకలం తెలుపుచున్నది. ఇక ఆఱవ వలయములోని అక్షరములు – నా-ద-మం-దై-దే-వ. దీనిని ఇలా వ్రాద్దామా? దేవనాద మందైః. ఇందులో దేవ అనగా నన్నెచోడ దేవుడు. చోడ దేవుడు అనే పదము శాసనాలలో కూడ ఉన్నది. తన పేరును దేవ అని తెలిపాడు ఆ దేవుని నాదము మందముగా ఉంటుంది (అందముగా కూడ) అని చెప్పుకొన్నాడు ఇందులో. నాదం అంటే ఇక్కడ కవితానాదము అని అర్థము. కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఇచ్చిన వివరణను అంగీకరించేవారు ఈ వివరణను మాత్రం ఎందుకు అంగీకరించకూడదు? నా ఉద్దేశం ఇటువంటి వాదనలు ఎంత అసమంజసమైనవో ఒక ఉదాహరణగా చూపించటం మాత్రమే.

  1. మానవల్లి రామకృష్ణకవికి చిత్రకవిత్వము అంటే ఏవగింపు. ఈ విషయమును తానే స్వయముగా ఒక ప్రసంగములో[10] వివరించారు. కు.స. వ్రాసిన నన్నెచోడుడు తెలుగులో చిత్రకవిత్వమునకు నాందీవాక్యమును పలికిన కవి. చిత్రకవిత్వమును అసహ్యించుకొనిన రామకృష్ణకవి కు.స.ను వ్రాసియుండుననుట హాస్యాస్పదమే నా ఉద్దేశములో.

నన్నెచోడుడు 16వ శతాబ్దం తఱువాతి వాడు కాదనీ, కుమారసంభవము లోని పద్యం లేదా పద్యాలు తె.రా.క. పిదప కాలం వానిది అసలే కాదని పైని చూపిన ఆధారాలు, ఉదాహరణల ద్వారా స్పష్టంగానే గమనించవచ్చును.


గ్రంథసూచి

  1. నన్నెచోడదేవకృత కుమారసంభవము – వ్యాఖ్యాత జొన్నలగడ్డ మృత్యుంజయరావు, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, ప్రథమ భాగము 1994; ద్వితీయ భాగము 1998.
  2. తెలుఁగు భాషలో ఛందోరీతులు – రావూరి దొరసామిశర్మ, వెల్డన్ ప్రెస్, మద్రాసు, 1962.
  3. కవిజనాశ్రయము, వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1950.
  4. నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?! – కొర్లపాటి శ్రీరామమూర్తి, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
  5. కన్నడ ఛందోవిహార – టి. వి. వెంకటాచలశాస్త్రీ, గీతా బుక్ హౌస్, మైసూరు, 1989.
  6. ఆంధ్ర చ్ఛందోవికాసము – మోడేకుర్తి వేంకట సత్యనారాయణ, ఆంధ్ర యూనివర్సిటి ప్రెస్, విశాఖపట్నం, 1990.
  7. నాగవర్మన కన్నడ ఛందస్సు – ఎఫ్. కిట్టెల్, బేసెల్ మిషన్ బుక్ అండ్ ట్రాక్ట్ డెపాసిటరి, మంగళూర్, 1875.
  8. అనంతుని ఛందము – ఉపోద్ఘాతము గిడుగు వేంకట సీతాపతి, వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1921.
  9. ద్రావిడ భాషా పరిశీలనము – వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి, మొదటి సంపుటము, ఆంధ్ర విశ్వకళా పరిషత్, చెన్నపురి, 1955.
  10. మానవల్లికవి – రచనలు – సం. నిడుదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1972.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...