ప్రాణం తన ఆవాసాన్ని అకస్మాత్తుగా
కూల్చుకొని వెళ్ళిపోతుంది ఓ రోజు
ఉన్నప్పుడు తిట్టిన నోళ్ళే కొత్తగా పొగుడుతోంటే
నోరెళ్ళబెట్టి చూస్తూంటుంది పార్థివశరీరం
అయినవాళ్ళు చిట్టచివరి చూపుల్ని రాల్చుతుంటే
కన్నీటి తడిలో కడసారి స్నానమాడుతుంది దేహం
తనతో బాటే పెరిగి పెద్దవైన అనుభవం, నైపుణ్యం
వదల్లేక అగరొత్తి పొగల్లో సుళ్ళు తిరుగుతుంటే
పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్
బరువెక్కిన గుండెల్ని మోసుకొచ్చిన ఓ నలుగురు
పాడె బరువుని బుజాల కెత్తుకుని ఆ నలుగురౌతారు
దింపుడు కల్లాల ఆశలన్నీ చల్లార్చుకున్నాక
దేహం ఉత్తర దిక్కుని చీల్చుకుంటూ గమ్యాన్ని చేరుతుంది
చితి మీదకు చేరాక చిల్లుకుండ కూడా చేజార్చాక
మరుజన్మకు మార్గాల్ని వెదుక్కుంటూ దేహం బూడిదైపోతుంది
అంతిమయాత్రకు బారులు తీరిన జనం లోంచి ఓ గొంతు
“జీవితమంటే ఇంతేనా, బూడిదలో పోయడానికి
దాయబడ్డ పన్నీరు బుడ్డేనా” అంటూ గొణుక్కుంటుంది!