కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు

2012 మనం వద్దనుకున్నా వచ్చేసింది.

గత సంవత్సరం సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రపంచంలో రకరకాల ఒడిదుడుకులొచ్చాయి. కొత్త సంవత్సరం కొత్త యుద్ధాలు మొదలు పెట్టకుండా శాంతియుతంగా సాగుతుందని ఆశిద్దాం.

కొత్త సంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగత సంబంధమైన విషయమని, ఈ మాట పత్రికకి సంబంధించనిదనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు. అయినా, ఆయనెవరో ఏనాడో అన్నట్టు “నవ్వి పోతురుగాక నాకేటి సిగ్గు,” అని ఒద్దిక చేసుకొని, ఈ క్రింది తీర్మానాలు చేస్తున్నాం. మరో కారణం. కార్పరేషనులు కూడా వ్యక్తులే అని ఢంకా బజాయించి చెప్పుతున్న ప్రస్తుత పరిస్థితులలో, ఈ మాట పత్రికను కూడా ఒక వ్యక్తిగా అభివర్ణించడం సబబని మా అభిప్రాయం.

ఇవిగో వచ్చే ఏటికి వరసగా మా తీర్మానాలు (కావాలనుకుంటే ప్రతిజ్ఞలు అనండి):

1. నవనవలికలను ప్రోత్సహించడం.

పత్రికలు, సంస్థలూ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారా అన్నట్టు కథలకి బోలెడు పోటీలు పెట్టేస్తున్నారు; సంక్రాతి పండగ పోటీలు, సంవత్సరాది పండగ పోటీలు, దీపావళి పండగ పోటీలు, అని! రకరకాల కథాసంకలనాలు అచ్చవుతున్నాయి. ప్రాంతీయ రాజకీయాల ప్రాబల్యంతో మరిన్ని సంకలనాలు బయటికొస్తున్నాయి. మరొక వింత ఏమిటంటే, కొందరు సంకలనకర్తలు, సంవత్సరంలో వచ్చిన కథలన్నీ చదవడం దండగని నిర్థారించుకొని, అచ్చైన సంకలనాలలోంచి మరో సంకలనం ప్రచురించేస్తున్నారు. ఏతా వాతా, కథలకి బోలెడు డిమాండ్!

అయితే, ఒక్క విషయం చాలా బాధ కలిగించే విషయం. నవలలకి ఒకప్పుడున్న వైభవం ఇప్పుడు అంతరించింది. విక్రం సేథ్ లాంటివారు రాసే బరువైన నవలలకి తెలుగులో అసలు గిరాకీ లేదు. బృహన్నవలలు రాసే రచయితలు అసలు రాయడం మానుకున్నారు; పోతే, చదివే జనానికి ఓపిక కూడా లేదు. అందుకని, కొత్త సంవత్సరంలో ఈ మాట నవనవలికలకి ప్రోత్సాహం ఇవ్వడానికి నిశ్చయించడానికి నిశ్చయించింది. నవనవలిక అంటే ఈ మాట కూర్పులో నూరు పేజీలకి మించని నవల అని మా నిర్ధారణ. నూట ఒకటి కాదు. తొంభై తొమ్మిది కాదు. నూరంటే నూరే! ప్రతి రెండు నెలలకీ ఒక నవనవలిక ప్రచురిండానికి నిర్ణయించుకుందామని నిర్ణయించుకున్నాం. ఇది పోటీగా భావించి గూటిలో గొంగళిపురుగుల్లా సతమతమవుతున్న నవనవలికా రచయితలు (కథకు ఎక్కువ, నవలకు తక్కువైపోయి ఆదరణ లేక సొమ్మసిల్లిపోతున్న వర్గం) సీతాకోకచిలుకల్లా విజృంభించి (నూరుపేజీలకు మించని) నవనవలికలు పుంఖానుపుంఖాలుగా రాసి తత్సాహిత్యప్రక్రియకి జీవం పోయడానికి మా ప్రోత్సాహాన్నివ్వడం – ఇది మొదటి తీర్మానం.

2. నియమ కవిత్వానికి ఊతనివ్వడం.

కథల ధోరణిలోనే ఛందోరహిత కవిత్వానికి కూడా విచ్చలవిడిగా పోటీలు పెడుతున్నారు. అంటే, ఏ నియమాలు లేని కవిత్వం, రాసినదాంట్లో కవిత్వం ఉండాలనే నియమం కూడా లేని కవితల పోటీలు పెడుతున్నారు. ఈ సందర్భంలో ఒక తెలుగు పత్రికాధిపతి నాతో ప్రైవేటుగా చెప్పిన విషయం మీతో మనవి చేసుకుంటున్నాను: ఒక తూరి కవితల పోటీకి సుమారు ఏడువందల కవితలు వచ్చాయని! కథల పోటీకి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పైచిలుకు కథలు వచ్చాయని! కొన్ని సంవత్సరాలపాటు, సంపాదకుడిగా తను, “అయ్యా! అమ్మా! మా పత్రికకి మీరు దయచేసి రాయండి,” అని బ్రతిమలాడుకోవలసిన అవసరం లేదని!

పైగా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కవులు తమతమ కవితాసంకలనాలు పోటీపడ్డట్టుగా ప్రచురించేసుకుంటున్నారు. ముందుమాటలు, వెనక మాటలు రాయించేసుకుంటున్నారు కూడాను! కొన్ని సంకలనాల్లో కవితలు పది పేజీలూ, ముందుమాట ముప్ఫై పేజీలూనూ. అంటే, కవితా సంకలనాలకి తోడు, ఈ ముందుమాటలకి, వెనక మాటలకీ కూడా డిమాండు బాగా పెరిగి పోయింది.

అందువల్ల చందోబద్ధ కవిత్వ రచనకి, అంటే అన్నీ నియమాలే ఉన్న కవితల పోటీలకి ప్రోత్సాహం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రాను రాను ఈ ప్రాచీన సాహిత్య ప్రక్రియ నశించిపోయే దుస్థితికి వచ్చింది. ఎక్కడో ఒకరో ఇద్దరో మహా అయితే ముగ్గురో ఈ ప్రక్రియపై ఇంటర్నెట్‌లో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ప్రక్రియకి ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహించితే, ఇది జీవం పుంజుకుంటుందని మా అభిప్రాయం. ఇది ఎందుకు అవసరమో ఆలోచించండి. చందోబద్ధకవిత్వం రాయడం పూర్తిగా అంతరించి పోయిందనుకోండి. మనకున్న అలంకార గ్రంధాలన్నీ ఏం కావాలి? వాటిని ఏం చేసుకోవాలి? మళ్ళీ పాత చింతకాయపచ్చడేనా అన్నట్టు, పాత కావ్యాలనే అలంకార శాస్త్రపరంగా అలరించాలా? ఇది ఎంత దుర్భరమో ఆలోచించండి. అందుకని అన్నీ నియమాలే ఉన్న కవిత్వానికి వెన్ను దట్టడానికి వెన్ను విరుచుకోవాలని అనుకోవాలని మా రెండో తీర్మానం.

3. నిరంకుశ పీర్లను ప్రవేశపెట్టడం.

ఈ పై రెండు ప్రక్రియలకీ – నవనవలికలకి, చందోబద్ధకవితలకీ – ఈ మాట ప్రోత్సహించడమే కాదు; ఆనవాయితీగా తమదైన ‘పీర్ రివ్యూలు’ కూడా చేస్తుంది. పునశ్చరణ అయినా పీర్ రివ్యూల గురించి ఇక్కడ మళ్ళీ ముచ్చటించటం అవసరం. ఇదివరలో చాలామంది రచయితలు పీర్ల పేర్లు ప్రచురించమని అడిగారు; కామెంటేతర్లు, డిమాండ్ చేశారు; కొందరైతే ఆడిపోసుకున్నారు, మమ్మల్ని పాడిపోసుకున్నారు కూడాను! అందుకని, మీ రచన మాకు అందగానే, ముగ్గురు పీర్ల పేర్లు మీకు చెబితాము. కావాలంటే వాళ్ళ సీ. వీ. లు కూడా మీకు పంపుతాము. ఆ ముగ్గురిలో, మీకిష్టమైన పీరుని మీరు ఎంచుకోవచ్చు. లేదా పేరుపేరునా ముగ్గురినీ మీ పీర్లగా ఎంచుకోవచ్చు. అయితే, ఒకే ఒక షరతు. మీ రచనకి, ఆ పీర్లు చేసిన చేర్పులు, మార్పులు, ఏవైనా సరే, అవి ఎలాంటివైనా సరే – వాటికి మీరు కట్టుబడి ఉండాలి. అంతే. ఈ విషయంలో ఏవిధమైన తర్జనభర్జనలూ సహించం.

పీర్ల విషయం వచ్చింది కాబట్టి మరొక్క విషయం చెప్పాలి. ఈ మాటలో ప్రచురించబడ్డ కథలు, కవితలు, వ్యాసాలు ఆంధ్రదేశంలో అచ్చుపత్రికలలోను, తిరిగి పుస్తక రూపంలోనూ అచ్చు వేయించుకునే రచయితలు, ఈ మాట పీర్లు చేసిన మార్పులని తిరిగి మార్చివేసో, లేదా పూర్తిగా తీసివేసో ప్రచురించుకుంటున్నట్టుగా మాకు చూచాయగా తెలియవచ్చింది. ఇది ఎంతమాత్రమూ సహించరాని నైతిక నేరం. ఇక ముందు నుంచి, మీరు పంపే హామీ పత్రంలో అటువంటి మార్పులు ససేమిరా చెయ్యం అని సంతకం చేయాలి. అంతే!

ఈ మార్పులు మీకు నచ్చితే సరేసరి! ఒకవేళ నచ్చకపోతే రాబోయే అమెరికన్ ఎన్నికలలో నేను మా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మెంబరు పదవికై పోటీ చెయ్యనని హామీ ఇవ్వడానికి నిరాకరిస్తాను.

But, seriously…

ఈ మాట రచయితలకి, పాఠకులకీ, విమర్శకులకీ మా హృదయపూర్వక వందనాలు. మీ ప్రోత్సాహం, సహనం, విమర్శలూ లేకపోతే ఈ పత్రిక ఈ స్థాయిలో నిలబడి ఉండగలిగేది కాదు. ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రోత్సాహం ద్విగుణీకృతమవుతుందని ఆశిస్తున్నాను.