4:11 AM

అరువు తెచ్చుకున్న నిర్వచనాలేవీ
నిన్నూ నన్నూ
ఒకరిగా నిలబెట్టలేవు.
రాస్తూ
దాచుకున్న తప్పులేవీ
మనల్ని కనీసం మళ్ళా కూడుకోమని చెప్పవు.

ఒళ్ళున్నప్పుడు
కోరికలుగా పుట్టి, బుద్ధున్నపుడు
తలపులుగా చలించి
రాత్రైనపుడు నిద్ర వెక్కిరిస్తున్నందుకే
మనలోంచి మనం వెలివేయబడి
కంచం నచ్చని ఇంట్లో, మంచం మెచ్చని కళ్ళను మొలిపించుకుంటాం.

తోడులేని ఏ నడకైనా అలుపేనని
నేనూ పాటలలో ఉన్న పాతకవిత్వం ఇపుడు నీకు చెప్పను.
నువ్వూ
నడిచిన దారి పాపమని సినిమాల్లో చూపినట్టు ఎప్పుడూ
నిర్ధారించేయకు.

అనుకుని చేసిన నిర్వచనాలన్నీ
నిజాలని కాదు.


చేసినదంతా కాదనకుండా
అర్ధరాత్రీ ఓ ముద్డొండి పెడతావు.
విసుక్కునే ముఖాన్నే కదా
ఇప్పుడు ముద్దూ పెట్టింది అంటావు.

ఐతే నచ్చానా అని అడుగుదాం అనుకునే ఆగిపోతాను.
“నిర్వచనాలు ఇరుమాంసాలవి
కనీసం కొద్దిసేపు మన మనసులు ఒకటి
మళ్ళీ కలిసినందుకు”
అని పాఠాన్ని ముగించి ప్రాణాన్ని మొదలుపెడతావు.

వింటాను, ముద్దవుతాను, ముద్ద తింటాను
కితకితలు వచ్చినందుకో, సంతోషం పట్టలేకో
కౌగిలినుండి తప్పుకుని
పాత మాటల్ని, తప్పుల్ని, దెప్పిపొడుపుల్నీ కడిగేసేంత గాఢంగా
పెదాల్ని ముడేస్తావు.

నిద్ర తెలుస్తున్నా, సమయం చూడనంత
గాఢమైన ముడులు కునుకుకీ కట్టక
ఒంటిమీద ఉరేస్తాయి నన్ను,
నాలుగూ పదకొండు ఇక నిద్రపో అని నువ్వనే వరకూ.

కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...