Insights

Weekend

నిద్రని అడిగాను.
కోప్పడనని సర్దుకున్నావు.

ఆకలనడిగితే
రోజంతా నవ్వావు.
మొక్కలకు నీళ్ళు పోసిన ఫోటోలు పెట్టావు.

పనుంది అన్నాను.
తర్వాత మాట్లాడతా అన్నావు.
నిద్ర, ఆకలి, పనీ కానీ నా రూపం ఒకటి నీ దగ్గర వదిలిపొమ్మన్నావు.

మాసిన చెమట
నచ్చుతుందని వదిలొచ్చాను.
వారం గడవడం
ఏడు జన్మల పాపం నాకు.

Draft

కోల్పోయింది ఎవర్ననీ
పొందింది ఏమిటనీ సమీక్షించుకుంటాము
ఇద్దరం ఏదో ఒకటి తింటూ.

నచ్చింది ఏమిటనీ
ఇచ్చేవాళ్ళు ఎవరనీ
ఒక్కొక్కరం మథనపడతాం ఇద్దరం ఒకేలాగ నిద్రనటిస్తూ

తిండి, నిద్రా
రెండు శరీరాలనూ వెలేసుకుంటాయి
కోరికలు, సమీక్షలూ
ఇష్టాలు, ఇష్టమైన వాళ్ళు
అక్షరాలుగా మారిపోతారు.

కవిత్వం కూడదు మన ప్రేమలాగ.

Insights

ఇష్టమని తెలీదు
ఎటు పోదామనుకున్నా
సమీప దూరంలోనే సమాధవుతావు

సుఖమని ఎరుగవు
జుట్టు వాసన చూసినందుకే నిద్రపోతావు

ప్రేమని చెప్తే మాత్రం
అన్నం వండినందుకేమో అనుకుంటావు

అక్షరమై ఆమెను రాసుకున్న
మూడుపూటలా నీ పుట్టుక ఆమె భిక్ష

Book mark

పొందిన తర్వాత నచ్చడం
ప్రేమే కదూ అనడిగాను.
బతకడం అనేసింది.

చూడకముందు కోరుకోవడం
ఇష్టం కదా అన్నాను.
చరిత్ర అంటారంది.

జీవితం?
అడిగాను.
పైవన్నీ అంది.


కాశి రాజు

రచయిత కాశి రాజు గురించి: పీజీ ఇన్ రూరల్ డెవలప్‍మెంట్, భూమధ్యరేఖ (కవిత్వం ), 2014. ...