కాలచక్రం గిర్రుమని తిరిగి పోయింది. నలభై ఏళ్ళ క్రితం మా ఆయన PhD చేయడానికి స్టూడెంటుగా రావడం, ఆయన వెనకాతల చంటిపిల్లని ఎత్తుకొని ‘బారిష్టరు పార్వతీశం’ లాగ నేను రావడం, ఇంగ్లీషు వచ్చినా, అమెరికన్ ఇంగ్లీషు పదాలు – ‘గేస్’, ‘కేబ్’, ‘చీజ్’, ‘క్రీము’ లాంటివి – అర్థం కాకపోవడం, ఈ అమెరికన్ సంఘ వ్యవస్థలో ఎలాగ ఐదు ఏళ్ళు బ్రతకడమా అని భయపడిన రోజులు 60¯ లోవి. ఆ తరువాత అతని PhD, నా MS చదువులు పూర్తిచేయడం, అతనికి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడం, ఇళ్ళుకొనడం, పిల్లల్ని స్కూలుకి, కాలేజీకీ పంపించడం, వాళ్ళకి పెళ్ళిచేసి, వాళ్ళకి పిల్లలు పుట్టిన తరువాత పురిటి పనులు, ‘బేబీ సిటింగ్’లతో నెలలూ, బుతువులూ, సంవత్సరాలూ, దశాబ్దాలు ఎలాగ గడిచిపోయాయో తెలియలేదు. శరవేగంతో కాలం గడిచి పోయిన మూలంగా అనుకుంటాను. మేం వయోవృద్ధులం అవుతామని గాని, వృద్ధులమైన తరువాత ఏమిచేస్తామని గానీ, ముఖ్యంగా రిటైర్మెంట్ గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు.
ప్రతీ ఏటా మా యూనివర్సిటీలో ఉన్న ఇండియన్ స్టూడెంట్లు అందరికీ అక్టోబరు – నవంబరు నెలల్లో ఒక పెద్ద ‘కార్తీక సంతర్పణ’ (గెట్ టుగెదర్) చేస్తాను. ఆ మధ్య ఒక పార్టీలో ఏదో మాట సందర్భంలో ఒక స్టూడెంటు అన్నాడు గదా. ‘‘మా నాన్న గారు అమెరికాకి విజిట్‌కి వస్తానని ఒకే గొడవ చేస్తున్నారు. నేనే రావద్దంటున్నాను. ఆయన చాలా ముసలాయన. అరవై ఏళ్ళు వచ్చేశాయి. అమెరికాకీ ఇంగ్లండ్కీ ఈ ముసలితనంలో ఎందుకండీ?’’ అన్నాడు. ఈ స్టూడెంటు ఉద్దేశంలో అరవై ఏళ్ళు ‘చాలా ముసలి’తనం అయితే, అరవై ఐదు ఏళ్ళు వచ్చిన మా ఆయన ‘‘చాలా, చాలా ముసలాయన’’ అన్నమాట. కాల ప్రవాహంలో ఒకసారి నేను వెనుకీత ఈదాను. నేను ఈ దేశం 25 ఏళ్ళప్పుడు వచ్చినప్పుడు కూడా ఏభై ఏళ్ళే ముసలితనం అనిపించేది. అంతేకాక, ఏభై ఏళ్ళు మాకు ఎప్పుడూ రావనిపించేది. కానీ మాకు ఏభై ఏళ్ళు వచ్చేసరికి, అరవై, డెబ్బై ఏళ్ళు రేపూ, ఎల్లుండి లాగనిపించింది. ఆ పార్టీ అయిన తరువాత మా ఆయనని రిటైరుమెంటు గురించి ఏమైనా ఆలోచించారా అని అడిగాను ‘‘రిటైర్మెంటూ లేదూ, గిటైర్మెంటూ లేదూ – నేను ముసలివాడినీ, ముతకవాడినీ కాదు’’ అని కోపంతో పడుకొన్నారు.
పార్టీ అయిన మర్నాడు మా వారితో జాయిన్ అయిన మరో ప్రొఫెసర్ గారి పెళ్ళాం నాకు ఫోను చేసింది. ‘‘మా వారు ఈ ఏడాది రిటైర్ అవుతున్నారు’’ అని. ఈ కబురు వినేసరికి నాకు షాక్ వచ్చింది. ఎందుకంటే, 38 ఏళ్ళ సర్వీసులో అతను ఎప్పుడూ ‘సబేటికల్’ లీవు కూడా తీసుకోలేదు. జీవితాంతం తన లేబ్లోనే పనిచేస్తానన్న మనిషి రిటైరు అవుతానని ఎందుకు నిశ్చయించుకున్నాడో. భయపడుతూ, భయపడుతూ మా వారు సినిమా పాటలు వింటున్నప్పుడు మెల్లిగా చెప్పాను ‘‘డాక్టర్ చక్రవర్తి గారు ఈ సంవత్సరం రిటైర్ అయిపోతున్నారు’’ అని. ఈ వార్త వినేసరికి మా వారికి నా కంటే పెద్ద షాక్ వచ్చింది. కొంచెం కోలుకున్న తరువాత ఆయన చెప్పినది వింటే నాకు రెండో షాక్ వచ్చింది. ‘‘చక్రవర్తి రిటైర్ అయిపోతున్నాడంటే, నేను కూడా రిటైర్మెంటు గురించి ఆలోచిస్తాను’’ అన్నారు. ఆయన రిటైర్మెంటు గురించి ఆలోచిస్తాను అన్నది ఇదే మొదటిమారు. మరికొంత సేపు అయిన తరువాత ఆయన అన్నారు. నాకు ఒక సెమెస్టరు శెలవు ఉంది. ఆ శెలవు ముందు తీసుకొని, రిటైర్మెంటు ఎలాగుంటుందో ఒక ఆరు నెలలు చూసి, లీవు తరువాత రిటైర్మెంటుకి అప్లై చేస్తాను ఆన్నారు. ఈ ఆరు నెలలు సెబేటికల్ లీవులో డిపార్టుమెంటు చుట్టుపక్కలకి వెళ్ళనని శపథము చేశారు.
ఐదేళ్ళ క్రితం షష్ఠిపూర్తి ఆయనకి మా పిల్లలు చేస్తామంటే ససేమిరా వద్దన్నారు, ‘‘ప్రపంచమందరికీ నాకు అరవై ఏళ్ళు వచ్చాయని’’ తెలియాలా అని. ఈ దేశంలో మనం షష్ఠిపూర్తి చేసుకున్నా, లేకపోయినా, ‘అంకుల్ సామ్’ మాత్రం మనకి అరవై ఏళ్ళు వచ్చిన వెంటనే ‘‘హేపీ రిటైర్మెంటు’’ అని మనకి చెప్పడం కాకుండా, అన్ని రకాల వాళ్ళకీ తెలుపుతాడనుకుంటాను. మన వయస్సు ఎంతన్నది మన మిత్రులకి తప్పా అంతమందికి తెలుస్తుంది.
అరవై ఐదు ఏళ్ళు వచ్చిన మర్నాడే మొదటి ఉత్తరం AARP వాళ్ళ దగ్గర నుంచి, మా ఆయనకి అరవై ఐదు ఏళ్ళు వచ్చాయన్న బాధకన్నా, AARPకి ఎలాగ తెలిసిందా అని బాధ ఎక్కువయింది. పుండుమీద కారం జల్లినట్టు ఒకరి తరువాత మరొకరు మా మెయిలు అంతా ‘‘కేర్’’ గురించే – ‘మెడికేర్’ వాళ్ళు ఆరు నెలల్లో రిజిష్టర్ చేసుకోమనీ, ‘హెల్త్‌కేర్’ వారు ఎంత ప్రీమియమ్ కడితే ఏ మందులు దొరుకుతాయో అనీ ‘లాంగ్ టెర్మ్ కేర్’ వాళ్ళు నర్సింగ్ హోమ్‌లో ఉంటే ఎంత అవుతుందనీ, ‘‘ఫ్యూనరల్ కేర్ వాళ్ళు’’ పేకేజ్ డీల్ కొంటే ‘బరియల్ ప్లాట్’ ఫ్రీగా ఇస్తామనీ, ఒక్కక్క దానికి అరవై కంపెనీల నుంచీ ఉత్తరాలే ఉత్తరాలు వచ్చేవి. ఇదేకాకుండా, ఎప్పుడూ వినని మందుల సాంపిల్స్‌తో మెయిలు బాక్స్ నిండిపోయేది – ‘లిపిటార్’, ‘ఫాసమాక్స్’, ‘వయాగ్రా’లతో!
ఎప్పుడూ మోగని టెలిఫోను కూడా ఆయనకి అరవై ఐదు ఏళ్ళు నిండేసరికి మోగడం ప్రారంభించింది – రిటైర్మెంటు డబ్బు ఏ స్టాక్‌లో పెడితే మంచిదనో, ఏ రిటైర్మెంటు కమ్యూనిటీ బాగుంటుందనో, ఇల్లు ‘డౌన్సైజ్’ చేయమని రియల్ ఎస్టేట్ వాళ్ళూనూ. ఒకమారు ఫ్లోరిడా నుంచి ఒకాయన ఫోనుచేసి ‘ఆర్లేండో దగ్గర మంచి ప్లాట్లు ఉన్నాయి, పది ఏళ్ళలో మూడు వందల శాతం అవి పెరుగుతాయి కాబట్టే మమల్ని కొనమని, ఇంతకీ మీ వయస్సు ఎంతండీ అని అడిగాడు. నేను చెప్పాను గదా ‘నాయనా, నా వయస్సులో పచ్చి అరిటిపళ్ళు కూడా కొనను, నాకు 30 ఏళ్ళ ఇన్వెస్ట్మెంటు ఎందుకనీ’’ అతను నవ్వుకున్నాడు. కొన్ని సందర్భాలలో మాత్రం ఆయన సీనియర్ సిటిజన్ స్టేటస్ బాగా పనికొచ్చేది. ఎవరో పోలీసు వాళ్ళ సంఘం చచ్చిపోయిన పోలీసు వాళ్ళ పిల్లల కాలేజీకి విరాళాలడిగిన వారు, ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చదువుకున్న యూనివర్సిటీ అలమ్నై వాళ్ళు విరాళాలికి ఫోనుచేస్తే నా జవాబు తణుక్కోకుండా ‘‘మేము రిటైర్ అయిన వృద్ద దంపతులం, ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉన్న వాళ్ళమి అనేసరికి, వాళ్ళు ‘సారీ’ అని క్షమాపణ వేడుకొనేవారు.
ప్రపంచంలో ఇంతమందికి మా ఆయన వయస్సు, రిటైరుమెంటు ఉద్దేశం గురించి తెలిసిన తరువాత, బంధుమిత్రులతో చెప్పకపోతే బాగుంటుందా? అందుచేత అందరికీ చెప్పాను – మా ఆయన ‘సబేటికల్ లీవు’ తీసుకుంటున్నారు, దాని తరువాత రిటైర్ అవుదామనుకుంటున్నారు, అని. ఆయన కూడా లీవు తదనంతరం రిటైర్ అవవచ్చునని వాళ్ళ డిపార్టుమెంటు ఛైర్మన్‌కి కూడా చెప్పారు.
ఇంక చూసుకోండీ. వాళ్ళ డిపార్టుమెంటులో జూనియర్ ప్రొఫెసర్లు ఇతని ఆఫీసు స్థలం ఎవరు తీసుకుంటారా అని తగువులు. ఇండియా నుంచి టెలిఫోనులు. ‘‘మీ అమెరికాలో రిటైర్మెంటు వయస్సు లేదు గదా – ఎందుకు రిటైర్ అవుతున్నావు అని. రిటైర్ అవుతున్నావు గదా, ఆరోగ్యం బాగుందా అని మరికొంతమంది. మీ రిటైర్మెంటు ప్రోజెక్ట్స్ ఏమిటి అని మరికొందరూ.
ఆరు నెలలు గబగబా తిరిగిపోయాయి. అతని ‘సబాటికల్ లీవు’ ప్రారంభమయింది. డిపార్టుమెంటు గుమ్మంలో కాలుపెట్టనని అతను శపధం చేశారు కదా. ఒకటి, రెండు, మూడూ, ఎనిమిది వారాలు అయాయి. మొదట్లో చాలా బాగుంది. ఆరు గంటలకి ప్రొద్దునే లేవక్కరలేదు, స్టూడెంటు పేపర్లు గ్రేడ్ చేయక్కరలేదు, కావలసినంత సేపు TV, మూవీలు చూడవచ్చును, బుద్ధి పుట్టినప్పుడు షాపింగ్‌కి వెళ్ళవచ్చును. రిటైర్డు జీవితం ఒక పూలబాటలాగ అనిపించింది..
అంతే రెండు నెలలపాటు చాలా బాగుంది కానీ, మూడో నెల నుంచి బోరు కొట్టింది. షాపింగ్‌కి ఎప్పుడు వెళ్ళడానికి తీరుబడే గానీ, మా ముసలి వాళ్ళకి ఏమి షాపు చేయాలి? ఉన్నవే అందరికీ ఇచ్చేస్తున్నాం. పార్టీలకీ పేరంటాలకీ వెళ్ళడానికి సిద్ధమే కానీ ఎవరైనా పిలవాలి గదా? ‘వీక్ డేస్’లో అందరికీ ఆఫీసులూ, ‘వీకెండ్’లో వాళ్ళ స్వంత పనులలో ఎవరికి ఫోన్ చేసినా ‘ఆన్సరింగ్ మెషిన్లు’ తప్ప మనిషి మాట వినిపించలేదు.
నలభై ఏళ్ళపాటు, అతనికి డబ్బులు ఇచ్చి ఆయన చెప్పే ఫిలాసఫీ పాఠాలు అందరూ వినేవారు. ఇప్పుడు ఉట్టినే చెప్తానంటే అందరూ పారిపోతున్నారు. నడిచే కాలూ, వాగే నోరూ ఉట్టినే ఉంటాయా? నేను ఇంట్లో ఉన్నాను గదా. ఆ స్టూడెంట్లుకి చెప్పవలిసిన పాఠాలు నాకు చెప్పడం ప్రారంభించారు.
పైవాళ్ళయితే తప్పించుకొని తిరుగుతారు గానీ, నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి. అతను ఉద్యోగం చేసేటప్పుడు ఉదయం ఎనిమిది గంటలు అవకుండా ఏదో ‘సీరియల్’ తిని, నేను ఏది లంచ్‌కి ఇస్తే అదే పట్టుకెళ్ళి, సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత రొట్టెల్లో కూర బాగుందా అంటే, లంచికి ఏమితిన్నానో జ్ఞాపకం లేదనే వారు. ఇంట్లో ఉండబట్టి కాబోలు, ‘బ్రేక్ ఫాస్టుకి’ ఇడ్లీ చేస్తావా, దోసె చేస్తావా అని అడగడం మామూలు అయింది అతనికి. ఇంక బ్రేక్‌ఫాస్టు అవకుండా ‘లంచి’కి ఏమిటనీ, వంకాయి ఆవకూర పెట్టి చేస్తావా, వేపడం చేస్తావా అనీ. ఆయనకి కావలసినట్టుగా చేస్తే, ఉప్పు తక్కువయిందనో కారం ఎక్కువయిందనో, కొత్తిమీర వేయలేదనో రోజూ ఒకే సణుగుడు, గొణుగుడూ, ఇంక లంచి ప్రారంభించకుండానే, డిన్నరు ప్లాను ఏమిటని ప్రశ్న. ఏ రోజుకి ఆ రోజు నా వంటకి ఏ వంక పెడతారో అని నాకు దినదిన గండం అయికూర్చుంది.
ఆయన రిటైరు అయిపోతున్నారు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు అన్న సంగతి అందరికీ తెలిసింది గదా. ఒక రోజు అతను హాస్పిటల్‌కి ‘చెక్ అప్’కి వెళ్తే అతని ఫ్రెండ్స్ అందరూ ‘‘రాప్, రిటైరు అవుతున్నావని విన్నాం. ఇక్కడ మాకు చాలామంది వాలాంటీర్లు కావాలి. వచ్చేయి అన్నారు. తెలుగు సంఘం. ఉగాది పండుగ వేడుకలకి వెళ్తే మీరు రిటైర్ అవుతున్నారు గదా, మా సంఘానికి ప్రెసిడెంటు అవండి అన్నారు. మరొకాయన కనిపించి మన టెంపిల్లో మూడో పూజారి లేడు. మీకు మంత్రం, తంత్రం, తెలుసును గదా, ఇక్కడ రెండు మూడు రోజులు పనిచేయండి దైవసేవ అనుకొని అన్నారు అతను. బుషీకేశ్ నుంచి అతని గురువు, ఒక స్వాములారు, ఇక్కడికి వచ్చి ఉండిపో. మాకు ప్రోజెక్ట్‌లు చాలా ఉన్నాయి. నీలాంటి వారు కావాలి అని ఉత్తరం రాశారు.
ఇంక, మా బ్రహ్మచారి సుపుత్రుడు న్యూయార్కు నుంచి వారానికి ఒకసారైనా, అంటాడు గదా, నాన్న రిటైరు అయిపోతున్నారు గదా. మీరు ఇద్దరూ ఇక్కడికి వచ్చేయండి. నా ఇల్లు చూసుకుంటూ, వంటాపెంటా నాకు చేసిపెట్టవచ్చును, అని. ఇంక మా ఏడేళ్ళ మనువరాలి దగ్గర నుంచి ఉత్తరం తాత గారికి: “Thatha, mom tells you are RETARDED.(retirementకి వచ్చిన స్పెల్లింగు పాట్లు.) come stay with us, help with our home work, take us to school” ఇంక మా ఊరులో అయితే ప్రతి ఇండియన్ స్టూడెంటూ ‘‘మాష్టారు, ఎయిర్‌పోర్టుకి రైడు కావాలనో, గ్రోసరీలకి తీసుకు వెళ్ళమనో టెలిఫోనులు. అప్పుడు అతనికి జ్ఞానోదయ మయింది. ఉద్యోగం చెయ్యనివాడికి అన్నీ ఉద్యోగాలే అని. ఉద్యోగంలో ఉన్నవాడయితే ‘‘అబ్బా పనితో చచ్చిపోతున్నా అంటే అందరూ సానుభూతి చూపిస్తారు.’’ రిటైరు అయిన వాడే చాలా బిజీగా ఉన్నానంటే ఎవరూ నమ్మరు. పనీలేదూ, తీరుబడి లేదూ అంటే అర్థం ఇప్పుడు తెలిసింది.
నలభై ఏళ్ళ క్రితం నేను M. Sc అమెరికాలో చేసినా, పిల్లల పెంపకం వాటితో నేను ఎప్పుడూ ఫుల్‌టైమ్’’ ఉద్యోగం చేయలేదు. ఒక రోజు సోఫాలో నేనూ, ఆయనా భ్రమరాంభ – మల్లికార్జునుడు లాగ కూర్చొని TV చూస్తూంటే నాకు ఆలోచన వచ్చింది – నేను ఫుల్‌టైం ఉద్యోగం చేస్తే ఎలాగుంటుందని. మెల్లగా భయపడుతూ మా ఆయనతో అన్నాను. ‘‘మీరు ఇంట్లోనే ఉంటున్నారు గదా, నేనెప్పుడూ ఫుల్‌టైం జాబ్ చేయలేదు గదా. చేస్తే ఎలా గుంటుంది అని. వెంటనే అతను ‘‘అలాగే’’ అనేసరికి ఆశ్చర్యపోయాను. తరువాత నాకు అర్థమయింది మా ఇద్దరి మధ్యా కొంచెం ‘‘స్పేస్’’ కావాలని – ‘‘టూ క్లోజ్ ఫర్ కంఫర్టు’’.
ఆయన ‘సరే’ అనేసరికి, ఎక్కడ లేని ఉత్సాహంతో మా చిన్న ఊరులో ఉన్న రెండో, మూడో డిపార్టుమెంటు స్టోర్లకి ఉద్యోగాన్వేషణకి వెళ్ళాను. నన్ను చూసేసరికి, నా ‘రెస్యూమే’ కూడా చూడకుండా మా దగ్గర రిటైర్డు మనుషులకి ఉద్యోగాలు లేవన్నారు. అబ్బే నేను రిటైరు అవలేదు అన్నాను. అలాగయితే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వీకెండు జాబ్‌లు అసలు లేవన్నారు. లేదండీ, నేను చూస్తున్నది మొదటి జాబే, రెండవది కాదన్నాను. అలాగా అని, మీ వయస్సు చూస్తూ ఉంటే మీరు రిటైర్డు అయిన ఆవిడలాగున్నారు అన్నారు. లేదండీ, నేను రిటైరు అవడానికి ఎప్పుడైనా ఉద్యోగం చేస్తేనే గదా? నాలాంటి దానికి రిటైరుమెంటు ప్రశ్న లేదు అన్నాను నవ్వుతూ. అంతే కదండీ, పెళ్ళిచేసుకుంటేనే కదా విధవ అవడానికి. పెళ్ళిచేసుకోని వాళ్ళకి వైధవ్యం లేదుగా.
నేను సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే, నా ముఖం చూసి మా ఆయన అన్నారు నీకు ఉద్యోగం ఎవరూ ఇచ్చినట్టు లేదే అని. వాళ్ళకి రిటైర్డు మనుషులకి ఉద్యోగాలు లేవుట. మీరు ఇంకా రిటైరు అవుదామా, వద్దా అని ఆలోచిస్తున్నారు. నేన మిమ్మల్ని పెళ్ళి చేసుకొన్న రోజే రిటైర్ అయిపోయాను అన్నాను కోపంగా.
అతను వెంటనే నిన్ను పెళ్ళి చేసుకొన్న మర్నాడు నుండీ మరీ కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను. నాకు రిటైరుమెంటు అంటే ఏమిటో తెలియదు, నీకు ఉద్యోగమేమిటో తెలియదు. ఎవరికి అలవాటు అయిన పనులు వారే చేసుకుంటే మంచిది. ఈ శెలవుల అనంతరం నేను ఉద్యోగంలో జాయిన్ అయి నా రిటైర్మెంటు ఉద్దేశం ఉపసంహరించుకంటాను అన్నారు. అమ్మయ్యా అని ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాను. *