మబ్బు

సాయంత్రం అయిదయ్యింది.

పద్మ దిగులుగా వుంది. ఏం చెయ్యాలన్నా మనసు కావటం లేదు.

రేపు స్వాతి వెళ్ళిపోతుంది. దాన్ని కాలేజీలో దింపి వచ్చాక, ఇక ఈ లంకంత కొంపలోనూ తనొక్కత్తే బిక్కుబిక్కుమంటూ. విశ్వం పొద్దున్నపోతే రాత్రెప్పుడో వస్తాడు.

రెండేళ్ళ క్రితం పెద్దది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదీ వెళ్ళిపోతుంది.

గూడు కాళీ అయిపోతోంది.

కూర్చున్నచోటినించి లేచి నెమ్మదిగా స్వాతి గదివేపు వెళ్ళింది. బట్టలు సర్దుకుంటోంది, చెవికీ భుజానికీ మధ్యనున్న ఫోనులో ఎవరితోనో మాట్లాడుతూ.

దిగులుతో క్రుంగిన తల్లి మొహం చూసి, ‘ఐ విల్‌ కాల్‌ యూ బాక్‌’ అని ఫోన్‌లో చెప్పి, చేతిలో పని ఆపి దగ్గరకొచ్చింది. తల్లికి గట్టిగా ఓ హగ్గిచ్చి, ‘డోన్ట్‌ లుక్‌ సో మిజరబుల్‌ మామ్‌, ఐ విల్‌ మిస్‌ యూటూ’ అంది.

వర్షించడానికి సిద్ధంగా వున్నాయి పద్మ కళ్ళు.

తల్లి, కూతురు స్వాతి బెడ్‌ మీద కూర్చున్నారు.

మౌనంగా వున్న పద్మ మనసులో, లేతగా, ప్రపంచం అంతా తన కాళ్ళముందు సాగిలబడ్డానికి సిద్ధంగా వుందన్న ధీమాతో వున్న కూతుర్ని చూస్తుంటే ఎక్కడలేని ప్రేమా పొంగుకొస్తోంది.

ఎప్పుడూ ‘మామ్‌ ఇది కావాలి, అది కావాలి’ అంటూ ఏ పనీ చేసుకోడం చాతకాని, ఈ బంగారుతల్లి ఆ కొత్తచోట్లో,ఎలా నెగ్గుకొస్తుందో అనే భయం ఒకవేపు, రెక్కలు విప్పి ఎగిరిపోతోంది, స్వతంత్రంగా వుండబోతోంది, తన మనసుక్కావాల్సిన విధంగా బ్రతకబోతోంది అనే అసూయతో కూడిన మెప్పు ఒకవేపు ఒకదానితో ఒకటి గుద్దుకుంటున్నాయ్‌.

తనుకూడా ఓ నాడు అలాంటి స్వతంత్రం కోసమే రెక్కలాడించింది.

చదువుల సరస్వతిగా తల్లిదండ్రుల్ని మురిపించింది. బోటనీలో పి.జి. చేసింది.

ఇంకేం చేద్దామా అనుకుంటుంటే విశ్వంతో పెళ్ళైపోయింది. ఇక్కడికొచ్చేసింది.

తన తరఫున నిర్ణయాలు తీసుకునే మరో మనిషితో అమెరికాకొచ్చేసింది.

‘రిసెర్చి ఏం చేస్తావులెద్దూ. నీ సబెక్టులో ఇక్కడ పెద్ద డిమాండ్‌ వుండదు’ అన్నాడు.

‘ఇంకేదన్నా చేద్దువుల’ే అన్నాడు.

తేల్చుకునే లోపలే పెద్దది పుట్టింది. మరో రెండేళ్ళకే స్వాతి.

‘పిల్లల్ని డే కేర్‌లో వుంచి, నువ్వు చదువుకెళ్ళడం, జాబ్‌ కెళ్ళడం ఏవిటీ’ అన్నాడు.

‘ఇది నేను నా కెరీర్‌లో ఎదిగే పీరియడ్‌. నేను నీకేం హెల్ప్‌చెయ్యగలను. నాకు టైమే ఉండటం లేదు.’

‘నువ్వుకూడా నాలాగా జాబ్‌ అనో, చదువనో బిజీ అయిపోతే పిల్లల ఫ్యూచర్‌ దెబ్బతింటుంది,’అన్నాడు.

చదువుసంగతి మరి రాలేదు. ఉద్యోగం అనేదాన్ని మర్చిపోయింది.

పిల్లల్ని స్కూళ్ళకు తీసుకెళ్ళి తీసుకురావడం. సంగీతం టీచరు ఇంటి చుట్టూ తిప్పడం. భరతనాట్యం, తెలుగుక్లాసులు ` వాళ్ళచుట్టూ అల్లుకుపోయింది కాలం.

వీకెండు పార్టీలు సరేసరి.

చిన్నప్పుడు తను క్లాసికల్‌ మ్యూజిక్‌ చక్కగా నేర్చుకుంది. భగవంతుడు మంచి కంఠం ప్రసాదించాడు. బాగా పాడగలదు. వీణ వాయించ గలదు. ఇక్కడి కొచ్చిన కొత్తలో ఓ పార్టీలో పాడింది. ‘ఎంత బాగా పాడావ్‌!’ అని అందరూ మెచ్చుకున్నారు.

ఆ తర్వాత రెండురోజులు విశ్వం ముభావంగా వున్నాడు.

ఏమైంది అలా వున్నారంటే, ‘పాడమన్నచోటల్లా నువ్వు పాడక్కర్లేదు’ అని వూరుకున్నాడు. తర్వాత తాను మరెక్కడా పాడలేదు.

ఈ సిటీకి మూవ్‌ అయ్యాక తను పాటనేర్చుకున్న సంగతి, పాడగలనన్న సంగతి ఎవరికీ చెప్పలేదు.

తను ఆన్‌ కాల్‌ పని మనిషి జీవితానికి అలవాటు పడింది.

‘అమ్మకు కామెర్లట, దగ్గరుండి పథ్యం అదీ వండిపెట్టి నయమయ్యాక రా’ అంటే రెండు నెలలు ఇండియా వెళ్ళి, అత్తగారిని మామగారిని చూసుకుని వచ్చిందోసారి.. ఊళ్ళోనే ఉండే ఆడపడుచు, చుట్టంచూపుగా వస్తుండేది. ‘ఉన్న ఒక్క కొడుకూ ఎక్కడో దూరంగా వుద్యోగంలో వుండిపోతే అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుండేది.

విశ్వం అమెరికా వెళ్ళిన తర్వాతే కుటుంబం ఆర్ధికంగా బలపడింది అన్న సంగతి అందరికీ తెలుసు.

‘అమ్మకి ఇక్కడ పద్ధతులు ఏం తెలుస్తాయి? నువ్వు వెళ్ళి అమ్మకు తోడుగా వుంటే’ – అంటే, ఈ దేశంలోనే వుండే ఇద్దరు ఆడపడుచుల డెలివరీస్‌కి తనే వెళ్ళి చూసుకుంది.

అలా తనని, అతనివాళ్ళకి సాయం చెయ్యటానికి పంపినప్పుడు మాత్రం పిల్లల్ని తనే సాకేవాడు. అన్ని పన్లూ చేసుకునే వాడు.

‘వదిన ఎలాగూ జాబ్‌ చెయ్యదు కదా, ఖాళీగానే వుంటోంది కదా, నాలుగు రోజులు సాయం పంపించు’ అంటే ఏనాడూ చెల్లెళ్ళకి ‘నో’ అనలేదు విశ్వం.

తన చెల్లెళ్ళు జాబ్‌ చెయ్యకపోతే తన బావలు ఊరుకోరనే వాడు. వాళ్ళు డబ్బుమనుషులు. వాళ్ళకి డబ్బు కావాలి. తను వేరు. తనకి పద్మ డబ్బు అక్కర్లేదు….

***

స్వాతి చెయ్యి పద్మ చేతి మీద పడింది.

‘‘ఏవిటాలోచిస్తున్నావ్‌ మామ్‌.’’

‘‘నీగురించే.’’

‘‘ఇంతకు ముందు ఇచ్చిన స్పీచే కద మామ్‌’’ అని నవ్వేసింది స్వాతి

‘‘వేళాకోళం కాదు తల్లీ. చూడుకన్నా. వేళకి తినాలి. పడుకోవాలి. చక్కగా చదువుకోవాలి. ఫ్రెండ్సు చేసుకునేముందు వాళ్ళు మంచి వాళ్ళవునో కాదో చూసుకోవాలి. అనవసరంగా దేనికీ ఇన్‌ఫ్లుయన్స్‌ అయిపోకూడదు.’’

‘‘డేటింగ్‌ అనీ, మరోటనీ అంటారు. అవన్నీ మనకొద్దు తల్లీ. ఒకవేళ కాదూ కూడదూ అంటే ఇండియన్‌ అబ్బాయిలతోనే చెయ్యి…’’

‘‘స్టాప్‌ ఫరె సెకండ్‌ మామ్‌. ఇండియన్‌ అబ్బాయిలు మంచి వాళ్ళని నీకు తెలుసా మామ్‌? వాళ్ళు ఇక్కడవాళ్ళకన్నా ఎందులో ఎక్కువ చెప్పమ్మా? చదువుల్లో ఎక్కువేమో పోనీ నేను ఆర్గ్యూ చెయ్యను, కాని కల్చర్‌లో అదే నువ్వు సంస్కారం అంటావు చూడు అందులో మాత్రం కాదు.’’

‘‘అలా అనకు స్వాతీ…’’

‘‘ఓకే మామీ… చక్కగా ఇద్దరు ఇండియన్‌ అబ్బాయిన్లి చూడు. నాకూ అక్కకీ ఇద్దరికీ ఒక్కేసారి పెళ్ళిళ్ళు చేసేయ్‌. నీలా ఏ మాస్టర్సో చదువుకునే దాకా ఆగి, అప్పుడు పెళ్ళి చేసుకుని, అప్పట్నుంచీ హౌస్‌కీపర్లా ఉండే బదులు ఇప్పట్నుంచే వుంటాం! లేక పోతే ఏంటి మామ్‌! నువ్వు చూడు, ఎప్పుడన్నా నీకు స్వతంత్రంగా ఏదన్నా చేసే ఆపర్చునిటీ వచ్చిందా. డాడీ సిట్‌ అంటే సిట్‌ స్టాండంటే స్టాండ్‌….’’

‘‘డోంట్‌ టాక్‌ లైక్‌ దట్‌ స్వాతీ….నేనెప్పుడూ అలా అనుకోలేదు..’’

‘‘నువ్వే అలా మాట్లాడద్దు మామ్‌..నీ గురించి మాకు తెలీదనుకోకు…’’

‘‘అమ్మా! నేను, అక్కా ఈ దేశంలో పుట్టినా తెలుగు నేర్చుకోండంటే నేర్చుకున్నాం. భరతనాట్యం అంటే నేర్చుకున్నాం. సంగీతం, మన డ్రెస్సులు, అలవాట్లు, పండగలు అన్నీ మా కర్ధం అయినా కాకపోయినా మీకోసం నేర్చుకున్నాం. వాటిని లైక్‌ చెయ్యడం నేర్చుకున్నాం. కానీ నీలాగ ఇండివిడ్యువాలిటీ చంపుకుని బ్రతకలేం. నువ్వెన్నా చెప్పు మాం. వాళ్ళ డాడీలెలా వుంటారో వాళ్ళలాగే వుండాలనుకుంటారు మన ఇండియన్‌ బాయిస్‌. పెళ్ళాలమీద ఎక్కువ అధికారం చేస్తారు మామ్‌…’’

సడన్‌ గా తల్లీకూతురూ గుమ్మంలో నిలబడ్డ విశ్వాన్ని చూశారు. విశ్వం నవ్వుతున్నాడు.

‘‘గంట పడ్తుందన్నారు అప్పుడే వచ్చేసారే అంది పద్మ’’ స్వాతి మాటలు విన్నాడా లేదా అనే ఆలోచనతో.

‘ఇంటికి వస్తున్నాను, గుడికెళ్దాం’ అని ‘ట్రాఫిక్‌ సంగతి చెప్పలేంగదా, గంట పట్టచ్చు, గంటన్నరపట్టచ్చు’ అని కార్లోంచి ఫోన్‌చేసాడు విశ్వం ఓ ఇరవై నిమిషాలకిందే. నిజానికి ట్రాఫిక్‌ ఎక్కువలేదు.

‘నాకూతురికి నామీద, ఇండియన్‌ మగాళ్ళమీద ఇంత కక్ష వుందా’ అనుకున్నాడు విశ్వం పైకి నవ్వుతూనే.

‘‘నడవండి, కారు గరాజ్‌ లోపలకూడా పెట్టకుండా పైకొచ్చాను’’ అన్నాడు.

స్వాతి, పద్మ మాట్లాడుకుండా అతన్ని అనుసరించారు.

మౌనంగా డ్రైవ్‌ చేస్తున్నమొగుడ్ని అప్పుడప్పుడు క్రీగంట చూస్తూ మౌనంగా వుంది పద్మ. స్వాతి ఐపాడ్‌లోంచి మ్యూజిక్‌ వింటూ అప్పుడప్పుడు తల్లిని తండ్రిని చూస్తూ తనూ మౌనమే పాటించింది.

కూతురు మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయ్‌ విశ్వం మెదడులో.

పద్మ గురించే ఆలోచిస్తున్నాడు.

జీవితం గురించీ ఆలోచిస్తున్నాడు.

తన జీవితంలో ఎప్పుడూ తనని, తన కుటుంబాన్ని కేంద్రంగా చిత్రించుకుని జీవించాడు. అప్పుడప్పుడు పద్మ ఇంటికుందేలులాంటి జీవితంతో విసిగి పోతోందేమోనన్న ఆలోచన వచ్చినా వెంటనే తుంపేసేవాడు. జీవితానికి రెండు చక్రాలూ అవసరమే, తనవేపు బరువు తను మోస్తే, ఆమెవేపు బరువు ఆమె మోస్తుంది అని సమాధానం చెప్పుకునేవాడు. తరతరాల సాంప్రదాయం ప్రకారం జీవిస్తున్నామే తప్ప ఇందులో కొత్తేముంది అనుకునేవాడు.

కాని కొత్త లేక పోవడమే.

ఆడవాళ్ళందరూ పద్మలాగా లేరుగా. తన తల్లికాలం వేరు, ఆవిడ తల్లికాలం వేరు.

వాళ్ళున్నట్టుగానే పద్మ కూడా వుండాల్సొచ్చింది తనని పెళ్ళి చేసుకుని. పూర్తిగా అలానూ లేదు. వాళ్ళకి లేని చదువులు తనకున్నాయ్‌. వాళ్ళు చేసిన పన్లేకాకుండా మరికొన్ని పన్లు చెయ్యాల్సొచ్చింది ఇక్కడికి రావడం వల్ల.

చేద్దామనుకున్న పన్లు కొన్ని మానుకోవల్సివచ్చింది. తనెలా జీవించాలన్న నిర్ణయాలన్నీ తానే తీసుకున్నాడు.

తన యిష్టాయిష్టాలు కనుక్కోక పోవడమేకాకుండా, అవేమీ ముఖ్యం కాదన్నట్టే చూశాడు.

పద్మ మనసులో దాచుకున్న అసంతృప్తినంతా స్వాతి బయటకి చెప్తోంది.

పద్మ సహకారం లేకుండా ఈ రోజు తనూ తన సంసారం ఈ స్థితిలో వుండేవాళ్ళా.

నేర్పు, ఓర్పు, సహనం అలవర్చుకున్న పద్మను ఆ రూపంలో చూడగలిగాడే గాని, తన పూర్తి వ్యక్తిత్వానికి అవకాశం రాకపోడంతో తనెంత వ్యధని లోపల ఇముడ్చుకు బ్రతికిందో అర్ధం చేసుకోనే లేదు.

ఇండియన్‌ మగాళ్ళందరూ ఇలాగే వుంటారని స్వాతి అనుకోడంలో అశ్చర్యపడాల్సిందేముంది….

***

తల్లీ, కూతురూ, తండ్రీ గుడిలోకెళ్ళి, అర్చన చేయించి, ప్రసాదం అందుకుని బయటకి వచ్చి మెట్లమీద కూర్చున్నారు.

‘‘వాట్‌ డిడ్‌ యూ ఆస్క్‌ గాడ్‌, స్వీట్‌హార్ట్‌!’’ అన్నాడు విశ్వం స్వాతి నుద్దేశించి.

‘‘నథింగ్‌ డాడ్‌’’

‘‘యూ డింట్‌ అస్క్‌ నాట్టూబి స్టక్‌ వితేనిండియన్‌ బాయ్‌ ఫరే హజ్బండ్‌, డిడ్‌ యూ?’’ అన్నాడు నవ్వుతూ.

స్వాతి జవాబు చెప్పలేదు.

‘‘స్వాతీ. నువ్వెలాగూ కాలేజీకి వెళ్తున్నావ్‌ కదా! అమ్మ ఇక ఇంట్లో ఫుల్‌టైం జాబు చెయ్యాల్సిన పన్లేదు. బయట జాబ్‌ చెయ్యచ్చు. కావాలంటే సంగీతం పాఠాలు చెప్పచ్చు. ఇవి మీ అమ్మతో చేయించాలని ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడే దేవుడ్నికూడా అడిగాను. ఆయనకూడా అలాగే ఆలోచిస్తున్నానన్నాడు.’’

‘‘దేర్‌ యూగో డాడ్‌! నువ్వు అమ్మకి గాడ్‌. నీకు దేవుడు గాడ్‌. యూ విల్‌ ఆల్వేస్‌ మేక్‌ ఆల్‌ ది డెసిషన్స్‌ ఫర్‌ మామ్‌. గుడ్‌లక్‌ ఇన్‌ ఫైండింగ్‌ వాట్‌ యూ వాంటూడూ మామ్‌,’’ అంది స్వాతి నవ్వుతూ.

పద్మ విశ్వం వైపు చూసింది. మబ్బు వీడిన చందమామలా కనిపించాడు విశ్వం.

‘‘ఐ మస్ట్‌ మేక్‌ దిస్‌ వుమన్‌ హాపీ’’ అనుకున్నాడు విశ్వం.

‘‘డాడ్‌ ఐ లవ్‌యూ, యూనో!’’ అని తండ్రికి హగ్‌ ఇచ్చింది స్వాతి, ఇక్కడ అక్క గూడా వుంటే ఎంత బాగుండును అనుకుంటూ.

మౌనంగా లేచి, ముగ్గురూ కారువేపు బయల్దేరారు.

మూడు జతల కళ్ళు ఒకటికి తెలీకుండా ఒకటి చెమ్మగిల్లాయి. *