‘‘వంశీ, వంశీ! మన రిజల్ట్సు వచ్చాయి. మనిద్దరికీ యు.ఎస్. ఎమ్.ఎల్.ఇ పరీక్షలో మంచి స్కోర్ వచ్చింది. తొంభై మూడు నాకూ, తొంభై నాలుగు నీకూ వచ్చాయి. ఇందులో కూడా నీదే పైచెయ్యి అనిపించావు చూశావా? నాకెంతో సంతోషంగా ఉంది వంశీ! ఇద్దరం స్టేట్స్‌కు వెళ్ళి మంచి రెసిడెన్సీ చేసి ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి రావచ్చు. ఆ ట్రయినింగ్‌తో మనం ఎన్నో మంచి పనులు ఇక్కడ చేయవచ్చు!’’ గలగలా మాట్లాడుతూ పరిగెత్తుకు వచ్చింది రాధిక.
రాధిక, వంశీ ఇద్దరూ మెడికల్ కాలేజీలో క్లాస్‌మేట్స్. హౌస్‌సర్జన్సీ కూడా కలిసి చేస్తున్నారు. ఇద్దరూ చాలా క్లోజ్‌ఫ్రండ్స్ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. వంశీ కుటుంబం, రాధిక కుటుంబం కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. రెండు కుటుంబాలూ ఒకే ఊరిలో ఉండటం వల్ల, అన్యోన్యంగా ఫంక్షన్స్‌లో కలవటం, చిన్న చిన్న ట్రిప్‌లకు కలిసి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉండేవారు. రాధిక, వంశీ అంత స్నేహంగా ఉండటం రెండు కుటుంబాల వాళ్ళకూ ముచ్చటగా ఉండేది.
రాధిక చిన్నప్పటి నుంచీ మంచి మాటకారి. గలగల పారే సెలయేరులా ఎప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. మనసులో ఉన్న ఏ అనుభూతినీ దాచుకోవటం చేతకాదు. పుటలు విప్పిన పుస్తకంలా అన్నీ తేటతెల్లంగా మాట్లాడుతుంది.
వంశీ అందుకు పూర్తిగా వ్యతిరేకం. తను ఏం మాట్లాడినా తూచితూచి మాట్లాడుతాడు. ఏ విషయంలోనూ తొందర పడడు. వంశీ, రాధికా ఐదేళ్ళుగా కలిసి చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరి అనుబంధం రోజురోజుకూ పటిష్టమవుతున్నది. ఏ పని చేసినా కలిసి చేసేవారు. కలిసి లైబ్రరీకి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, ఇలా అన్ని పనులూ కలిసి చేయటంతో ఒకరినొకరు వదిలి ఒక గంటసేపుకూడా ఉండలేనంత దగ్గరయ్యారు. ఆ స్నేహం, అభిమానం, ప్రేమగా మారుతోందని, ఇద్దరూ గమనించారు. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు, త్వరలో వాళ్ళిద్దరికీ పెళ్ళిచేయాలని ఆశపడుతున్నారు.
అనుకున్నట్టుగానే ఇద్దరికీ న్యూయార్కు సిటిలో రెసిడెన్సీలు వచ్చాయి. రాధికకు పీడియాట్రిక్ రెసిడెన్సీ, వంశీకి సర్జరీ రెసిడెన్సీ – అయితే ఇద్దరికీ వేరు వేరు హాస్పిటల్సులో వచ్చాయి.
పెద్ద వాళ్ళింక ఇద్దరికీ వివాహం చేసి పంపిద్దామని ఎంతో ప్రయత్నించారు. కాని రెసిడెన్సీ పూర్తి చేశాక గానీ వివాహం సంగతి ఆలోచించమని ఖచ్చితంగా చెప్పేశారు రాధికా, వంశీ! ఎంత ప్రయత్నించినా ఒప్పుకోకపోయేసరికి, రాధిక నాన్నగారు ఒక ఒప్పందానికి వచ్చారు. ‘‘ఇప్పుడెలాగూ ముహూర్తాలు లేవు – వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి. మీ ఇద్దరూ ఒక రెండు వారాల సెలవులో వచ్చి వెళ్ళండి. అప్పుడు మారేజి సెరిమనీ ఏర్పాటు చేయవచ్చు’’ అన్నారు. వారిద్దరి కుటుంబాలూ వచ్చే మాఘమాసం కోసం ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టాయి.
న్యూయార్కు సిటీకి ఇద్దరూ కలిసి బయలుదేరినా అక్కడ రెండు హాస్పిటల్సు దూరదూరంగా ఉండటంతో చెరి ఒక అపార్టుమెంటులో ఉండాల్సి వచ్చింది. వంశీకి, సర్జరీ రెసిడెన్సీలో రోజు విడిచి రోజు నైట్ కాల్స్ ఉండేవి. రాధిక కూడా తన వర్క్‌తో బిజీగా ఉండటంతో ఎప్పుడో కాని కలవటం కుదిరేది కాదు. సెలవు దొరికినప్పుడు మాత్రం ఏదో రకంగా కలిసి టైమ్ గడిపేవారు. రోజుకు ఒక సారయినా ఫోన్‌లో మాట్లాడుకునే వారు.
‘‘ఏయ్ వంశీ! నేను దూరంగా ఉన్నానని ఏమీ పిచ్చి వేషాలు వేయటం లేదుగా! తెల్ల అమ్మాయిలకేమీ సైట్ కొట్టటం లేదుగా? అందంగా వడ్డూ పొడుగూ ఉన్న డాక్టరబ్బాయిలను వలలో వేసుకోవటానికి వయసులో ఉన్న అమ్మాయిలు ప్రయత్నిస్తారట. జాగ్రత్త! వేరే హాస్పిటలు కదా నాకేమీ తెలియదనుకుంటావేమో? నేను అన్నీ కనుక్కోగలను!’’ అని దబాయించేది రాధిక.
‘‘రాధీ! కంటినిండా నిద్రపోవటానికే టయిమ్ లేదు – ఇంక సైట్‌కొట్టే ఛాన్సు ఎక్కడుంది?’’
‘‘అంటే ఛాన్సు దొరికితే సైట్ కొట్టాలనే ఉందన్నమాట?’’
‘‘అవును నీ ఇష్టమేమిటి? నాకిక్కడ ఒక అందమయిన నర్సుతో పరిచయమయింది! ఏం చేస్తావు నువ్వు?’’
‘‘ఏయ్ వంశీ! నేను రాక్షసిలా వచ్చి ఆ అమ్మాయిని కరిచేస్తాను తెలుసా? పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావు! అసలు నిన్ను ఇక్కడ దాకా తీసుకు రావటం తప్పయిపోయింది. అక్కడే సత్యభామ దగ్గర వదిలేసి రావలిసింది!’’ అన్నది రాధిక.
మెడికల్ కాలేజీలో ఉండగా వాళ్ళ క్లాసులో సత్యభామ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి వంశీ అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు కనపడేది. వంశీతో మాటలు కలిపి ఏదోవిధంగా దగ్గరవ్వాలని ప్రయత్నించేది. రాధికా, వంశీ ఇద్దరూ ఆ విషయం గమనించారు.
సత్యభామా వాళ్ళ నాన్నగారు హైకోర్టు జడ్జిగా పని చేసేవారు ఆ అమ్మాయి రోజూ కాలేజికి కారులో వచ్చేది. అందుకే రాధిక ఎప్పుడూ జోక్ చేస్తూ ‘‘సత్యభామని పెళ్ళిచేసుకో, నీకు బోలెడంత కట్నం వస్తుంది’’ అనేది.
ఆరు నెలలు గడిచిపోయాయి. అది డిసెంబరు నెల. ఆ సంవత్సరం చలి చాలా ఉధృతంగా ఉంది. ఆ చలికి అలవాటు పడటం రాధికకు చాలా కష్టంగా ఉండేది. రికార్డు బ్రేక్‌లాగా, ఆ సంవత్సరం డిసెంబరులోనే ఇరవై అంగుళాల స్నో పడింది. ఎక్కడ చూసినా పిండారాబోసినట్టు తెల్లటి స్నో. ఎండిపోయిన చెట్లకొమ్మల మీద వెండి జరీపోగులు పోసినట్టు అందంగా చూడటానికి చాలా బాగుంది. కాని అపార్టుమెంటు నుంచి హాస్పిటలు వరకూ నడిచి వెళ్ళటానికి కూడా రాధికకు చాలా కష్టమయిపోయేది. లాంగ్ కోటు వేసుకుని, చేతులకు ఉన్ని గ్లౌప్స్, లాంగ్ బూట్సు, తలకు ఉన్ని క్యాప్ పెట్టుకుని రడీ అయితే తప్ప బయటకు వెళ్ళటానికి వీలయ్యేది కాదు. ఇండియాలో హవాయి చెప్పులు వేసుకుని, ఎలా ఉంటే అలా బయటకు పరుగెత్తుకు వెళ్ళటం ఎంత హాయిగా ఉండేది అనుకునేది. హాస్పిటలుకు, అపార్టుమెంటుకు చాలా దగ్గర కనుక రాధిక రోజూ వర్క్‌కు నడిచి వెళ్ళేది, సెలవు రోజు మాత్రం కారు బయటకు తీసి, గ్రోసరీసుకు కాని, వంశీ వాళ్ళ హాస్పిటలుకు కాని వేళ్ళేది రాధిక.
ఆరోజు ఆదివారం రాధికకు సెలవు రోజు. శనివారం రాత్రి నైట్ డ్యూటీ చేయటం వల్ల ఆదివారం ఉదయానికల్లా ఇంటికి వచ్చేసింది. వంశీ ఆదివారం సర్జరీ డ్యూటీ చేస్తున్నాడు. అతన్ని చూసి వారం పైగా అయిపోయింది. త్వరలో రడీఅయి వాళ్ళ హాస్పిటలుకు వెళదామనే ప్రయత్నంలో ఉంది రాధిక.
ఇంటికి వస్తూనే వంటచేసి వంశీకి ఇష్టమయిన ఐటమ్స్ తయారుచేసింది. స్నానంచేసి రడీఅయి, క్యారియర్ పట్టుకుని వంశీ పనిచేసే హాస్పిటలుకు బయలుదేరింది రాధిక. అంతకు ముందు రోజు పన్నెండు అంగుళాల స్నో పడింది. ఆ రోజు మాత్రం స్నో పడలేదు. ఎందుకంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ 10డిగ్రీల ఫారన్ హీట్‌లో ఉంటుంది. ఎముకలు కొరికేసేంత చలి. అంత చలిగా ఉన్నప్పుడు స్నో పడదు. కాని పడిన స్నో అంతా ఐస్‌గా గడ్డకట్టి పోతుంది. మెయిన్ రోడ్డులో చాలా త్వరగా ఐస్ స్క్రేపర్స్‌తో క్లీన్ చేశారు. చిన్న చిన్న సెకండరీ రోడ్లన్నీ ఐజీగా ఉన్నాయి. ఆ ఐస్ మీద డ్రైప్ చేయటం చాలా కష్టమయిన పని. ఎంత జాగ్రత్తగా ఉన్నా వీల్స్ స్లిప్ అయి కారు కంట్రోల్ తప్పే అవకాశం ఉంది.
రాధిక త్వరగా పార్కింగ్ లాట్‌కు వెళ్ళి కారు బయటకు తీసి బయలు దేరింది. ఒక మైలు దూరం వెళ్ళాక మెయిన్ రోడ్డులో నుంచి మరొక చిన్న రోడ్డులోకి తిరగాలి. ఆ రోడ్డంతా చాలా ఐసీగా ఉంది. సడెన్‌గా రాధిక కారు చక్రాలు ఐస్ మీదపడి, కారు 180 డిగ్రీలు తిరిగి పోయి, ఆపోజిట్ డైరెక్షన్‌లోకి వెళ్ళింది. ఎదురుగా వస్తున్న కారు సడన్ బ్రేక్ వెయ్యటానికి ప్రయత్నించినా కారు ఆగకుండా హెడ్ ఆన్ కొలిషన్ జరిగిపోయింది. రాధిక వీల్ దగ్గర స్పృహతప్పి పడిపోయింది. ఇదంతా ఒక్క నిమిషంలో జరిగిపోయింది.
ఆంబులెన్స్‌లో రాధికను వెంటనే హాస్పిటలుకు తీసుకువెళ్ళారు. ఎదుటి కారు డ్రైప్ చేస్తున్న ఆయనకు చిన్న చిన్న గీతలు. పెద్ద దెబ్బలేమీ తగలలేదు. రాధిక మాత్రం స్పృహలో లేదు. ఎమర్జెన్సీ రూమ్‌లో వెంటనే ఊపిరి అందటం కోసం, గాలిగొట్టంలోకి ఎండో ట్రకియల్ ట్యూబ్ వేశారు. సెలైన్ స్టార్టు చేసి బి.పి. స్టేబుల్‌గా ఉన్న తరువాత ఎక్స్‌రేలకు పంపించారు. వెన్నెముకకూ, తలకూ ఎమ్.ఆర్.ఐ చేశారు. వంశీకి తెలియపరచటంతో అతను హాస్పిటలులో స్పెషల్ పర్మిషను తీసుకుని రాధిక దగ్గరే ఉండటానికి వచ్చాడు.
ఎమ్.ఆర్.ఐ చేసిన తరువాత తెలిసింది రాధికకు స్పైనల్ ఫ్రాక్చరు అని. అదీ మెడ వెనుక భాగంలోని వెన్నెముక ఫ్రాక్చరు కావటంవల్ల, ఆమె రెండు చేతులూ, రెండు కాళ్ళూ కూడా కదిలించలేక పోతోంది.
రాధికను ఇంటెన్సిప్ కేర్ యూనిట్‌లో అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌తో బ్రీదింగ్, సెంట్రల్ లైన్‌లో ఇంట్రావీనస్ ప్లూయిడ్స్ ఇస్తున్నారు. ఆమె పరిస్థితి స్టేబుల్‌గా ఉందని చెబుతున్నారు వంశీకి.
రెండు రోజుల తరువాత రాధికకు స్పృహ వస్తున్న సమయంలో బ్రెయిన్ యాక్టివిటీ పరీక్ష చేశారు. బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్‌గా ఉందని తెలిసింది. కాని రెండు కాళ్ళూ, రెండు చేతులూ పారలైజ్ అయిపోయాయి. ఆమెకు ‘‘క్వాడ్రీప్లీజియా’’ అని నిర్ణయమయింది. ఊపిరితిత్తులకు గాలి అందటం కోసం, గాలిగొట్టం ఓపెన్ చేసి పర్మనెంటు ట్రకియాస్టమీ చేయాల్సి వచ్చింది.
వళ్ళంతా ట్యూబ్‌లతో, నిస్సహాయంగా పడుకుని ఉన్న రాధికను చూస్తే వంశీ గుండె తరుక్కుపోతోంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి. ఆప్తులెవరూ దగ్గరలేని పరాయి దేశంలో తన ప్రాణానికి ప్రాణమయిన రాధికను ఆ పరిస్థితిలో చూస్తూ ఉంటే వంశీకి మతిపోతోంది. ఇరవై నాలుగు గంటలూ ఆమె దగ్గరే గడుపుతున్నాడు. ఇంత జరిగినా ఇంటికి ఫోన్‌చేసి చెప్పలేక పోయాడు. అంతదూరంలో ఉన్నవాళ్ళు భయపడి బాధపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. రాధిక కొంచెం కోలుకున్నాకే నెమ్మదిగా చెప్పవచ్చని అనుకున్నాడు. హాస్పిటలు స్టాఫ్ అంతా ఎంతో శ్రద్ధగా ఉన్నారు. వంశీకి అన్ని విషయాలూ వివరంగా చెబుతున్నారు.
రాధికను ఇంటెన్సిప్‌కేర్ యూనిట్ నుంచి రీహాబ్ యూనిట్‌కు మార్చారు. రీహాబ్‌లో దాదాపు ఆరు వారాలు పైగా ఉండాలన్నారు.
రీహాబ్ యూనిట్‌లో చేరిన దగ్గర నుంచి రాధిక చేత ఉదయం నుంచి సాయంత్రం వరకూ రకరకాల ఎక్సర్‌సైజెస్ చేయించే వారు. చేతులకూ కాళ్ళకూ కండరాలకు బలం పెరగటానికి, వివిధ రకాల ఎక్సర్‌సైజ్‌లు నేర్పించారు. సపోర్టుతో పట్టుకుని నడిపించటం మొదలుపెట్టారు. స్పీచ్ తెరపిస్టు వచ్చి(ట్రేకియాస్టమీజరిగాక) మాట్లాడటానికి ట్రయినింగు ఇస్తున్నారు.
రాధిక చాలా ఓపికగా ఉత్సాహంగా చెప్పినవన్నీ చేసేది. ఎప్పుడూ పాజిటిప్ ఫీలింగు తప్ప ఆమెలో నిరాశా నిస్పృహ కనిపించేవి కావు. రిహాబ్ యూనిట్‌లో ఉన్న వారందరితో ఆమెకు స్నేహం ఏర్పడింది.
అక్కడ ఉన్న మిగతా పేషెంట్లకు కూడా ఆమె ఇన్సిపిరేషను కలిగించేది. ట్రయినర్ చెప్పిన టైంకంటే కూడా ఎక్కువసేపు ఎక్సర్ సైజులు చేసేది. ఏ నాటికయినా లేచి నిలబడి నడవగలను అనే పట్టుదల ఆమెలో కనిపించేది. రాధిక ఏదైనా త్వరగా గ్రహిస్తుంది. దానికి తోడు ఆమె ఏకాగ్రతా, కార్యదీక్షా కలిసి ఆమె అనుకున్నది తప్పక సాధించగలదు అనిపించేది.
ఏ నిరాశా, నిస్పృహలకూ చోటివ్వని ఆమె ఉత్సాహాన్నీ, మనోబలాన్నీ చూస్తే అక్కడి స్టాఫ్ అందరికీ ముచ్చటవేసేది.
వంశీ గంటలు గంటలూ రాధిక బెడ్ దగ్గరే గడిపేవాడు. అతను రెసిడెన్సీ నుంచి నాలుగు నెలలు సెలవు తీసుకుని రాధికకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత దాచాలని ప్రయత్నించినా అతని ఆంతర్యంలోని దిగులూ, బాధా అతని ముఖంలో వ్యక్తమవుతూనే ఉండేవి.
‘‘వంశీ! నీ వలా దిగులుగా అన్నీ పోగొట్టుకున్న వాడిలా ఆ ఏడుపు ముఖం పెట్టుకుని నా దగ్గరకు రావద్దు. ఎవరో డెత్ బెడ్ మీద ఉన్నట్టు ఎందుకా కన్నీళ్ళు? ఇందులో నీ తప్పేమీ లేదు వంశీ! జరగవలసింది జరుగుతుంది. నిన్ను నీవలా శిక్షించుకుంటా వెందుకు? నవ్వుతూ మాట్లాడగలిగితేనే నా దగ్గరకు రా! లేకపోతే అసలు రావద్దు’’ అన్నది రాధిక.
‘‘అలాగే రాధీ! పాజిటిప్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. అసలు నువ్వూ నేనూ కలిసి ఏదైనా సాధించగలం, ఉయ్ కెన్ బీట్ దిస్ ఆర్డియల్!’’
రాధిక ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాట మనసులోనే మిగిలిపోయింది.
‘‘పిచ్చి వంశీ! ఇంకా నువ్వూ నేను ఏమిటి? ఆ కలలన్నీ ఏనాడో కరిగి పోయాయి. ఇప్పుడు నా ప్రయత్నమంతా, ఎలాగైనా నిన్ను వప్పించి జీవితంలో సెటిల్ అయేట్టు చూడటం’’ అనుకున్నది రాధిక మనసులో!
‘‘సరైన టైం వచ్చినప్పుడు వంశీని ఎలాగైనా వప్పించాలి. పాపం వంశీ వర్క్ ప్రెషరూ, నా ఆరోగ్యం ప్రెషరూ వీటన్నిటితో సతమతమవుతున్నాడు! అతనికి కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రా దొరికి ఎన్నాళ్ళయిందో?’’
జీవితంలో ఎంతో పోగొట్టుకున్న రాధిక ఎప్పుడూ మాయని చిరునవ్వుతో ఎనలేని పట్టుదలతో ముందుకు సాగిపోతోంది! అప్పుడప్పుడూ కొంత విసుగూ, విషాదం వెలికి రావటానికి ప్రయత్నించినా, దానిని అధిగమించి అణచివేసే శక్తిని సంపాదించుకుంది రాధిక!
ఆమెకు మోటరైజ్‌డ్ వీల్ చెయిర్ ఇచ్చారు. దానితో హాస్పిటలులో అన్ని చోట్లకు వెళ్ళగలుగుతోంది స్పీచ్ థె¸రపీ వల్ల మాట కూడా బాగా వస్తున్నది. తన పని తను చేసుకోగలిగే స్థితికి వచ్చింది రాధిక. త్వరలోనే రీహాబ్ సెంటరు నుంచి కూడా రిలీజ్ చేస్తామన్నారు.
ఒకరోజు రాధిక ‘‘వంశీ! నాకు ఒక ముఖ్యమైన కోరిక ఉంది! తీరుస్తావా?’’ అని అడిగింది.
‘‘రాధీ! నీ కోసం ఏదైనా చేస్తాను! చెప్పు! ఏం కావాలో!’’
‘‘ప్రామిస్?’’
‘‘ఆ! ఆ!! ప్రామిస్’’
‘‘వంశీ! అమ్మా, నాన్నా, అత్తయ్య వాళ్ళంతా వచ్చే మాఘమాసంలో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాం, మీరు సెలవు తీసుకుని రండి అని చెప్పేవారు గుర్తుందా? అలాగే ఈ మాఘమాసంలో నీవు పెళ్ళి చేసుకోవాలి!’’
‘‘అదెలా కుదురుతుంది రాధీ! నీ ఆరోగ్యం కుదుటపడాలి కదా! ఇప్పుడు మన పెళ్ళికి తొందరేముంది? నీవు అంతదూరం ప్రయాణం చేసే స్థితిలో లేవు కదా!’’
‘‘పిచ్చి వంశీ!’’ నా జీవన ప్రయాణం ఇక్కడితో ఆగిపోయింది. ఎక్కడికీ పయనించే ఓపిక నాకు లేదు. నీవు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళిచేసుకో. అది నేను బ్రతికుండగానే చూడాలి. అదే నా బలమైన కోరిక!’’ అన్నది.
‘‘రాధీ! నీ కేమయినా మతిపోయిందా? నేను ఇంకొకళ్ళను చూసిపెళ్ళి చేసుకోవటమేమిటి? నీకూ, నాకూ శాస్త్రోక్తంగా పెళ్ళి జరగకపోయినా మనిద్దరి జీవితాలూ ఏనాడో ముడిపడి పోయాయి. కష్టంలోనూ, సుఖంలోనూ మనిద్దరం భాగస్వాములం. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?’’
‘‘వంశీ! నీవు నాకు ప్రామిస్ చేశావు నా కోరిక తీరుస్తానని!’’
‘‘రాధీ! మనకు ఇది వరకే పెళ్ళయితే నీవిలా అనగలిగే దానివా? నేను నీ స్థానంలో ఉంటే, నీవు వెళ్ళి వేరే వాళ్ళను పెళ్ళి చేసుకునే దానివా? ఇలాంటి అస్తవ్యస్తమయిన ఆలోచనలు మానేసెయ్యి!’’
‘‘అదికాదు వంశీ! నీ కెంతో భవిష్యత్తు ఉంది. నాలాంటి అవిటి దానితో నీ జీవితాన్ని వృధా చేయకు ప్లీజ్! నీవు సుఖంగా ఉన్నావంటే నా మనసంతా సంతోషంతో నిండిపోతుంది. నిన్ను కట్టిపడేస్తున్నాననే గిల్ట్‌ఫీలింగ్‌తో నన్ను కృంగదీయకు. ప్లీజ్ ఆలోచించు వంశీ!’’
‘‘నాకేది సంతోషమో నీకు తెలియదా రాధీ? నీ శరీరాన్ని కాదు, నీ మనసుని ప్రేమించాను నేను. నీ మనసు కావాలి నాకు – అవిటితనం మనసుకు లేదు! రాధీ నీవు నడవ లేకపోయినా, నీ మనసు ఆలోచిస్తోంది! నీ హృదయం స్పందిస్తోంది!! అన్నిటినీ మించి, నీ కళ్ళలోకి చూస్తూ ఉంటే ప్రేమ అనే ప్రియభావన కనిపిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి? నిజంగా, మనం చాలా అదృష్టవంతులం. ఆ యాక్సిడెంటు వల్ల, నీవు నాకు లేకుండాపోతే, నేను ఏమయిపోయే వాడినో? రాధీ, నీవు నడవలేకపోతే, నా అడుగులో నీ అడుగు నేను వేయిస్తాను. నీవు రాయలేకపోతే నీ కలానికి నా చేయి ఆలంబన ఇస్తాను! అంతేకాని, నీ నుంచి నన్ను దూరం చేయటానికి ప్రయత్నించకు! నీ పిచ్చి ఆలోచనలతో నాకంత పెద్ద శిక్ష వేయకు! అసలూ, నిజం చెప్పు! నన్ను వదిలి నీవు ఉండగలవా? నేను నీతో కష్టపడి పోతానేమోనని, పెద్ద త్యాగం చేసి, నన్నెవరికో అంటకట్టాలని చూస్తున్నావు! కానీ ఈ సమయంలో నీకు నేనూ, నాకు నువ్వూ ఎంత అవసరమో ఆలోచించావా?’’ అన్నాడు వంశీ.
‘‘అదికాదు వంశీ! నీవు పిల్లాపాపలతో, కుటుంబ జీవితంతో సంతోషంగా ఉండాలని నా ఆశ! అలా నిన్ను చూస్తూ నేను ఆనందంగా గడిపేయగలను!’’
‘‘పిల్లలే కావాలనుకుంటే ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమయిన పిల్లలు చాలామంది ఉన్నారు! వాళ్ళను పెంచుకుని మన ప్రేమను పంచి ఇద్దాం.’’
ఎన్నిసార్లు ఆ టాపిక్ తీసుకొచ్చినా అలా జరిగేది సంభాషణ. రాధిక అతన్ని పెళ్ళికి ఒప్పించటానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయింది.
రాధికను రీహాబ్‌సెంటరు నుంచి రిలీజ్ చేశారు. వంశీ రాధికను తన అపార్టుమెంటుకు తీసుకువెళ్ళాడు. వంశీ అపార్టుమెంటు దగ్గర వీల్ చెయిర్ వెళ్ళటానికి వీలుగా రాంప్ ఉంది.
బెడ్‌మీద నుంచి వీల్ చెయిర్‌లోకి హెల్ప్ చేస్తే రాధిక చాలా వరకూ తన పనులు తాను చేసుకోగలుగుతోంది.
తన కాళ్ళూ, చేతులూ ఉపయోగించ లేకపోయిన కొరత కనిపించకుండా వంశీ రాధికకు సహాయం చేస్తున్నాడు. టైపు చేయటానికి ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించి, కంప్యూటర్ ఉపయోగించటం నేర్చుకున్నది రాధిక – వంశీ, వాయిస్ కమాండ్‌తో పనిచేసే కంప్యూటర్ కొన్నాడు – రాధికకు స్నానానికి ఏర్పాటుచేయటం, వంట చేసి తనే స్వయంగా తినిపించటం లాంటి పనులన్నీ చేస్తున్నాడు వంశీ!
కాలం గడిచిన కొద్దీ ఇద్దరి జీవితాలు ఒక గాడిలో పడటం మొదలయింది. ఇద్దరూ ఒక రొటీనుకు అలవాటు పడ్డారు.
రాధిక పీడియాట్రిక్ చెయిర్‌మన్ ను కలిసి సలహా అడిగింది. ఆయన ఆమె పరిస్థితిలో సైకియాట్రిక్ రెసిడెన్సీ అయితే బాగుంటుందన్నారు. సైకియాట్రీ చెయిర్‌మన్‌కు ఆయన స్వయంగా వెళ్ళి రికమెండు చేశారు. ‘‘రాధిక వీల్ చెయిర్‌లో ఉన్నంత మాత్రాన ఆమెను తక్కువ అంచనా వేయవద్దని, ఆమె పట్టుదలతో, దీక్షతో పని చేయగలదు’’ అని చెప్పారు. ‘‘ఆమెకున్న మనోనిబ్బరం నేనెక్కడా చూడలేదు’’ అని కూడా అన్నారు.
రాధిక సైకియాట్రీ రెసిడెన్సీలో చేరింది. రోజూ ఉదయం హాస్పిటలుకు వెళ్ళటానికి, నాలుగున్నర గంటలకల్లా లేచి స్నానం అదీ ముగించుకుని, కావలసిన పరికరాలు తీసుకుని వీల్ చెయిర్‌లో బయటకు వచ్చి రాంప్ ఉన్న వాన్‌లో ఎక్కితే వంశీ డ్రైప్ చేసి హాస్పిటలుకు తీసుకు వెళ్ళేవాడు. అక్కడ మళ్ళీ ఎలివేటరులో డిపార్టుమెంటుకు వెళ్ళేది. ఆమె ఉదయం ఏడు గంటలకు అక్కడ ఉండాలంటే, అందరి కంటే ముందు ఆరున్నర గంటలకే వచ్చి తన రౌండ్స్ మొదలుపెట్టేది. రౌండ్స్ చేసేప్పుడు, అటెండింగ్ డాక్టరు అడుగుతున్న ప్రతి ప్రశ్నకూ, ఆమె దగ్గర సమాధానం ఉండేది. రౌండ్స్ అయిపోయాక క్లినిక్‌కు వెళ్ళబోయే ముందు, అందరూ కాఫీ బ్రేక్ తీసుకుంటే, రాధిక ముందే క్లినిక్‌కు వెళ్ళి ఆరోజు చూడవలసిన పేషెంట్ల చార్టులన్నీ చూసేది. తనకున్న హాండీకాప్‌ను అధిగమించటానికి, రాధిక మిగతా రెసిడెంట్ల కంటే రెట్టింపు ఎక్కువ పని చేసేది.
రాధిక పేషెంట్లతో కూడా ఎంతో ఓపికగా ఆత్మీయంగా, ఆర్ద్రతతో మాట్లాడుతుంటే, వాళ్ళు కూడా రాధిక అంటే ఇష్టంగా స్వంత బాధలు వివరంగా చెప్పేవారు. అందుకే ఆమె వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చెయ్యగలిగేది. వాళ్ళని అర్థం చేసుకోగలుగుతున్నదన్న నమ్మకమే వాళ్ళకు సగం ట్రీట్‌మెంటుగా ఉండేది. ఆ సంవత్సరం ఆమెకు ‘‘రెసిడెంటు ఆఫ్ ది ఇయర్’’ అని అవార్డు ఇచ్చారు.
ఇదివరకు పోగొట్టుకున్న ధైర్యం, ఆసక్తి తిరిగి లభిస్తున్నాయి రాధికకు. విధి వైపరీత్యం వల్ల అంగవైకల్యం కలిగినా, మనోధైర్యంతో దానిని అధిగమించవచ్చని, మానసికానందానికి శరీర రుగ్మతలేవీ అడ్డురావని ఆమెకు అర్థమయింది. రాధిక మానసిక స్థితిలో వస్తున్న మార్పులు గమనిస్తున్న వంశీకి ఎంతో తృప్తిగా ఉంది.
ఆరోజు గ్రాడ్యుయేషన్ డే. రెసిడెన్సీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళందరికీ బాంక్వెట్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ స్టాఫ్, డిపార్టుమెంటు చెయిర్‌మన్, అందరూ రాధిక అచీప్‌మెంట్సుకు అభినందించారు. అంతేకాక, ఆమె వారి ప్రోగ్రాములో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఆరోజు వంశీకి ఎంతో సంతోషంగా ఉంది. ఒక పూల బొకే తీసుకుని ఇంటికి వచ్చాడు. ‘‘రాధీ! మనం అమెరికా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మాఘమాసంలో సెలవు తీసుకుని ఇండియా వచ్చి వెళ్ళండీ అని మన వాళ్ళంతా మరీ మరీ చెప్పారు. అలాంటి మాఘమాసాలు నాలుగు వెళ్ళిపోయాయి. ఈ వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి, మన పెళ్ళికి ఏర్పాట్లు చేయమని మన వాళ్ళకు చెప్పనా?’’ అన్నాడు మోకాళ్ళ మీద కూర్చుని రాధిక కాళ్ళ దగ్గర పూలగుత్తి పెడుతూ!
రాధిక చిన్నగా నవ్వి ‘‘నీ ఇష్టం వంశీ! నా బరువు మోయటం నీ కంత సరదాగా ఉంటే నాకు పోయేదేముంది?’’ అన్నది.
‘‘మరయితే నేను సత్యభామ దగ్గరకు వెళ్ళే అవకాశమే లేదా?’’ అన్నాడు వంశీ జోక్‌గా.
‘‘అహా ఆశా! సత్యభామే కాదు, ఏ భామ మీదా నీ చూపు పడటానికి వీల్లేదు.’’
‘‘అదీ స్పిరిట్! మళ్ళీ నా పాత రాధికను చూస్తున్నాను. ఇంకేం భయం లేదు’’ అన్నాడు.
ఆ సంవత్సరం మాఘమాసంలో, రాధిక కుటుంబం, వంశీ కుటుంబం, స్నేహితులూ, ఎంతోమంది ఆత్మీయుల సమక్షంలో జీవితాంతం, ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, కష్టసుఖాల్లో భాగం పంచుకుంటామనీ వాగ్దానం చేసుకుని భార్యా భర్తలయ్యారు వంశీ, రాధికలు.
అనుకున్న ప్రకారం ఇండియాలోనే అమ్మా నాన్నలకు దగ్గరలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
‘‘వంశీ కౌన్సిలింగ్ సర్వీసెస్’’ అనే పేరుతో రాధిక సైకియాట్రీ క్లినిక్ ఓపెన్ చేసింది. యాక్సిడెంట్‌లో కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్న వాళ్ళకూ, వ్యాధుల వలన వికలాంగులైన వాళ్ళకూ కౌన్సిలింగ్ చేస్తోంది రాధిక.
‘‘పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్’’తో బాధపడుతూ, డ్రిప్రెస్‌డ్‌గా ఉన్న వాళ్ళతో, పనిచేసి వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు కోప్ అప్ చేసే స్థితికి తీసుకు వచ్చేది రాధిక.
రాధిక క్లినిక్‌కు ఎదురుగా ‘‘రాధికా రిహాబ్‌సెంటర్’’ అని వంశీ మొదలుపెట్టాడు. చాలా ఆధునిక పరికరాలు పెట్టి ఎంతో మంది వికలాంగులకు తమ స్వశక్తితో మనగలిగే అవకాశాలు కల్పిస్తున్నాడు.
రాధిక, వంశీ జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధిస్తున్నారు. రాధిక తన మిస్ ఫార్చ్యూనిని పాజిటిప్‌గా మార్చుకుని, మనోబలంతో జీవితంలో నిలదొక్కుకోవటానికి వంశీ పాత్ర చాలా ఉంది. *