రచయిత వివరాలు

పూర్తిపేరు: కాశి రాజు
ఇతరపేర్లు:
సొంత ఊరు: యాదాద్రి, భువనగిరి జిల్లా.
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014.

 

అంతా ప్రేమే
నువ్విచ్చినవన్నీ వద్దన్నందుకు
నా నిద్రమీద మంటేసి ఎండుచేపలు ఆరేసిన చీర కాల్చిన చప్పుడు గుండెల్లోకి తన్నుతున్నావు చూడూ అంతా అదంతా ప్రేమే.

సూరీడు మంచునీ
మంచు చెట్లనీ కప్పుకునుంటే
ఇంకా తెల్లారనట్టు మోసపోయాను.

పడవపువ్వుల్ని కుట్టుకుని
నది
ఇసకంచు చీర చుట్టేసుకుంది.

పెరిగిన గడ్డం, పెదాలకి అడ్డొచ్చే మీసం
పెద్దగా ఇబ్బంది పెట్టవు.
అంటుకున్న ఎంగిలి అద్దంలో చూసుకున్నాకయితే
ఒకప్పుడు చేత్తో తుడిచిన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి మరి?

ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.

పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.

ఉండబట్టలేకే ప్రవాహం.
తడిసిన మనుషులెవరూ
దుఃఖంలో ఎవరు మునిగారో తెలీరు.
నవ్వుతున్న ముఖాల్లో నీళ్ళూ కదలవు.

“సెక్సా అలా రాస్తున్నదంతా” అంటావు.
చదుతున్నారా అని కూడా అడుగుతావు నువ్వే.

నిద్ర తెలుస్తున్నా, సమయం చూడనంత
గాఢమైన ముడులు కునుకుకీ కట్టక
ఒంటిమీద ఉరేస్తాయి నన్ను,
నాలుగూ పదకొండు ఇక నిద్రపో అని నువ్వనే వరకూ.

తిండి, నిద్రా
రెండు శరీరాలనూ వెలేసుకుంటాయి
కోరికలు, సమీక్షలూ
ఇష్టాలు, ఇష్టమైన వాళ్ళు
అక్షరాలుగా మారిపోతారు.

కవిత్వం కూడదు మన ప్రేమలాగ.