నా మాట

ఆరోజు, డిసెంబర్ 1, 1955.

మాంట్ గొమెరీ, అలబామా. నలభైరెండేళ్ళ ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనికత్తె అలిసిపోయి సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగి వెళ్ళేందుకు రోజూలాగానే సిటీ బస్సెక్కింది. చలికాలం మొదలయ్యింది.

ఆ రోజుల్లో చట్టం: తెల్లవాళ్ళకి బస్సు ముందు భాగంలో సీటు ఉన్నంతవరకూ నల్లవాళ్ళు, బస్సు మధ్య సీట్లలో కూర్చోవచ్చు. మామూలుగా నల్లవాళ్ళు బస్సు వెనక సీట్లలోనే కూర్చోవాలి. ముందు సీట్లు తెల్లవాళ్ళతో నిండిపోతే, కొత్తగా బస్సెక్కే తెల్లవాడికి, మధ్యసీట్లు ఖాళీ చెయ్యాలి. అంటే, నల్లవాళ్ళు లేచి వెనక సీట్లోకి పోవాలి. వెనకసీటు లేకపోతే, వెనక్కి పోయి నించోవాలి. దీనికి “జిమ్‌‌క్రో” చట్టం అని పేరు.

డిసెంబర్ ఒకటోతారీకున, ఇంకో ముగ్గురు నల్లవాళ్ళతో పాటు బస్సు మధ్య సీట్లో కూర్చుంది, రోజా పార్క్స్. కొన్ని స్టాపుల తర్వాత బస్సు ముందుభాగం తెల్లవాళ్ళతో నిండింది. తరువాతి మజిలీలో ఒక తెల్ల ఆసామీ బస్సెక్కాడు. వెంటనే బస్సు డ్రైవర్ నల్లవాళ్ళని లేచి వెనక్కి పొమ్మన్నాడు. ముగ్గురు లేచి వెనక్కి సర్దుకున్నారు. రోజా పార్క్స్ లేవలేదు. బస్సు డ్రైవరు ఆవిడని లెమ్మన్నాడు. ఆవిడ లేవనంది.

“నువ్వు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. నేను పోలీసులని పిలిచి నిన్ను అరెస్ట్ చేయించవలసి వస్తుంది,” అన్నాడు డ్రైవర్. అతని పేరు జేంస్ బ్లేక్. “సరే నీ ఇష్టం,” అంది రోజా పార్క్స్. తమాషా ఏమిటంతే, ఇదే డ్రైవర్, బ్లేక్, 1943 లో రోజా పార్క్స్ ని బస్సెక్కనియ్యలేదు. కారణం: అప్పట్లో నల్లవాళ్ళూ బస్సు ముందరినించి ఎక్కి, బస్సు టికెట్ డబ్బులు ఇచ్చి, బస్సు దిగి, వెనకనించి బస్సెక్కాలి. ఆ రోజు వర్షం కురుస్తోంది. రోజా పార్క్స్ తను మళ్ళి బస్సు దిగి వెనకనుంచి బస్సెక్కనన్నది. డ్రైవర్ ఆవిడని బస్సెక్కనియ్యలేదు. అది “చట్టవిరుద్ధం” కాబట్టి. ఆవిడ వర్షంలో తడుస్తూ ఇంటికెళ్ళీంది.

ఈ సారి బస్సు డ్రైవర్ బస్సు ఆపేసి ఇద్దరు పోలిసులని పిలిచాడు. ఒక పోలీసు అడిగాడు, “నువ్వెందుకు డ్రైవర్ చెప్పినట్టు వెనక్కి పోలేదు?” అని. ఆవిడ, “మీరు మా నల్లవాళ్ళని ఎందుకు ఇల్లా నీచంగా చూస్తారు?” అని అడిగింది. వెంటనే మరో పోలీసు, “ ఆ విషయం నాకు తెలియదు. చట్టం చట్టమే. నువ్వు చట్టం ధిక్కరించావు కాబట్టి, నిన్ను అరెస్ట్ చేస్తున్నా,” అని ఆవిడని పోలీసు స్టేషనుకి తీసుకోపోయాడు.

అది అమెరికా లో పౌరహక్కుల విప్లవానికి నాంది. నల్లవారికి, తెల్లవారికీ పౌరహక్కులలో సమానత్వం కోసం పోరాటం ప్రారంభమైన రోజు. ఆరోజు మొదలు మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో, నల్లవాళ్ళందరూ బస్సులు ఎక్కకండా 381 రోజులు సమ్మె చేశారు, మాంట్ గొమెరీ స్థానిక ప్రభుత్వం బస్సులు నడపలేక దివాలా తీసేంతపని అయ్యింది. ఎందుకంటే, నూటికి తొంభైపాళ్ళు సిటీ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు బీదవాళ్ళు – నల్లవాళ్ళే.

పార్క్స్ కి పది డాలర్ల జరిమాన, నాలుగు డాలర్ల కోర్టు ఖర్చులు, అనుఇ తీర్మానించాడు చిన్న జడ్జి. పై కోర్టుద్వారా ప్రతిఘటనకి చాలమంది పార్క్స్ స్నేహితులు, బంధువులూ సుముఖత చూపించలేదు. సరికద్ద, రోజాని భయపెట్టారు, తెల్లవాళ్ళు తనని చంపు తారని. పార్క్స్ భర్త రేమండ్ కూడా అభ్యంతరపెట్టాడు. మాంట్ గొమెరీ బస్సు చట్టం దేశ రాజ్యాంగానికి విరుద్ధం అని తీర్పుతెచ్చుకునేవరకూ రోజా పార్క్స్ విశ్రమించలేదనే చెప్పాలి. నవంబర్ 13, 1956న సుప్రీం కోర్ట్ మాంట్గొమెరీ బస్సుల్లో నల్ల – తెల్ల వివక్షత రాజ్యాంగానికి విరుద్ధం అని తీర్పుచెప్పింది.

1893 మే – జూన్ ప్రాంతం

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, బారిస్టర్ గా దక్షిన ఆఫ్రికా వచ్చి వారం పై చిలుకు అయి వుంటుంది. ఒక భారతీయ వ్యాపారస్తుడి తరఫున వకాలత్ తీసుకొని ప్రెటోరియా కోర్టు లో వాదించాలి. అందుకు దర్బాన్ నుంచి రైలు ప్రయాణం. మొదటి తరగతి టికెట్ కొనుక్కొని రైలెక్కాడు గాంధి. మారిట్జ్ బర్గ్ నాటాల్ రాష్ట్రానికి రాజధాని. రైలు అక్కడ ఆగింది. ఒక తెల్ల దొర గాంధీ ఉన్న మొదటి తరగతి రైలు పెట్టె ఎక్కాడు. అక్కడ నల్లతోలు గాంధీని ఎగా దిగా చూసి, బండి దిగి ఇద్దరు రైల్వే ఆఫీసర్లతో తిరిగి వచ్చాడు. 

వాళ్ళు గాంధీని మూడవ తరగతి పెట్టె ఎక్క మన్నారు. గాంధీ తనదగ్గిర మొదటి తరగతి టికెట్ ఉన్నదన్నాడు. “నీకు మొదటి తరగతి టికెట్ ఉన్నా నువ్వు మూడవతరతిలోకే వెళ్ళాలి, వెళ్ళకపోతే, పోలీసులని పిలిచి గెంటిచవలసి వస్తుంది,” అన్నారు. “స్వచ్ఛందంగా, నామటుకు నేను ఈ మొదటితరగతి పెట్టె ఖాళీ చేసి వెళ్ళను. తరువాత మీ ఇష్టం,” అన్నాడు గాంధీ. ఆ ఆఫీసర్లు పోలిసుని పిలిచారు. వాడు గాంధీని మొదటితరగతి పెట్టె నుంచి బయటకి గెంటాడు. గాంధీ మూడవతరగతి పెట్టె ఎక్కడానికి నిరాకరించాడు. రైలు బండి మారిట్జ్బర్గ్ వదిలి వెళ్ళిపోయింది.

గాంధీ ఆరాత్రి చలిలో వణుకుతూ ప్లాట్ ఫారం మీద గడిపాడు. తరువాత గాంధీ దక్షిణ ఆఫ్రికాలో ఇరవై సంవత్సరాల పైచిలుకే వున్నాడు. ఆక్కడే, సహాయనిరాకరణోద్యమానికి పునాది పడింది. తరువాతి చరిత్ర భారతీయులు మరిచిపోయినా నాగరిక ప్రపంచం యవత్తూ కోడై ఇంకా కూస్తూనే వున్నది. మొరపెడుతూనేఉన్నది.

పౌరహక్కుల న్యాయం కోసం తుపాకులు అక్కరలేదు, తూటాలు అక్కరలేదు. విప్లవం విప్లవం అంటూ గొంతుచించుకొని అరవక్కరలేదు, అని బోధిస్తున్నాయి రోజా పార్క్స్, గాంధీల జీవితాలు. రోజా పార్క్స్ , గాంధీ, ఈ ఇద్దరూ అన్యాయాన్ని ప్రతిఘటించడం చట్టబద్ధంగా చేశారు. చట్టం మంచిది కానప్పుడు ఆ చట్టాన్ని మార్చడంకోసం శాంతియుతం గా “యుద్ధం” చేశారు. వాళ్ళ ధైర్యం, నైతిక బలం ప్రశంశనీయం.

రోజా పార్క్స్ ఆఖరి దశాబ్దపు జీవనం అంత “రోజీ” గా గడవలేదు. ఆఖరిరోజుల్లో ఆవిడ ఇంటి అద్దెకూడా ఇవ్వలేకపోయింది. రోజా పార్క్స్ అక్టొబరు 24, 2005 న చనిపోయింది. ఆమెకి తొంభైరెండు ఏళ్ళు. ఈ రోజున నల్లవాళ్ళు నిటారుగా నిలబడడానికి, రోజా పార్క్స్ ఆ రోజున నీచమైన పాడు చట్టాన్ని ప్రతిఘటించి బస్సులో కూర్చో వడమే కారణం.

అభివాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు