రచయితలకు నమస్కారం.
ఇటీవల సమావేశాల్లోనూ, ఇతరత్రా మాటల్లోనూ రచయితలు ఎదురుకుంటున్న ముఖ్యసమస్యలలో ఒకటి, తమ పుస్తకాలను పదిమందికీ చేరవేయలేక పోవడమని స్పష్టమయింది. ప్రస్తుతం తెలుగు సాహిత్యావరణంలో మనకంటూ ఒక పటిష్టమైన ప్రచురణ, పంపిణీ వ్యవస్థ లేదు. విమర్శ, చర్చ అనేవి దాదాపుగా కనుమరుగైనాయి. ఈ సమయంలో తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.
- రచయితలు, కవులు వీలైనంతవరకూ తమ పుస్తకాన్ని ఎలక్ట్రానిక్ మీడియాగా, సంపాదకుల మెయిల్ ఐడీకి మాత్రమే పంపాలి. మెయిల్ సబ్జక్ట్లో స్పష్టంగా “ఈమాటలో పుస్తక పరిచయం కోసం” అని రాయాలి.
- వారు పంపిన ఈ-కాపీ కేవలం సంపాదకులమైన మేము మాత్రమే చూస్తాం, చదువుతాం తప్ప ఆ ఈ-కాపీ వేరెవరికీ (రచయిత లిఖిత పూర్వక అనుమతి లేకుండా) చూపించమని, ఇంకెవరికీ పంచమని మా బేషరతు హామీ.
- కేవలం అచ్చులో ప్రతి మాత్రమే అందుబాటులో ఉన్న రచయితలు మమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే వారికి పోస్ట్ ద్వారా మాకు పంపడానికి చిరునామా ఇవ్వగలం.
- ప్రచురణ సంస్థ, ధర, దొరికే చోట్ల వివరాలు తప్పకుండా పుస్తకంతో పాటు జతచేయాలి.
- మాకు పంపిన ప్రతీ పుస్తకానికీ ఒక సంక్షిప్తమైన పరిచయం రాసి పత్రికలో ప్రచురిస్తాం, అలాగే ఈమాట ఫేస్బుక్ పేజీలోనూ ప్రకటిస్తాం.
- సంపాదకుల నిర్ణయం మేరకు అర్హమైనవి అనుకున్న పుస్తకాలకు మాత్రమే, అదీ మా వీలును, విమర్శకులు కేటాయించగల సమయాన్ని బట్టి, పైన పేర్కొన్న సంక్షిప్త పరిచయం కాక, వివరంగా నిష్పక్షపాతంగా సమీక్ష రాయించే ప్రయత్నమూ చేస్తాం. ఇది మా నిర్ణయం, వెసులుబాటు మేరకే అని, ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదని ముందుగానే మనవి చేస్తున్నాం.
మీ పుస్తకాలు పదిమందికీ పరిచయం అవడానికి ఈ వేదికను వినియోగించుకొమ్మని స్వాగతం పలుకుతూ…
ఈమాట సంపాదకులు.