స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా?

డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు ఈమాట నవంబరు 2013 సంచికలో కుమారసంభవ కావ్య కర్తృత్వ విషయ నిర్ణయముపై వ్రాసిన నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసానికి నా స్పందన ఈ వ్యాసము. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము, నన్నెచోడుడు: 1. ప్రబంధయుగములో గాని, దాని తఱువాత గాని జీవించి ఉండుటకు వీలుకాదు, 2. కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందు కుమారసంభవమును వ్రాసినాడని చెప్పడం మాత్రమే.

ఒక పద్యముపైన మానవల్లి రామకృష్ణకవి వ్రాసిన వ్యాఖ్య నాధారము చేసికొని, అది తెనాలి రామకృష్ణకవి (తె.రా.క) వ్రాసిన కందర్పకేతువిలాసములోని ఒక పద్యమునకు అనుకరణగా నున్నందువలన, నన్నెచోడుడు తె.రా.క. పిదప కాలము వాడని ఆయన నిర్ణయించారు. కొన్ని పద్యముల మూలములను త్రవ్వి వివరంగా మనకు చూపించిన తీరు, వారి శక్తి సామర్థ్యాలు హర్షనీయమే.

నన్నెచోడుడు 16వశతాబ్ది తఱువాతివాడా?

ముందుగా మనము నన్నెచోడుడు తె.రా.క. పిదప కాలము వాడని, అంటే పదహారవ శతాబ్దము లేక దాని తఱువాతి కాలము వాడని అనుకొంటే వచ్చే పర్యవసానములేమిటో గమనిస్తాను.

  1. నన్నెచోడుడు కుమారసంభవ[1] కావ్యావతారికలో తాను కరికాలచోళుని వంశమునకు చెందినవాడని గర్వముగా చెప్పుకొన్నాడు.

కలుపొన్న విరులఁ బెరుఁగం
గలుకోడి రవంబు దిశలఁ గలయఁగఁ జెలగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘు పరాక్రముడఁ డెంకణాదిత్యుండన్ (1.54)

చోళ రాజులు సుమారు క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునుండి సుమారు క్రీస్తు శకము పదమూడవ శతాబ్దమువఱకు దక్షిణభారతదేశమును పరిపాలించారు. పాండ్యరాజులు క్రీ.శ. 1279లో చోళసామ్రాజ్యమును తమ వశము చేసికొన్న పిదప చోళుల పరిపాలన అంతమయినది. అట్టి పక్షములో పదహారవ శతాబ్దములో నన్నెచోడుడు ఎక్కడినుండి వచ్చాడు అనే ప్రశ్న వస్తుంది గదా? అది మాత్రమే గాక, విజయనగర రాజుల పరిపాలనలో చోళరాజులు ఇప్పటి దక్షిణాంధ్రములో ఉన్నట్లు చరిత్రలో దాఖలాలు గాని, శాసనాలు గాని లేవు. ఉన్న పక్షములో నన్నెచోడుని గుఱించిన చర్చలో ఎప్పుడో ఈ విషయము బయటపడి ఉండేది.

  1. నన్నెచోడుడు కు.స. కావ్యమును తన గురువైన జంగమ మల్లికార్జునునికి అంకిత మిచ్చాడు.

రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
త్కవి భువి నన్నెచోడుఁ డటె, కావ్యము దివ్యకథం గుమార సం
భవ మటె, సత్కథాధిపతి భవ్యుఁడు జంగమ మల్లికార్జునుం
డవిచలితార్థ యోగధరుఁ డట్టె, వినం గొనియాడఁ జాలదే (1.57)

పదహారవ శతాబ్దము, దాని పిదప కాలములో వీరశైవుల ఆధిక్యము దక్షిణాంధ్రములో అంతగా లేదు, అలాటి గురువు ఉండినట్లు కూడ మనకు ఆధారాలు లేవు.

ఇందువల్ల మనకు తెలిసే విషయమేమంటే — కరికాలచోళుని వంశములో పుట్టి, జంగమ మల్లికార్జునుని గురువుగా బొందిన నన్నెచోడుడు — పదహారవ శతాబ్దము పిదప, నిజానికి పదమూడవ శతాబ్దము పిదప జీవించి ఉండడం సంభవం కాదని అనిపిస్తున్నది.

కుమారసంభవము లోని కొన్ని ఛందోంశములు

  1. తెలుగు కవులు కావ్యారంభములో సామాన్యముగా శ్రీకారముతో శార్దూలవిక్రీడితమునో లేక ఉత్పలమాలనో వాడుతారు. కాని కాలిదాసాది కవులవలె నన్నెచోడుడు కావ్యారంభములో స్రగ్ధరావృత్తమును వ్రాసినాడు. దీనికి కారణము ఇతడు తెలుగులో ఆదికవియో లేక ఆదికవులలో ఒక్కడుగా నుండాలి.

స్రగ్ధరకు గణములు – మ/ర/భ/న/య/య/య. నన్నెచోడుడు స్రగ్ధరలో వ్రాసిన మొదటి పద్యముపైన ఎన్నో అభిప్రాయములు గలవు. అవి:

1. తన పేరైన మానవల్లి రామకృష్ణకవి యందలి మ. ర. అక్షరములతో ఈ వృత్తమును వ్రాసినాడని అందువలన మానవల్లి రామకృష్ణకవియే కు.స. కావ్య రచయిత అని ఒక వాదము ఉంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే.

2. మగణ-రగణములు ప్రక్కప్రక్కన ఉంటే మరణము సంభవించునని, అందువలననే నన్నెచోడుడు యుద్ధములో చనిపోయాడని అందువలన స్రగ్ధరావృత్తమును కావ్యారంభములో వాడుట శ్రేయస్కరము కాదని అధర్వణ ఛందస్సు లోని ఒక పద్యము రావూరు దొరసామిశర్మ ఛందోరీతులలో[2] కనిపిస్తుంది. ఆ పద్యము ఇది:

మగణమ్ముఁ గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
బగు నిక్కమండ్రు మడియఁడె
యగుననియిడి తొల్లి టేంకణాదిత్యుఁ డనిన్

అధర్వణుడు సుమారు క్రీ.శ. 1300-1400 మధ్యనుండిన వాడు[3]. అసలు ఆ పద్యము అధర్వణుడు వ్రాయలేదని ఇంకొక వివాదము ఉన్నది. ఇటువంటి పద్యమే భైరవకవి రచించిన కవిగజాంకుశము అనే గ్రంథములో[4] ఉన్నది. ఈ కావ్యాన్ని కూడా మానవల్లి కవిగారే పరిష్కరించారు. ఆ పద్యాన్ని తీసుకుని కొంతగా మార్చి అధర్వణుడికి ఆపాదించి తద్వారా తన సిద్ధాంతానికి అనువుగా వాడుకున్నారని, అందువల్లనే ఈ పద్యపు తాళపత్ర ప్రతి ఎవరికీ చూపలేదని, రామకృష్ణకవిపై ఆరోపణ చేశారు. కొర్లపాటి శ్రీరామమూర్తి[4] ఇలాగంటారు: “ఇది (అధర్వణఛందము) ప్రసిద్ధమైన ఛందమే కాని నేడు లభించదు. ఇతర లక్షణగ్రంథములలో దీని పద్యములు 30 వఱకు లభించెను. రావూరి దొరసామిశర్మ అందిచ్చిన సమాచారమునందును “మగణమ్ముఁ గదియ రగణము” అను పద్యము లేదు. అంతే కాదు అది ముద్రితాముద్రిత లక్షణగ్రంథములందు మృగ్యము.” ముందు ఈ పద్యము అధర్వణఛందములో నున్నదని చెప్పిన దొరసామిశర్మకూడా తఱువాత తన అభిప్రాయమును మార్చుకొన్నారు.

ఎన్నో కట్టు కథలు ఉన్నట్లు ఈ మ/ర గణములపైన కూడ ఒక చాటువు ఉండి ఉండవచ్చును. అది నిజముగా అధర్వణ ఛందములో నున్నదా లేదా అనే విషయము కూడ నన్నెచోడుని కాల చర్చకు అనవసరము. నన్నెచోడుడు ఆదికవులలో ఒకడు కాబట్టి, అతనికి నచ్చిన వృత్తాన్ని అతను ఎన్నుకున్నాడు. కాలిదాసాదులు శార్దూలవిక్రీడిత, స్రగ్ధరా వృత్తములను వాడినారు. పంపకవి ఉత్పలమాలను వాడాడు. నన్నెచోడుడు స్రగ్ధరను ఎన్నుకున్నాడు.

  1. కవిరాజవిరాజితమనే వృత్తమునకు ఆ పేరు ఏ విధముగా వచ్చింది?

సంస్కృతములో, కన్నడములో ఇది హంసగతిగా చెలామణి అయినది. నన్నెచోడుడు తాను కవిరాజశిఖామణి అని ప్రకటించుకొన్నాడు ‘రవికులశేఖరుండు కవిరాజశిఖామణి…’ పద్యంలో కాబట్టి నన్నెచోడుడే దీనికి కవిరాజవిరాజితము అనే పేరునుంచినాడా అనే సందేహం కూడ కలుగుతుంది. (బహుశా పోతన వ్రాసిన పలికెడిది భాగవతమట… అనే పద్యము ఈ పద్యమునకు అనుసరణయే ఏమో?)

  1. అదే విధముగా మంగళమహాశ్రీవృత్తము కూడ కవిజనాశ్రయములో ఉదహరించబడినది.

ఈ వృత్తము సంస్కృతములో గాని, కన్నడములో గాని లేదు. మఱి తెలుగులో ఎవరు వ్రాసినారు? చోడుని తఱువాత తిక్కన కూడ ఈ వృత్తమును స్త్రీపర్వములో వాడాడు. కు.స.లో ఈ వృత్తము కూడ ముద్రాలంకారయుక్తమై ఉన్నది. ఇది లయగ్రాహిలోని ఒక పంచమాత్రను త్యజించగా లభించిన వృత్తము. లయగ్రాహిలోని యతి ప్రాసయతి, మంగళమహాశ్రీ యందలి యతి అక్షరసామ్య యతి. దేశి కవిత్వమును ఆదరించిన నన్నెచోడుడు ఈ వృత్తమును సృష్టించి యుండవచ్చును గదా? దీని వివరములు మఱొక వ్యాసంలో ప్రస్తావించాను. గమనించగలరు.