‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా, ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు.
‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే మా రంగం పెట్టికీ, మైలగుడ్డల పెట్టికీ పాలీషు పెడతావని పిలిచాను,’’ అంది అమ్మమ్మ.
‘‘మొన్న పట్నం నించీ ఎద్ద కొట్టాళ్ళు (షోరూమ్) వచ్చారండీ. ఎక్కడన్నా రంగంపెట్టి ఉంటే ఎతికి పెట్టమన్నాడు. ఐదేలిప్పిత్తాను.’’
‘‘ఏదో పనివంతుడివి తింటే పదో పరకో తింటావు గందా అని నిన్ను పిలిత్తే మా కొంపలో వాళ్ళలాగా నువ్వు కూడా నా సామానం మీదే కన్నేశా. పదినిమిషాల్లో మా స్థలం ఖాళీ చెయ్యక పొయ్యావో నిన్ను సావిడూడిసే పొలికట్టెతో కొడతా,’’ అని తిట్లు మొదలుపెట్టింది. దడిసిపోయిన వాసుదేవరావు కథ ఎదురు తిరగటంతో బతుకుజీవుడా అని ఎట్టాగో బయటపడ్డాడు. ఇంతలోకి మా అమ్మమ్మకి నేను దొరికిపోయా.
‘‘ఏవే ఎక్కడ ఆడతన్నా. ఊరిమీద బలి తిరుగుతున్నావా. బెజగాడెల్లే పెరిగావు. పనిపాటల్లేవు. ముసల్ది చేసుకోలేక సత్తందని యావన్నా ఉందా. నీకు ఇవరం ఎప్పుడు వచ్చుద్దే,’’ అని అమ్మమ్మ పురాణం ఇప్పింది.
నన్నేదో అనటం ఇని, ‘‘ఏంజెయ్యాలక్కయ్యా,’’ అంటా పక్కింటో ఉండే మా కవలమ్మమ్మ వచ్చింది.
‘‘ఏంజెయ్యాలా ఆ ఎలిసిమీద సామానం పారేసి ఎన్నాళ్ళ యింది. పోయినేడు కుదరక తోవలా. ఆటి గురించి పట్టిచ్చుకునేది ఎవరు? ఒక్కళ్ళన్నా నా మాట ఇంటేనా. అట్టా వదిలేసి రెండేళ్ళు అయ్యింది. ఎలికలు, బొద్దింకలు, సాలీళ్ళు ఎన్ని గూళ్ళు, గుడ్లు పెట్టినయ్యో. తోవటానికి పనిమనిషి నాగమ్మని రమ్మన్నా. ఈ పిల్లలు ఒకళ్ళూ పైకెక్కి ఒంపుతా, రెండోవాళ్ళందిత్తంటే, నాగమ్మ తువుతుంటే నేను కడగొచ్చొనుకుంటన్నా. మళ్ళీ ఆటిని తుడిసి ఎండలోబెట్టి, కిలువు పట్టకుండా, ఉప్పురవకుండా, నేతిగుడ్డతో తుడవాలి. ఎలిసి దులపాలి. మళ్ళీ కొత్తగుడ్డలు పరిసి సామానం పరవాలి. నా సావు కొత్తంది, ఒక్కదాన్నే సేసుకోలేక.’’
‘‘నేను సెయ్యేత్తాలే అక్కయ్యా,’’ అంటా పనికి మమ్మల్ని పురమాయించారు.
ముందుగా రంగిపెట్టీ మైలపెట్టీ తుడుత్తున్నారు. నేను రంగంపెట్టి ఈపు అరసున్నాలాగా ఉంటే కాసేపు దానిమీద పడుకున్నా. మా ఇంటో భోషాణం పెట్టి, కుండలపెట్టి, మైలగుడ్డల పెట్టి, రాట్నం పెట్టి, గాజుల పెట్టి, బల్లపద్దుల పెట్టి, ఏకులపెట్టి, బొట్టుపెట్టి, ఆఖరిదీ పెట్టెలకే రారాజు రంగం పెట్టి (రంగూన్ పెట్టి). మళ్ళీ దీంటో రకాలు. పూలపెట్టి, నగిషీలపెట్టి, బద్దీలపెట్టి. మా పక్కింటో కవలమ్మమ్మ వాళ్ళది పూలపెట్టి. బద్దీలపెట్టిలో నాలుగొరసలు. వరసకి నాలుగు నించీ ఎనిమిది సొరుగులు. ఒకొరస మొత్తం తీత్తేగానీ రొండో వరస రాదు. రక రకాల అరలు. అమ్మమ్మ మెడలో చంద్రహారం పెట్టికి ఏసినట్టుగా పైన దండ అతుక్కుని ఉంటది. మూలలన ఇత్తడి బద్దీలు మేం రంగూన్ జమిందారులం అన్నట్టు నిక్కు సూపిత్తా ఉంటయ్యి. దస్తావేజులు, పాత పుస్తకాలు, సావుపుటకల కాయితాలు, ఈలునామాలు, అప్పునోట్లు. అన్నిటికీ అదే బ్యాంకీ. ఆఖరి అర తియ్యాలంటే అంతా తెలిసినాళ్ళకి అరగంటయినా పట్టుద్ది. నా పదేళ్ళు వయసప్పుడు మా పక్కింటో ఉండే మా అమ్మమ్మ చెల్లెలు వరసయ్యే కవలమ్మమ్మ రంగంపెట్టి తెరుత్తుంటే చూశా. అప్పటి నంచీ నాకా పెట్టంటే చానా ఇష్టం. పాత విఠలాచార్య సినిమాలో మాంత్రికుడి కొంపలాగా ఉండేది.
రంగంపెట్టి మా ఇంటికి చేరటం కూడా సిత్రవే. కవలమ్మమ్మ వాళ్ళాయనా, మా తాతా పడవల మీద బియ్యం ఏసుకుని రంగం ఎల్లి వత్తావత్తా, మాకు బద్దీలపెట్టి, ఆళ్ళకి పూలపెట్టీ తెచ్చారు. నష్టం వచ్చి యాపారం మానేసినా ఈ చెక్క సామానం గుర్తుగా ఉండిపోయినయ్యి.
ఇంకోటి మైలగుడ్డల పెట్టి. దాన్ని సుండు సీతమ్మగారని మా అమ్మమ్మ స్నేహితురాలు ఆళ్ళ పిల్లలతో పాటు రాజమండ్రి నించీ మాకూ ఒకటి తెచ్చింది. ఇడిసిన గుడ్డలు అందులో ఏత్తే మా రాంకోటి తాత కింద చిన్న తలుపు తీసుకుని గుడ్డలు మూట కట్టుకుని ఎల్లేవాడు. దానికి గాజు అద్దాలు. ఎనక పాత హిందీ సినిమా తారల చిత్రాలు. ఎప్పుడయినా అల్లరి ఎక్కువ చేత్తే అమ్మతో దెబ్బలు పడతయ్యి అనుకున్నప్పుడు గౌనులో ఏరు సెనక్కాయలు పోసుకుని తింటా అమ్మ కోపం తగ్గినాక బయటికి వచ్చేదాన్ని. ఈ రొండూ లేకపోతే మా ఇంటికి అందవే లేదు. మరనాటి పొద్దిన్నే సామానం తోమే పని మొదలుపెట్టారు. అసిగాడు (అన్న) ఎలిసిమీద నించి అందిత్తంటే, నచ్చితే చేతికిత్తన్నా లేకపోతే ఇసిరి ఇసిరి కొడతన్నా, ఆడుకోటానికి ఈలవటల్లేదనే కచ్చతో.
‘‘అట్టా ఇసిరితే, సొట్టలు పడితే అయ్యి ఎందుకూ పనికి రావు. మళ్ళీ కొనుక్కొలేము. వస్తువ అవరదు. నిదానంగా ఇవ్వాలి,’’ అంది కవలమ్మమ్మ.
‘‘దానికేంటి కష్టం జేత్తేగా నెప్పి తెలిసేది. ఒంకిటికెల్లి ఉడకేసుకోటానికి కూడా సట్టీ అవుర్సుకున్నప్పుడు కదా మన బాద అర్థవయ్యేది.’’
‘‘అంతేలే అక్కయ్యా, పిల్లాజెల్లా లేకపోతే కుక్కా నక్కా పిల్లీ దూడా దుక్కీ మీద బెమలు పెంచుకుంటాం. అయ్యీ లేకపోతే బీరువాలు, మంచాలు, కంచాలు, చిప్పలే బందాలు. పొద్దిన లెగిత్తే అయ్యే పలకరిత్తయ్యి. ఆటిమీదే మమకారాలు. ఏదో పక్కింటో నువ్వుండబట్టి ఇంటో లేళ్ళల్లే ఈ పిల్లలు ఎగురుతా, గంతులేత్తన్నారు. ఏదో ఈళ్ళేగా నాకు పిల్లాజెల్లా. మొగుడు ఏ దేశాల మీద తిరిగినా లోటు తెలవటల్లా. ఏది తెచ్చిపెట్టమన్నా తుర్రున పరుగెత్తుతారు. అంతగా అయితే దానికి పెళ్ళయిన తరువాత నే నెలతాలే ఎనకమాల. ఒంటికాయి సొంఠికమ్మునేగా.’’
‘‘దీన్ని నమ్ముకుంటా, గొంతులో నీళ్ళు కూడా పొయ్యదు. నాకూ కూతురుంది. సుకపడతన్నానా. చాకిరీ తప్పిందా. బిడ్డలుండా లేకపోయినా ఒకటే బతుకు. ఉండాళ్ళేవయినా మమ్ముల్ని ఎండి ఉయ్యాలేసి ఊపుతున్నారా, నిన్నూపట్లేదని బాదపడతానికి. అందరిదీ ఒకటే రాత. ఈ బిడ్డలకన్నా మట్టిగెడ్డలు నయ్యం. చాకిరీ జేత్తే ఫలితం సూపిత్తయ్యి. ఇప్పుటాళ్ళు మీద మనవే నయం. తిట్టుకున్నా, తిమ్ముకున్నా పెద్దాళ్ళు మంచాన పడితే శాకిరీ జేసి కూడేశాం. ఇప్పుడన్నీ మొక్కుబడి తంతులు. ముందు ముందు అయ్యి కూడా సూడములే. మాట్టాడితే నా కూతురు సామానం కేజీల లెక్కన మారకం కాటా ఏపిత్తానంటది. ఏనాటినించీ ఏర్పాటు జేసుకున్నాం. ఎన్ని గుర్తులు. అయినా మన బాదలు మడుసుల కన్నా సామానులకే ఎక్కువ తెలుసు,’’ అంది.
సాయంత్రం దాకా అందరం కలసి సత్తా, పడతా సామాన్లు కడగటం సరిపోయింది. అమ్మమ్మకి, కవలమ్మమ్మకీ ఓపికలు అయిపోయినయ్యి. ఇక రేపు తుడిసి సర్దొచ్చులే అని ఇల్లంతా సిందరవందరగా పరిసినట్టు ఒదిలేశారు. మైలుగుడ్డల పెట్టి, రంగంపెట్టీ ఎల్లుండి దులిపి, పాలీషుకి మనిషిని రమ్మని కబురు పెట్టారు. ఇంతలో అమ్మ వచ్చింది. చూసి చిరచిరలాడతా,
‘‘అన్నీ గోతాల్లో మూటకట్టండి. టాక్టరు మీదేసుకెల్లి అమ్మి పడేద్దాం. కొంపంతా బొచ్చలే. ఎదవ సంత. తూకానికి ఓ ఐదారువేలొత్తయ్యి. ఇంకో ఎయ్యి కలిపితే ఎకరం పొలం వచ్చుద్ది. కనీసం మగతా అన్నా ఇత్తారు. పతిసారీ ఐదారుకేజీల ఊక, దబ్బకాయలో నాలుగు, ఎఱ్ఱమట్టి, సబ్బుపొడి, కొబ్బరిపీసు, తోవటానికి ముగ్గురు మడుసులు, దొంగలెవరన్నా ఎత్తుకుపోతారనే బయం. కొంపకి కాపలాగా ఎల్లకాలం ఓ మడిసి. తీరా సర్దినాక డమడమా, బడబడా, ఆటిట్టో ఎలికలు తిరగడం,’’ అని ఇసుక్కుంది.
‘‘ఇయ్యాల అయ్యి అడ్డవయినయ్యని అమ్ముతానంటన్నావు. రేపు ముసలాళ్ళు మయినాక మేవడ్డమని మమ్ముల్నెవరికి అమ్ముతా?’’
‘‘అమ్మా ఇక నువ్వాపు. రోజుకొకసారన్నా వాడనయ్యి ఇంటో అనవసరం. అయినా నేను చెపితే నువ్వింటా. ఎముకలు అరిగే దాకా తోవుకో.’’
‘‘నేను సచ్చేదాకా నా సామానం అమ్మమాక. నీకు ఒద్దకపోతే నేను నా మనవరాలికి ఇత్తా. ఆనాడే దానికి ఒద్దకపోతే తెగ నమ్ముద్ది.’’
అక్కడే ఉండి ఈళ్ళ మాటలింటన్న నేను, ‘‘నాకు మాత్రం కవలమ్మమ్మది రంగంపెట్టి, మైలగుడ్డల పెట్టీ కావాలి. రంగం పెట్టిలో ఉండి ఎండి కాటిక్కాయి, వక్కపొడి డబ్బా, ఎండి పెన్ను, పన్నీరుబుడ్డీ నాకే ఇత్తానందిగా.’’
‘‘తీసుకుని నెత్తిన పెట్టుకు ఊరేగు. నీకొచ్చేవాడు పల్లెటూళ్ళో ఉంటాడనేంటి? ఏ పట్నంవాడో అయితే అగ్గిపెట్టి కొంపలో ఖాళీలేక ఇసిరి రోడ్డుకేత్తాడు. ఈ పెట్టెలు రొండూ పెట్టా లంటే పెద్ద చావిడి కావాలి.’’
‘‘కొంపాగోడూ లేనాణ్ణి ఎతికి తెత్తావా ఏంటి దానికి. మేం ఇద్దరం ఎల్లి సర్ది వత్తాం. అవసరం అయితే సచ్చేదాకా దాని దగ్గిరే ఉండి బూజులు దులిపి కడిగి పెడతాంలే,’’ అంది కవలమ్మమ్మ.
‘‘ఇప్పుడు మాటలూ ఓపికలూ అప్పుడు ఎవరికీ ఉండవు. అయినా దాని సంగతి మీరెట్టా చెబుతారు. ఇక అది కూడా ఏ ఆనందం లేకుండా మీకు మల్లేనే కుండలూ, డబ్బాలు, సట్టిలూ, సిప్పలూ కడుక్కుంటదా. చదువూ, ఉజ్జోగాలు, దేశాల మీద తిరుగుతా, అన్నీ హోటళ్ళలో కొనుక్కుని తినే రోజులొత్తయ్యి. అయినా మీకు మడుసుల మీద కన్నా కుండ, సిప్ప, డిప్పా, సట్టీ, సిబ్బిరేకు, తప్పాళాలల మీదే మోజు. అయ్యే కూడు పెడతయ్యి.’’
‘‘మాకు తెలిసింది ఇదే. మీ బాబులాగా, నీలాగా మమ్మల్ని మా బాబు సదివివ్వలా. ఈటి గురించి తప్ప మాకింకేమి తెలుత్తయ్యి. ఏ ఊళ్ళన్నా ఏలటం రావద్దూ. అయినా నాకు సామానం అంటే ఇష్టం. మల్లీ మాట్టాడావో, అన్నీ పట్టుకుపోయి ఏరే కొంపలో అద్దెకుంటా,’’ అని ఒక్కిసురిసిరింది.
ఎందుకొచ్చిన గొడవ అని అమ్మ కూడా వాదిచ్చలా.