తెలుగు సాహిత్యచరిత్రలో కర్తృత్వసమస్య కారణంగా అత్యంత వివాదాస్పదమైన కుమార సంభవ మహాకావ్యం ప్రథమభాగాన్ని ఇప్పటికి నూటనాలుగేళ్ళ క్రితం 1909లో, కవిరాజశిఖామణి నన్నెచోడుని పేర ప్రకటించిన మానవల్లి రామకృష్ణకవి అందులోని 106వ పుటలో, షష్ఠాశ్వాసంలోని 824 వరుస సంఖ్య గల పద్యం అధోజ్ఞాపికలో ఒక ఆసక్తికరమైన విశేషాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ పద్యమూ, ఆ అధోజ్ఞాపికా ఇవి:
మ. అలిధమ్మిల్ల మృణాళహస్తఁ గమనీయావర్తనాభిన్ మహో
త్పలగంధిం గలహంసయాన విలసద్బంధూకరక్తోష్ఠ ను
త్పలనేత్రిం గమలాస్య నంగజరసాంభఃపూరఁ దత్పార్వతీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే. (ప. 824)ఉపమానోపమేయ విపర్యయమును విశేషణవిశేష్యలింగభేదమును దోషములుగా గ్రహించి దానిఁ దొలంగింపనని కాఁబోలును తెన్నాలి రామలింగకవి తన కందర్పకేతువిలాసములో నిట్లమార్చి పద్యమును గూర్చుకొనెను:- లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో। త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ। పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ। జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1972లో ప్రకటించిన మానవల్లికవి – రచనలు అన్న బృహత్సంకలనంలో ఈ లఘువ్యాఖ్య లేదు. మానవల్లి రామకృష్ణకవి 1909లో ప్రకటించిన ప్రతిని చూస్తే కాని ఈ లఘువ్యాఖ్య సాహిత్య అకాడమి ప్రతిలో లేని ఈ విషయం పాఠకులకు తెలిసే అవకాశం ఉండదు.
1909లో కుమారసంభవాన్ని ప్రకటించిన ఇరవైఎనిమిదేళ్ళకు భారతి మాసపత్రిక ధాత నామ సంవత్సరం పుష్యమాస సంచికలో, గ్రంథచౌర్యము అనే వ్యాసంలో మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమారసంభవము లోని పద్యాన్ని తెనాలి రామలింగకవి తన కందర్పకేతు విలాసంలో అర్థచౌర్యం చేసి వాడుకొన్నాడన్న ఉదంతాన్ని మళ్ళీ ఈ విధంగా ప్రస్తావించారు:
మ. అలిధమ్మిల్ల మృణాళహస్తఁ గమనీయావర్తనాభిన్ మహో
త్పలగంధిం గలహంసయాన విలసద్బంధూకరక్తోష్ఠ ను
త్పలనేత్రిం గమలాస్య నంగజరసాంభఃపూరఁ దత్పార్వతీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.మ. లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే.ఇందు రూపకమున విశేషణవిన్యాసక్రమమున దోషము సంఘటిల్లెననియు దానిని దొలఁగింపఁ గాఁబోలుఁ జోడని పద్యము సంస్కరించి భావనోద్బోధిత సంవిచ్చమత్కారశూన్యుండగు తెనాలికవి యర్థచౌర్యముఁ గావించె. రెండవ పద్యమునఁ జతుర్థ పాదమును మార్పకుండుట సమస్యాపూరణ కౌశలప్రకాశనము కాఁబోలు.
…ఈ యర్థాపహారము కవిత్వశిక్షాభ్యాసకాలమునఁ గాని రాజసభలలో విద్యావినోదకాలములోఁ జమత్కారముగాఁ గాని సంఘటిల్లును. లేక భక్తి పారవశ్యముచేఁ గాళిదాసాది మహాకవు లొసంగు వాక్పుష్పములఁ దమ యశఃశరీరము లగు కావ్యబంధముల శేఖరములుగా నునిచికొని తీర్థప్రసాదము వలె గ్రహించి వారి నర్చింతురు. ఇట్టివి కేవలము చాటువులుగా నిలిచినచో క్షణకాలవిస్మయ మాపాదించుఁ గాని కావ్యనివేశితములైనచోఁ దప్పక తత్కవుల కసత్స్ఫాల్య శల్యభూతములై కీర్తిశరీరముల వేధించుచుండును.
మానవల్లికవి – రచనలు సంపుటంలోని 382 – 410 పుటల మధ్య గ్రంథచౌర్యము అన్న ఆ వ్యాసమూ; 385వ పుటలో పై వ్యాఖ్యా ఉన్నాయి. రామకృష్ణకవి 1909 నాటి తొలి ముద్రణలో 824వది అని చూపిన ‘అలిధమ్మిల్ల’ పద్యం నేటి ముద్రణలలో కుమారసంభవం 6వ ఆశ్వాసంలోని 165వ పద్యం. దానిని తెనాలి రామలింగకవి అర్థచౌర్యం చేశాడని ప్రదర్శింపబడిన ‘లలితాస్యాంబురుహంబు’ అన్న పద్యం తెనాలి రామలింగకవి రచించిన కందర్పకేతు విలాసంలో నుంచి తమకు ఎక్కడ దొరికిందో రామకృష్ణకవి ఆనాడు పేర్కొనలేదు కాని, అది తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో 189వ సంఖ్య గల పెదపాటి జగన్నాథకవి సంధానించిన ప్రబంధరత్నాకరము యొక్క వ్రాతప్రతిలో మాత్రమే ఉన్నదని పరిశీలకులు గుర్తించారు. అక్కడ తప్ప ఆ పద్యం మఱెక్కడా లేదు.
పెదపాటి జగన్నాథకవి తన ప్రబంధరత్నాకరంలో తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం నుంచి మొత్తం మూడు పద్యాలను ఉదాహరించాడు.
ఉ. కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు; సరోరుహగంధి మందిరా
రామముఁ జూచి మ్రానుపడు; రాజనిభానన సారెకున్ శుక
స్తోమముఁ జూచి యేఁకరును; దొయ్యలి కోకిలఁ జూచి కంటఁ గెం
పౌ మదలీలఁ దాల్చు మదనానలతాపవిషాదవేదనన్.ఉ. అ క్కమలాక్షిఁ గన్గొనిన యప్పటి నుండియు నేమి చెప్ప! నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ, డెక్కడఁ జూచిన రోహిణీవిభుం,
డెక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు, లిం
కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్.సీ. తారామనోరంజనారంభ మే దొడ్డు?
శిలలు ద్రవింపంగఁ జేయు ననినఁ
జాకోరహర్షయోజనకేళి యే దొడ్డు?
పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
గుముదౌఘతాపోపశమకృత్య మే దొడ్డు?
సృష్టి యంతయుఁ జల్లసేయు ననిన
వరనిశాకామినీవాల్లభ్య మే దొడ్డు?
వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁగీ. దనకు సర్వజ్ఞశేఖరత్వంబు గలుగ
హితసుధాహారవితరణం బేమి దొడ్డు
ననఁగ విలసిల్లె హరిదంతహస్తిదంత
కాంతినిభకాంతిఁ జెలువారి కంజవైరి.
వీటిలో ‘కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు’ అన్న పద్యం ప్రబంధరత్నాకరం ద్వితీయాశ్వాసంలో 79వ సంఖ్య గలది. ‘అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు’ అన్న పద్యం ప్రబంధరత్నాకరం ద్వితీయాశ్వాసంలో 95వ సంఖ్యతో ఉన్నది. ‘తారామనోరంజనారంభ’ మన్న సీసపద్యం తృతీయాశ్వాసం లోని 198వది. ఇవి కాక, ద్వితీయాశ్వాసం లోని ‘అక్కమలాక్షిఁ గన్గొనిన యప్పటినుండియు’ అన్న పై 198వ విరహవర్ణన పద్యానికి దిగువ ఈ పద్యాలెవరివో, ఏయే కావ్యాలలోనివో ఎటువంటి నిర్దేశమూ లేకుండా 199, 200 సంఖ్యలతో రెండు పద్యాలున్నాయి:
ఉ. వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
మీ రుచిరాస్య, మీ నయన, మీ కుచ, మీ యలకాళి, మీ గతిన్,
మీ రమణాంగి – మత్ప్రియ నమేయగతిన్, విరహాతురాననన్
మీరును మీరు మీరు మఱి మీరును మీరు మీరునున్. (ప. 199)మ. లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే. (ప. 200)
1918లో వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలోని పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరాన్ని, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్కార్యాలయంలోని ఉదాహరణ పద్యములు అన్న సంకలనాన్ని సంశోధించి ఆ రెండింటి సమాకలనగా తమ ప్రబంధరత్నావళిని ప్రకటించినప్పుడు జగన్నాథకవి పేర్కొన్న మూడు పద్యాలకు దిగువ ఉండటంతో పాటు ప్రకరణసామ్యం, శైలిసామ్యం ఉన్నందువల్ల కాబోలు – కావ్యనిర్దేశం, కర్తృత్వనిర్దేశం లేకపోయినా, ‘వారిజ! మీన! కోక! యళివర్గ!’ అన్న పద్యాన్ని తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదిగా ఊహించి, తమ సంకలనంలో కలుపుకొన్నారు. తమకంటె తొమ్మిదేళ్ళకు మునుపే మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమారసంభవం పద్యవ్యాఖ్యలో తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలో అర్థచౌర్యం చేసినదని ఉదాహరించిన కర్తృత్వనిర్దేశం లేని ‘లలితాస్యాంబురుహంబు’ అన్న పద్యాన్ని మాత్రం ఉపేక్షించారు. దానిని కందర్పకేతు విలాసం లోనిదిగా స్వీకరింపలేదు. అందుకు కారణాలు తెలియవు. ఈ పద్యం కందర్పకేతు విలాసం లోనిదే అని, ఇవి గాక మరికొన్ని పద్యాలను వేర్వేరు ఆకరాలనుంచి గ్రహించి, సుబంధుని వాసవదత్తా కథ: తెనాలి రామకృష్ణకవి కందర్పకేతు విలాసము అని నేను వ్రాసిన లఘుపుస్తకాన్ని వావిళ్ళ వారు అచ్చువేస్తున్నారు. అందులో దీని ఉనికిని గురించిన తర్కసంగతిని విశదంగా వ్రాశాను.