ఎగరడాన్ని…
ఎగిరించడాన్ని…
విను వీధుల్లో
విహరించి రాగలిగేంతలా
తెలిసిన వాడికి
రెక్కల గురించి
వేరే చెప్పడమెందుకు?ఎప్పుడూ అతడి దగ్గర
అనేకమైన రెక్కల జతలు
సిద్ధంగా ఉంటాయి…జీవితంలో
ఒకసారి కూడా ఎగరని వాళ్ళకు
ప్రయత్నించీ ఎగరలేకపోయిన వాళ్ళకు
పడిపోయిన వాళ్ళకు
అసలు ఎగరడమే తెలియని వాళ్ళకు
రెక్కలు కట్టి ఒక్కసారైనా
సంతోషంగా ఎగిరేట్టు చెయ్యాలని… తపనఅతనికి అదెప్పుడూ
నేల విడిచిన సాము కాదు!
నేల నుండి మొలకెత్తిన
చిన్న కోరికను
కొమ్మల రెమ్మలా
విస్తరించి
పైపైకి రెక్కలు విప్పుకుంటూ సాగిపోవడమే…ఎడారులు కమ్మేస్తున్న
ప్రతి మనసునూ
సారవంతం చేసి
ఒక కోరికను నాటి
రెక్కలు తొడిగితే చాలు,
చెట్ల గురించి వేరేక్కడో వెతుక్కునే అవసరం తప్పుతుంది.గుబురు గుబురుగా పెరిగిన వృక్షాలు తమ చుట్టూ
ఆకాశానికి చల్ల గాలిని వింజామరలతో విసిరి
భూమికి వర్షాన్ని బహుమతిగా రప్పించుకుంటాయి.ఎగరడమంటే చెట్టులా పైకెగసి
చినుకులా భూమిని ముద్దాడటమే!ఎగిరే
ఎగిరించే
ఎగరాలనిపించే వాడు
సంజీవిని తెచ్చే హనుమంతుడే కానక్కర్లేదు
రాసుకోలేని వాళ్ళకు
లేపనం పూసే వైద్యగాడి సాహచర్యంలానో
వ్రాసుకోలేని వాళ్ళకు
ఉత్తరాలు రాసే చదువుకున్నోడి విజ్ఞత లానో
ఎప్పటినుండో తెలిసినట్టే ఉంటుంటాడు.