…!!
ఒకటే అద్దాలు ఊహలు నీడలు జాడలు అన్నీ ఒక్కసారి గుండెల మీద కూర్చొని ‘నీ ఊపిరి నేనవుతా’ అనే ఒక వింత ఉక్కిరిబిక్కిరి… హటాత్తుగా లేచి కూర్చున్నాడు గౌతమ్. పక్కనే భార్య యశోధర కోసం తడిమాడు. తగల్లేదు. విచిత్రంగా గడియారంలా టంచనుగా పడుకొని తెల్లవారుఝామునే లేచే యశో లేదంటే, అప్పుడే తెల్లారిపోయిందేమోనని గుండె గుభేలుమంది. ఇవాళ మీటింగ్స్, డెడ్ లైన్లు అన్నీ వరుసగా లైన్లో గుర్తొచ్చేసరికి, లేపనందుకు పెళ్ళాం మీద కోపం కూడా వచ్చింది. ‘మన పని కోసం ఇతర్ల మీద డిపెండ్ అవటం అంత బుద్ది తక్కువ పని మరోటి లేదు,’ అనుకుంటూ పెట్టిన అలారం మోగనందుకు విసుగ్గా సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అబ్బా ఏదో వాసన, మళ్ళీ యశోని తిట్టుకున్నాడు, యేవేవో తెస్తుంది నేచురల్ స్మెల్ ఇస్తాయి అనుకుంటూ బోటిక్స్ నుండి. ఏంటా వాసన, ఏదో గుర్తుకు తెస్తోంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే తెలిసింది. హా! బలపాల వాసన. నానిపోయి, వర్షపు హోరులో ప్లాస్టిక్ కవర్ల మధ్య దాచుకున్న పలకలు, వాటితో పాటు తడిసిపోయి కొన్ని ముద్దై మరికొన్ని కాని సుద్దముక్క బలపాల వాసన! అవి గుర్తు రాగానే గాభరా పుట్టింది గౌతమ్‌కి. ఇంతకీ ఎక్కడికి పోయింది యశో…?
కనీసం సెల్‌ఫోన్ చూస్తే అన్నా టైమెంతయిందో తెలుస్తుంది. సైలెంట్ మోడ్‌లో పెట్టిన ఫోన్ స్క్రీన్ మసకగా కనిపించింది. కళ్ళు నులుముకొని చూసేటంతలో కనీ కనబడని ఆ టైమ్ కాస్తా మాయమై ఒక పాత పలక స్క్రీన్ మీద ప్రత్యక్షం అయింది. ఏంటిది? గౌతమ్ గొంతు పొడారింది. దాని మీద అక్షరాలు…
ఒరే గౌతమ్,
నువ్వు, మీ మమ్మీ డాడీ ఇక్కడి నుండి వెళ్ళిపోయిన దగ్గరనుండీ దుగ్గు గాడు నన్ను బాగా ఏడిపిస్తున్నాడు. నిన్ను టామీ అన్నాడు.నీది డాగ్ పేరు అన్నాడు. నాకు కోపం వచ్చి కొట్టాను. వాడు నా హెయిర్ క్లిప్స్ పీకేసి దాచేశాడు. నా లంచ్ బాక్స్‌లో మాగీ తినేశాడు. నువ్వు ఇంక రావు అని చెప్తున్నాడు. అబద్ధం కదా. వస్తావు కదూ! స్పీడుగా వచ్చి వాడ్ని కొట్టు. కొట్టేసి వెళ్ళిపో కావాలంటే. నాకు నువ్వు లేకుండా ఈ స్కూల్ బాలేదు..!
నీ ఫ్రెండ్
యశోధర,
థర్డ్ క్లాస్, బీ-సెక్షన్ , రోల్ నంబర్ 21.
విద్యా పబ్లిక్ స్కూల్,
అనంతపురం.
గౌతమ్‌కి ఏమీ అర్ధం కాలేదు. ‘యశో! యశో!’ అని పిలిచాడు. తన గొంతు తనకే కీచుగా వినిపించింది. తొట్రుపడుతూ, తడబడుతున్న అడుగులతో, బెడ్రూమ్ దాటి బయటకి వచ్చాడు. ఎంతయింది టైమ్? ఏమో ఏమీ తెలీటం లేదు. యశోకి అస్సలు బుద్ది లేదు. ప్రతిసారీ కేంపులకి వెళ్ళినప్పుడల్లా రకరకాల వాల్ క్లాక్స్ తెస్తూనే ఉంటాడు. రెండు రోజులు ఎక్కడో ఒకచోట తగిలిస్తుంది. తర్వాత తీసేస్తుంది.
అయినా వాల్క్లాకే కావాలా, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఓవెన్ అన్నిటి మీద టైం ఉంటుందిగా. ప్రిడ్జ్! మర్చిపోయిన దాహం గుర్తొచ్చింది. గభాల్న లైట్స్ అన్నీ వేసుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళి, వాటర్ డిస్పెన్సర్ నుంచి గ్లాసు నిండా నింపుకుని గటా గటా చల్లటి నీళ్ళు తాగాడు. వెంటనే గుర్తొచ్చింది జీవన్మరణ సమస్యలా టైం ఎంతయింది అని.
ఫ్రిడ్జ్ మీద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ చూడటానికి ప్రయత్నించాడు. మసకమసకగా కనిపించింది. ఈ మధ్య ఈ సైట్ ఒకటి! కళ్ళజోడు పెట్టుకుంటే గానీ ఏదీ కనబడి ఛావదు. కళ్ళు చికిలించాడు. ఫ్రిడ్జ్ మీది స్క్రీన్ ఉన్నచోట ఒక అందమైన పింక్ కలర్ కాగితం వేలాడుతోంది. ఇదెక్కడో చూసినట్టుందే. ఓహ్, తను మొదటిసారి కొని రాసిన లెటర్ పాడ్ లోది కదూ. ఇదిక్కడ ఎందుకుందబ్బా? యశో అతికించి ఉంటుంది. అది లాగాలని ప్రయత్నించాడు. వీలుకాలేదు. అది స్క్రీన్‌లా మారిపోయింది. కష్టపడి దాచుకున్న సెంట్ పూసిన ఉత్తరం. మరో అక్షరాల వాన. ఈ అక్షరాలు రాసింది నేనే కదూ అనుకున్నాడు.
ప్రియమైన యశో,
నేను వస్తానని చెప్పాను, వచ్చాను. ఎంత మారావు యశో. రెండు పోనీటెయిల్స్ పిల్ల హటాత్తుగా లంగా వోణీతో, కన్నుల్లో కన్నెతనపు విశ్వాసంతో, క్షణంలో చిలిపితనం మెరిపించి, పెద్దవాళ్ళు వస్తుంటే గంభీరంగా మారిపోయే ముఖ కళవళికలతో, ఎదురయిన నేస్తాన్ని ఏం చేయాలి? నీ దగ్గర మంచివాడిగా ఉండటం అనేది నాకు నేను చెప్పుకొనే పెద్ద అబద్ధం. ఒక్కసారికి చెడ్డవాణ్ని అయిపోనా? ఓహ్! చెడ్డవాళ్ళు పర్మిషన్ అడగరు కదూ!
సరే. ఇంకొక్క నాలుగేళ్ళు యశో… వోపిక పట్టు. తప్పకుండా అధికారికంగా తీసుకు వెళతాను. ప్లీజ్, రా. ఈ ప్లీజ్ నాకు నేనే చెప్పుకున్నట్టు ఉంది, నిన్ను వదల్లేక!
ఒకరోజు నీ జ్ఞాపకాల్లో నలిగి, ఏం తోచక, మొదటి సారి లైబ్రరీలో దొంతర్లుగా ఉన్న తెలుగు పుస్తకాలు కొన్ని చదివాను. నువ్వు తరచు నాతో మాట్లాడే పేర్లు కొన్ని కనిపించాయిరా. అన్నిచోట్లా ప్రబంధ నాయికలు, వాసవ సజ్జిక, విరహోత్కంఠిత, ఇంకెవరో. కానీ, విరహం ఆడవాళ్ళ కేనా, మగవాళ్ళకి ఉండదా? నీ ఆలోచనల్లో నిద్ర పట్టని నన్ను అడగమని చెప్పు. ఎప్పటికో నిద్ర పడుతుంది. నీ కళ్ళ మెరుపో, నవ్వు సవ్వడో వినిపించి తెలివి వచ్చేస్తుంది. బాబోయ్, నాక్కూడా కవిత్వం వస్తోందోయ్!
చాలా చదవాలి. నిన్ను సుకుమారంగా చూసుకోవాలి. ఎలా తెలుసా? అసలు మన జీవితం ఎన్నేళ్ళు గడిచిందో గుర్తుకు రానంత! నీకు సమయమే గుర్తుకు రానంత అపురూపంగా చూసుకుంటా తెలుసా!
ఇంకా ఆపేస్తాను. నా కవిత్వానికి కాదు రేపు పరీక్ష. నా తెలివితేటలకీ, జ్ఞాపక శక్తికీ. ఉంటా యశో…
నీ
గౌతమ్ అనబడే టామీ.
ఆ ఉత్తరంతో పాటు మర్చిపోయిన సెంట్ వాసన. ఎన్ని మంచినీళ్ళు తాగినా గొంతు పొడారినట్టే ఉంది. గౌతమ్ ఏదీ నమ్మలేకపోతున్నాడు. స్పష్టాస్పష్టంగా కూడా జరుగుతున్నది ఏమిటో అర్ధం కావటం లేదు అతనికి. ఇప్పుడు రెండు ప్రశ్నలు — యశో ఏమైంది? సమయం ఎంత అయింది?
హటాత్తుగా గుర్తొచ్చింది. ల్యాండ్ లైన్ కార్డ్‌లెస్ ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి కదూ. యశో ఆ ఫోనే ఎక్కువ వాడుతుంది. ఆ ఫోన్ మీద కూడా టైం కనబడుతుంది కదా. తడబాటు పడుతున్నట్టుగా హాల్లోకి వచ్చాడు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. గోడల నిండా, తనవీ యశో వీ, కొడుకు రాహుల్వీ ఫోటోలు. రాహుల్ బోర్డింగ్ స్కూల్ యూనిఫారంలో కొన్ని. అవునూ రాహుల్ స్కూల్‌కి ఫోన్ చేస్తే? యశో అక్కడకి వెళ్ళి ఉంటుందేమో. కానీ రాత్రి పక్కన పడుకొనుంది. స్కూల్‌కి ఎప్పుడెళ్ళింది, ఎందుకు వెళ్తుంది? ఏమో…
సన్నగా తలనెప్పి ప్రారంభం అయింది. ల్యాండ్ లైన్ ఫోన్ కోసం వేట కూడా. హాల్లో లేదు. వరండాలో లేదు. యశో ఫోన్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉన్నట్టే అనిపించింది. మళ్ళీ చూస్తానా తనని? వెతుక్కుంటూ ఇల్లంతా తిరిగేశాడు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. చివరగా స్టోర్ రూమ్ కనిపించింది. స్టోర్ రూమ్‌లో ఫోన్ ఎందుకు ఉంటుంది? ఏమో. చిత్రంగా స్టోర్ రూమ్ తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళాడు గౌతమ్. రూమ్ నిండా వాల్ క్లాక్‌లు. ఆకలి మీదున్న వాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అనిపించింది. హమ్మయ్య! కనీసం సమయం తెలుస్తుంది. ఆత్రంగా ఆ గడియారాల వంక చూశాడు. అన్నీ ఒకటే సమయం చూపిస్తున్నాయి. ఉదయం 1:43. తేదీ 7-7-2007. అబ్బా! ఈ గడియారాలన్నీ ఆగిపోయాయే. ఈ తేదీ ఎంతో పరిచయం అయినదిలా ఉందే.. అప్పటికి పెళ్ళయి పధ్నాలుగు నెలల ముఫై రోజులు. అంటే పదిహేను నెలలేగా అని యశో నవ్వు. కాదు,ఈ నెల ముఫై ఒకటో రోజు ఉంది. ఇది వన్ ఫోర్ త్రీ రా. అంటే ఐ లవ్ యూ. ఒక తెల్లారుఝామున, ఇద్దరికే పరిమితమైన బీచ్ రిసార్ట్‌లో, సముద్రపు గాలుల మధ్య ఇసుక తన్నుకుంటూ నడిచిన క్షణాలు… రాహుల్ కడుపులో పడ్డాడని తెలిసిన క్షణాలు… అప్రయత్నంగా కళ్ళు తడి అయ్యాయి.
హేయ్! ఇక్కడే ఉంది ఫోన్. యశో పడేసి ఉంటుంది. ఆబగా చేతిలోకి తీసుకున్నాడు. రాహుల్ స్కూల్ ఫోన్. కానీ నంబర్ యశోకే తెలుసు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తేగా? ఆశ్చర్యం వేసింది గౌతమ్‌కి. ఐ.ఐ.టీ.లో టాపర్, తన మెమొరీకి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు క్లాస్మేట్స్ లో. అలాంటిది ఇవాళ… టైం ఎంత అయింది, యశో ఎక్కడ ఉంది, రాహుల్ నంబర్ ఎంత, అన్నీ ప్రశ్నలే!