కొన్నేళ్ళ కిందట నా దగ్గర సితార్ నేర్చుకుంటున్న ఒక హిందీ అమ్మాయి “సంగీత కచేరీల్లో అప్పుడప్పుడూ ఎందుకు వాహ్వా అంటూ ఉంటారు?” అని అడిగింది. అనుకోని ఈ ప్రశ్నకు మొదట విస్తుపోయిన నేను ఈ పద్ధతిలో జవాబు చెప్పాను. శాస్త్రీయసంగీతం కొన్ని సాంప్రదాయాల ననుసరిస్తుంది. అవేమిటో సంగీతకారుడికే కాక వినేవాళ్ళకు కూడా కొద్దోగొప్పో తెలిసే ఉంటుంది. వినే వ్యక్తికి వింటున్న సంగీతంలో తనకు తెలిసినదానికన్నా కాస్త ఎక్కువ స్థాయిలో ఏదైనా వినబడితే అప్రయత్నంగానే నోటివెంట శభాష్ అనో, మరొక మాటో రావచ్చు.
హృదయంనుంచి వచ్చే ఈ స్పందనకు విశ్లేషణ అనవసరం. కాని ఇందులో కొన్ని విషయాలున్నాయి. ఒకరికి నచ్చినదే మరొకరికీ నచ్చాలని లేదు. అభిరుచిలో తేడాలుండడం ఒక్కటే దీనికి కారణం కాదు. వినేవారి మానసిక, సాంస్కృతిక పరిణతి కూడా ఒక కారణమే. ఎందుకంటే సంగీత రసాస్వాదనంలో రానురాను అనుభవం గడించడమనేది సంగీతం వినిపించేవారికే కాదు; వినేవారికి కూడా వర్తిస్తుంది. కచేరీలకు వెళ్ళడంలో “తల పండినవారు” ఎందరో కనిపిస్తారు. తాము పెద్దగా పాడి, వాయించ లేకపోయినా రాగాలూ, తాళాలూ, కీర్తనలూ, వాగ్గేయకారులూ, జన్యరాగాలూ అంటూ కొత్తగా వింటున్నవారిని అదరగొట్టేస్తూ ఉంటారు. పాడేవాణ్ణి తాన్‌సేన్ అన్నట్టుగా ఇలాంటివారిని హిందీలో “కాన్‌సేన్” అనడం పరిపాటి (హిందీలో కాన్ అంటే చెవి).
శాస్త్రీయ సంగీతంలో సృజనాత్మకతకు చాలా అవకాశముంది. అందుకు పేరుపొందిన అతి శ్రేష్ఠమైన కళాకారులు చాలామందే ఉన్నారు. అయినప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాంప్రదాయాలూ, కట్టుబాట్లూ చాలా ఎక్కువ. అవన్నీ వినడానికి బావుంటాయి కూడా. వీటిని మించి మనని ఆకట్టుకునే సందర్భం వచ్చినప్పుడు మనలో మంచి స్పందన కలుగుతుంది.
చాలా కాలంగా సంగీతం వింటున్నవారికి తమ ఆసక్తికొద్దీ కొత్త విషయాలు తెలుసుకోవడం అలవాటవుతుంది. మొదట్లో సులభంగా “కిక్” ఇచ్చిన సంగీతపు అంశాలు కాలక్రమేణా పరిచితాలైపోతాయి. నాకు మొదట్లో విలాయత్‌ఖాన్ సితార్ మీటడం వినగానే చాలు, పులకరింత కలిగేది. తరవాత డజన్లసార్లు విన్నాక ఆయన సంగీతమంటే ఇష్టం ఎన్నోరెట్లు పెరిగినా ఆనందించే “స్థాయి” కూడా పెరిగింది. ఇటువంటిది ఎవరికైనా జరగవచ్చు. కళాకారుల శైలితోనూ, వారి కళ యొక్క లోతులతోనూ పరిచయం పెరుగుతున్న కొద్దీ “ఆహా” అనే సందర్భాలు కూడా మారే అవకాశం ఉంది. ఇది లలితకళలన్నిటికీ, సాహిత్యాభిరుచికీ కూడా వర్తిస్తుంది.
దేశ విదేశాల్లో కచేరీలు చేసిన రవిశంకర్ ఒక వ్యాసంలో మన దేశపు ప్రేక్షకులను విదేశాలవారితో పోల్చాడు. మనవాళ్ళు సంగీతం వింటున్నప్పుడు రెస్పాన్స్ స్పాంటేనియస్‌గా వస్తుంది. అది సరైన సమయంలో జరిగితే కళాకారులకు ప్రోత్సాహం కలుగుతుంది. చాలా ఏళ్ళ కిందట బొంబాయిలో జరిగిన ఒక కచేరీలో మహాగాయకుడు బడేగులాం అలీఖాన్ ప్రేక్షకులను చీకటిలో కూర్చోబెట్టారని గమనించి, ఎంతకీ పాడడం మొదలుపెట్టలేదట. చివరికి నిర్వాహకులు అడిగితే “నా శ్రోతల మొహాలు కనబడకపోతే నేనెలా పాడను?” అని అడిగాట్ట.
పశ్చిమ దేశాల్లో సంగీతం వింటున్నంతసేపూ నిశ్శబ్దంగా ఉండడం, ప్రతి ఐటం తరవాతా చప్పట్లు కొట్టడమూ మర్యాద. అలాంటప్పుడు సంగీతం ప్రేక్షకులకు “నిజం”గా నచ్చిందో లేదో చెప్పడం కష్టం. కాని అక్కడివారు మనవాళ్ళలాగా ముందు వరసలో కూర్చుని కూడా పక్కవారితో మాట్లాడడం, కుట్లూ అల్లికలూ చేసుకోవడం లాంటివి చెయ్యరు. తొలిరోజుల్లో సంగీతానికి ఇలాటి అవమానాలు సహించలేకనే తాను కళ్ళుమూసుకుని సితార్ వాయించడం అలవాటు చేసుకున్నానని రవిశంకర్ అన్నాడు.
మద్రాసులోనూ, ఉత్తరాదిలోనూ సంగీతకచేరీల్లో ప్రేక్షకుల రెస్పాన్స్‌లో తేడా ఉండేది. కర్ణాటక సంగీత కచేరీల్లో వర్ణం, కచేరీ మొదట్లో వినాయకస్తుతి చేసే కీర్తనలూ వగైరా “మామూలు” ఐటంల తరవాత చప్పట్లు కొట్టేవారు కారు; అదేదో వారి మేధాశక్తికి లోకువలాగా. ఇక ఈ ప్రేక్షక “విద్వాంసులు” చప్పట్లు కొట్టే సందర్భం ఎటువంటిది? గాయకులు తారస్థాయిలో ఒక స్వరం గుక్కపట్టి నిలిపినప్పుడు చప్పట్లు కొట్టేవారు; అదే సంగీతానికి పరాకాష్ఠ అయినట్టు. ఉత్తరాది సంగీత కచేరీల్లో ఇలా ప్రేక్షకులు జడ్జిమెంటుకు కూర్చున్నట్టుగా ఉండదు. కళాకారులకు అభిమానులైనవారే వచ్చి కూర్చుని మొదటి నుంచి చివరిదాకా ఆనందించి వెళతారు. (ఇందుకు సంగీతానికి సంబంధించనిది ఒక కారణం ఉన్నట్టు తోస్తుంది. దక్షిణాదిలో నెలకి ఇంత అని సభలకి చందాలు కట్టి, సభవారు ఏ కచేరీ ఏర్పాటు చేస్తే దానికి హాజరయే పద్ధతి ఉంది. అందులో పాల్గొంటున్న కళాకారులు ప్రతివారి మీదా అందరికీ అభిమానం ఉండకపోవచ్చు. అందుకని వచ్చేవారికి “విమర్శనాత్మక” వైఖరి ఉంటుంది).
కేవలం టీవీల ద్వారా కళలతో సంపర్కం పెంచుకునేవారికి “సభామర్యాదలు” తెలియకపోవడం చూస్తూంటాం. టీవీ మోగుతున్నంత సేపూ మనం కామెంట్ చేస్తూనే ఉన్నా కళాకారులకు ఏమీ “అనిపించదు”. అదే అలవాటు కొద్దీ చాలామంది కచేరీలకు హాజరైనప్పుడు కూడా తమ నోటికి పనికల్పిస్తూ ఉంటారు. కచేరీ ఒకవంక సాగుతూండగానే వీరిలో కొందరు తమ సరసన ఉన్నవారికి (అడగకపోయినా) తమ సంగీతం కూడా వినిపిస్తూ ఉంటారు. దగ్గులూ, తుమ్ములూ, కుర్చీలు జరపడాల చప్పుడుతో బాటు ఇది కూడా ఉచితంగా లభిస్తూ ఉంటుంది. ఇలాంటి “పార్టిసిపేషన్” తక్కినవారికి ఇబ్బంది కలగకుండా ఉండడం చాలా అవసరం.
కొంత ఇబ్బంది ఆర్గనైజర్లవల్ల కూడా కలుగుతుంది. తాజ్‌మహల్ ప్రాంతంలో ఆ మధ్య ఏర్పాటు చేసిన కచేరీలు టీవీలో ప్రసారం అయాయి. వాటిలో బిస్మిల్లాఖాన్ మొదలుకొని అనేక ప్రసిద్ధ సంగీతకారులు పాల్గొన్నారు. దానికి వ్యాఖ్యానం సమకూర్చిన సోనూ నిగమ్ అంతకు ముందు తాను చాలా నెలలుగా యువ గాయనీ గాయకులతో వ్యవహరిస్తున్న వైఖరినే ప్రదర్శించాడు. అతి ప్రసిద్ధులైన క ళాకారులు వస్తున్నప్పుడు కూడా మాటిమాటికీ చప్పట్లు కొట్టమని ప్రేక్షకులను హెచ్చరిస్తూ, తానే వారిని తొలిసారిగా పరిచయం చేస్తున్నట్టు ప్రవర్తించాడు. కుర్రకారు పాల్గొనే యూత్‌ఫెస్టివల్‌లో అలాంటి ధోరణి బావుండచ్చు. ఇదంతా సంస్కార లోపమే అనడంలో సందేహం లేదు. పైగా లక్షలు “గుమ్మరించి” పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్లలో కళాకారుల వ్యక్తిగత ప్రతిభకు ప్రాధాన్యత తగ్గుతుంది.
ప్రేక్షకులు చాలా ఎక్కువగా “పాల్గొనే” సందర్భాలు పశ్చిమదేశాల పాప్ సంగీతంలోనూ, రాక్ ఫెస్టివల్స్‌లోనూ కనిపిస్తాయి. కచేరీ జరుగున్నంతసేపూ ప్రేక్షకులు కేరింతలూ, ఈలలూ వేస్తూ, తాముకూడా లేచి నృత్యం చేస్తూ తమ “సంఘీభావాన్ని” ప్రదర్శిస్తారు. అది చూస్తే సంగీతం “ఆత్మానందం” కోసమే అని నమ్మకం కలగదు. వింటున్నవారు కూడా భౌతికంగా “ఊగి తూగాలి”. అమెరికావంటి దేశాల్లో ప్రేక్షకులందరూ తెలుగువారే అయినప్పుడు కూడా ఏదైనా సినిమా పాట కాస్త హుషారుగా వినిపిస్తే ఆడియెన్స్‌లో చిన్నా పెద్దా, ఆడా, మగా అంతా లేచి నాట్యాలు చేస్తూ ఉంటారు. చిక్కల్లా ఎక్కడంటే అటువంటి పాట తరవాత ఇక అంతకంతకూ అల్లరి పాటలే పాడాలి తప్ప ఏ భక్తిపాటో పాడితే ప్రోగ్రాం చప్పబడిపోతుంది.
హిందూస్తానీ వాద్యసంగీత కచేరీల్లో (ముఖ్యంగా సితార్, సరోద్ కార్యక్రమాల్లో) తబలా ప్రాధాన్యత ముఖ్య కళాకారులకు దాదాపు సమాన స్థాయిలో ఉంటుంది. తబలా మొదలైన కొద్ది నిమిషాల్లోనే మొదటి విడత చప్పట్లు వారికే అందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా విలాయత్‌ఖాన్ వంటి పెద్ద కళాకారులు తబలా ధాటి తమను అధిగమించి తమను ఇరిటేట్ చెయ్యకుండా చూసుకుంటారు. నేను విన్న ఒక కచేరీలో ఆయనకు తబలా వాయిస్తున్న అత్యంత ప్రతిభాశాలి శాంతాప్రసాద్ తనకు ఇటువంటి పరిస్థితి ఎదురవటంతో కాస్త అసహనానికి గురయాడు. విలాయత్‌ఖాన్ అతి సున్నితంగా సితార్ వాయిస్తూ జనాన్ని మెప్పించడం చూసిన అతను మైక్‌లో “ఉస్తాద్‌గారి ఇటువంటి నాజూకు రాగప్రస్తారంలో నావంటి కళాకారులకు ధాటిగా వాయించే అవకాశమే లభించదు. ఉదాహరణకు ఈ వరస చిత్తగించండి” అంటూ ఉరుములూ, పిడుగులూ కురిపించే తబలా విన్యాసం ప్రదర్శించాడు. వెంటనే చప్పట్లతో హాలు హోరెత్తింది! సితార్ ఆర్టిస్టును పొగుడుతూనే తన పని కానిచ్చుకున్న మేధావి శాంతాప్రసాద్. (నాచే మన్ మోరా మగన్ అన్న రఫీ సినిమా పాటకు తబలా వాయించినది శాంతాప్రసాద్‌గారే).
కచేరీల్లో కొన్ని అంశాలూ, సంగతులూ విన్నప్పుడు గుండె ఝల్లుమంటుంది, మనసు పులకరిస్తుంది. కాని ఈలలూ, చప్పట్ల జోరూ తగినవిగా అనిపించవు. శాస్త్రీయ సంగీతంలో కూడా తబలా దరువూ, పాటలోని ఊపూ ఒక్కొక్కప్పుడు శరీరాన్నీ, మనసునూ కూడా కుదిపేస్తాయి. కాని మనసునూ, బుద్ధినీ కదిలించే సంగీతం మరింత ఉన్నతమైనది. అతి గొప్పదైన సంగీతం ఎలాంటివారినైనా కదిలించక మానదు. అందుచేతనే చాలా పెద్ద స్థాయి కచేరీలకు ప్రసిద్ధ కళాకారులు వచ్చి, విని ఆనందించడం చూస్తూ ఉంటాం.
సినిమా పాటలు ఎంత మంచివైనా తెరిపి లేకుండా మళ్ళీ మళ్ళీ వింటే బోరు కొట్టేస్తాయి. మా చిన్నతనంలో రఫీ పాడిన మంచి పాటలు బినాకా గీత్‌మాలా వంటి ప్రోగ్రాముల్లో పదే పదే వినిపించి వినేవారికి విముఖత కలిగించడం నాకు గుర్తుంది. శాస్త్రీయసంగీతంలో అలా జరగదు. ఎందుకంటే రాగాల్లోనూ, పాటలోనూ అంతులేని వైవిధ్యం చూపడానికి అవకాశాలుంటాయి. ఆలాపన మొదట్లో కొద్దిపాటి స్వరసంచారం జరుగుతున్నప్పుడు కూడా వినేవారి మనస్సు రాగంలోని ఇతర స్వరాల, సంగతుల గురించి ఆలోచిస్తూ, వాటిని అభిలషిస్తూ ఉంటుంది. ముందుగా ఊహించే ఈ anticipation రాగంపట్ల మన ఉత్కంఠను పెంచి, శ్రద్ధగా వినేలా చేస్తుంది. అందుకనే శాస్త్రీయ సంగీతంపట్ల అభిమానులకు ఉండే విశ్వాసం మతవిశ్వాసమంత బలమైనదిగా అనిపిస్తుంది. ఎక్కువగా, రకరకాల సంగీతం వింటూ ఉన్నవారికి అభిరుచి మెరుగుపడి, అంతకంతకూ మంచి విషయాలను ఆస్వాదించి, ఆనందించడం సాధ్యమౌతుంది.