కృష్ణ: లలిత గీతాలు

కృష్ణ చంద్రిక!

ఏ లేమ పులకింతవే
వెన్నెలా!
ఏ భామ మైపూతవే
తెల్లని నీ వెలుగు వెల్లువల డోలికల
ఉయ్యాల లూగేను వయ్యారి యమున

ఏ సుదతి చిరునవ్వువే
వెన్నెలా!
ఏ మగువ సిగపువ్వువే
తెల్లని నీ వెలుగు వెల్లువల పరుపుపై
పవళించె నరమోడ్పు ముదిత బృందావని!

ఏ కన్నె ఎద మంటవే
వెన్నెలా!
ఏ కాంత తమి పంటవే
తెల్లని నీ వెలుగు వెల్లువల పడగలపై
పిల్లన గ్రోవూదె నల్లని నా సామి!

కృష్ణ సుందరి!

పగలు ప్రతి గడియ నిను పలవరించేననా
రేయి కనుమూయగనె కనులలో నీవు!

పగలు నీ పిలుపుకై పరితపించేననా
పలుకరించును మురళి నిదురలో నన్ను!

అపరిచిత వలె పగలు తొలగి పొయేననా
చేరెదవు కలల లో చెలిమికై చెంత!

మథుర వీథుల పగలు నీ వెంట జనలేదనా
కొనిపోయెదవు కలల కాళింది తటికి!

కనుసన్నలను పగలు కసురుకున్నాననా
కసి తీర్చుకుందువు కలల కౌగిళ్ళ!

నీ తలపులే కృష్ణ! తలబ్రాలు నాకు!
పగలేమి రేయేమి పరవశించుటకు!