శ్రీ,
నేనే!
నేనే నీకీ ఉత్తరం రాస్తున్నాను. ఆఫీస్ కొచ్చీ రావడంతోనే, హడావిడిగా లాప్‌టాప్ తెరిచి ఇలా…
నేనేవిటా, ఇలా, మెయిల్ రాయడమేమిటా అని ఆశ్చర్యం కదూ నీకు? నిజమే. కొన్ని మాటలు మనం ఎదురెదురుగా మాట్లాడుకోలేం. మన హావభావాలు మనల్ని కొంత డిస్టర్బ్ చేస్తాయి. చెప్పాలనుకున్న మాటలు సగం గొంతులో, మరి సగం పెదవి గడప లోపలగా నిల్చిపోతాయి. అసంపూర్తిగా మిగిలిపోతాయి. అదే ఇలా అక్షరాలలో అయితే, అద్దం లోలా అన్నీ అవగతమై పోతాయి. గుండెని పట్టిస్తాయి. పట్టేస్తాయి కూడా!
అందుకే… నీకు నేనీ ఉత్తరం రాసే సాహసం చేస్తున్నాను. చదువుతావు కదూ? పూర్తిగా!
…
ఎక్కణ్నించి మొదలు పెట్టనా అని చూస్తున్నా శ్రీ!
ఊఁ! మొన్న, పిల్లల్ని అడిగావు కదూ!క్రిస్మస్ కమ్ పొంగల్ హాలిడేస్‌కి ఎక్కడికెళ్దామని? మీరందరూ కంప్యూటర్ చుట్టూ చేరి, ఎడతెరిపి లేని డిస్కషన్లు చేసుకుంటుంటే మౌనంగా చూస్తూండిపోయా. అది చూసి నన్నడిగావ్ గుర్తుందా? నువ్వేమిటీ? మాట్లాడవ్! అని. మాట్లాడాలనే అనుకున్నాను శ్రీ. కానీ నీ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక ఆగిపోయాను. ఒక వేళ నేను నోరువిప్పి చెప్పినా, విన్నాక నువ్వు చిత్రంగా నా వైపు చూస్తూ, ‘కొత్తగా ఇప్పుడిదేమిటీ?’ అంటూ అదోలా నా మనసుని చూపులతో గుచ్చేస్తావన్న భయంతో చెప్పలేకపోయాను.
నిజమే శ్రీ! ఇప్పుడు నాకంతా కొత్తగానే వుంటోంది జీవితం. కొన్ని కొత్తకొత్త సమస్యలెదురవుతుంటే, వాటి మూలాల గురించి ఆలోచిస్తుంటే, పరిష్కారమేమిటీ అని వెతుక్కుంటుంటే అర్ధమౌతోంది. ఈ ఇంట్లో ఒక సరికొత్త వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఆ బాధ్యతని మనమిద్దరం కలసి తీసుకోవాలని, దానికంటే ముందు — నువ్వూ, నేనూ కలిసి మాట్లాడుకోడం కూడా జరగాలని తెలుస్తోంది. కాదు. తెలిసొస్తోంది.
‘మనమా? మాట్లాడుకోడమా?’ అని అలా తీసేసినట్టు నవ్వకు శ్రీ, ప్లీజ్. నే భరించలేను.
నిజమే, పెళ్ళయిన కొత్తల్లో నాతో మాట్లాడాలని నువ్వెప్పుడు, ఎంతగా ప్రయత్నించినా పడనిచ్చేదాన్ని కాదు. ముఖ్యంగా, అత్తయ్య, మావయ్యల విషయంలో నేను చాలా పొసెసివ్ గానే వున్నాను. అందరాడపిల్లల్లానే నా ఇల్లు, నా మొగుడు, నా పిల్లలు నాకు మాత్రమే సొంతం కావాలని, అదే జీవిత ధ్యేయమనే భ్రమలో ఉన్నాను. నువ్వు నాకే పరిమతమై పోవాలని, నేను కాకుండా నీ జీవితంలో ఇంకెవరి జోక్యం వుండకూడదనీ, ఆ వ్యక్తి నీ తల్లి అయినా సహించేది లేదని నీకు తెగేసి చెప్పాను. అప్పుడు నీ ముఖం కందగడ్డలా ఎంత ఎర్రబడిందనీ! ‘ఏం కొడతావా?’ అని కూడా అన్నాను. అబ్భ! అప్పుడు, నువ్వు చూసిన చూపు ఇదిగో ఇప్పుడు కూడా ఇంకా దడ పుట్టిస్తూ, వేటాడ్తూనే వుంది, తెలుసా?
నిజమే శ్రీ! నేనన్నది తప్పే. పొరబాటే. అలా అని వుండకూడదు నేను! కానీ అనేశాను. ఏం చేయను? అదంతా నీ మీద ప్రేమ. నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలనే రక్కసి ప్రేమ. ఆ ప్రయత్నంలో నువ్వెంతగా సర్దిచెప్పాలని చూస్తే అంత కఠినంగా మొండికేయాలనిపించే ఒక మానసిక పరిస్థితి నాది అప్పట్లో!
ఇంకో నిజం కూడా చెప్పనా? ‘ఆఁ! నే చెప్పింది వినకుంటే ఏం చేస్తాడ్లే. ఎక్కడికిపోతాడ్లే,’ అనే ఒక ధీమా, ధిలాసాలు కూడా. అందుకు సగం కారణమూ నువ్వేలే. ఇప్పుడంటే, చెరోవైపు ఇద్దరు పిల్లల్నేసుకుని పడుకుంటున్నావ్ కానీ, అప్పట్లో ఇలా కాదుగా! అదే మరి! అసలు మనమధ్యే ఈ వివాహబంధమే కనక లేకపోయుంటే, వున్నా కట్టుబడి లేకపోయుంటే, లేకున్నా కలహాలన్ని ఇంతటితో రద్దు అని మనమొకటి కాకపోయుంటే, మనమెమెప్పుడో మాజీ భార్యాభర్తలమై పోయుండే వాళ్ళం. కదూ?
ఇద్దరమూ కలిసి ఈ బంధాన్ని ‘మన అంతరంగాల సాక్షిగా అంగీకరించుకుని’ వున్నామేమో? అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు, ఇంకో అప్పుడు నేను, సర్దుకున్నాం. పెళ్ళైన కొత్తల్లో నువ్వెంత అంటే నువ్వెంత వరకూ వెళ్ళినా, ఏదో జంకు, ఇంకొంచెం బెరకు, మనల్ని ఈ గీటు దాటనీకుండా ఆపింది. అరి కట్టింది.
ఆ తర్వాత రోజుల్లో నా మీద నీకు అభిమానం కలిగింది. నిన్ను తండ్రిని చేస్తున్న ఆనందంతో కలిగిన అభిమానం. అనురాగం. గర్వమేసేది. నిన్ను గెలుచుకున్నానని కాదు. ఓడగొట్టానని! ప్రసవ వేదనలో నిన్ను చాలా మాటలనేశాను. నా బాధ చూడలేక కన్నీరయ్యావు. అది చూసి, పురిటి నొప్పుల బాధే మర్చిపోయాను. పండంటి బిడ్డను నువ్వెత్తుకుని మురిసిపోతున్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను. మరో సారి అమ్మని కావాలని. నీ కళ్ళల్లో మెరిసే ఆ మెరుపుల్ని నే మళ్ళీ చూడాలని. నే రెండో సారి తల్లినౌతున్నప్పుడు నీ దిగులు చూపు చూసి ఎంత పొంగిపోయాననీ? అప్పుడు నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాలనిపించి…
ఇలా ఇల్లు, పిల్లలు, మనం, సంసారం. ఈ ధ్యాసలో నువ్వు పూర్తిగా మునిగిపోవడంతో నేనూ అందర్లానే చాలా సంతోషపడిపోయాను. అప్పుడప్పుడు పిల్లల పెంపకంలో తప్ప మనమధ్య పెద్ద పెద్ద గొడవల్లేవిప్పుడు. నీకూ నాకూ ఏ మాత్రం టైమ్ దొరికినా వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళని ఎలా పెంచడమా అని ఆలోచిస్తున్నాం తప్ప మరో ప్రసక్తి మన మధ్య లేదు. ఇక రాదు. నిజానికి ఏ భార్యైనా – ఇలా సజావుగా జీవితం సాగిపోతున్నందుకు, ఎవరి పోరూ లేకుండా సుఖంగా బ్రతుకెళ్ళిపోతున్నందుకు సంతోషపడాల్సిందే. కానీ, శ్రీ! నాకెందుకో ఇలా మనం బ్రతకడంలో ఏదో లోపం కొట్టొస్తూ కనిపిస్తోంది. పైకి చెప్పుకోలేని లోటేదో లోలోపల అసంతృప్తి రాజేసి పోతోంది.
ఈ మధ్య నువ్వు నన్ను తరచూ అడుగుతున్నావ్ ఏమిటీ, అలా వుంటున్నావ్? అని. ఏమీ లేదని అంటున్నానే కానీ, ఇదీ కారణమని చెప్పడానికి వెనకాడుతూ వచ్చాను. చెప్పలేక కాదు, చెప్పాక నువ్వు నమ్మకపోతేనో? అని.
నిజం. శ్రీ! ఇప్పుడు నాకు నా పిల్లల గురించి బెంగ పట్టుకుంది. చాలా చాలా బెంగపడుతున్నా. ‘అర్ధం లేకుండా మాట్లాడకు. బెంగెందుకు? నీ మొహం?’ అని కోప్పడ్తావని తెలుసు. నిజమే. ఆర్ధికంగా నువ్వన్ని ఏర్పాట్లూ చేశావ్. ఇప్పట్లో మనం దేనికీ వెతుక్కోనవసరం లేనంత పకడ్బందీగా ప్లాన్ చేశాం. అది కాదు నా బెంగ.
నా పిల్లలకి ఒక వెచ్చని స్పర్శ లేదని బెంగ. మన పిల్లల్ని మనంతగా ప్రేమించేవాళ్ళు లేరే అన్న నిరాశతో బెంగ. వాళ్ళకి మనమూ, స్కూలూ, కంప్యూటర్ గేమ్సూ, టీవీ చానెల్సూ కాకుండా ఇంకే ప్రేమానుభూతులూ వుండవేమో అని బెంగ. దిగులు. దిగులేస్తోంది శ్రీ! వాళ్ళకెప్పటికీ నువ్వూ నేనేనా? ఇంకెవ్వరితోనూ ఏ సంబంధ బాంధవ్యాలూ వొద్దా? వుండొద్దా? వాళ్ళు గుమ్మంలో కొచ్చారని తెలిసి, కన్నీళ్ళతో పరుగెత్తుకొచ్చే నా వాళ్ళెవరో నాకు పదే పదే గుర్తుకొస్తున్నారు శ్రీ. అలా వాళ్ళు తలపుకొచ్చినప్పుడల్లా గుండె గోదారౌతోంది. ‘వాళ్ళంటే?’ – అదిగో, అప్పుడే నీ కనుబొమలు ముడిపడిపోయాయి, కదూ. దయచేసి పాత జ్ఞాపకం తవ్వి తెచ్చుకోకు శ్రీ!
వాళ్ళంటే అమ్మా నాన్న. వాళ్ళంటే మా అత్తగారు మావగారు. వాళ్ళంటే మన పిల్లలకు బామ్మా తాతయ్యలు. వాళ్ళంటే ఆత్మీయులు, ప్రేమ మూర్తులు.
శ్రీ! ‘నువ్వేనా ఇలా మాట్లాడ్తున్నదీ’ అన్నట్టు చూడకు, ప్లీజ్. గతాని మనం మర్చిపోనీ. తవ్వుకుంటే ఏం మిగుల్తుంది చెప్పు గొయ్యి తప్ప. అదే, రేపటి కోసమని ఓ ప్రేమ విత్తనం నాటామే అనుకో, సంతోషాల సిరుల సౌఖ్యం కురవదూ? అందుకే మనం ఏం చేయాలా అని ఆలోచించాను. అందుకే ఈ ఉత్తరం ఇప్పుడిలా…
శ్రీ! మనం ఈ సంక్రాంతి కెక్కడికీ వెళ్ళొద్దు. ఏ రిసార్ట్సూ వొద్దు. ఏ అడవులకీ పోవొద్దు. కానీ, వూరెళ్దాం. మీ వూరెళ్దాం. కాదు మనింటికెళ్దాం. నువ్వూ, నేనూ, పిల్లలం అందరం కల్సి పది రోజులపాటు మన వూరెళ్ళి వుండొద్దాం. చెప్పకుండా వెళ్దాం, సర్‌ప్రైజ్ చేద్దాం. ఏం?!