నన్నెచోడుని క్రౌంచపదము

[కవిరాజశిఖామణిగా తనని తాను ప్రకటించుకున్న నన్నెచోడుని ఉనికీ, కాలనిర్ణయమూ, అతని కావ్యం కుమారసంభవము – వీటిపై విస్తృతంగానే వాదోపవాదాలు జరిగేయి. నన్నెచోడుడు ఎప్పటివాడో నిర్ధారించటానికి అనేకమంది పండితులు ప్రయత్నించారు. అతని కావ్య లక్షణాల ఆధారంగా ఈ కవి ఏ కాలం వాడో, రచయిత ఈ వ్యాసంలో విశ్లేషిస్తున్నారు. ఈ కవి వ్రాసిన కుమారసంభవ కావ్యం ఎందుకు విశిష్టమైనదో జనవరి 2009 ఈమాట కవిరాజశిఖామణి వ్యాసంలో వివరించారు. – సం.]

పరిచయము

తెలుగు కవులు ఎంత గొప్పవారైనా వారి జీవిత విశేషాలని దురదృష్టవశాత్తు వారు ఎక్కడా వ్రాయలేదు, వారి కావ్యాల్లో మనకు ఎక్కువ ఆధారాలను వదలలేదు. ఉన్న ఆధారాలతో వారి కాలాన్ని నిర్ణయించడం కష్టతరమైన కార్యం, కానీ కొన్ని పద్ధతులతో చేయడానికి వీలవుతుంది. అందులో కొన్ని: 1. సామాన్యంగా రాజులు కవులను పోషించేవారు, ఆ రాజులకు కవులు తమ కావ్యాలను అంకితం చేసేవారు. ఆ ప్రభువుల రాజ్యపాలనా కాలము కవుల కాలాన్ని కూడా తెలుపుతుంది. 2. కవులు తమకు ముందున్న కవులను, తమ సమకాలీన కవులను పొగడి పద్యాలను రాసేవారు. కవుల కాలం అట్లు పొగడబడిన కవులకు పిదప కాలం అని మనం అనుకోవచ్చు. 3. కవుల పేరులు, వారి కుటుంబపు వారి పేరులు లేక వారిని పోషించిన రాజుల పేరులు ఉండే కొన్ని శిలాశాసనాలతో కొందరు కవుల కాలాన్ని నిర్ణయించవచ్చు. 4. కవుల గ్రంథాల శైలి, వారి వ్యాకరణము, ఛందస్సు, వారు ఉపయోగించిన పలుకుబడులు ఇత్యాదులు.

నన్నెచోడుడు తన గురించి చెప్పుకొన్నదల్లా తన తండ్రి చోడబల్లి అని, తల్లి శ్రీదేవి అని, గురువు మల్లికార్జునుడని. తానేమో టెంకణాదిత్యుడన్నాడు. టెంకణము అంటే దక్షిణదేశం. పూర్వకవి స్తుతిలో వాల్మీకిని, వ్యాసుని, కాళిదాసును, భారవిని, ఉద్భటుని, బాణుని పేర్కొన్నాడు. తెలుగు కవులను మరెవ్వరిని పేర్కొనలేదు, నన్నెచోడుని కూడ మరెవ్వరు పేర్కొన్నట్లు ఆధారాలు లేవు. ఇక మనకు మిగిలిందల్లా శిలాశాసనాలు, కుమారసంభవ కావ్యం మాత్రమే. కేవలం వీటి ఆధారంగా నన్నెచోడుని కాలనిర్ణయం ఎలా చేయగలమో వివరించడమే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం. నన్నెచోడుడు ఉపయోగించిన విశేష వృత్త ఛందస్సులనూ, ముఖ్యంగా క్రౌంచపదమనే వృత్తాన్ని గురించి వివరించి, ఈ వృత్త లక్షణాల ఆధారంగా ఇతడు తెలుగులో మొదటి ఛందోగ్రంథాన్ని రాసిన కవిజనాశ్రయకర్తకన్నా పూర్వుడనే నా అభిప్రాయాన్ని విశదీకరిస్తాను.

శాసనప్రమాణాలు

మానవల్లి రామకృష్ణకవి ఈ కవి నన్నయకంటె పూర్వీకుడని నిర్ణయించిన దానికి ఆధారాలు[1]: కుడుంబలూరు శాసనం (క్రీ.శ. 900-950) ప్రకారం విక్రమకేసరి అనే ఒక రాజు మల్లికార్జునుడనే ఒక మతాచార్యునికి ఒక మఠాన్ని దానం చేశాడు. బీచుపల్లి అనే మరో శాసనంలో (క్రీ.శ. 902) చోడబల్లి అనే రాజు కృష్ణానది ఒడ్డులో ఉండే ఒక గుడికి భూదానం చేశాడు. ఇక మూడో శాసనంలో నన్నెచోడుడనే రాజు పశ్చిమ చాళుక్యులతో చేసిన యుద్ధంలో క్రీ.శ. 940లో చనిపోయాడు. తండ్రి పేరు, గురువు పేరు, నన్నెచోడుని పేరు ఈ మూడూ మూడు శాసనాలలో ఉన్నాయి, కాబట్టి ఇతడు నన్నయకు ముందటి వాడని కవి తీర్మానం.

ఇంతవరకు, నన్నెచోడుడు ఎప్పటివాడో అన్నది కేవలం శిలాశాసనాలపై ఆధారపడిందే. చోడుడు నన్నయ తిక్కనలకు మధ్య కాలం వాడన్న దానికి ఆధారాలు[1]: పెదచెరకూరు శాసనం అని ఒకటి ఉంది. ఇది కాకతీయ రాజు గణపతిదేవునికోసం మల్లిదేవుడనే చోళరాజు చేసిన దానాన్ని గురించినది. దీని కాలం క్రీ.శ. 1250 సంవత్సరం. ఇందులో ఏ సందేహమూ లేదు. మల్లిదేవుని వంశంలోని పూర్వుల జాబితా ఇలాగుండి ఉంటుందని ఊహ: మల్లిదేవుడు (1250) – నన్నెచోడుడు – మల్లిదేవుడు – ఘటంకారుడు – సురభూపతి, రాజరాజ మహీపతి – నన్నెచోడుడు – చోడబల్లి – కరికాలచోడుడు . ఇక పోతే ఒక తరానికి మరో తరానికి మధ్య ఎన్నేళ్ళు తీసికోవాలో అనే దానిపై అంగీకృతమైన విషయం 25 నుండి 30 ఏళ్ళని. దీని ప్రకారం ఇందులోని నన్నెచోడుని కాలం బహుశా క్రీ.శ. 1125 ప్రాంతం. అదీ కాకుండా కొప్పరపు శాసనం ప్రకారం క్రీ.శ. 1125 ప్రాంతంలో చోడబల్లి అనే రాజు ఒక మల్లికార్జునయోగిని సత్కరించాడట. ఈ వాదం ప్రకారం నన్నెచోడుడు నన్నయ తిక్కనల నడిమి కాలం వాడు. ఈ వాదాన్నే అనేకులు బలపరిచారు.

నన్నెచోడుని కవితలో తిక్కన, నాచన సోమనల ఛాయలు ఉన్నాయని, కావున ఇతడు తిక్కనకు తరువాతి వాడని మరి కొందరి వాదం[1]. ఇక పోతే ఇతని కవితలోని గూఢాంశాలను నిశితంగా పరిశీలించి ఇతడు నన్నయకు సమకాలీనుడని దేవరపల్లి కృష్ణారెడ్డి తీర్మానించారు[2]. చివరగా కొర్లపాటి శ్రీరామమూర్తి మానవల్లి రామకృష్ణకవే కుమారసంభవ కావ్యాన్ని రాసి నన్నెచోడునికి ఆపాదించారని ఒక పెద్ద పుస్తకం రాశారు[3].

మంగళాచరణ పద్యాలు

నన్నయ తిక్కనలు తమ కావ్యాలను సంస్కృత పద్యాలతో ఆరంభించారు. కాని నన్నెచోడుడు తెలుగులో రాసి మార్గదర్శి అయ్యాడు. మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో అతి పురాతనమైనది రేచన వ్రాసిన కవిజనాశ్రయము. ఇందులో కూడా మంగళాచరణమైన కింది మొదటి పద్యం (సంజ్ఙాధికారము నుండి) తెలుగులోనే ఉంది [4],[5].

కం. శ్రీకాంతాతిప్రియ వా
        క్ఛ్రీ కాంత జగత్రయైక సేవిత నుత వి
        ద్యాకాంత దివ్య కావ్య స
        దేకాంత నితాంత కాంతి నీవుత మాకున్

శ్రీకాంతునికి అతి ప్రియమైన దానా, పలుకుల సిరిరాణీ, ముల్లోకములయందు పూజింపబడుదానా, విద్యల తల్లీ, మంచి కావ్యములయందు ప్రీతి చూపుదానా, ఎల్లప్పుడు మాకు నీ కాంతుల నొసగుమని దీనికి అర్థము.

ఇది ఎందుకు ముఖ్యమంటే నన్నయ తిక్కనలవలె కాక ఈ ఇద్దరు కవులు తెలుగు పద్యంతో కావ్యారంభం చేశారు. ఇందులో ఎవరు ఎవరిని అనుసరించారన్నది ఎవరు ముందో ఎవరు వెనుకో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అంతే కాక రేచన తేటగీతి లక్షణాలను తెలిపేటప్పుడు “వస్తుకవి జనాశ్రయా” అంటూ వస్తుకవిత అనే పదాన్ని కూడా వాడాడు[4],[5]. ఈ రెండు పద్యాలు జయంతి రామయ్యపంతులుగారి ప్రతిలో[6]లేదు.

గోవిందకవి చోడుని అనుసరించాడా?

కుమారసంభవ కావ్యపు ముద్రణ లన్నింటికీ తంజావూరు సరస్వతీమహలు ప్రతియే మూలాధారం. మరొక ప్రతి ఉందని కవిగారు చెప్పినా దానిని మరెవ్వరు చూచింది లేదు. ఆ తంజావూరు ప్రతి నిజమయిందేనా అనే సంశయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఈ మధ్య నేను తాళదశప్రాణప్రదీపిక[7] అనే గ్రంథం చూశాను. ఇది సంగీతంలోని తాళాలపైన ఒక గొప్ప పుస్తకం. దీనిని పోలూరి గోవిందకవి రాశాడు. ఈ కవి కాలం బహుశా నన్నయ నన్నెచోడుల పిదప. ఇతడు మంగళాచరణ పద్యాన్ని తెలుగులో ప్రారంభించాడు. నన్నెచోడునివలె షష్ఠ్యంతాలను కూడా రాశాడు. ఈ కవి నన్నయను, గణిత శాస్త్రములో ప్రావీణ్యము గడించిన పావులూరి మల్లనను మాత్రమే పేరు పెట్టి ప్రశంసించాడు. బ్రాహ్మణేతర కవులను ఆ కాలములో స్తుతించరో ఏమో? కాని “నన్నయ ప్రముఖాంధ్ర సన్నుత ప్రాక్తన కవిరాజరాజుల కవనతు లిడి” అన్నప్పుడు వ్యంగ్యంగా నన్నెచోడుని కూడా పేర్కొన్నాడని నా ఊహ. ఇదే నిజమయితే కవిరాజశిఖామణిని ప్రస్తుతించిన ఒకే కవి ఇతడు కాబోలు! ఈ గ్రంథపు ప్రతి కూడా తంజావూరు సరస్వతి మహలు నుండే, అక్కడ తప్ప వేరెక్కడా లేదు. మరి ఒకే ప్రతి ఉన్న ఈ పుస్తకాన్ని కవిపండితులు అంగీకరించి, కుమారసంభవాన్ని ఎందుకు కూట సృష్టి అంటారో అర్ధం కాదు.

రేచన నన్నెచోడులు

కవిజనాశ్రయము తెలుగులో మనకు దొరికిన మొదటి ఛందోగ్రంథము. దీని రచయిత రేచనయా లేక వేములవాడ భీమకవియా అన్న విషయం కూడా ఇంకా సరిగా తీర్మానించబడలేదు. జయంతిరామయ్యచే పరిష్కృతమైన ప్రతిలో[6] ఈ పుస్తకాన్ని భీమకవి రాశాడన్నాడు. దీనిని భీమనఛందం అనడం వాడుక. వావిళ్ళ ప్రతిలో[5] నిడదవోలు వేంకటరావు భీమకవి రేచనలు వేరువేరు వారనియూ, రేచనయే కవిజనాశ్రయపు కర్త అని తీర్మానించారు. అంతేకాక కుమారసంభవం, కవిజనాశ్రయములోని కొన్ని పద్యాలకు సామ్యాన్ని కూడా వీరు ఎత్తి చూపారు. మచ్చుకు కింది రెండు పద్యాలు ఒకదాని కొకటి అనుసరణ అనుటలో సందేహం లేదు. నన్నెచోడుని కుమారసంభవము (7.1) నుండి –

కం. శ్రీ శ్రితవక్షుఁడు ముక్తి
        శ్రీ శ్రిత సహజావదాతచిత్తుఁడు వాణీ
        శ్రీశ్రితసుముఖుఁడు కీర్తి
        శ్రీశ్రితదిఙ్ముఖుఁడు శేముషీనిధిపేర్మిన్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, మోక్షలక్ష్మికి ఆశ్రయమైన నిర్మలచిత్తుడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన దిఙ్ముఖుడు, బుద్ధివంతుడు అయిన జంగమ మల్లికార్జునుని ఉద్దేశించి, రేచన (కవిజనాశ్రయము, దోషాధికార ప్రకరణము) రాసినది ఈ పద్యము.

కం. శ్రీ శ్రితవక్షుఁడు విద్యా
        శ్రీశ్రితముఖుఁడఖిలజనవిశేషితకీర్తి
        శ్రీశ్రితభువనుఁడు సుకవిజ
        నాశ్రయుఁడెఱిగించు కృతులనగు దోషంబుల్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, లోకములో జనులెల్లరిచే పొగడబడుచు కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన వాడు, మంచి కవులకు ఆశ్రయమిచ్చువాడు గ్రంథములలోని దోషములను తెలియజేయును.