నండూరి వారు “ఎంకి”ని సృష్టించి ఎనభై ఏండ్లు నిండాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.
ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి.
ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు:
రాసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలు సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి
అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు.
ఎంకి పాటలు పుస్తకం మొదట్లో పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి గారు “ఒకటి రెండు మాటలు” చెప్పారు. “సుబ్బారావుగారు ఆంధ్రజాతికి సహజములై – శ్రావ్యములై – సొంపు నింపుగల మృదుమధురగేయములలో అందునను నేడు వాడుకలో – వ్యవహారములోనున్న జీవద్భాషలో ఎంకి – నాయుడుబావల దాంపత్య పూతములును భావోన్నతములును ముగ్ధముగ్ధములును అగు ప్రణయగాధలను గానము సేయుచున్నారు… ”
ఈ మాటలు చదువుతుంటే ఒకటి స్పష్టమవుతుంది : నండూరివారి పాటలు కేవలం గదిలో కూర్చొని చదవటానికి కాదు. పాడు కొనటానికి, వినటానికి. మళ్ళీ శాస్త్రిగారు ” ఈ పాటలన్నచో పండిత పామర సాధారణముగా నెల్లవారికిని యే మాత్రపు భావనాశక్తి యున్నను, అందుకొనుటకు, ఆనందించి తవిసి తరింప చేయుటకును వీలైనట్టివి. నిక్కమగు ప్రేమను, దాంపత్యభావమును, ధర్మపరతమును, యెట్టి యాదర్శములను కలిగి యుండునోయను విషయమును ఈ పాటలంత తేట తెల్లముగా … సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయములివి”. అంటే, అంతటి ప్రేమను, ధర్మము, దర్శనము రంగరింపయిన ప్రేమను, సామాన్యుడి అనుభవపరంగా పలికి, అతనితో పలికించి, అతని నోట పలికేలా చెయ్యగలిగిన మాధుర్యం, దివ్యశక్తి యీ పాటలకున్నయ్, మరొక్కసారి శాస్త్రిగారు : “సుబ్బారావు పంతులుగారు గానము చేసిన ఈ పాటలలో భావము కంటెను ముందుగ భాషయును, భాషకంటే మున్ముందుగ భావమును, సహామహమికతో బర్వు లెత్తుచుండెను.” ప్రముఖ ఆంగ్ల కవి T.S. Eliot చెప్పినట్లు, You are the music/while the music lasts.
ఎంకిపాటలు చదివినప్పుడు (లేక వినినప్పుడు), శాస్త్రిగారి “ఒకటి రెండు మాటలు” చదివినప్పుడు ఒకటి, రెండు ముఖ్య విషయాలు మనకు స్పురిస్తయ్: Arthur Koestler, సృజనాత్మక రచయిత, సాంస్కృతిక విమర్శకుడు చెప్తాడు – Artist has the ability to live in distinguished and undivided worlds. ఈ విషయము గురించి ఒక ప్రాచీన తెలుగు కవి ప్రస్తావిస్తాడు: రవి గాంచనిచో కవి గాంచునే. ఇది దార్శనికతతో జత అయి వుంటుంది. అందువలననే మనవాళ్ళు కవిని దార్శనికుడు (visionary) అన్నారు. కవి దర్శనమును, ఆధ్యాత్మికతానుభూతి (spiritual/mystical experience) కి సమానార్ధకముగా గ్రహించవచ్చు. నండూరి వారి ఎంకిపాటలు లో అటువంటి అనుభవాలు చాలా వున్నయ్.
ఎంకిపాటల వివరాలలోకి వెళ్ళేముందు నండూరి వారి పీఠికలోని వ్యాఖ్యలను గ్రహిద్దాం.. “ఒకనాడు కాలేజీ నుండి ట్రాం బండిలో వస్తుండగా, గొంతులో సన్నని రాగం బయలుదేరింది. దానిని నాలో నేను పాడుకోవాలని సాహిత్యం జ్ఞాపకం చేసుకోబోయాను. ఎప్పుడో విన్న పదం లాగున “గుండె గొంతుకలోన కొట్లాడుతాది” అన్న పల్లవి వచ్చింది. అదే మననం చేసుకోగా యిల్లు చేరేసరికి నేను వ్రాసిన మొదటి పాట తేలింది.” ఇది చదువుతుంటే ఇంగ్లీషులో యీ విషయమై William Wordsworth, John Keats వ్రాసిన మాటలు జ్ఞప్తికి వస్తాయి. Wordsworth అంటాడు: “Poetry is spontaneous overflow of powerful feelings.” Keats అంటాడు: “Poetry comes naturally like leaves to a tree, or if better not come at all.” సృజనకు – కవిత్వంగాని, మరొక కళగాని – ముఖ్యంగా రెండు అంశాలు చెప్పుకొనవచ్చును: ప్రేరణ, క్రమము. మొదటి అంశం ప్రేరణ. ప్రేరణ దైవికం. దీనిగురించి Bible లోని saying చెప్పుకొనవచ్చును : The wind bloweth as it listeth ” రెండవది: క్రమము. క్రమము గురించి Wordsworth, Keats విడివిడిగా యిలా చెప్తారు: Wordsworth : “Poetry is emotion recollected in tranquillity.” Keats: “load every rift with one”. క్రమంలో ప్రయత్నం వుంది. కవిత్వంగానీ కళగానీ గాఢంగా, నిగూఢంగా సహజత్వము, సాధనల రంగరింపు.
నండూరి చెప్తారు: “పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహము చేసి వీపు తట్టిన అధికార్లవారికా? 50 కవిత్వకళా రహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనికా? మువ్వురకును.” ఎంకి పాటలు అప్రయత్నంగా వచ్చినవే. సహజంగా, స్వేచ్చతో, ప్రయత్నమున్ననూ, అప్రయత్నమనే భావన కలిగిస్తాయి. అది కవి గొప్పతనం. హృదయం, మనసు, ఆత్మల సమ్మేళణ ఫలితం. మళ్ళీ నండూరి: “తెలుగుతల్లి యొక్క నిజస్వరూపం చూడవలెనని… తెలుగు పస, తెలుగు నుడి, తెలుగు నాదం, తెలుగు రుచి తెలిసికొని మానవ జాతి సాంప్రదాయాలలోగాల సొగసు, జీవనమూ,పదిమందికిన్నీ మనసుకెక్కించవలెనని.. ” ఈ గుణాలన్నిటినీ ఎంకిపాటలు మరపురాని పద్ధతిలో వ్యక్తం చేస్తాయి.
ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విమర్శనాత్మక అభిప్రాయం చెప్పవచ్చు: Science goes from the general to the particular, while art goes from the particular to the general. దీనికి మినహాయింపులు రెండు క్షేత్రాల్లోనూ వుంటయ్. మొత్తం మీద కళలోగాని, కవిత్వంలో గాని సాధారణీకరణ జరుగుతుంది. అది ఎంకిపాటలు లో చాలా గొప్పగా వుంది. ఎంకి నాయుడు బావల ప్రణయం, ప్రేమ తెలుగుతనం, తెలుగుపస మొదలగువాటితో నిండి వుంటయ్: విశ్వజనీనమూను.
“ముద్దుల నాయెంకి” లోని పల్లవి, “గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ” గేయాల స్వరాన్ని (tone) మొదటగా అందిస్తుంది, స్థాపిస్తుంది. ఇంగ్లీషు “heart” కంటె, సంస్కృతం ‘హృదయం” కంటె, తెలుగు “గుండె” ఎక్కువ పొరలు, సంబంధాలు, సాంకేతిక విలువలు గల మాట. దీనిలోనూ, యిటువంటి యితర ప్రయోగాలలోనూ తెలుగు పస, తెలుగు నుడి, తెలుగు నాదం, తెలుగు రుచి నిండుగా వున్నయ్. ఆ వుండటానికి మనందరమూ తెలుగు సరస్వతికి, నండూరివారికి కృతజ్ఞులము.
ఎంకి పాటలు లోని గేయాలు వైవిధ్యాన్ని, ఏకత్వాన్ని సమంగా సంతరించుకున్నాయ్. “ప్రతివారి గుండెలలోనుంచి సూటిగా, వెచ్చగ ప్రవహిస్తయ్.” చక్కని, చిక్కని తెలుగు పల్లెపదాలతో ఎంకిని చిత్రిస్తారు నండూరి.
కూకుండ నీదురా కూసింతసేపు
…………………………
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
యెల్లి మాటాడిస్తే యిసిరికొడతాది!
………………………….
కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటే అగ్గి సూస్తాదీ!
ఆమె అమాయకత్వం, అల్లరి చేష్టలు, నాయుడుబావతో ఆమె అనుభవించే ఏకత్వం చదువరులను, శ్రోతలను ముగ్ధులను చేస్తయ్ :
జాము రేతిరి యేళ జడుపూ గిడుపూ మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే
మెల్లంగా వస్తాది నా యెంకీ !
సల్లంగా వస్తాది నా యెంకీ !
……………………..
సెందురుణ్ణీ తిట్టు నాయెంకీ !
సూరియుణ్ణీ తిట్టు నాయెంకీ !
ప్రణయానికి, ప్రేమకీ కాలం హద్దు కాదు, కాజాలదు. శృంగారంలో మాట. పాట, ఆట ఒకటిగా వుంటయ్. పల్లె పిల్లలు, ప్రియులు-ఎంకి-నాయుడుబావలు యీ సత్యాలను జీవిస్తారు. స్వానుభవంతో సజీవం చేసుకొంటారు, చేస్తారు. ప్రకృతి వాళ్ళ సాటి లేని నేస్తం. అనుభవం, ప్రకృతి వాళ్ళకి బలాన్ని ఇవ్వగా, తీర్థాలకేమి కరువు? తిరుపతి వెళ్తారు, భద్రాద్రి వెళ్తారు. సరిగంగ స్నానాలు చేస్తారు. అనుభవం, భావన, భక్తి, నమ్మకం, సంస్కారం; అన్నీ ఆ స్నానాల్లోని జలాలు, ఒక దాంట్లోకి యింకొకటి ప్రవహిస్తుంది. అ అంతర్‌ప్రవాహం అనుభవానికే అందుతుంది. ఒక స్థితి దాటేక భాష అనుభవాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేదు.
“సత్తెకాలపు నా యెంకి” సూటిగా, నేరుగా, నీటుగా మన ఎదతో, మదితో పలుకుతుంది :
“నీతోటే వుంటాను నాయుడు బావా !
నీ మాటే యింటాను నాయుడు బావా !
సరుకులేమి కావాలె సంతన పిల్లా?”
………………………..
నీ
నీడలోనే మేడ కడతా నాయుడు బావా!”
నాగరికత చాయ యింకా ఎంకి – నాయుడు బావల మీద పడలేదు. వాళ్ళ బంధం, బలం పరస్పర విశ్వాసం. అరమరికలు లేకపోవటానికి వాళ్ళ పరిస్థితి సంకేతం, బాహ్యరూపం, దైనందిన జీవితం, విశ్వాసం ఒక దాన్ని యింకొకటి పెనవేసుకొని వుంటయ్. ఈ పెనవేసుకొని వుండటానికి నాగరికత ఎంతో దూరం కదా! అందుకనే కవి నాయుడుబావ పరంగా “సత్తెకాలపు నా యెంకి” అంటాడు. ఈ గేయం ద్వారానూ, యిటువంటి యితర గేయాల ద్వారానూ కవి పల్లె జీవితానికి, నాగరికతకి మధ్య నున్న దూరాన్ని భావగర్భితంగా సూచిస్తాడు.