ప్రాధాన్యం

అన్నపూర్ణకి, నాకూ మధ్య తలెత్తిన గొడవ చిన్నదే… అయినా ఇబ్బందిగా, చిరాగ్గా వుంది. తనకీ అలాగే వుంటుందని తెలుసు.

వాళ్ళ ఊరు వెళ్ళటం అన్న చిన్న విషయం ఎందుకు ఇంతగా చిరాకు పెడుతోంది? భార్యాభర్తల మధ్య ప్రయారిటీస్‌ తేడా యేనా? తన కోరికకి, నా కోర్కెలంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదా?

సంక్రాంతి సెలవల వల్ల ప్రయాణపు ఏర్పాట్లు చాలా కష్టమయ్యాయి. నావరకూ నాకు విసుగ్గానే వుంది.

పదేళ్ళు దాటింది నేను ఆ ఊరు వెళ్ళి. రైలు, బస్సు, రిక్షా… ఇలా రకరకాల వాహనాలు ఎక్కాలి. పిల్లలతో కలిసి ప్రయాణం. నానా హైరానా తప్పదు. ఎంతగా నచ్చచెప్పినా, అన్నపూర్ణ మాట వినలేదు.

రైలు బయల్దేరిన కాస్సేపటికి గుర్తించాను… పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా వున్నారు. వాళ్ళవేపు మురిపెంగా చూస్తున్న అన్నపూర్ణ ముఖం నవనవలాడుతోంది. ఈమధ్య అన్నపూర్ణ ముఖంలో అంత మెరుపు చూళ్ళేదు. ఇంట్లో వున్న నలుగురం ఒకర్నొకరు తీరుబడిగా చూసుకోవటమే తగ్గిపోయింది. ఊరు వెళ్ళటమన్న చిన్న కోరిక నేను తీరుస్తున్నందుకు, తనలో ఎంత సంతోషం. ఎన్ని కోరికలు తీరుతున్నా మగవాళ్ళెందుకు ఇంతగా సంతోషపడరు?

ప్రయాణం నేను ఊహించినంత ఇబ్బందిగా లేదు. ఈ పదేళ్ళలో జరగటానికి ఆస్కారం వున్న మార్పుల విషయం నా ఆలోచన్నే తాకలేదు. రైలు దిగిన గంటన్నరలో ఊరు చేరిపోయాం. ఇదివరకైతే గంటలు గంటలు బస్సుల కోసం చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అంచెలంచెలుగా రకరకాల వాహనాలు.

గుమ్మంలో మమ్మల్ని చూసిన పెద్దాయన నారాయణరావు ముఖం వెలిగిపోయింది. ‘తాతయ్యా,’ అంటూ చిన్నపిల్లలా అన్నపూర్ణ ఆయన గుండెల దగ్గర చేరిపోయింది.

కొద్దిసేపట్లోనే పిల్లలిద్దరూ తాతమ్మ, ముత్తాతలతో కబుర్లే కబుర్లు… ఆ పెద్ద ఇల్లు, దొడ్డి కలయతిరిగేశారు.

ఆ సాయంత్రానికి ఇల్లంతా నిండిపోయినంత సందడి. నా ఇద్దరు తోడల్లుళ్ళు, వదినా, మరదలు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఆ రాత్రికే నా ఒక్కగానొక్క బావ మరిదీ కుటుంబ సమేతంగా వచ్చేశాడు. ఇంట్లో అన్ని వయసుల వాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఈ పండక్కి తప్పనిసరిగా రావాలని అందర్నీ పెద్దాయన కొంచెం గట్టిగానే ఒత్తిడి చేసి పిలిపించారు. అలా ఆయన ఎందుకు పిలిచారో ఎవరికీ అర్థంకాలేదు. రకరకాల ఊహా గానాలు సాగాయి. అడిగి తెలుసుకునే చొరవ ఎవరూ చూపించ లేకపోయారు.

మర్నాటి పొద్దున్న, ‘‘రావోయ్‌ రాజారావు, అలా వెళ్ళొద్దాం,’’ అని పిలిచారు.

కాఫీ తాగ్గానే బయలుదేరాం. ఇంకా సూర్యోదయం అవలేదు. కొన్నాళ్ళు మార్నింగ్‌ వాక్‌ చేశాను. అందువల్ల తిరిగి ఈ నడక బాగానే వుంది.

నాకన్నా ముప్ఫై ఏళ్ళు పెద్దవారాయన. ఎంతో చురుగ్గా నడుస్తున్నారు. వెనకపడ్డ నన్ను గమనించి, ‘‘సిటీలో నడక అంత అలవాటు ఉండదు కదూ…’’ అన్నారు. సమాధానంగా చిన్నగా నవ్వాను. ఈమాత్రం తీరుబడిగా నడిచి ఎన్నాళ్ళైందో… ఎప్పుడూ మనసులో ఏదో హడావిడే.

పరిసరాల్ని, పక్కవాళ్ళనీ పరికిస్తూ ప్రశాంతంగా నడుస్తుంటే హాయిగా వుంది. ఊరు పెద్దగా మారలేదు. పెంకుటిళ్ళ స్థానంలో అక్కడక్కడ డాబాలు వచ్చాయి. పాకలు తగ్గినట్టుగా అనిపించింది. పరిసరాలు అంతగా మారకపోయినా, మనుషుల తీరులో మార్పు తెలుస్తోంది.

ఊళ్ళో నాలుగువేపులా వీళ్ళకి పొలాలు వున్నాయి. దక్షిణం వేపు తీసుకెడుతున్నారాయన. దార్లో ఊరివాళ్ళు చాలామంది ఎదురయ్యారు. పెద్దా చిన్నా తేడా లేకుండా వాళ్ళందరూ ఆయనతో కలివిడిగా మాట్లాడుతున్నారు. సలహాలు, సంప్రదింపులు, పలకరింపులు అన్నీ… ఆయనతో ఎంతో ఇష్టంగానే చేస్తున్నట్టుంది.

దక్షిణంవేపు పొలాల పక్కనే పెద్ద మామిడితోట. ఆ తోటకి కంచెలా ఒత్తుగా జీడిమామిడి చెట్లు… కొంచెం దూరంలో కొబ్బరి తోట… ఆ తోటకి ఆనుకునే కొబ్బరిపీచు తీసే పరిశ్రమ.

చాలారోజులకి కంటి ముందు పచ్చటి సౌందర్యం. పైర గాలి… హడావిడి లేని జనం. ఎన్నో జన్మలక్రితం నేనెరిగిన జీవితాన్ని తిరిగి అనుభవిస్తున్నట్టుంది.

అంతా తిరిగి మేం ఇల్లు చేరేటప్పటికి రెండు గంటలు పైనే పట్టింది. ఈ సమయమంతా తాతయ్యగారు నాతోనే వున్నా, మాట్లాడిన మాటలు తక్కువే అయినా, నాకు కొన్ని విషయాలు తేలిగ్గానే అర్థమయ్యాయి.

ఊరంతా ఒక యూనిట్‌గా మార్పు చెందుతున్నట్టు కన బడుతోంది. ఊళ్ళో ఎక్కువమంది వ్యవసాయదారులే. వ్యవసాయంతో పాటు వ్యవసాయాధార చేతిపనుల్లో అభివృద్ధి బావుంది దీని వల్ల. ఆసక్తి ఉన్నవారికి చెయ్యటానికి పనికి లోటులేదు. వీటి వెనుక తాతయ్యగారి కృషి, ఊరివాళ్ళ మాటల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్షంగా నా అనుభవంలోకి ఆయన కావాలనే ఏదో తీసుకు వచ్చినట్టుంది.

ఇంకో రోజు గడిచింది. ఆ ఊరు రావటానికి ఎంతగా విసుక్కున్నానో, అనవసర ప్రయాణమని ఎంత చిరాకుపడ్డానో అదంతా నాలోంచి తొలగిపోయింది.

ఇల్లంతా పిల్లల సందడి. పువ్వులు, తూనీగలు ఉన్న తోటలా వుంది ఇల్లు.

మా పిల్లలు రవీ, శుభల సంతోషం మరీ… వేరే లోకంలో వున్నట్టు సంబరంగా వున్నారు. కొబ్బరాకుల బొమ్మలు, బూరాలు, వామనగుంటలు, తొక్కుడుబిళ్ళ, కోతికొమ్మచ్చి… ఇవన్నీ రవికి, శుభకి కొత్త అనుభవాలు.

మా మావగారు, అత్తగారు ఇంట్లో ఉన్న ఎవరికీ ఏ లోటు రాకుండా వెయ్యి కళ్ళతో అజమాయిషీ చేస్తున్నారు.

అందరం కలిసి వీలున్నప్పుడల్లా ఎటో అటు వెడుతున్నాం. ఓరోజు గుడికి, మరోరోజు తోటకి… ఊరు నాలుగు వేపులా తిరిగి రావటం, కడుపునిండా తినటం… రోజులు తెలియ కుండానే గడిచిపోతున్నట్టుంది.

తినటం ఓ అవసరంలా కాకుండా, ఓ రసాస్వాదనలా వుంది. మామూలు ఫలహారాలే కాక, చిట్టిగారెలు, పోకుండలు, నువ్వుండలు, చిమ్మిలి, మినపసున్నిలాంటివే కాక… జున్ను, కొబ్బరిబొండాలు, ఈతమువ్వ… ఓరకం కాదు… సిటీలోనే పెరిగిన పిల్లలకి సరికొత్త రుచులు… నూతన అనుభవం.

చిన్నపిల్లల్లా మేం గెంతులు వెయ్యకపోయినా, కేరింతలు కొట్టకపోయినా, మా మనసులు అవన్నీ చేస్తున్నాయి. చిన్నతనం లోకి, పసితనపు అనుభవం లోకి, సహజాతాల పరిమళం లోకి తిరిగి ప్రయాణిస్తున్నట్టుంది.

ఈ ఊరు పేరు ‘తేనెపల్లి.’ ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరినిండా పూలతోటలు, తేనెపట్లు ఎక్కువగా ఉండేవని, అందుకే ఆ పేరు వచ్చిందంటారు. ఈ ఊరి ప్రత్యేకత ఉత్తర, దక్షిణాల్లో రెండు పక్కలా పంట కాలువలుండటం.

ఓసారి మా రవి ‘కెనాల్‌’ అంటే ఏమిటని అడిగాడు. వాడికి వివరించి చెప్పినా పూర్తిగా అర్థంకాలేదు. తీసికెళ్ళి ఆ ఊరి కాలవలు చూపించగానే అంతా తేలిగ్గా అర్థమైనట్టు మారింది వాడి ముఖం. తుమ్మెదల నాదం, ఉడతల విన్యాసం, గుంపుగా ఎగిరే పక్షుల సాయం సమయం, వివరించి చెప్పేవి కావు. ఇలా రావటం వల్ల పిల్లలకి ఎంతో మంచి జరిగిందనిపించింది.

మాతో గడిపే నారాయణరావుగారికి, పిల్లలతో గడిపే నారాయణరావుగారికీ ఎంతో తేడా… ఎక్కువసేపు వాళ్ళతోటే… నక్షత్రాలన్నింటినీ తన చుట్టూ పెట్టుకున్న అందంలా… ఆయన వాళ్ళ మధ్య మురిపాల ముత్తాత. ఆ అనుభవం నిష్కల్మషం. అసలు సిసలైన ఆనందం.

కొన్ని కొన్ని కొసల్ని కలిపి జీవితంలో చూసుకోవటం మిస్‌ అవుతుంటాం. ఊరి మనిషిగా నారాయణరావుగారు, కుటుంబ పెద్దగా నారాయణరావుగారు చేసే పనులు వేరైనా, రెండూ ఒక దానికి మరొకటి కొనసాగింపులాగే వున్నాయి. జీవితం పట్ల సరైన కృషి, అవగాహన అది. ఇంటా బైటా కూడా అర్థవంతమైన బతుకది.

పండుగ నాలుగు రోజులూ మరీ బాగా గడిచాయి. గంగిరెద్దుల మేళాలు, రంగురంగుల ముగ్గులూ… పిల్లలూ, పెద్దలూ ఒకటైపోయాం. మానసికంగా, శారీరకంగా ఓ ఆరోగ్యం మధ్య వున్నట్టుంది.

అన్నీ బాగానే వున్నాయి. మేం వెళ్ళే రోజు దగ్గరపడిరది. మమ్మల్నందర్నీ పండక్కోసమే పిలిచారా? ఆయనంతగా ఆయనేం బయటపడ్డంలేదు.

ఆయన పద్ధతుల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇంటికి విరజాజి, జాబిల్లి… ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. నారాయణరావుగారు అలాంటి పేర్లేం పెట్టలేదుగానీ, వీధి గుమ్మం పక్కన పెద్ద శిలాఫలకం ఏర్పాటుచేశారు. తమ కుటుం బంలో ముందుగా ‘తేనెపల్లి’ వచ్చి స్థిరపడిన ఆయన ముత్తాత తండ్రి దగ్గర నుంచీ, ఆయన వరకూ, అందరి పేర్లూ, వివరాలూ ఆ ఫలకం మీద చెక్కి వున్నాయి.

గట్టిగా గుర్తు తెచ్చుకుంటేనేగానీ నాకు మా ముత్తాతగారి పేరు గుర్తురాదు. తాతగారి పేరు చెప్పటానికే చాలామంది తడుముకునే రోజులివి.

ఊరి మధ్య వున్న గుడి గాలిగోపురం మీంచి ఊరంతటినీ ప్రతి సంవత్సరం వివరంగా ఫోటోలు తీయిస్తున్నారు. ఊరికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, నకళ్ళు భద్రపరుస్తున్నారు. ఊళ్ళోని అన్ని కుటుంబాల వివరాలు సేకరించారు. ఏ హడావిడి లేకుండా, ఆయనంతగా ఆయన చేస్తున్న ఈ పనులు… మొత్తం ఊరి తాలూకు తీరుతెన్నుల్ని, ఎదుగుదల, మార్పుల్ని భద్రంగా భావికి అందించే దృష్టి… చరిత్ర విషయంలో అంతగా శ్రద్ధలేని మనకి ఓ ముసలాయన చాదస్తం అనిపించే అవకాశం లేకపోలేదు. కానీ అలాంటి వ్యక్తి ఊరికే మమ్మల్నందర్నీ పిలిచారా?

అదేరోజు మా ప్రయాణం. ఇంకో రెండుగంటల్లో బయలు దేరతాం. భోంచేసి కూచున్నాం. తాతయ్యగారు మా దగ్గరికి వచ్చి కూచున్నారు.

‘‘మీ అందరికీ శ్రమ అవుతుందని తెలుసు. సెలవలు పెట్టి దూరప్రయాణం ఇబ్బందనీ తెలుసు. అయినా మొండిగానే మిమ్మల్ని పిలిచాను. కుటుంబం అంతా ఒక్కసారేనా కలుసు కోవటం అవసరం అనిపించింది. లేకపోతే ఒకే కుటుంబం అయినా ఒకరికొకరం తెలియం. అభిమానం కరువైపోతుంది.

‘‘పిల్లలు ఒకళ్ళనొకళ్ళు పేర్లు పెట్టి పిలుచుకోవటం తప్ప అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, బావా, చెల్లాయి లాంటి పిలుపులకే దూరమైపోతారు. పెద్దవాణ్ణి, ఏదో చేశాను. కష్టం కలిగితే ఏమీ అనుకోకండి…’’ అన్నారు.

బయలుదేరుతుంటే ఏదో ఓ సుఖంలోంచి రొడ్డకొట్టుడు జీవితంలోకి వెడుతున్నట్టుంది. అయినా తప్పదు. పిల్లలు మరీ దిగులు ముఖాలు పెట్టారు.

దేని మీదా గట్టి ప్రేమ లేని జీవితంలో ఏం ఉండదు. తాతగారి బాధ అదే. రుచిలో, స్పర్శలో, నలుగురు కలిసి గడపటంలో, నువ్వెరిగిన పలకరింపులో, ఆనందం సరఫరా అవుతుందన్న ఎరుక తిరిగి మాలో కలిగించే ప్రయత్నమే ఆ పండుగ పిలుపులు.

మళ్ళీ రైల్లో కుదుటపడ్డాం.

‘‘పెట్టుబడులు, కానుకలే కాక… మనకి కష్టం తెలియకూడదని, ఇది కూడా ఇచ్చాడు తాతయ్య…’’ అంది అన్నపూర్ణ. తన చేతిలో నోట్ల బొంతర వుంది.

‘కష్టం తెలియకపోవటమే కాదు… మనకి నిజమైన సుఖం దక్కాలని ఆయన శ్రమిస్తున్నారు,’ అనుకున్నాను.

ఆయన సంపాదించిన డబ్బంతా మాకు పంచాలనుకుంటే ఎంతో తేలికే ఆయనకి. కానీ, ఆయన అంతకన్నా విలువైన వారసత్వం కోసం తపిస్తున్నాడు. ఈ వారంరోజుల అనుభవంతో కళ్ళ ముందు చాలా మెదుల్తున్నాయి. ఆలోచనలో ఎన్నో భావాలు. అన్నింటికన్నా ఆయన తన మునిమనవలందరితో కలిసి నిండుగా మెరిసిన దృశ్యమే గుర్తొస్తోంది.

మునిమనవలు, ముత్తాతలే అరుదైపోతున్న కాలం. ఆయన మరీ అరుదైన ముత్తాత. ఆయనకి నా పిల్లల్ని దగ్గర చెయ్యాల్సిన బాధ్యత నాదికాదా? దీనికి అన్నపూర్ణ కోరికన్న రూపు కావాలా? ఇది నా ప్రియారిటీ అన్న ఆలోచన లేకపోవటం అన్యాయం కాదా?

(వి. రాజారామమోహనరావు 250 కథలు, 17 నవలలు రాశారు. వరద, తెల్లటి చీకటి, మలుపు కథాసంపుటాలు వెలువడ్డాయి. కొన్ని కథలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. 1970లనాటి న్యూవేవ్‌ రచయితల్లో ముఖ్యులు. రేడియో, టీవీలకు రచనలు చేశారు. రైల్వేలో పదవీ విరమణ చేశారు. తెలుగునాడి పత్రికలో ధారావాహికంగా ప్రచురించిన నవలాపరిచయాలతో ‘నవలా హృదయం’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. నివాసం హైదరాబాద్‌.)