శివరాత్రి శివరాత్రికీ ఇంట్లో సాయంత్రం వరకూ ఉపవాసం, రాత్రి జాగారం ఉంటారు బామ్మా, చిట్టి బామ్మగారూనూ. అమ్మా పిన్నీ అమీను తాతయ్యగారు ఉపవాసం ఉండరు. జాగారం మాత్రం చేస్తారు. మేం పిల్లలం తాతయ్యగారిలా జాగారం మాత్రమే ఉంటాం. వాళ్ళు పడుకోమన్నా పడుకోం. వాళ్ళైనా శివనామ సంకీర్తనం చేస్తూ జాగారం ఏం ఉండరు. మా ఇంట్లో దమ్మిడీల డిబ్బీ ఒకటి ఉంది. అందులో ఉన్నవన్నీ దమ్మిడీలే. ఆ డిబ్బీ ప్రతి శివరాత్రికీ పైకి తీస్తారు. అమ్మా పిన్నీ చిట్టి బామ్మగారు బామ్మ తాతయ్యగారూ ఆ దమ్మిడీలు పందెంగా వేసుకుని ‘ఎత్తడం’ పేకాట ఆడతారు.
ఎత్తడం ఆటని నలుగురూ లేదా ఐదుగురు కలిసి ఆడొచ్చు. ముక్కల్ని పంచడం కుడివేపు నుండి కాకుండా పంచేవాడు తన ఎడమవేపు నుండి పంచాలి. ఇలా పంపకం అయిన తర్వాత పాట మొదలవుతుంది. పాట పాడ్డం మాత్రం పంచేవాడి కుడివేపు ఉన్నవాడు మొదలుపెట్టాలి. మొదటి పాట ఒకటి అని మొదలవుతుంది. పెద్దముక్కలు అంటే ఆసు, రాజు, రాణి, జాకీ వచ్చిన నాలుగు ముక్కల్లో ఉన్నట్టయితే, పాడిన పాట గెలుచుకోగలనన్న ధీమా ఉంటే పాట పాడి మధ్యన బోర్లించిన ముక్కల్ని ఎత్తుకోవాలి. ఎత్తుకున్న ముక్కల్ని, తన చేతిలోని ముక్కల్ని కలిపి చూసుకుని పనికిరాని నాలుగు ముక్కల్ని కింద పడేయాలి. పాట అయేక తురుపు చెప్పాలి. ఆ తర్వాత దస్తాలోని మిగతా ముక్కల్ని పంచుకోవాలి. పాట పాడి మధ్యన బోర్లించిన ముక్కలని ఎత్తుకోవడం నుంచీ దీనికి ‘ఎత్తడం’ ఆట అని పేరు వచ్చింది.
కన్యాశుల్కంలో ఎత్తడం ఆట సన్నివేశం ఉంది. మధురవాణి మిగతావారూ ఆడతారు. పోలిసెట్టి మధురవాణి పక్కన కూచుని పాట కట్టి పాడుతూ ఉంటాడు. నవ్వొచ్చే సీను. అందులో మోచెయ్యి పెడితే నష్టపోతామని మోచెయ్యి పెట్టొద్దు అని దెబ్బలాడ్డం ఉంది!
‘అడ్డాట’ ఎత్తడం రెండూ ఒకటి కాదు! వేరు వేరు ఆటలు. అడ్డాటలో జాకీ మణేలా ముక్కలు పెద్దవి. మణేలా అంటే తొమ్మిది. ఇందులో ఆసు పెద్దది కాదు. ఇద్దరు ఆటగాళ్ళు ఒకటై ఎదుటి ఆటగాళ్ళు ఇద్దరికి పట్లు రాకుండా ఆడతారు. అంటే అడ్డు పడి ఆపుతారు. అందుకే అడ్డాట అయింది.
ఇంచుమించు 1960ల వరకూ ఈ ఎత్తడం ఆట మా ఇళ్ళల్లో ఆడుతూ ఉండడం ఉంది. ముఖ్యంగా శివరాత్రికి జాగారం ఉండడానికి ఈ ఆటను ఆడుతూ తెల్లవార్లూ జాగారం ఉండేవారు. గురజాడ దీనిని హాస్య సన్నివేశానికి ఎంతో గొప్పగా వాడుకున్నాడు.
అమీను తాతయ్య అన్నీ తాపీవే. ఏ పని చేసినా తెగ ఆలోచించి ఆలోచించి చేసేవాడు. చిట్టి బామ్మగారు ఆయన్ని దెబ్బలాడని రోజు ఉండేది కాదు. ఈ తాపీ మనిషితో చచ్చిపోతున్నాం అని విసుక్కునేది. శివరాత్రి పేకాట సమయంలో మా తాతగారు గోడకు చేర్లాబడి తాపీగా ఆలోచించి ఆలోచించి ముక్క కింద వేసేవారు. లేదా కింద బోర్లించిన ముక్క ఎత్తేవారు. ఈయనతో ఇదో చిక్కు. ‘మీరు ముక్క వేసి ముక్క తీసేలోగా మాకు కునికిపాట్లతో నిద్ర జోగు వస్తోంది. జాగారం రాత్రి కుక్క ముట్టుకునేటట్టుంది. రేపటి సాయంత్రం వరకూ తెలివిగా ఏం ఉంటాం? వెయ్యండి ముక్కని. మీకు పుణ్యం ఉంటుందీ!’ అని కొంత విసుక్కుంటూ కొంత బతిమాలుతూ అంటూ ఉండేవారు. ఎవరు ఎన్నిసార్లు ఎలా చెప్పినా తాతగారు తన నైజాన్ని మార్చుకునేవారు కారు. ఆయన అలాగే తాపీగా ఆలోచనలో మునిగి ముక్క ఎత్తడమో వెయ్యడమో చెసేవారు కాదు. ‘చెయ్యి, ఆ మోచెయ్యి నా పక్క అలా పెట్టకు, నీక్కాదూ చెప్పేదీ! ఎన్నిసార్లు చెప్పనూ’ అంటూ మోచెయ్యి పెట్టిన వాళ్ళను చెడామడా తిట్టేవారు.
‘తాతయ్యా, ఒకటి కాదు ఒహటి, ఒహటి’ అని, ‘రెండు కాదు రొండు రొండు అనీ పాడు’ అని నేనో తమ్ముడో అంటే ‘భడవల్లారా, మీరూ నాకు చెప్పడమే? అయినా తెలివి తక్కువ దద్దమ్మలు. కన్యాశుల్కంలో వాళ్ళ పేర్లను బట్టి గురజాడ గడుసుగా వాళ్ళ యాసలోనే తిట్లతో పాటు పేకాట పాటనీ పాడించి ఒహటీ రొండూ అనిపించేడు. నా భాష నా యాస వేరు. మనది స్వచ్ఛమైన బ్రాహ్మణ భాష. మనం ఉచ్ఛరించినట్టు వాళ్ళెలా ఉచ్ఛరించగలరూ? పాత్రలో ప్రవేశించి మరీ రాసేడు ఆయన. ఆయన పాత్రలన్నీ సజీవంగా ఈనాటికీ ఆనాటికీ నిలిచివుంటాయి’ అంటారు.
‘ఒరే పెద్దాడా! ఆవలింతలూ కునికిపాట్లూ వస్తున్నాయి. తీసుకెళ్ళు నన్ను’ అని నాన్నని కేకేసేవారు. బామ్మ లేచి తాతయ్యను నాన్నతో కలిసి ఆయన గదిలోకి తీసుకువెళ్ళేది. ఆయన జాగారం రాత్రే కుక్క ముట్టుకున్నది అయేది. ‘ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఇక మనం తెల్లార్లూ ఆడుకోవచ్చు. ఆయన ముక్క వెయ్యడం ఆలీసం చేసేరని తిట్టుకోడం ఉండదు. చకచకా ఆడుకుందాం’ అనుకునేవారు మిగతావారు.
ఓ సంవత్సరం మీరు పేకాట ఆడద్దూ, మేం పిల్లలం నాటకాలు ఆడతాం అంటే వాళ్ళూ ఒప్పుకున్నారు. అలాగే మీ నాటకాలూ డాన్సులూ పాటలూ వింటూ జాగారం చేస్తాం. నిద్ర రాదు మీ ఆటపాటలకి అన్నారు. వీధిలో నా ఈడు ఆడా మగా పిల్లలం ఎక్కువమందే ఉన్నాం. అందరం కలిసి ఒక జట్టుగా ఉంటాం. దెబ్బలాడుకోం. అంత స్నేహం. ఎవరి ఇంట్లోనో ఒకరి ఇంట్లో, ఎవరి పెరట్లోనో ఒకరి పెరట్లో చెట్లు ఎక్కీ గోడలెక్కీ దోరజామపళ్ళు కోసుకుంటాం. పెరళ్ళూ విశాలంగా ఎన్నెన్నో రకాల మొక్కలూ చెట్లతో ఉండేవి. పెద్దవాళ్ళు మమ్మల్ని ఏఁవీ అనేవారు కాదు. దోరపళ్ళు మా జేబుల్లో పెట్టుకోడమే కాదు, ఆ ఇంట్లోనూ వాళ్ళ పిల్లాడితోనో పిల్లతోనో కలిసి కోసేవాళ్ళం, వాళ్ళ వాళ్ళకీ ఇచ్చేవాళ్ళం. వాళ్ళింటి బామ్మగారికి, తాతగారికీ ఇస్తే మా సంతోషపడిపోయేవారు. వాళ్ళకి చెట్టుని బాగా మగ్గి మెత్తగా ఉన్న పళ్ళను ఇచ్చేవాళ్ళం. రెండు రకాల జామచెట్లు ఉండేవి లోపల ఎర్రగా ఉండే జాంపళ్ళు, తెల్లగా ఉండే జాంపళ్ళూనూ. రెండూ రుచి అయినవే. నాకు ఎర్రగా ఉన్నవి ఎక్కువ ఇష్టం. దేని రుచి దానిదే అయినా ఎర్ర జాంపళ్ళు మరింత ఎక్కువ రుచి.
అందుకనే అందరి ఇళ్ళల్లోనూ జాగారం ఉండే పెద్దవాళ్ళంతా మా ఇంటికే వచ్చి ఇక్కడే జాగారం చెయ్యడానికి వస్తామని ఒప్పుకున్నారు.
పెద్ద సావిట్లో చివరగా ఉన్న భోషాణం దగ్గరికి ఓ నీలం కర్టెను రాజు నాన్న కట్టి పెట్టేడు. భోషాణం మీద మా కిరీటాలు, మా కత్తులు, మా రంగులూ మా నాటకాల బట్టలూ అన్నీ మొత్తం సరంజామా అంతా పెట్టుకోడానికి సదుపాయంగా ఉండేటట్టు – ఓ పెద్ద అద్దమూ, దువ్వెన్నతో అన్నీనూ – ఓ పెట్రోమాక్సు లైటు ఆ భోషాణం పెట్టె మీదే రాజు నాన్న పెట్టేడు. కర్టెనుకి ఇవతల వేపు తివాసీలు, జంబుఖానాలు, భోజనాలగది గోడ వరకూ పరిచి ఎంతమంది వచ్చినా కూచోడానికి సరిపోయేటట్టు వేసి సిద్దం చేసేడు. రాజు నాన్న చిన్నప్పుడు నాటకాలు వేసేవాట్ట. ఆయనకు నాటకాలు వెయ్యడమన్నా చూడ్డమన్నా చాలా ఇష్టం.
ఓ పెద్దబిందెతో మంచినీళ్ళు కూడా పెట్టేడు. మా వేషాలు వేసుకునే వైపూ మంచినీళ్ళు మరో బిందెతో పెట్టేడు. పెట్రోమాక్సు లైటు వెలుగులో ఇత్తడి బిందె బంగారంలా మెరిసిపోయేది జిగేల్మంటూ. ఆ వెలుతురులో భోషాణం మీద సీలింగు నుంచి వేళ్ళాడేటట్టు కట్టి వేళ్ళాడదీసిన తలుపులున్న మేనా పల్లకీ గమ్మత్తు గమ్మత్తుగా నల్లరంగు మెరిసిపోతూ కనిపించేది.
మా నాటకాలు పుస్తకాల్లో ఎవరో రాసినవి కావు. మేఁవు మా నాటకాల్నీ సంభాషణలనీ అన్నిటినీ మాకు మేమే చెప్పేసుకునేవాళ్ళం. ఆవేళ ‘ఇవాళ్టి అర్ధనారీశ్వరుడు’ అని వేసిన వేషం కడుపుబ్బా నవ్వించేసరికి ఓ తాతగారు దానికి ఫస్ట్ ప్రైజు అంటూ ఓ చాక్‌లెట్‌ల డబ్బా తెల్లగా తెల్లారిన తర్వాత, నాటకాలు వేషాలు అన్నీ అయిపోయేక ఇచ్చేరు. మిగతావాళ్ళ చప్పట్లతో హోరెత్తిపోయింది. ఆ వేషం వేసిన అమ్మాయి మొహం మతాబాలా వెలిగిపోయింది. ఆ వేషం ఊహించిన అబ్బాయిలకీ అమ్మాయిలకీ, అలా చేద్దాం ఇలా చేద్దాం అని వేషాన్ని సరిదిద్దిన వాళ్ళందరికీ, ఆ వేషానికి కావల్సిన బూట్లు, హైహీలు ఆడపిల్లల చెప్పులు, పసుపూ పారాణి, మువ్వల పట్టీలు – ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర ఉన్నవి తెచ్చి ఇచ్చేరే, వాళ్ళందరి మొహాలూ పెట్రోమాక్సు లైటులా వెలిగిపోయాయి. రాజు నాన్న పెట్రోమాక్సు లైట్లని మధ్య మధ్య పంపు కొట్టీ, మాంటిల్‌ను పిన్నుతో పొడిచీ కాంతి తగ్గిపోతూ ఉంటే పెంచేవాడు మూడు పెట్రోమాక్స్ లైట్లని – అందరూ కూచున్న వేపు పెట్టిన రెండు, మేం వేషాలు వేసుకునే వైపున ఉన్నదాన్నీనూ.
అర్ధనారీశ్వరుడు ఓ పాదానికి హైహీలు చెప్పూ మువ్వల పట్టీలూ గజ్జెలూ ఓ వేపు, రెండో వేపు బాగా నల్లగా పాలిష్ చేసిన బాటా బూటులతో ఆ పిల్ల నడుస్తూ ఇటూ అటూ తిరుగుతూ మధ్య మధ్య చూస్తున్నవాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళవేపు గాజులున్న చేతిని గలగలలాడిస్తూ, రెండో చేతిలోని బాజాని రెండో వేపు నోటి దగ్గర పెట్టుకొని వాయిస్తూ, ఓ పక్క నిక్కరు కాలు, ఇంకోపక్క గౌనూ కట్టుకున్న బట్టలూ – నవ్వు తెప్పించక ఏం చేస్తాయి?
ఓ పక్క జుట్టు కొప్పు, ఇంకో పక్క జుట్టు విప్పి మెడమీంచి వేళ్ళాడుతూ నడుము వరకూ ఉన్న పొడుగు జుట్టూనూ! ఒక పక్క చెవికి రింగులు, రెండో చెవికి లోలాకులు – ఇలా అటూ ఇటూ ఇప్పటి ఆడా మగాల వేషాలు కలిపి అర్ధనారీశ్వరుణ్ణి కట్టేం.
అట్టలు కత్తిరించి, ముచ్చి కాయితం ముక్కల్ని డైమండు ఆకారంలో కత్తిరించి ఆ అట్టకి అంటించడం, మొదట మొత్తం కిరీటం ఆకారపు అట్టకి వాటర్ కలర్‌ని ఆకుపచ్చ రంగు ఒకదానికి, నీలం రంగు ఒకదానికి, బచ్చలి పండు రంగు ఒక దానికి, ఇలా రంగుల్ని మార్చి పదో పదిహేనో కిరీటాలని తయారు చేసేం. ఆ అట్ట కిరీటం తలకు కట్టుకోటానికి వీలుగా ఈ చివరా ఆ చివరా చిన్న కన్నాలు దబ్బనంతో పెట్టి, దళసరి దారాన్ని కట్టి ఈ పక్క కొసని, ఆ పక్క కొసనీ ఉన్న దారం ముక్కల్ని తల వెనకవేపు కట్టుకునేవాళ్ళం. మరీ చిన్నపిల్లలు అయితే బుర్రకి దూర్చేసి పెట్టేసేవాళ్ళం. అట్టకత్తులు, బాకులు, డాలులూ చేసేం. మేం చదువుకున్న చరిత్ర పాఠాల కథలన్నిటినీ వేషాలు వేసి ఆడేం.
ఝాన్సీలక్ష్మిలా వేషం వేసుకుని ఓ ప్లాస్టిక్ బొమ్మని నడుంకి కట్టుకుని గుర్రం మీద కత్తి ఝుళిపిస్తూ యుద్ధం చేస్తున్నట్టు అటూ ఇటూ హాలంతా కలియతిరుగుతూ అక్కడ నిజంగా యుద్ధం జరుగుతోందా అన్నట్టు, యుద్ధభూమే అయినట్టు, అబ్బాయిలూ అమ్మాయిలూ గుర్రపు డెక్కల చప్పుడులా కర్రలతో కొడుతూ ఉంటే, కత్తి దెబ్బలకి చచ్చిపడిపోతున్న హాహాకారాల్లా అబ్బా అమ్మా అన్న అరుపులు, గుర్రాలు పడిపోతున్నట్టు చప్పుళ్ళూ వినిపించేటట్టూ మిగతా పిల్లలు చేస్తూ ఉంటే – చూస్తున్నవాళ్ళంతా ఒకటే చప్పట్లు!
నేను తాండ్ర పాపారాయుణ్ణి అంటూ బాగా పొడుగ్గా ఉన్న అబ్బాయి మీసాలు తగిలించుకుని చేత్తో బాకు పట్టుకుని, పంచె కట్టుకుని వచ్చి అక్కడ పడుకున్న మరో అబ్బాయిని బాకుతో పొడుస్తున్నప్పుడు బొబ్బిలి యుద్ధం చూస్తున్నట్టే ఉంది అని పెద్దవాళ్ళు మెచ్చుకునేవారు! నెత్తురు కూడా చిమ్మినట్టు పడుకున్న అబ్బాయి ఎర్ర సిరాని అటువేపు చేత్తో ఒంపేసుకోడం చూసి ‘హౌరా! ఈ పిల్లలు ఎంత బాగా అన్నీ చేస్తున్నారు! పెద్దవాళ్ళ సాయం పిసరంతా లేకుండా’ అని విస్తుపోయేవారు.
బ్రహ్మనాయుడి చాపకూడుకి అబ్బాయిలు నానారకాల బట్టలు వేసుకుని పంక్తిలో కూచుని కుడుస్తున్నట్టు; ఖడ్గ తిక్కన పోరునుండి పారిపోయి ఇంటికి వచ్చినప్పుడు భార్య నులకమంచం పెట్టి పసుపుముద్ద పెట్టి స్నానానికి నీళ్ళు పెట్టి ‘వెన్ను చూపి పారిపోయి వచ్చినవాడు ఆడదాని లాంటి’ వాడేనని అండము, అన్నం పెట్టేటప్పుడు విరిగిన పాలు మజ్జిగకు బదులు వేసిన తల్లిని ఇదేమిటని అడిగితే ‘పిరికిగొడ్డులా పారిపోయి వచ్చినట్టే తిక్కా ఈ పాలు విరిగిపోయేయి’ అండం, దాంతో తిక్కన తిరిగి యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు ఇవ్వడం. ఖడ్గ తిక్కన్నగా పేరు పడ్డం; ఆ కథనీ అంతే రమ్యంగా ఉందనీ పొగిడేరు.
శ్రీనాథుడిలా వేషం వేసుకుని కంచుఢక్కని పగలగొట్టినవాణ్ణి, విస్సన్నతో కలిసి బంగారపు పాత్రలలో అన్నం తిన్నవాణ్ణి, తనను మెచ్చినవాళ్ళంతా స్వర్గానికి ముందే వెళ్ళిపోతే, కాలం చేసేస్తే బాకీ పడ్డ ఏడు నూర్ల వరహాలు ఎలా చెల్లించడము అని బాధపడడం, అన్ని గొప్ప సత్కారాలు పొందిన తన మెడ మీద నగరం వాకిలిలో ఉన్న నల్ల గుండు మొయ్యవలసి రావడం, బొడ్డుపల్లిని గొడ్డేరి మోసపోయాను, మిగిలిన కాసిని తిలల్నీ పెసల్నీ బిలబిలాక్షులు తినేసేయి అని శ్రీనాథుడు దుఃఖిస్తూ ఉంటే అక్కడ చూస్తున్నవాళ్ళలో అతని దురవస్థకి కంటతడి పెట్టనివాళ్ళు, బుగ్గల మీంచి కన్నీరు కార్చనివాళ్ళూ లేరంటే అతిశయోక్తి కాదు.
చివరగా వాలకం కూడా కట్టేం. ఎదురుగా కూచుని చూస్తున్న తమ తండ్రినో, ఇంకో కుర్రాడి తండ్రినో తల్లినో చూస్తూ వాళ్ళెంత పిసినారివాళ్ళో, చేతిలోంచి డబ్బు ఎలా రాలదో అంటూ వెటకారం చేస్తూ కట్టిన దాన్ని చూసి ఎవరి మీద కట్టేరో వారితో సహా అందరూ పకపకా నవ్వేరు. ‘మా గొంతుకలని కూడా ఎంత చక్కగా అనుకరిస్తూ మేమెలా మాటాడతామో అలా కొన్ని మాటలని నొక్కీ కొన్ని మాటలని దీర్ఘం తీసీ కొన్ని ముక్కుతో మాటాడీ – ఇలా ఎవరి గొంతుకో స్పష్టంగా తెలిసిపోయేటట్టు భలే పట్టుకున్నారు!’ అని తల్లులూ తండ్రులూ ఒకటే మెచ్చుకోడం, ముక్కులు చీదుతూ మేం ఏడ్చే ఏడ్పులని మీ నాన్నలు బాధలు పెట్టేడని ఇరుగమ్మకి చెప్పుకోడం గొప్పగా ఉందర్రా అని అంటే పిల్లలు పొంగిపోయేరు. అల్లాగ్గా శివరాత్రి జాగారం వారినీ నిద్ర పోనివ్వకుండా చేసింది.