పుస్తకం ఎలా చదవాలి ?

ఆంగ్లమూలం జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ
నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా దుకాణాల్లో జర్మన్‌తత్వవేత్త పుస్తకాలు! అనంతంప్రచురణ రంగం బాగా పసిగట్ట గల అంశమే, ఎందుకంటే అది కీర్తిశేషుడైన ఒక రచయిత అస్తిత్వాన్ని అతని పరిమితులను మించి పొడిగిస్తుంది కనుక. మనమనుకొనే తెంపులేని భవిష్యత్తును బ్రతికున్న రచయిత కళ్ళముందుంచుతుంది.

మొత్తానికి, పుస్తకాలు మనకన్నా తక్కువ పరిమితమైనవి.వాటిలో అన్నిటికన్నా చెత్త అనుకొన్నది కూడా రచయితను మించి బ్రతుకుతుంది.ముఖ్యకారణం దాని రచయిత కన్నా అది ఆక్రమించే స్థలం చాలా తక్కువ.పిడికెడు మట్టిగా మారిన రచయిత కన్నా, అరల్లో మట్టిగొట్టుకు పోయి,ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. మిగిలిన బంధుమిత్రుల జ్ఞాపకాల(అంతగా ఆధారపడలేము) కన్నా ఈ తరహా భవిష్యత్‌చాలా నయం.ఈ తరహా మరణాంతర దృష్టి కవి కలాన్ని కదిపే శక్తి. నలు చదరంగా ఉన్న వీటిని అటూఇటూ తిప్పుతాం మన చేతులతోచిన్నవి ,పెద్దవి , మరీ పెద్దవిఅస్థి శకలాలను కదుపుతున్నాము అనుకోవడం లో తప్పేమి లేదు. ఒకపుస్తకం నవల,తత్వ గ్రంథం,కవితాసంకలనం,ఆత్మకథ,రోమాంచకిఏదైనా సరే చివరికి అది మనిషి ఏకైక జీవితమే;మంచో,చెడో , కానీ ఎప్పుడూ పరిమితమే. తత్వ వివేచన మృత్యుసమక్షంలో మనిషిచేసే పని అని ఎవరన్నారో అది అక్షరాలా నిజం.

రచిస్తూ ఎవడూ యువకుడు కాలేడు. అలాగే,చదవడం వల్ల ఎవడూ యువకుడు కాలేడు.అదిలా ఉండబట్టే మనమందరం మంచి పుస్తకాలు చదవడానికి సహజంగా అంత ప్రాధాన్యతనిస్తాం.సాహిత్యం లోనే కాదు ఎందులోనూ,మంచి అన్నది సొంతంగా నిలబడేది కాదు.చెడు నుండి విడదీస్తూ మనం దాన్ని నిర్వచిస్తాము.ఒక మంచి పుస్తకాన్ని రాయడానికి రచయిత నానా చెత్తంతా చదవాల్సి వుంటుంది.లేని పక్షంలో ఇదమిత్థమని తేల్చుకోలేడు.ఈ రకంగా చెడు సాహిత్యానికి కూడా చివరికి ఒక విధమైన సమర్థన దొరుకుతుంది.

మనమందరం చనిపోతాము కాబట్టి,పుస్తకాలు చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, మనమేదైనా ఒక ఉపాయం కనుక్కోవాలిమన సమయం ఆదా చేసుకోవడానికి. లావాటి నవలనొకదాన్ని ముందేసుకొని,హాయిగా పేజీలు తిరగేస్తూ పోవడంలో ఆనందం ఉంది,కాదనను.కానీ,అలా ఎక్కువ కాలం గడపలేము. చివరికి,ఏదో ఒకనాడు చదవడం చదవడంకోసమే కాకుండా ఏదోకొంత నేర్చుకొనడానికి చదువుతాము.కావున క్లుప్తత, సంక్షిప్తత,సమ్మేళనాల అవసరంఅన్ని రకాల మానవ యాతనను దేదీప్యమానంగా ప్రదర్శించడానికి ఇంకోలా చెప్పాలంటే ఒక అడ్డదారి అవసరం ఉంది.అటువంటి అడ్డదారి ఒకటి ఉందా?(ఉంది,దాని గురించి తర్వాత)అన్న మన అనుమాన ఫలంఅక్షర సముద్రాన్ని తరించడానికి ఒక దిక్శూచి అవసరం.

సమీక్షకుల పుణ్యమా అని సాహిత్య విమర్శ దిక్శూచి పాత్ర వహిస్తుంది,అయ్యో ఈ ముల్లు విపరీతంగా ఊగిసలాడుతుందే.ఒకరికేది దక్షిణమో మరొకరికి అది ఉత్తరం!తూర్పు పడమరల విషయంలో ఈ తతంగం మరీ దారుణం.సమీక్షకులతో వచ్చిన చిక్కల్లా (అధమ పక్షం) మూడు రకాలు.

1.వాడు దివాలకోరు కావచ్చు.అతనూ మనలాంటి అజ్ఞానే కావచ్చు.

2.కొన్ని రకాల రచనల పట్ల పక్షపాతం ఉండవచ్చు;లేదా ముద్రాపకుల కోసం పనిచేస్తూ ఉండవచ్చు.

3.అతడు గొప్ప రచయితే ఐతే(బోర్జెస్‌లా)తన సమీక్షనే గొప్ప కళాఖండంలా మలచవచ్చు.ఆ సమీక్షలో పడిపోయి మనం మూలాన్ని వదిలేయవచ్చు.

ఏది ఏమైనా ,ముంచుతుందో ,తేలుస్తుందో తెలియని ఒక దుంగను అంటిపెట్టుకొని,నీవు సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంటావు.అన్ని దిక్కులా పుటలు తిరగేస్తున్న సవ్వడి. దీనికి ఒక ప్రత్యామ్నాయం , నీ సొంత అభిరుచిని నీవు పెంపొందించుకోవడం ,నీ దిక్శూచిని నీవు తయారు చేసుకోవడం.బాగా ప్రకాశించే, మిణుకుమిణుకుమనే, కొన్ని తారలతో,నక్షత్ర మండలాలతో పరిచయాన్ని పెంచుకోవడం.కానీ ఇవన్నీ చేయడానికి లెక్కకుమిక్కిలి ఎక్కువ కాలం పట్టవచ్చు.ఈ లోపు తలనెరిసి ముసిలి వాడవైన తర్వాత కూడాఏదో పుస్తకం చేబూని..రోజులు లెక్క బెట్టుకొంటూ ఉండవచ్చు.పోతే, మరో మార్గాంతరం ఇందాక అనుకొన్నట్టుగానే.. ఎవరో ఒకరి మాటను నమ్మడం స్నేహితుడి సలహా,నీవు బాగా ఇష్టపడే పుస్తకంలోనీ ఒక ఉట్టంకింపుఏ రకంగా వ్యవస్థీకృతం కాకున్నా,ఈ తరహా పద్ధతులు మనం బాల్యం నుండి అలవాటు పడినవే. కానీ,దీన్ని నమ్ముకోలేం.కారణం సాహిత్య సముద్ర మట్టం దినదినం పెరిగిపోతూ ఉండటమే.(ఈ పుస్తక ప్రదర్శన దీనికి నిరూపణ;ఇది మరో పెను ఉప్పెన సుమా!) మరి ఎక్కడ కాలు మోపడానికి గట్టినేల?అది నివాస యోగ్యం కాని ద్వీపం అయినా సరే! నాలుగు మాటలు చెప్పదలిచాను.

నా సూచనసాహిత్యంలో ఉత్తమ అభిరుచిని ఏర్పరచుకోవడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గంమీకు తెలియచేసే ముందుగాఈ పరిష్కార మూలం గురించి..

అనగా ఏ గొప్పతనం లేని నా గురించిఅహంకారానికి లోనై కాదు,ఒక భావం విలువ అది జనించే సందర్భానికి సంబంధించి ఉంటుందని నమ్మడం వల్లనేనే ప్రచురణకర్తనైతే ,పుస్తకం అట్టమీద రచయిత వివరాలతో పాటు,ఆ రచన చేసేనాటికి ఖచ్చితంగా అతని వయసు ఎంతో ముద్రిస్తాను. వయసులో తమకన్న అంత చిన్న లేదా అంత పెద్ద రచయిత మాటలను పట్టించుకోవాలా వద్దా అన్న విషయాన్ని పాఠకులే తేల్చుకొంటారు.

నేను చేయబోయే సూచన ఒక వర్గానికి(నేను తరం అన్న పదాన్ని వాడలేను, కారణం అది ఒక బరువునూ,ఐకమత్యాన్ని సూచిస్తుంది) చెందిన మనుషులకు చెందినది.వారికి సాహిత్యం సహస్ర నామాలతో సాక్షాత్కరిస్తుంది.అడవి మనిషి కూడా నాగరిక సమాజం లో వారిని ఎగాదిగా గమనిస్తాడు.వీరు సమూహాల్లో ఇబ్బందిగా కదులుతారు.పార్టీలో గానా బజానాలో వీరు పాలు పంచుకోరు.అక్రమ సంబంధాలకు తాత్విక ప్రాయశ్చిత్తాలను వెదుకుతారు.రాజకీయాల చర్చల్లో ఒక పట్టాన ఒప్పుకోరు.తమ గురించి చెడుప్రచారం చేసే వారిని మించి తమ్ము తాము ఈసడించుకొంటారు.గంజాయి,భంగు కాకున్నా పొగ,తాగుడుతో సరిపెట్టుకొంటారు. అటువంటివారు అప్పుడప్పుడు జైలుగదిలో తమ రక్తంలో తాము ఈదుతున్నట్టు లేదా వేదిక నెక్కి మాటాడుతున్నట్టు కనిపిస్తారు.వారు తిరగబడుతున్నది(సరిగ్గా చెప్పాలంటే నిరసిస్తున్నది)కేవలం అన్యాయానికి ప్రతిగా కాదు,ఏకంగా ప్రపంచమార్గం మీద!తమ ఆలోచనలు,భావాలు నిక్కచ్చి అన్న భ్రమలు వారికి ఏ కోశానా లేవు.క్షమించరాని ఆత్మాశ్రయత్వం మీదే ఆదినుండి వారి పట్టుదల.దాడికి గురి కాకుండా తమ్ము తాము కాపాడుకోవడానికి వారలా చేయడం లేదు.వారి భావాలు, వాటిని పదిలపరిచే స్థానాలు ఎంత తేలికగా దెబ్బ తినగలవో వారికి బాగా తెలుసు.డార్విన్‌సిద్ధాంతానికి వ్యతిరేకంగా దెబ్బతినడమే జీవలక్షణమని వారు భావిస్తారు.ఐతే ఒక విషయం ఆత్మపీడనకు ,దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇటీవలి కాలంలో స్వతంత్ర ధోరణిలో రాసిన ప్రతిరచయితకి దీన్ని అంటగట్టడం ఒక ఆనవాయితి అయిపోయింది.కళలో మూసపోతను(cliche)అరికట్టే సాధనాలు తీవ్రమైన ఆత్మాశ్రయత్వం,దురభిప్రాయం,అమిత ఇష్టాలు అన్న వారి సహజాతానికి లేదా స్వతస్సిద్ధమైన ఎరుకకి సంబంధించినదిది.మూసధోరణికి(cliche)వ్యతిరేకతే కళను జీవితం నుండి వేరు పరుస్తుంది.

నేను చెప్పబోయే దాని నేపథ్యం మీకు కొంతవరకు తేటతెల్లమైందనుకొంటా, సరే చెప్పివేస్తాను.

సాహిత్యంలో ఉత్తమాభిరుచిని పెంపొందించే ఏకైక సాధనం కవిత్వం.కవినన్న పక్షపాతంతో,ఏదో ప్రయోజనాలనాశించి నేనిలా చెబుతున్నానని మీరనుకొంటే అది శుద్ధ తప్పు.అందునా,నాకు ఎటువంటి సంఘాలతో ప్రమేయం లేదు.

కవిత్వం మానవ అభివ్యక్తికి చరమ రూపం.కవిత్వం బహు క్లుప్తమే కాదు, మానవ అనుభవాన్ని వ్యక్తం చేసే సంక్షిప్త మార్గం.భాషాగత కార్యకలాపాలకు సాధ్యమైనంత ఉన్నత ప్రమాణాలను నిర్ణయిస్తుంది..ప్రత్యేకించి వ్రాతలో!

కవిత్వాన్ని పఠించేకొద్దీరాజకీయ,తాత్విక గ్రంథాలు,చరిత్ర,సామాజిక శాస్త్రాలు,నవలలుఎందులో కూడా శబ్దాడంబరాన్ని(verbosity)బొత్తిగా భరించలేరు.ఈ కవిత్వశబ్దాల్లోని(poetic diction)తీక్ష్ణమైన క్లుప్తత,వేగం,ఖచ్చితత్వాలకు లోబడే ఉంటుంది వచనం లో మంచి శైలి కూడా.మరణ శాసనానికి,పరమ సూక్తికి జన్మించిన కవిత భావింపదగిన ఏ విషయానికైనా బహు దగ్గరి దారి;గద్యానికి పద్యం క్రమశిక్షణ గరపుతుంది.ప్రతిపదం విలువ,పాదరసంలా జారిపోయే మానసిక గతులు, దీర్ఘపంక్తులకు మార్గాంతారం,అనవసర వివరాలను,తేలికగా అర్థమయే దాన్ని విసర్జించే ఒడుపు,ముగింపు శిల్పంగద్యానికి తెలిసివచ్చేలా చేసేది పద్యమే.. కవిత్వమే.సాధారణ రచనని,అపూర్వ కళని వేరుచేసే తాత్వికకాంక్షను గద్యంలో రగిలించేది కవిత్వమే.ఈ విషయంలో గద్యం,పద్యం కన్నా చాల మందమతి. దయచేసి,నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.నేను గద్యాన్ని కొట్టి పారేయడం లేదు. నిజానికి,పద్యం, గద్యం కన్నా బహు ప్రాచీనం.సాహిత్యం కవిత్వంతోనే మొదలయింది. గుహవాసి చిత్రించిన బొమ్మకన్నా,దిమ్మరి పాడిన పాట బాగా పురాతనమైనది.

వెనుకట,ఎప్పుడో నేను పోల్చినట్టు,గద్యం కాల్బలం,పద్యం వాయుసేన.పైవాటి ద్వారా నేను నిరూపించ దలచుకొన్నవి కవిత్వ అధికారశ్రేణి,అనాది మూలాలు అంతకన్నా కావు. ఆచరణీయమైన విషయాలు నాలుగు చెప్పి,అచ్చుపడిన ప్రతిపుస్తకాన్ని చదివే శ్రమకు లోను కాకుండా,మీ దృష్టిని,మెదడుని కాపాడే యత్నం. కవిత్వం ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే కనిపెట్టబడింది.కారణం అది క్లుప్తతకు పర్యాయపదం!కొన్ని సహస్రాబ్దాల ఈ ప్రక్రియను సూక్ష్మంగా సింహావలోకనం చేసుకోవాలి.నీవనుకొన్న దానికన్నా ఇది సులువే,పద్యం గద్యం కన్న తక్కువ బరువు కాబట్టి.కేవలం సమకాలీన సాహిత్యం మీదే దృష్టి నిలిపావా..ఇక నీ పని నల్లేరుపై బండినడక.ఓ రెండునెలలు శ్రద్ధగా నీ మాతృ భాషలో వచ్చిన కవుల రచనలను సంపాదించు,ముఖ్యంగా ఈ శతాబ్ది ఆదిగా.. ఓ డజను పుస్తకాలు సమకూరుతాయి! ఈ వేసవి ముగిసేసరికల్లా నీ ప్రయత్నానికి మంచి రూపు వస్తుంది.

కవిత్వపఠనం తర్వాత అలమరాలో అలవాటైన గద్యాన్ని తీసి అవతల గిరవాటేస్తావు. అది నీ తప్పు కాదు.నీవింకా వదలకుండా చదువుతున్నావంటే అది ఆ గద్య రచయిత ఘనత.మన అస్తిత్వానికి సంబంధించిన నిజాలను,కవుల్లాగే,అతనూ వెల్లడిస్తున్నాడు. ఇది ఆ గద్య రచన ఏ మాత్రం భారం కాదని నిరూపిస్తుంది.అంతేగాక అతని భాషలో జవజీవాలు పుష్కలంగా ఉన్నాయి.లేదా నీవు పఠన వ్యసనానికి గురయ్యావు.ఇతర వ్యసనాలతో పోలిస్తే ఇదేమంత చెడ్డదేమీ కాదు.

నన్నొక వ్యంగ్య చిత్రాన్ని(caricature) గీయనివ్వు.కారికేచర్లు అవసరమైన దాన్ని బలంగా ఎత్తి చూపుతాయి.నా కారికేచర్‌లో చదువరి రెండుచేతులా పుస్తకాలు.ఎడమ కవిత్వం,కుడి వచనం.దేన్ని ముందు పడవేస్తాడో చూద్దాం.అతని రెండు చేతుల్లో గద్యమే ఉండే అవకాశం లేకపోలేదు.కానీ అది అత్మ తిరస్కారానికి దారి తీస్తుంది.మీరు అడగవచ్చు మంచి,చెడు కవిత్వాలను ఎలా వేరు చేయాలి అని.అతని ఎడమ చేతిలో ఉన్నది చదవ దగ్గదే అనడానికి భరోసా ఏమిటి?అని. ఒకటి ఎడమ చేతిలో ఉన్నది,కుడిచేతిలో ఉన్నదాని కన్నా తేలిక అవడానికి ఎక్కువ అవకాశం.రెండు.కవిత్వం ఇటాలియన్‌కవి మొంటాలే చెప్పినట్టు అర్థ కళ!అందులో బుకాయింపుకు అవకాశాలు బొత్తిగా తక్కువ.మూడవ పంక్తి చదవగానే పాఠకుడికి తన ఎడమచేతిలో ఉన్నది ఏపాటి పుస్తకమో అర్థమై పోతుంది.కవిత్వం త్వరగా గ్రహింపు కొస్తుంది,దానిలోని భాషసౌష్టవం భావాన్ని ఇట్టే అందేలా చేస్తుంది.మూడు కవితా పంక్తులు తేరిపార చూశాక అతను కుడి చేతివైపు దృష్టి సారించవచ్చు.

ముందే చెప్పినట్లు ఇది కారికేచర్‌. మీకు తెలియకుండా మీరు ఇదే భంగిమలో నిలిచి పుస్తకాలు పరిశీలిస్తూ ఉండవచ్చు.వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన పుస్తకాలను ఎంచుకోండి.కుడి వేపు,ఎడమ వేపు మార్చి మార్చి చూడాల్సిరావడం మతిపోగొట్టే పనే, ఒప్పుకొంటాను.టూరిన్‌వీధుల్లో గుర్రబ్బండ్లు ఇప్పుడు లేవు.ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక బగ్గీ వాడు తన గుర్రాన్ని చర్నాకోలాతో బాదే దృశ్యం నిన్ను ఇబ్బంది పెట్టదు ఒకప్పటిలా. ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్న అన్ని పుస్తకాల్లోని అక్షరాలను మించి పెరిగే ఈ గుంపులకు , ఒక వందేళ్ళ తర్వాత ఎవరి పిచ్చి ,అంతగా పట్టక పోవచ్చు.సరే,నేను ఇందాక చెప్పిన చిట్కా ను నీవు అమలులో పెట్టు.

(ట్యూరిన్‌,ఇటలీ లో తొలిపుస్తక ప్రదర్శన(మే,1988) సందర్భంగా బ్రాడ్‌స్కీ చేసిన ప్రసంగం)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...