2009 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

J.K.మోహన రావు గారికి C.P బ్రౌన్ పురస్కారం.

ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ సంవత్సరం బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని ఎంపిక చేశాము.వీరి ఛందశ్శాస్త్ర పరిశోధనా ఫలం ఆదికవుల్లో ఒక్కడైన నన్నెచోడుని కాలనిర్ణయం ఎన్నదగినది.వీరి ఛందశ్శాస్త్ర వ్యాసాలను సంకలించి దేశిబుక్స్ తరపున ప్రచురించి బహుళ ప్రచారం కల్పించడం జరుగుతుంది. “విద్యల లోపల నుత్తమ విద్య కవిత్వంబు, మఱి కవిత్వము ఛందోవేద్యము గావున” వీరి స్ఫూర్తితో కొడిగడుతున్న ఛందః దీపాన్ని ఆరిపోనీకుండా-ఆ వెలుగుల్లో ప్రాచీన సాహిత్యాన్ని మరింత లోతుగా చదివి ప్రయోజనాన్ని పొంది కవిత్వ పటుత్వ మహత్వ సంపదలను రాశులు పోయడానికి మనకవులు నడుం బిగిస్తే అంతకన్నా కావలసినదేముంది? బ్రౌన్ ఛందశ్శాస్త్రంలో సలిపిన కృషి అతనికి గొప్పపేరు తెచ్చి పెట్టింది.చాలా మందికి బ్రౌన్ నిఘంటునిర్మాణంలో పడిన శ్రమ మాత్రమే తెలుసు. మొత్తానికి, బ్రౌన్ స్ఫూర్తి పురస్కారాన్ని ఛందస్సును ఊపిరిగా చేసుకున్న మోహనరావు గారికి అందించడం ఎంతో సబబు అని భావిస్తున్నాము.

జీవిత విశేషాలు: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు (విద్వత్కవిభూషణ వేదం వేంకటకృష్ణ శర్మ తెలుగు పాఠాలు చెప్పారు).తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు. వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem.


వైదేహి శశిధర్‌కి ఇస్మాయిల్ అవార్డు

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ కవితా సంకలనం “నిద్రిత నగరం” ఎంపికైంది. న్యూజెర్సీలో నవంబర్ 7న జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో అవార్డును బహూకరించడం జరుగుతుంది. అరుదైన భావుకతకు సరితూగే ఆలంకారిక శైలి ఈమెని నేటికాలపు కవులనుండి ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌లకు ఈ అవార్డ్ లభించింది.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...