వర్షాలు కురుస్తాయెలాగూ
మనసులోంచి మే నెల పోయాక
మబ్బులన్నీ మాట్లాడుకునీ చల్లబడీ.
కురిసిన కొద్దిసేపటికెలాగూ
వరదొస్తుంది.
ఉండబట్టలేకే ప్రవాహం.
తడిసిన మనుషుల్లో
దుఃఖంలో మునిగిందెవరో తెలీదు
నవ్వుతున్న ముఖాల్లో నీళ్ళూ కదలవు.
“సెక్సా అలా రాస్తున్నదంతా” అంటావు.
చదుతున్నారా అని కూడా అడుగుతావు నువ్వే.
తడిస్తే అది వానేనని తెలుసు
ఒళ్ళు తుడుచుకు బుకాయించడం
చిన్నపిల్లల ఏమెరగనితత్వం.
రూపం అరూపం
అనేదో నేను రాయబోతుంటే
రెండుగా చీల్చి
నేనూ రాయగలనంది.
శరీరం మనసూ అంటూ
గీయబోతుంటే
మనసూ, గాయమే
మనుషులవి అంది.
చిమ్మెట్లూ రాత్రిదే స్నేహం అంటే
అవి రెండేమీ కాదంది.
రమించిన వాణ్ని
రాత్రి అనీ
ప్రేమించిన వాణ్ని పగలు అనీ
శీర్షిక రాసి వెళ్ళిపోయింది.