నిరీక్షణ

పాతికేళ్ళ నాటి మిత్రుడొకడు
కలుస్తానన్నాడు.

ఎప్పుడొస్తాడో
అనే ఆలోచనలో
గడియారం ముల్లు
చీమలా పాకుతోంది

తాజా ఉదయం
పాత జ్ఞాపకాలను
వెచ్చగా నెమరేస్తోంది
మాటిమాటికీ కాలాన్ని
మణికట్టుపై కొలుస్తున్నాను

నాలుగు టీలు నడిచాయి
కళ్ళు తలుపులకతుక్కుని
ఆశతో వేళ్ళాడుతున్నాయి
కాళ్ళు పదిమార్లు
గుమ్మం వరకూ వెళ్ళొచ్చాయి

పదే పదే చదివిన
పత్రికలోని అక్షరాలు
పక్షుల్లా ఎగిరిపోయి
కాగితం తెల్లముఖం వేసింది

బెల్లు మోగి
ఆత్రంగా తలుపు తీస్తే
ఇస్త్రీ బట్టలవాడు
నిరీక్షణా వీక్షణాల మీద
నీళ్ళు చల్లాడు

వస్తానన్న వాడు
రాకుండా ఉండడు
కనీసం నా కలల్లోకైనా
తప్పక వస్తాడు.