2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి బ్రౌన్ పురస్కారం

J.P.L గ్విన్ నిఘంటు నిర్మాణంలో పాలుపంచుకుని సహసంపాదకత్వం నెరిపినందుకు గాను జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. శాస్త్రి గారు భాషాశాస్త్రంలో లండన్ యూనివర్సిటి నుండి Ph.D పట్టభద్రులు. ఆయన అనువాదం,నిఘంటు నిర్మాణాల్లో అవిరళ కృషి, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాయాల్లో బోధన,పరిశోధన. మలయాళ భాషనుండి అనువాదాలు చేశారు. భాషేతరులకు తెలుగు బోధన నిమిత్తం వాచకాలు నిర్మించారు.

అనువాదం పరిశోధన నిఘంటునిర్మాణాల్లో తెలుగుజాతికి ఎనలేని సేవలు చేసిన C.P బ్రౌన్ స్మృత్యర్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశాము. గత ఏడాది ఉత్తమ అనువాదానికి గాను డి. కేశవరావు (Tree,My Guru) కు ఈ పురస్కారం లభించింది. C.P. బ్రౌన్ పండిత పురస్కారం (పదివేలా నూటా పదహార్లు) నవంబర్ 24న హైదరాబాద్ లో జరిగే సంస్మరణ సభలో బహూకరిస్తాము.


పి. మోహన్ కు ఇస్మాయిల్ అవార్డు

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట” ఎంపికైంది. హైదరాబాద్ లో నవంబర్ 25న జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో అవార్డును బహూకరించడం జరుగుతుంది. కవిత్వంలో నిజాయితీ, అద్భుతమైన ఊహాశాలీనత, భావగతులను ఘనీభవింపజేసే భాషాశక్తి ఇతణ్ణి నేటికాలపు కవులనుండి ఎడంగా నిలబెడతాయి.

గతంలో ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు: పాలపర్తి ఇంద్రాణి(2005), గోపిరెడ్డి రామకృష్ణా రావు(2006), గరికపాటి పవన్‌కుమార్(2007).

ఇస్మాయిల్ అవార్డ్ (పదివేలా నూటా పదహార్లు) నవంబర్ 24న హైదరాబాద్ లో జరిగే సంస్మరణ సభలో బహూకరిస్తాము.


మోహన్ కవితా ఖండికలు

ఈ కవితల నేపథ్యం కవి జైలు జీవితం; అక్కడ అనుభవించిన చిత్రహింసలు. తెలుగులో చాలామంది కవుల్లా ఇతనిది అరువు గొంతు కాదు. “అంతరాంతరాళాల్లోని పూల ఆనవాలు” తెలిసినవాడీ కవి. ఇతనిది ధారాళమైన కవిత్వం. ఇతని కవిత్వం గురించి మరొక్క సారి పూర్తి వ్యాసంలో ముచ్చటించుకొందాం. మచ్చుకి నేను కొన్ని భాగాలు మాత్రం ఉటకించాను; పూర్తి కవితల కోసం “కిటికీ పిట్ట” తెరవండి.

1.ఒకటికి ఒకటి

..పెరిగిన చేతి గోళ్ళు
గడచిన నిర్బంధ దినాలకు గుర్తుగా
గోడలపై చిత్తరవులేవో చెక్కుతూ
గుహ చుట్టూ క్రూరమృగాలు ముసిరిన వేళ
దుఃఖిత ఆదిమానవుని
నెత్తుటిగోళ్ళ చిత్రలిపి!

సూర్య కిరణం
చంద్ర శీతలం
మృగ్యమైపోయిన
పదమూడు కన్నీటి రేయింబవళ్ళ
బరువు బరువు పలవరింత

నాకే హిమసమూహాలు అక్కర్లేదు
ఏ పూలవనాల కోయిలపాటలు అక్కర్లేదు
మీ కట్టెదుటే
కాసేపలా నిల్చునో,కూచునో
పొడిబారిన పగళ్ళనో
నక్షత్ర సహితమో నక్షత్ర రహితమో అయిన
నిరామయ చలిరాత్రులనో
చూస్తూ ఊరకే అలా కేవలం శ్వాసిస్తాను.
ఒకటి పక్కన ఒకటి
ఇలాంటి చోట బహు దుఃఖమైనది..

2.శోధన

..కూడదీసుకో దేహచలనమా,
కూడదీసుకో నీ సమస్త ప్రాణకణాల సంస్పందనలను!
వ్యక్తావ్యక్త పదపరిభ్రమణాల్లోంచే
కొనవూపిరి జీవితపు కొట్టుకులాటలోంచే
రాలిపడిన బతుకు పూరెక్కల కుప్పలోంచే
కూడదీసుకో నీ సమస్త నాడీగత పురాశ్వాసనలను

గబ్బిలాలు ముసిరిన వైరాగ్యపు భీతిలోంచే
విచ్చిపోయే కలల కుండల చప్పుడులోంచే

నీ వంతుకు నీవే
నీ వంతకు నీవే

అల్లెతాడుకు విల్లు కర్రకూ మధ్య
బిర్రబిగిసిన బాణపు ప్రతిచర్యలా
కూడదీసుకో దేహచలనమా
కూడదీసుకో…”



రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...