ఉ. ఆ కమలాక్షి యింపున దృగంచల మించుక మూసి హర్షబా
ష్పాకులకోణశోణ రుచు లగ్రమునం జన జూచు చూపు తీ
రై కనుపట్టె దమ్మరస మంటుకొనన్ వెడవింటివాడు క్రో
ధైక ధురీణతం గఱచి యేసిన సింగిణి కోలయో యనన్
కవిత్వం, ముఖ్యంగా కావ్యరచన అనేది శిల్పం లాగా చిత్రలేఖనం లాగా చాలా సాధనతో కూడుకున్న కళ. సన్నివేశకల్పనలో కాని పాత్రచిత్రణలో కాని, చాలా సూక్షమైన సున్నితమైన అంశాలని కవి దర్శించగలగాలి. వాటిని అంతే జాగ్రత్తగా పాఠకులకి అందించగలగాలి. అది అతి మనోహరమైన కల్పన కావచ్చు. లేదా అత్యంత సహజమైన వర్ణనైనా కావచ్చు. పాఠకుని గుండెని, సన్నని దారాన్ని కట్టి లాగినట్టుగా తనవైపుకి, తనలోకి, లాక్కోవాలి. అలా మన మనసులని లాక్కునిపోయే పద్యమిది! ముందుగా, ఈ పద్య సందర్భాన్ని గురించీ పనిలో పనిగా ఇదే సన్నివేశంలో వచ్చే మరో మంచి పద్యాన్ని గురించీ ముచ్చటించుకొని, ఆ తర్వాత యీ పద్యం సంగతి చూద్దాం.
తాను వలచిన సుందరాంగుడు – మామూలు సుందరాంగుడా అతడు, మకరాంకశశాంక మనోజ్ఞమూర్తి, అలేఖ్య తనూవిలాసుడు – అలాంటి వాడు తన వలపుని త్రోసిపుచ్చి, తనను అంగభవువానికి అగ్గము చేసి, క్రూరుడై వెళ్ళిపోయాడు. దానితో ఆ లలితాంగి వియోగవహ్నిలో దహించుకుపోసాగింది. చెలులు ఆమెని అనునయించి ఉద్యానవనానికి తీసుకువచ్చారు. అక్కడొక కొలను. అందులోకి దిగి ఆ సఖులు జలక్రీడలు మొదలుపెట్టారు. ఈమె మాత్రం ఒడ్డున కూర్చుని ఉంది. ఆమె ఎలా ఉంది?
వాడిన మోముదమ్మి తెలివాలిక కన్నులు విన్నబోవ దో
నాడక నెన్నొసల్ కరమునందిడి తీరనిషణ్ణయై జలం
బాడగ బిల్చువారి నొక హస్తపు మ్రొక్కున నాడు డంచు దా
జూడక చూచుచూడ్కి నల జోటి దెసల్ పరికింప నొక్కచో
వాడిన మోముదమ్మి, తెలివాలిక కన్నులు విన్నబోవన్, తోన్ ఆడక, నెన్నొసల్ కరమునందు ఇడి, తీరనిషణ్ణయై, జలంబు ఆడగన్ పిల్చువారిన్, ఒక హస్తపు మ్రొక్కునన్, ఆడుడు అంచున్, తాన్, చూడక చూచు చూడ్కిన్, అల జోటి, దెసల్ పరికింపన్, ఒక్కచోన్
‘అల జోటి’ అంటే ఆ యింతి. ఆమె ముఖపద్మం వాడిపోయింది. తెల్లని నిడుదైన కన్నులు చిన్నబోయి ఉన్నాయి. చెలులతో చేరి ఆమె సరసులోకి దిగి ఆడటం లేదు. ఒక చేయి నుదుటన పెట్టుకుని అలా ఒడ్డునే కూర్చొని ఉంది (తీరనిషణ్ణయై). నెచ్చెలులు తనని ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళకి రెండో చేత్తో, ఒంటి చేత్తోనే, నమస్కారం పెట్టి, దయచేసి మీ దోవన మీరు ఆడుకోండని చెపుతోంది. నలుదిక్కులా పరికిస్తోంది. ఏమిటి చూస్తోంది? ఏమీ లేదు! అది ‘చూడక చూచు చూడ్కి.’ వట్టి చూపులన్న మాట.
ఇది చాలా సహజమైన వర్ణన. దీన్ని చదివిన సహృదయునికి ఆ దృశ్యం కళ్ళముందు కనిపించక మానదు. అంత కన్నా ముఖ్యంగా, ఆమె అవస్థ మనసుకి హత్తుకోక మానదు. ‘వాడిన మోముదమ్మి తెలివాలిక కన్నులు విన్నబోవ దోనాడక,’ అనేది మామూలు కవులెవరైనా చేయగల వర్ణనే. ‘నెన్నొసల్ కరమునందిడి’ ఉన్నదని చెప్పడానికి కొంత ఏకాగ్ర దృష్టి అవసరం. ‘జలం బాడగ బిల్చువారి నొక హస్తపు మ్రొక్కున నాడు’డని ఆమె చెప్పిందన్న వర్ణన ఉంది చూశారూ, అది సూక్ష్మదృష్టి గల కవి మాత్రమే చేయగల చిత్రణ. ‘చూడక చూచు చూడ్కి,’ అనడంలో ఆమె నిర్లిప్తతంతా ధ్వనింపజేశాడు కవి. కావ్యదేహంలో ప్రాణాన్ని ఊదేవి ఇలాంటి చిత్రణలే.
సరే, అలా ఎటో చూస్తూ కూర్చున్న ఆమెకి తనను తిరస్కరించిపోయిన ప్రియుడు అల్లంత దూరంలో కనిపించనే కనిపించాడు! ఇంకేముంది, ‘కలక్వణత్ కనక కాంచికయై’ ఎదురేగింది. కలలోని వస్తువు కళ్ళముందు కనిపించినట్టుగా అనిపించింది. ఎదురుగా వెళ్ళి అనురక్తితో అతన్ని చూసింది. అదుగో ఆ చూపుని వర్ణిస్తున్నాడు కవి. వ్యాసం మొదట పేర్కొన్న పద్యం అదే. దాన్ని మళ్ళా ఓమారు చదివి యిలా రండి. ఎంత మనోజ్ఞమైన ఊహ!
అసలే ఆమె కమలాక్షి! అంటే ఎఱ్ఱతామరల్లాంటి కళ్ళు కలది. ఆపై, ఇంపుతో అనురక్తితో చూస్తున్న చూపాయె. ఒకవైపు సిగ్గు, మరోవైపు కోరిక. కంటికొన (దృక్+అంచలము) ఇంచుక మూసి, ఆనందబాష్పాలతో నిండిన ఆ కనుకొలకులనుండి ఎఱ్ఱని కాంతులు ప్రసరిస్తూ, ఆమె చూసిన చూపు ఎలా ఉందో ఒక అపురూపమైన కల్పన చేశాడు కవి. ఆ చూపులోని ఎఱ్ఱదనం చుట్టూ అల్లుకున్న కల్పన యిది. ఆ ఎఱ్ఱదనం ఎక్కడనుండి వచ్చింది? అనురక్తితో చూసింది కాబట్టి, అనురాగపు ఎఱ్ఱదనం అని ఊహించవచ్చు. విరహతాపంతో నిద్రలేక కళ్ళు ఎఱ్ఱబారాయని కూడా అనుకోవచ్చు. కవి ఆ ఊహలన్నీ పాఠకునికి వదిలిపెట్టేశాడు. అంతే కాకుండా, ఆ ఎఱ్ఱదనంలో మరొక భావాన్ని పట్టుకున్నాడు! ఒకవైపు ఎంత ఆనందమూ కోరికా ఉన్నా, మరో వైపు తనని నిర్దాక్షిణ్యంగా విడిచి వెళ్ళిపోయాడన్న ఉక్రోషం కూడా సహజంగా ఎంతో కొంత ఉంటుంది కదా ఆమె మనసులో! ఆ కోపం వల్ల ఎఱ్ఱబడిన చూపు ఎందుకు కాకూడదూ? అదీ కవిగారి ఊహ. అయితే, ఈమె ఏ సత్యభామలాంటి స్వాధీనపతికో, ఖండిత నాయికో కాదు. ఇప్పటి దాకా ఆమెది వట్టి ఒకవైపు ప్రేమాయె. అలాంటప్పుడు తన అదృష్టం కొద్దీ తిరిగి కనిపించాడనుకుంటున్న ఆ ప్రియునిపై ఆమె కోపం వ్యక్తం చేయగలదా? లేదు. కాబట్టి ఆ ఉక్రోషమంతా మనసులోనే ఉండిపోయి ఉండాలి. అలాంటప్పుడు అది ఎఱ్ఱని చూపుగా ఎలా బయటపడుతుంది? కానీ బయటపడితేనే కానీ మన కవిగారికి తృప్తి లేదు! ఎలా మరి? కల్పనాశక్తి కలిగిన కవికి సాధ్యం కానిది ఏముంటుంది!
వెడవింటి వాడిని రంగంలోకి దింపాడు. మనసులో భావానికి మన్మథుని కన్నా ప్రతినిధి ఇంకెవరుంటారు చెప్పండి! ఆ మన్మథుడు ఆమె ప్రియునిపై కోపైకధురీణుడై (కోపమనే పెనుభారాన్ని మోస్తున్నవాడై) ఉన్నాడట. మధ్యలో మన్మథుడి కెందుకయ్యా అతనిపై కోపం అంటే, కవిగారు దానికి జవాబు చెప్పరు. రసజ్ఞులైన ‘ఊహ తెలియంగల’ పాఠకులకి అర్థమవుతుందన్న నమ్మకం. రతీదేవిలాంటి సొగసుకత్తె అందించాలనుకున్న మన్మథసామ్రాజ్యాన్ని, ఈ తుచ్ఛ సుఖాలు మీసాలపై తేనియలు, అని తృణీకరించి వెళిపోయాడు కదా ఆ ప్రియుడు. పైగా ఆ మహానుభావుడు చేసిన పనికి, నేరం తనపై మోపి ఆ సుందరాంగి తనను నిందించింది కూడానూ (మన్మథోపాలంభము!) అంచేత మన్మథునికి అతనిపై అంత కోపం. దానితో, అతను కనీ కనిపించగానే మన్మథుడు ఏం చేశాడట అంటే, వాడి బాణం ఒకటి తీసి, కసిగా, తమ్మరసం (నోటనున్న తాంబూలపు ఎఱ్ఱని రసం) ఆ బాణపు ములుకుకి అంటుకొనేలా దాన్ని గట్టిగా ముద్దిడి, తన సింగాణితో (విల్లు) సంధించి గురి చూసి అతనిపై వేశాడట. అలా వేసిన మన్మథబాణంలా ఉన్నదట ఆమె చూపు! ఓహ్, ఈ కవి అసాధ్యుడు సుమండీ! కోపం ఆమెది కాదు, ఆమె మనసులో తిష్ఠ వేసుక్కూర్చున్న మన్మథునిదట. మదనుని విరితూపులాంటి ఆ చూపులోని ఎఱ్ఱదనంలో, ఒకవైపు తమ్మరసపు కమ్మదనమూ, మరోవైపు చురుక్కుమనిపించే కోపమూ, రెండూ ఉన్నాయన్నమాట. ఆ బాణం వెళ్ళి మెత్తగా సూటిగా ప్రియుని గుండెల్లో గుచ్చుకుంటుంది. అతనికింక మన్మథబాధ తప్పదన్న మాటే! ఈ వివరణంతా వాచ్యం చేయకుండా, చెప్పాల్సినంత వరకే పొదుపుగా పొందికగా పద్యంలో బిగించి చెప్పి, భావాన్ని ధ్వనింపజేయడం గొప్ప కవిత్వం.
ఇదీ అల్లసాని వాని అల్లికలోని జిగి, బిగి! ఊరికే అన్నారా మరి – పెద్దన వలె కృతి సెప్పిన పెద్దనవలె!
(షరా: ‘తమ్మరసమంటుకొనన్’ అన్న దగ్గరనుండీ ఉన్న పద్య భాగానికి, నేను చూసిన రెండు పుస్తకాలలో తాత్పర్యం వేరుగా ఉంది. అది నాకంత సారస్యంగా అనిపించ లేదు. అందువల్ల కొంత సాహసించి నాకు బాగుందనిపించిన అన్వయాన్ని యిక్కడ వివరించాను. దీనిలోని గుణదోషాలను పెద్దలే నిర్ణయించాలి.)