మంచు

నాతో పాటు బస్సు దిగిన వారందరూ చకచకా తలో దిక్కుకీ వెళ్ళిపోయారు. నేను మాత్రం చేతిలో నా లెదర్ డఫెల్‌తో ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాను. నవంబరు చలిగాలి రివ్వున వీస్తోంది. టైం చూస్తే ఏడే అయ్యింది గానీ కొండప్రాంతం కావడంతో ఏ తొమ్మిదో అయినట్టుంది ఆ వాతావరణం. అసలు బస్సు సాయంత్రం నాలుగున్నరకే రావాలి. హెయిర్‌పిన్ బెండ్ల ఘాట్‌రోడ్డు ఎక్కలేక ఎక్కలేక ఎక్కబోయిన బస్సు. మధ్యలో మంచెరాప దగ్గర ట్రబులివ్వడంతో మరో బస్సు ఎక్కించి పంపించారు. అలవాటు లేని ఆరుగంటల బస్సు ప్రయాణం. తలనొప్పి. అలసట. అనుభవాలు నిండిన నలభైలు అలసటని వెక్కిరించే వయసు కాదు. ఒక పక్క చలి వణికించెస్తోంది. నా స్కాచ్ ఫ్లాస్క్ తెచ్చుకోనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. కొద్దిదూరంలో ఒక టీ బండిని చూసి అటువైపు నడిచాను, కనీసం టీ అయినా తాగుదామని.

“ఓ టీ ఇవ్వయ్యా.” పాత స్వెట్టరు వేసుకున్న టీ బండి ఆసామి తన మఫ్లరు తలూపాడు.

పక్కనే టీలు తాగుతూ మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు నా వైపు ఒక్కసారి చూసి తిరిగి మళ్ళీ వాళ్ళ మాటల్లో పడ్డారు. ఆకాశ దీపాల మధ్య చీకటి అగాధంలోకి చూస్తూ టీ తాగడం మొదలెట్టాను. రోడ్డు మీద జనసంచారమే లేదు. ఆ ఇద్దరి వైపూ చూశాను. ఒక్కాయనే మాట్లాడుతున్నాడు. రెండో అతను కేవలం వింటున్నాడు.

“మీకు లేటవుతుందేమో. నేను బయలుదేరతాను మాష్టారూ,” టీ కప్పు బండి మీద పెడుతూ అన్నాడు ఆ లావుపాటాయన.

రెండో వ్యక్తి జేబులోంచి చిల్లర తీసి “ఇంద మల్లేశూ,” అంటూండగానే ఆ లావుగా ఉన్నాయన చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న ఆయన వైపు నవ్వుకుంటూ చూసి మల్లేశు, “సారుకి మా చెడ్డ బయమండి!” అని టీ కెటిల్ కింది నీలి మంట వెలుగులో చిల్లర లెక్కపెట్టుకుని గోనెకింద పెట్టుకున్నాడు.

“ఊరికి కొత్తోరిలా ఉన్నారు. బాబుగారు ఎవరింటికెళ్ళాలండీ?”

“దగ్గర్లో ఏవైనా మంచి గెస్ట్‌హౌస్ గాని, హోటల్ గాని దొరుకుతాయా?”

“హోటళ్ళేమీ లేవండీ. ఫారెస్టు డిపార్టుమెంటు గెస్టు హౌసుంది గానీ, ఆఫీసు అయిదింటికే మూసేస్తారు.” మొదటిసారిగా మాట్లాడాడు ఆ రెండో అతను.

“బస్సు ట్రబులిచ్చింది. అందుకే లేటయిపోయింది.” తప్పు నాది కాదు కదా సంజాయిషీ చెప్పడానికి.

“మీకభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి.” పాతికేళ్ళుంటాయేమో సన్నగా పొడుగ్గా ఉన్నాడు.

“అభ్యంతరం ఏమీ లేదు గానీ, మీ ఫ్యామిలీకి ఏమైనా…” ఆ రాత్రంతా అక్కడే గడపాలేమో అన్న భయం నన్ను ఒదిలిపెట్టలేదు.

అతను చిరునవ్వు నవ్వి పదండి అన్నట్టు సైగ చేస్తూ ముందుకి నడిచాడు. మల్లేశుకి డబ్బులిచ్చేసి అతణ్ణి అనుసరించాను. ఇద్దరం నడుస్తున్నాం.

“ఒక చిన్న విషయం…”

చెప్పండి అన్నట్టుగా చూశాడు.

“నేనెవర్ని, ఎక్కడ నుండి? ఎందుకొచ్చాను? ఇలా నా గురించి ప్రశ్నలడగకండి”

చిన్నగా నవ్వి సరే అన్నట్టు తలూపాడు. కాసేపు మౌనంగా నడిచాం.

“మీ పేరేమిటి? ఏం చేస్తుంటారు?”

“నా పేరు దామోదర్. ఇక్కడ ‘మాబడి’లో టీచర్ పని చేస్తున్నాను.”

“టీచర్ గానా? ఎక్రెడిటేడ్ స్కూలేనా?”

కాదన్నట్టుగా తల ఊపాడు.

సాయంత్రం వాన పడిందేమో రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. దాటుతున్న వీధి దీపాలనుంచి మా నీడలు పొడుగ్గా పరుచుకుంటున్నాయి. నిమిష నిమిషానికీ నాకు చలి పెరిగిపోతోంది. ఒక వీధి దీపం దగ్గర అతణ్ణి ఆగమని ఆ వెలుతురులో డఫెల్ మోకాలి మీద పెట్టుకుని అందులోనించి నా కాష్మీరీ షాల్ తీశాను. చలి ఉంటుందని తెలుసు గానీ మరీ ఇంత చలి ఉంటుందని అనుకోలేదు.

“మీకు చలి వెయ్యట్లేదా?”

చిరునవ్వే సమాధానం. ఒక దగ్గర మెయిన్ రోడ్డు మీంచి మలుపు తిరిగాం. వీధి దీపాలు కూడా లేని సందు. అతను టార్చి వేశాడు. ఆ సన్నని కాంతిపుంజం ఆ దట్టమైన చీకట్లో ఒక వెలుగు సొరంగం తవ్వుతున్నట్టుగా వ్యాపించింది. గడ్డి మధ్యలో చిన్న కాలిబాట. చుట్టూ కీచురాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. చీకటి, నిశ్శబ్దం ఇంత దట్టంగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ చీకట్లో ఒక మనిషి దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే అతణ్ణి అనుసరించడం కొత్తగా ఉంది. మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. వెంటనే ఇతను నన్ను ఎక్కడకి తీసుకెళ్తున్నాడోనని మనసులో ఏ మూలో అనుమానం కలిగింది కానీ మహా అయితే ఏమౌతుందిలే అనుకున్నాను. కాలిబాట గుట్టపైకి ఉన్నట్టుంది. ఎక్కలేక అంత చలిలోనూ చెమట్లు పడుతున్నాయి. కాళ్ళు పీకుతున్నాయి.

“ఇంకా ఎంత దూరం?”

“వచ్చేశాం.”

గుట్ట ఎక్కాక మెరక ప్రదేశం వచ్చింది. కాస్త దూరంలో తాళం కప్ప మీదకి టార్చి వేసి చూపించాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాం. స్విచ్చి వేశాడు. లైటు వెలగలేదు. ‘కరెంటు పోయింది,’ అన్నాడు ఏ భావమూ లేకుండా. కరెంటు ఉంటేనే ఆశ్చర్య పడాలేమో ఆ కొండ పల్లెలో అనుకున్నాను. అతను లాంతరు వెలిగించాడు. ఒకటే గది. చిన్న వంటిల్లు. అంతే. కూజా లోంచి మంచి నీళ్ళు వంపి గ్లాసుతో తెచ్చిచ్చాడు. ఆ నీళ్ళ చల్లదనానికి పళ్ళు జివ్వుమని లాగాయి. చలికాలం నీళ్ళకీ, గాలికీ కూడా కోరలు మొలుస్తాయేమో అనిపించింది.

“స్నానం చేస్తారా?”

“వేణ్ణీళ్ళున్నాయా?”

అతను నవ్వి, లుంగీ కట్టుకుని పెరటి తలుపు తీసి కర్రలపొయ్యి వెలిగించి మసిపట్టిన సిలవరి డేసాతో నీళ్ళు పెట్టాడు. నేను బట్టలు మార్చుకునేసరికి అతను కిరసనాయిలు స్టవ్వు మీద వంట మొదలుపెట్టాడు. నేను పెరట్లో పొయ్యి దగ్గరకి వెళ్ళి కూచున్నాను. ఎరుపు పసుపు రంగుల అద్భుత మిశ్రమ వర్ణంలో చీకటిని వధించడానికి నాట్యం చేస్తున్న అగ్నిశిఖల చుట్టూ చేతులు కాచుకుంటూ, ఆ నాట్యాన్ని అబ్బురంతో అలాగే చూస్తూ కూచున్నాను. ఎరుపు, పసుపు, నీలం, నలుపు… ఇవే నాకు కావాల్సిన రంగులు. నీళ్ళు కుతకుతా మరుగుతున్న చప్పుడు. నేను లేచి లోపలికి వెళ్ళబోతుంటే ఇనప బాల్చీతో అతనే వచ్చాడు. నీళ్ళు బకెట్లోకి తొరిపేసి, “అదిగో బాత్రూం. కొవ్వొత్తి పట్టుకెళ్ళండి. కొంచెం జాగ్రత్త. పాములు తిరుగుతుంటాయి,” అన్నాడు.

పాములు అనగానే నా వెన్నులో వణుకు పుట్టింది. వచ్చిన పని కాకుండా చస్తానేమో అనుకుంటూ బాత్రూంలోకి నడిచాను. అంచులకి దన్నుగా చెక్కలు దిగ్గొట్టిన రేకు తలుపు మూస్తుంటే గోడకి రాసుకుని భయంకరంగా శబ్దం చేసింది. కొవ్వొత్తి వెలుతురులో హడావిడిగా స్నానం చేశాను. చెంబుతో వేడివేడిగా నీళ్ళు పోసుకుంటుంటే ప్రాణం లేచొచ్చింది. నీళ్ళు ఒంటిమీద ఉన్నంతసేపే వెచ్చదనం. స్నానం ముగించి తువ్వాలుతో తుడుచుకోగానే మళ్ళీ చలి. వణుకుతూనే లుంగీ కట్టుకుని గబగబా గదిలోకి నడిచాను. వంట పూర్తి చేసి చాప వేసి రెండు పాత స్టీలు కంచాలు పెట్టాడు. మంచి నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా చేశాడు. వేడి వేడి అన్నం, బంగాళాదుంప వేపుడు, చారు. పొగలు పోయే ఆకలితో ఈ రాత్రి ఒక లాంతరు వెలుగులో, ఒక అపరిచితుడి ఇంట్లో నేను తిన్న భోజనం! నేను జీవితంలో తిరిగిన దేశాలు, తిన్న రకరకాల తిళ్ళు అతనితో చెబుతూ ఈ అనుభవాన్ని గుర్తు పెట్టుకుంటానన్నాను. మళ్ళీ చిన్నగా నవ్వు. భోజనాలు పూర్తి చేసి, కంచాలు బయటపడేసి లోపలికొచ్చేసరికి కరెంటొచ్చింది. ఆ వెలుగులో చూస్తే అటుపక్క ఇంకో గది తాళం వేసి ఉంది.

“అదేమిటి, ఆ గదికి అలా తాళం వేశారూ?”

అతను పరుపులు పట్టుకొస్తూ నా ప్రశ్న వినలేదో లేదూ కావాలని సమాధానం చెప్పలేదో కానీ జవాబివ్వలేదు. అసలే చిన్న ఇల్లు. ఉన్న రెండు అగ్గిపెట్టె గదుల్లోనూ ఒకటి ఎందుకూ వాడుకోకుండా తాళం వేయడం ఎందుకూ. ఆ గదిలో ఈ మనిషి రహస్యం ఏదో ఉంది. అదేమయ్యుంటుందో…

అతను ఇంతలో రెండు పరుపులు కింద పరిచాడు. అలసట, వేడి నీళ్ళ స్నానం, మంచి భోజనం, బయట చలి, వెచ్చని రగ్గులో నేను. జీవితాన్ని మథిస్తూ ప్రతిరాత్రీ ఒంటిగంట దాకా నిద్రపోలేని నేను ఐదు నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాను.