పొడవూ వెడల్పుల లోతు

చచ్చిపోతున్నాను వీటితో

మృత్యువు యొక్క ముందరి క్షణాల్ని
గుర్తుకు చేసి
కలవరపరిచే మధ్యాహ్నాలు

దినచర్యలోని సంగీతాన్ని
తాగమని
గలగల లాడే ఆకుల చివర్లు

అపరిచిత గ్రహాలమీది
చీకటితో కూడా తమకున్న సంబంధాన్ని
తెలియ జెప్పడానికి
తాపత్రయపడే పువ్వుల రంగులు

ప్రాకృతిక రహస్యాల
భౌతిక వ్యక్తీకరణల్లాంటి
స్త్రీల హావ భావాలు

తమ యాత్రజాతరలో
నన్ను ఎప్పుడూ పోగొట్టుకొని
వెదుక్కునే స్వప్నాలు

అద్భుతమైన నా ఒంటరితనాన్ని
గుర్తుకు చేసే
హఠాత్ నిశ్శబ్దాలు

చచ్చిపోతున్నాను వీటితో
బతికిపోతున్నాను వీటితో