చుట్టుకొలతీయం

‘‘హలో! హలో!! ఎవరు?’’

‘‘……….’’

‘‘ఓహో అన్నపూర్ణా, నువ్వా? స్టేట్స్‌ఎప్పుడొచ్చావ్‌ ?…మీ మనవడి దగ్గరకా..ఓ..! పెళ్ళయిందా వాడికి? చిన్నమ్మాయి బావుందా?’’

ఓ శనివారం పొద్దున్నే కాఫీ తాగుతూ, పేపరు చదువుదామనే ప్రయత్నంలో నేనున్న సమయంలో, చాలా సంబరంగా, గట్టిగా ఫోన్లో మా అమ్మ.

ఆవిడ సమాధానాల్ని బట్టి అవతల ఆవిడ ఎవరో ఈవిడికి చిన్నప్పట్నుంచీ తెలిసిన బంధువుగా నిర్ధారించుకున్నాను. మనవడు పిలిస్తే ఈ దేశానికి వచ్చి, మా అమ్మ ఎక్కడ వుంటోందో వాకబు చేసి, ఫోన్‌ చేసి కుశలం కనుక్కుంటోంది.

చుట్టుకొలతీయంహఠాత్తుగా మా అమ్మ ఫోన్‌లో,‘‘ఏవిటే నాలుగు భాగ్యాలా? నాలుగు ఆభరణాలా?’’ అంటూ ఆశ్చర్యపోతున్న గొంతుతో అంటోంది.‘‘ఇప్పుడేవిటే అవన్నీ? కాసుల పేరంటావా? నా కెప్పట్నుంచో వుందే. మా అబ్బాయి పదేళ్ళ క్రితమే చేయించాడు. అయినా వఢ్డాణం, వంకీలు, కంటే అవీ కావాలంటే కొనిచ్చేవాడే కాని, ఈ వయసులో అవన్నీ ఏమిటే నాకు? మరీ వేళాకోళానిక్కూడా కొంచెం హద్దుండాలి!’’ నవ్వుతో పాటు కొంత కోపం ధ్వనింపజేస్తూ అంది మా అమ్మ.

పేపరుపక్కన పడేసి, ఇంత పొద్దున్నే మా అమ్మకి ఫోన్‌ చేసి నగలగురించి అడుగుతున్నదెవరా అనుకుంటూ వేరే గదిలో ఉన్న రెండోఫోన్‌ తీసుకున్నాను.

‘‘ఈ ఆభరణాలన్నీ వచ్చేవి 50,60,70లు దాటాకనే కద! చుట్టుకొలత పెరిగిన కొలది వద్దన్నా అవే వస్తాయి. నా కప్పుడే వంకీలు, వఢ్డాణం వచ్చేసాయనుకో,’’ ఉడికిస్తున్నట్లుగా అవతలవైపు అన్నపూర్ణమ్మగారు!

అర్ధమైంది. ఈ అన్నపూర్ణమ్మ గారు మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. ఓ చిన్న జమీందారు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటినుంచే వంటిమీద ఓ మణుగు బంగారం ఉన్న మనిషి. ఓ సారి నా చిన్నతనంలో వాళ్ళ యింటికి పెళ్ళికి వెళ్ళినపుడు చూశాను. సూర్యుడు, చంద్రుడు, పెద్ద బంగారు జడ, మెడలో కాసులపేరు, వరహాలపేరు, ఇంకా ఇంకా ఏవో సత్తరకాయలపేర్లు, ఎన్నో ఎన్నెన్నో. వాటితో పాటు మెడకు హత్తుకుని కంటె, సరే నడుముకు వెడల్పుగా పచ్చలు, కెంపులు, వజ్రాలు పొదిగిన లక్ష్మిబిళ్ళతో వఢ్డాణం. ఆవిడని ఎరగని వారుండరు మా కుటుంబాల్లో.

ఓసారి మా చిన్న మేనమామ భార్య, ‘‘ఆవిడ్నిచూశారా! ఆవిడ నడుముకు ఉన్న వఢ్డాణాన్ని చూశారా!’’ అని వాళ్ళాయనతో అంటే, మా మావయ్య, ‘‘నేను జమీందారుని కాదోయి,’’ అనకుండా, ‘‘సరస్వతీ! నీకు ఓ కిలో బంగారం పెట్టి వఢ్డాణం చేయించాలనే వుందే! కానీ నీ చుట్టుకొలత ఇంకా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే వుంది కదా, అది ఆగాక చూద్దాం అని ఎదురుచూస్తున్నానోయ్‌. ఇప్పుడే చేయిస్తే రేప్పొద్దున్నే చిన్నదయ్‌పోవచ్చు!’’ అంటూ ఉడికించబోయాడు. మా చిన్నత్తేం తక్కువ తిందా! కోపం తెచ్చుకోకుండా, ‘‘అంత బెంగ అవసరం లేదులెండి! కంసాలివాణ్ణి కనుక్కున్నాను. ఎడ్చెస్టబుల్‌ వఢ్డాణమే చేస్తానన్నాడు మగవాళ్ళ బెల్టుల్లాగా. కొలత ఆ కన్నాలన్నీ దాటిపోయిందనుకోండి,అప్పటికి ఫాషన్‌ మార్చి వెనక ఓ బంగారు తాడు కట్టెయ్యచ్చు. ఇక మీరు కిలో బంగారంకోసం బజారుకు బయల్దేరడమే తరవాయి,’’ అని సవాలు చేసింది.

ఇదంతా వింటున్న మా అమ్మమ్మ, ‘‘స్వరణా! పెద్దయి బాగా చదువుకుని డబ్బులు సంపాదించుకుంటే నీ వఢ్డాణం నువ్వే కొనుక్కోవచ్చమ్మా! మీ తాతగారు బతికేవుంటే మీ కందరికీ ఎన్ని వఢ్డాణాలో,’ అని ఓ సారి అర్ధంతరంగా ఏనాడో ఈ లోకం వదిలి వెళ్ళిపోయిన మా లాయరు తాతగారిని తలుచుకుని కళ్ళు తుడిచేసుకుంది. ఇలాంటి సంభాషణలమధ్య పెరిగిన నాకు, ఇక్కడిప్పుడు తేలిన ఈ అన్నపూర్ణమ్మగారూ, అవిడ వఢ్డాణమూ పరిచయమే.

అంతే గాని ఆ రోజుల్లో చుట్టుకొలతలో వున్న ప్రమాదాల గురించిన స్పృహ వుండేదికాదు.

‘‘సీతాయీ, నా కెప్పట్నుంచో వున్న ఆభరణాల గురించి కాదే నే మాట్లాడేది. వంకీలు అంటే బ్లడ్‌ ప్రెషరు, కాసులపేరు అంటే గుండె జబ్బు, వఢ్డాణం అంటే షుగరుప్రోబ్లమూనే! ఈ వయసులో మనకి ప్రాప్తించే భాగ్యాలు ఇవేగా! నీకు ఎన్నివచ్చాయి అనడుగుతున్నాను,’’ అందావిడ నవ్వుతూ అవతలవైపు నించి.

‘‘అదా! పెద్ద జోకే వేశావ్‌!’’ అని మా అమ్మకూడా నవ్వేసింది.

***
ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పుడు విన్నప్పుడు అన్ని సూక్తుల్లోనూ ఇదోటి అని బుర్రలో ఓ చోట ఫైల్‌ చేసి పారేశానే తప్ప, ఎక్కువగా ఆలోచించలేదు. డాక్టరుగా పేషంట్సును చూడ్డం మొదలైనప్పట్నుంచీ అందులోని నిజం బోధపడుతూ వస్తోంది. మనకి వయసు మీద పడుతోందనిపించడం మొదలైనదగ్గర్నుంచీ మరింతగా జ్ఞాపకం వస్తోంది.

ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ చుట్టుకొలతను గూర్చిన చర్చ ఉధృతమైంది. ఆడవారికైనా, మగవారికైనా చుట్టుకొలత పెరిగితే వచ్చే ప్రమాదాలగురించి ఎలుగెత్తి చాటుతున్నారు ప్రతి సైంటిఫిక్‌ మీటింగ్‌లోనూ. చిన్నప్పట్నుంచి ఇతర బలహీనతలతో పాటు, చుట్టుకొలతతో కూడా పెనుగులాడిన మాజీ ప్రెసిడెంటు క్లింటను ఈ మధ్య చుట్టుకొలత పీచమడచిన మరో ఆర్కన్సా గవర్నరు మైక్‌ హకబీతో చేయి కలిపి అమెరికన్ల చుట్టుకొలతమీద యుద్ధంకూడా ప్రకటించాడు.(దేశాల మీద దండెత్తడంకంటె ఇలాంటి దండయాత్రలు చాలా వాంఛనీయమే!)

‘‘ఈ డాక్టర్ల దగ్గరకు వెళ్ళడం తప్పు బాబూ! మాయదారి రోగాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు. తిండి మానేయాలనో, తగ్గించండనో ఒకటే గొడవ! మా తాతముత్తాతల కెవరికి ఈ గొడవలేదు. పప్పులో గరిటెడు నెయ్యి వేసుకొని, శేరెడు అన్నం తినేవారు. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా నెయ్యి ఎక్కువ వెయ్యద్దనీ, అసలు అలవాటు చెయ్యద్దనీ ఆంక్ష పెడుతున్నారు.,’ అని ఓ పెద్దావిడ నా దగ్గర వాపోయింది, నేను డాక్టర్ని అని తెలిసాక.

‘‘మీ తాతగారు ఏం చేసేవారండీ?’’ అని అడిగాను, అమాయకంగా మొహం పెట్టి.

‘‘అబ్బో, పెద్ద వ్యవసాయదారుడు మాతాత. 40, 50 ఎకరాల మాగాణీ. తెల్లవారకట్ట లేచి పొలానికెళితే, వంచిన నడుం ఎత్తకుండా పనివాళ్ళతో సమంగా పక్కనే ఉండి వాళ్ళచేత చేయిస్తూ, తానూ చేసేవారట. 7కాదు, 8కాదు, 10 మైళ్ళైనా సరే సునాయాసంగా నడిచిపోతుండేవారట. ఇప్పట్లా కార్లూ అవీనా ఎంత కాయకష్టం చేసేవారూ!’ అంటూ వాళ్ళతాతగారి గురించి చాలా గొప్పగా చెప్పిందావిడ చేతులూ, కళ్ళూ తిప్పుతూ.

‘‘మీ ప్రశ్నకి మీరే జవాబు చెప్పారు. మీ తాతగారు తినే నెయ్యి తినే హక్కు మనం పోగొట్టుకున్నామండి, ’’ అన్నాను నేను ఆవిడకి కొన్ని జీవితసత్యాలు వివరిస్తూ.

ఆర్ధికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా ఆదాయం బాగా పెరిగింది. దాంతో బాటూ యాంటీ బయాటిక్స్‌ పుణ్యమా అని ఇదివరలో జనాల్ని చంపుకుతినే మహామారి అంటురోగాలు ఎన్నో తోకముడిచేసరికి జనాల ఆయుర్దాయమూ పెరిగింది. ఆహారంలో పోషకశక్తి పెరిగింది. దినచర్యలో శరీరశ్రమ తగ్గింది. మనుషుల ఎత్తు, వెడల్పు బాగా పెరుగుతూ పోతున్నాయి, బుర్రలోతు మాట ఎలా ఉన్నా!

ఇక వలస వచ్చిన మనలాంటి వాళ్ళ విషయం తీసుకుంటే గత 20,30 ఏళ్ళుగా ఇక్కడ అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ, ఇతర పాశ్చాత్యదేశాలలోనూ స్థిరపడిన జనాల్లో షుగరువ్యాధి, రక్తపోటు, రక్తనాళాల జబ్బు వంటి దీర్ఘకాలికరుగ్మతల (క్రానిక్‌ డిసీజెస్‌)కు, గురయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. మన పూర్వీకులు ప్రసాదించిన స్టార్వేషన్‌ జీన్స్‌తో జత కలిపి, ఇక్కడి హైకాలరీ, హైకొలెస్టరాల్‌ తిళ్ళు, వాటికితోడు కార్లలో దొర్లడమే తప్ప, కాళ్ళతో నడవకపోవడం వంటి నాగరీకపద్ధతులు ఇలాంటి వ్యాధులకు ప్రోత్సాహకారులవుతున్నాయని తెలుస్తోంది. మన మగవాళ్ళలో కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, షుగరువ్యాధి, రక్తపోటు, ఇక ఆడవాళ్ళలో వీటితోపాటు బ్రెస్ట్‌ కేన్సరు వంటివి ఈ చుట్టుకొలత పెరగడం వల్ల ఎక్కువవుతాయని పరిశోధకులు చెప్తున్నారు.

మనదేశంలో ఐశ్వర్యవంతులు, మధ్యతరగతి జనాన్ని గమనిస్తే, వాళ్ళూ మన జీవనసరళినే అలవాటు చేసుకున్నకొద్దీ, ఇలాంటి జబ్బులకే గురౌతున్నారని, అవుతారని చెప్పవచ్చు.

వీటిని అదుపులో పెట్టాలంటే, చిన్నప్పట్నుంచీ, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోక తప్పదు. నివారణని మించిన వైద్యం లేదు.

ఇక ఇప్పటికే చేయి దాటినవారి విషయంలో, డాక్టర్లను తరచు సంప్రదించడంతో పాటు, వాళ్ళు పెట్టిన నియమాలను పాటిండం తప్ప అన్యధా శరణం నాస్తి. నిత్యం ఎక్కడో అక్కడ కాస్త నడవడంతోపాటు, కొనుక్కోగలిగినవన్నీ కొనుక్కోకుండా వుండడం, కొన్నా, కొన్నవన్నీ తినకుండా వుండడం కూడా తప్పక పాటించాల్సిందే. జబ్బుముదరకముందే కనుక్కోవడం జరిగితే (అందుకే తరచు డాక్టర్లను చూసి వస్తూండడం) ఆహారం మార్పుతోనూ, కొంత కాయకష్టమో, వ్యాయామమో చెయ్యడంతోనూ, మందులతోనూ ఆరోగ్యాన్ని, ఆయుష్షును కూడా కొనుక్కోవచ్చు.

***

‘‘చిరకాలంగా డాక్టర్లకు గుర్తు స్టెతస్కోపు ఐతే, ఇక ముందు నడుం చుట్టుకొలత కొలిచే టేపు డాక్టరు గుర్తవుతుందంటున్నారు కొందరు!’’ అని ఫోను పెట్టేసిన మా అమ్మతో అని మళ్ళీ పేపరు పఠనం మొదలు పెట్టాను నేను జబ్బులగురించి కాసేపు మర్చిపోదామని!

‘‘డాక్టర్లు, దర్జీలు ఒకటేనన్నమాట!’’ అని నవ్వేసింది అమ్మ. *