ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో సంస్కృత సాహిత్యంలోను, తెలుగు సాహిత్యంలోను, అలంకారశాస్త్రంలోను, గాఢంగా పనిచేసిన భారతీయ పండితుడు ఎవరైనా ఒకరున్నారనుకోండి. ఆయన ఏదో కొంత ఇంగ్లీషు కూడా చదువుకుని వున్నాడనుకోండి. ఆయన చుట్టూ ఇంగ్లీషు చదువుకున్న కొత్త యువకులు ఇంగ్లీషు సాహిత్యాన్ని తెగ పొగుడుతున్నారనుకోండి. ఈ ఇంగ్లీషువాళ్ళ సాహిత్యం యెలా వుంటుందో చూద్దామని ఆ పండితుడు వెళ్ళి అప్పటి కాలేజీలలో ఇంగ్లీషు బోధించే ఒక తెల్లదొరని అడిగాడనుకోండి.’ఇదిగో మా సాహిత్యంలో షేక్స్పియర్ గొప్పవాడు, ఆ మాటకొస్తే మీ కాళిదాసు కన్నా గొప్పవాడు,’ అని షేక్స్పియర్ రాసిన హామ్లెట్ పుస్తకాన్ని ఆ తెల్లదొర ఆయనకిచ్చాడనుకోండి.
ఈ తెలుగు/సంస్కృత పండితుడు స్థూలంగా షేక్స్పియర్ రాసిన హామ్లెట్ చదివి కథ అర్థం చేసుకోగలడు. అప్పటికే కాళిదాసు నాటకాల మీద ఇంగ్లీషులో ప్రతిపదార్థాలు చెప్పి, అందులోని వ్యాకరణం ఇంగ్లీషులో బోధపరచి ఆ నాటకం మొత్తాన్ని తమకు వచ్చిన ఇంగ్లీషులో ముక్కస్యముక్క అనువాదం చేసి ప్రచురించిన వాళ్ళు వుండేవారు. అందులో కొందరు కాళిదాసు నాటకాన్ని వ్యాఖ్యానిస్తూ షేక్స్పియర్తో పోలిస్తే కాళిదాసు గొప్ప నాటకకర్తేమీ కాదని చెప్పేవాళ్ళు. సరిగ్గా ఆ సమయంలో ఇందాక మేము చెప్పిన పండితుడు షేక్స్పియర్ నాటకాన్ని చదివాడనుకోండి.
మీకు ఆ నాటకం ఎలా వుంది అని అడిగితే: ఇదేమి నాటకం? వస్తువు అసభ్యమైన వస్తువు. ఒక రాజు భార్య ఆ రాజు తమ్ముడి వ్యామోహంలో పడి అతనితో రహస్య సంసారం చేస్తూ వుంటుంది. ఆ తరువాత ఆ తమ్ముడు ఆవిడ సహాయంతో రాజుని చంపేస్తాడు. ఆ రాజు చచ్చిపోయిన తరువాత ఈ తమ్ముడు రాజ్యాధికారం తీసుకుని, చచ్చిపోయిన రాజు భార్యని పెళ్ళి చేసుకుంటాడు. ఆ చచ్చిపోయిన రాజు కొడుకు ఈ సంగతి తెలుసుకుని అయినా ఏమీ చేయలేక అసమర్ధుడిగా తన్ను తాను చంపుకుంటాడు. ఇదా కథ! దీనికి కావ్యగౌరవం ఎలా వస్తుంది? ఇందులో రసం లేదు. అలంకారం లేదు. ఉపదేశం లేదు. ఏమీ లేదు. ఇదేదో అనాగరిక జాతి అజ్ఞానంలో పైకి తీసుకొచ్చిన పుస్తకంలా వుంది — అని అంటాడు. దానితో పాటు ఆ ఇంగ్లీషు స్పెల్లింగులు అస్తవ్యస్తంగా వుండటం, ఉచ్చారణకి రాతకి మధ్య ఏ రకమైన పోలిక లేకుండా ఒక చోట ఒక అక్షరానికి ఒక ధ్వని వుంటే అదే అక్షరానికి మరొక చోట మరొక ధ్వని వుండటం ఈ పండితునికి మరీ అనాగరికంగా కనిపించి అవన్నీ ఒక సాంప్రదాయకమైన దారిలో పెట్టుకోలేక పోవటం ఈ జాతి అజ్ఞానానికి మరొక లక్షణం అని నిర్ణయించుకుంటాడు.
ఈ కథ మేము పూర్తిగా కల్పించినది కాదు. ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగాయి. కాకపోతే ఇలాంటి అభిప్రాయాలు చెప్పిన గొంతుకలు పైకి రాలేదు. ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణగారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులో అప్పటి పండితులకి ఇంగ్లీషు గురించి వుండే అభిప్రాయాలు కొన్ని వున్నాయి చూడండి.
పాశ్చాత్య విధానాల్లో రచనలు చేసిన భారతీయుల గురించి కూడా భారతీయ సాహిత్య సంప్రదాయాల మీద విశ్వాసం వున్న మన పాత పండితులకి కూడా ఇలాంటి అభిప్రాయాలే వుండేవి. టాగోర్ గీతాంజలిని ఆదిపూడి సోమనాథరావుగారి (1913) అనువాదంలో చదివి దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, “మహాకవిగా చెప్పుకోదగ్గ సారస్యం యిందులో ఏమీ కనిపించదే,” [1]అని అన్నారట.
ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే రెండు సంస్కృతులకు చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య ఒకరి పట్ల ఒకరికి చక్కటి అవగాహన సాధారణంగా కలగదు. యాత్రికులుగా దూరదేశాలు తిరిగి వాళ్ళ అనుభవాలు రాసిన వాళ్ళ మాటలని చరిత్రకారులు తరుచూ తమ నిర్ణయాలకి ఆధారంగా తీసుకుంటారు. కానీ, అందులో ఉండే ఇబ్బందులు ప్రసిద్ధంగా తెలిసినవే. ఇది కాక, రెండు పెద్ద సంస్కృతులు స్నేహంగా ఒకదానినొకటి కౌగిలించుకునేలాగా ఎప్పుడూ కలవవు. ఒకదానిని యుద్ధంలో జయించటం మూలంగానో లేదా వలస రాజ్యంగా స్వాధీన పరచుకోవడం మూలంగానో కలుస్తాయి. అందుచేత గెలిచిన సంస్కృతికి అధికార ప్రాబల్యమూ, అహంకారమూ, ఓడిపోయిన సంస్కృతి పట్ల నిరాదరణ భావమూ, తృణీకార దృష్టీ వుంటాయి. గెలిచిన సంస్కృతికి పూర్తిగా తనకి పాదాక్రాంతమైన సంస్కృతి మీద కొంత ఆదరణ భావమూ ఒక్కొక్కప్పుడు కొంత మెచ్చుకోలూ కూడా వుండొచ్చు. కాని ఇది కేవలం అనుగ్రహ బుద్ధితో చేసే పని. భారతదేశం పాశ్చాత్య రాజ్యాలని జయించి వుంటే వాళ్ళ సాహిత్యాన్ని మన పండితులు అలంకారశాస్త్ర దృష్టితో చూసి అందుకు ఆ సాహిత్యం నప్పకపోతే దాన్ని తిరస్కరించి, తరువాత దాన్ని కొంత అనుగ్రహ బుద్ధితో ‘సంస్కరించి’ వాళ్ళకి తోచిన రీతిలో నిలబెట్టేవాళ్ళు. కాని చరిత్ర దానికి అవకాశం యివ్వలేదు. కాని ఇంగ్లీషువాళ్ళకి భారతీయ సాహిత్యాన్ని ఉద్ధరించడానికి చరిత్ర అవకాశం యిచ్చింది.
మనకి వలసవాద సంస్కృతి, ఆధునిక సంస్కృతి కలిసి జమిలిగా వచ్చాయి. ఈ రెండింటిలో ఏది ఏదో మనం విడదీసుకోలేకపోయాం. స్వాతంత్ర్య పోరాట సమయంలో మనం కావాలని కోరుకున్నది రాజకీయ స్వాతంత్ర్యమే. మనం ఇంగ్లీషువాళ్ళ వల్లనే ఆధునికుల మయ్యామని, ఇంగ్లీషు లేకపోతే మనం పాతకాలపు మూఢ నమ్మకాలలో కూరుకుపోయి వుండే వాళ్ళమని, మన సాంస్కృతిక నాయకులు నమ్మారు. ఈ నమ్మకానికి పొడిగింపే మనలో ఇంకా మిగిలిపోయిన బ్రౌన్ ఆరాధన. మనదైన ఒక సంస్కృతి ఉన్నదని, దాన్ని అనుసరించాలి కాని పాశ్చాత్య భావదాస్యంలో పడిపోకూడదని మాటలైతే మనకి తరచు వినిపించేవే కాని, ఆ మన సంస్కృతి ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించలేదు. పైగా, వలస పాలకులు అనుగ్రహ దృష్టితో మనకి నేర్పిన కొత్త సంస్కరణలలో ఏవి మనకి పనికి వచ్చేవో, ఏవి చాప కింద నీరులా మన ఆలోచనల్ని మార్చేస్తూంటే, అమాయకంగా ఆధునికత పేరుతో అవన్నీ మనకి అవసరమని మనం నమ్మి, వాటినీ, ఆ సంస్కరణలు తెచ్చిన వాళ్ళనీ ఆరాధనాబుద్ధితో పూజిస్తున్నామో మనకి ఇప్పటికీ బోధపడడం లేదు. పైగా ఈ ‘మన సంస్కృతి’ అనే భావాన్ని రాజకీయం చేసి భారతదేశం లోని ప్రజలందరికీ హిందూ ధర్మం పేరుతో ఒక పెద్ద బండరాయి నెత్తికెక్కించడానికి పనిచేసే రాజకీయ పక్షాలు కూడా మనకున్నాయి. ఆ రకమైన రాజకీయ భావాలు వలసవాదం కన్న ప్రమాదకరమైనవి. ఇన్ని ఆలోచన సమస్యల మధ్య ఈ వ్యాసం రాయడంలో ఉన్న ఇబ్బందులూ, వాటితోపాటు మాకున్న సమాచార పరిమితులూ గుర్తుంచుకుని ఈ వ్యాసం రాస్తున్నాం.
మన గ్రంథ పరిష్కరణ విధానాలు ఎలా వుండాలో కొంత స్థూలంగానైనా చెప్దామని ఈ వ్యాసం మొదలు పెట్టాం. కాని ఆ పని అంత తేలికగా అయ్యేది కాదనీ, అంతకు ముందు చెయ్యవలసినది చాలా వుందని అనిపించింది. మన సాహిత్యంలో మనం అనుసరించవలసిన గ్రంథ పరిష్కరణ విధానాలు వేరే ఉన్నాయా, లేకపోతే పాశ్చాత్య విధానాలే అందరూ అనుసరించదగిన ఆధునిక విధానాలా? అన్న ప్రశ్న వేసుకోవడానికి ముందు మన గ్రంథ లేఖన పఠన పాఠన సంప్రదాయాలు ఎలా ఉండేవో ఆలోచించాలి.
పాతని పునరుద్ధరించాలని, గత రెండువందల సంవత్సరాలలో ఆధునిక నాగరికత పొందిన ప్రయోజనాలని తిరస్కరించాలని, మా అభిప్రాయం కాదు. పాత సాహిత్యాన్ని పాత పాఠకులు, శ్రోతలు ఉపయోగించుకున్న సందర్భాలని తిరిగి బోధపరచుకుని ఆ సాహిత్యం ఏ రకంగా వుండేదో గమనించి దాని మూలకంగా అప్పటి విధానాలని తెలుసుకోవడమే మా ఉద్దేశం. అట్లా బోధపరచుకున్న పద్ధతులు మళ్ళా ఉన్నవి ఉన్నట్లుగా అమలులో పెట్టాలని మా ఉద్దేశం కాదు. ఇంకో మాటల్లో చెప్పాలంటే మాది ఉద్ధారక (revivalist) దృష్టి కాదు, అవగాహక దృష్టి మాత్రమే. మన సాహిత్యం ప్రవర్తిల్లిన పద్ధతులు మనకి అవగాహన అయిన తరవాత అవి మన పుస్తక పరిష్కరణ విధానాలు నిర్మించుకోడానికి అవి పనికొస్తాయని మా ఆలోచన.
ఇంతకు ముందు బ్రౌన్ గురించి మేము రాసిన వ్యాసంలో పుస్తక పరిష్కరణ విషయంలో ఆయన అనుసరింప జేసిన పద్ధతులు, తన దగ్గర పని చేసే పండితుల్ని, లేఖకుల్ని ఆయన వాడుకున్న తీరు, తెలుగు సాహిత్యానికి అపకారం చేసిందని, తెలుగు పండితుల సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బ తీసిందని చెప్పాం. పంధొమ్మిదవ శతాబ్దపు మొదటి కాలం నుంచి ఇరవయ్యవ శతాబ్దపు తొలి కాలం వరకు తెలుగు గ్రంథాల విషయంలో బ్రౌన్, సంస్కృతం లోని ధర్మశాస్త్ర గ్రంథాల విషయంలో కోల్బ్రూక్, పురాణాల విషయంలో హెచ్. హెచ్. విల్సన్, ఇరవయ్యవ శతాబ్దం తొలిరోజుల్లో మహాభారత గ్రంథ పరిష్కరణలో సుక్తాంకర్, ఇంకా తరువాత కాలంలో మన తెలుగు పండితులూ దాదాపుగా ఒకే రకమైన మార్గాన్ని అనుసరించారు. స్థూలంగా వీరందరి మార్గం పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలకి అనుకరణమే. ఈ విధానం వస్తుతః తప్పు అని మా ప్రతిపాదన.
పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలు
మూల గ్రంథం అనేది ఒకటి ఉందని, దానికొక కర్త ఉన్నాడని, ఆ కర్త ఆ గ్రంథాన్ని రాసిన చోటు, తేదీ పట్టుకుని ఆ మూల గ్రంథాన్ని పునర్నిర్మించవచ్చని ఒక ఆలోచన పాశ్చాత్య గ్రంథపరిష్కరణ పద్ధతులకన్నిటికీ మూలభూతమైన విషయం. ఈ విధానాలు మూడు రకాలు.
అనేకమైన ప్రతుల ఆధారంగా తయారు చేయబడిన మిశ్రమ ప్రతిని ఎక్లెక్టిక్ (eclectic) ప్రతి అని, ఈ పద్ధతిని ఎక్లెక్టిసిౙమ్ అనీ పిలుస్తారు. ఈ మిశ్రమ ప్రతి, దానికి మూలాధారమైన ఏ ఒక్క ప్రతినీ పోలివుండదు. ఈ విధానంలో ఏ ఒక్క ప్రతికీ మిగతా ప్రతులకన్నా ఎక్కువ ప్రాధాన్యత వుండదు. పరిష్కర్తలు తమకు నచ్చిన ప్రతిని ప్రధానంగా తీసుకుని మిగిలిన ప్రతుల్లో తమకు నచ్చిన పాఠాలని తాము ఎంచుకున్న ప్రతిలో చేరుస్తాడు. ఈ రకంగా ఒక మిశ్రమప్రతి తయారవుతుంది. పరిష్కర్త వ్యక్తిగత అభిప్రాయాలకు ఊతమిచ్చేదిగా మిశ్రమ ప్రతి ఉండడం ఈ పద్ధతిలో ముఖ్యమైన లోపం. ఈ ఎక్లెక్టిక్ విధానమే మనం తెలుగు పుస్తకాల పరిష్కరణ విషయంలో తరచూ వినియోగించినది.
ఇక, రెండవది వంశవృక్ష పద్ధతి. దీనిని స్టెమాటిక్స్ (stemmatics) లేదా (stemmology) అనీ అంటారు. ప్రతి ప్రతీ కేవలం వేరొక ప్రతి నుండే పుడుతుంది. ఒకవేళ ఏ ప్రతి అయినా రెండు, అంతకన్నా ఎక్కువ ప్రతుల కలయికగా అనిపిస్తే, ఆప్రతిని కలుషితప్రతిగా భావిస్తారు. ఏ రెండు ప్రతులలోనైనా ఒకేరకమైన తప్పులు ఎక్కువగా కనిపిస్తే ఆ రెండు ప్రతులూ ఒకే మూలప్రతినుంచి వచ్చినవిగా గ్రహిస్తారు. అదేవిధంగా, రెండు ప్రతులు విభిన్నంగా ఉన్నప్పుడు పరిష్కర్త తన అభిప్రాయం ప్రకారం ఏ ప్రతి సరైనదో నిర్ధారిస్తాడు. ఈ పక్కనున్న బొమ్మ[2] చూడండి. అందులో మహాభారతాన్ని దొరికిన ప్రతుల ఆధారంగా వేర్వేరు శాఖలుగా విభజించారు. ఈ పద్ధతిలో అట్టడుగునున్న ప్రతుల ఆధారంగా పైకి పైకి వెళ్ళి బహుశా మూల భారతాన్ని పట్టుకోగలమని ఈ పరిష్కర్తల ఆశయం. పూర్తిగా, వ్యాసుడు రాసిన మహాభారతమే వారికి దొరకకపోయినా, దానికి సమీపానికి వెళ్ళగలమని ఈ పరిష్కర్తల విశ్వాసం. ఈ పద్ధతి తెలుగు పుస్తకాల విషయంలో ఎప్పుడూ అనుసరించవలసిన అవసరం లేకపోయింది.
మూడవ పద్ధతి జీవశాస్త్రం నుంచి నేర్చుకున్నది. ఈ క్లాడిస్టిక్స్ (cladistics) పద్ధతిలో అన్ని ప్రతులనూ కంప్యూటర్ల సహాయంతో, వాటి వాటిలో గల సామ్యాల ఆధారంగా గుంపులుగా విడదీస్తారు. ఆ గుంపులను ఒకదానికొకటి సంబంధిగా చూస్తారు కానీ ఏ ప్రతులు మూల ప్రతికి దగ్గరిగా ఉన్నాయో నిర్ణయించరు. ఈ పద్ధతి తెలుగులో ఎవరూ అనుసరించలేదు.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే భారతీయ గ్రంథాల విషయంలో పరిష్కరణ విధానాలు తమ దృక్పథంతో అమలు పరిచిన పాశ్చాత్యులే ఆ విధానాలు సవరించవలసిన అవసరం వుందని గుర్తిస్తున్నారు[3].
పాశ్చాత్య విద్వాంసులు భారతీయ గ్రంథ పాఠపరిష్కరణ విషయంలోను గ్రంథ వ్యాఖ్యాన విషయంలోను ఒక పరిమితికి లోబడి పనిచేశారు. వాళ్ళు కేవలం లిఖిత ప్రతులనే పరిశీలించారు. పాఠకులు ఈ లిఖిత ప్రతులలో వున్న గ్రంథాలని ఎలా చదువుతున్నారు, పాడుతున్నారు అన్న ప్రశ్న వాళ్ళు వేసుకోలేదు. ముఖ్యంగా సంస్కృత గ్రంథాల మీద, తెలుగు గ్రంథాల మీద, పరిశోధన చేసినవాళ్ళు అసలు వేసుకోలేదు. వీళ్ళందరి దృష్టిలో లిఖిత గ్రంథమే పరమ ప్రామాణికమైన గ్రంథం.
తెలుగు అనుభవంలో ఈ విధానం తప్పు. తెలుగులో తాటాకుల మీద కానీ కాగితం మీద కానీ రాసిన గ్రంథాన్ని వెంటనే కట్ట విప్పి ఆకులు తెరిచి దబదబా ఎవ్వరూ చదివేవాళ్ళు కాదు. పుస్తకం ఎలా చదవాలో ముందు గురువు దగ్గర నేర్చుకుని ఆ తరవాతే పుస్తకాన్ని తీసి చదివేవాళ్ళు. అంటే ఇప్పుడు అచ్చులో వుండే కథనో, నవలనో, వచనపద్యాన్నో చదివినట్లుగా పుస్తకం కనిపించగానే తీసి చదవడానికి పూర్వగ్రంథాలేవీ అవకాశం ఇచ్చేవి కావు. గ్రంథ పఠనం ఒక విద్య. ఆ విద్య బాధ్యతగా నేర్చుకోవాలి. కొత్త పుస్తకం చదవడానికి మళ్ళా కొత్తగా నేర్చుకోవాలి.
పుస్తకం చదవడం రానివాళ్ళు ధైర్యం చేసి పుస్తకాన్ని విప్పి చదువుతూంటే వాళ్ళకి పదం ఎక్కడ విరగాలో, పాదం ఎక్కడ ఆపాలో, ఎక్కడ సంధి విడదీయాలో, ఎక్కడ కలపాలో తెలియక పోవడం చేత రకరకాల తికమకలు పడేవాళ్ళు. అలాంటి వాళ్ళని వేళాకోళం చేసే కథలు తెలుగులో వుండేవి. రామునితోకపివరుండిట్లనియె అనే వాక్యాన్ని వాళ్ళు కంగారు పడి రామునితోక అని చదివి, తరవాత ఏమి చేయాలో తెలియక తికమక పడేవాళ్ళు అని ఈ కథలు చెప్తాయి. దీని పరమార్థం ఏమిటంటే పుస్తకం ఎలా చదవాలో ముందు తెలియకుండా తొందరపడి పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టవద్దు అని. తాటాకుల పుస్తకంలో ఎక్కడా విరామ చిహ్నాలు కానీ పదాల విరుపులు కానీ పద్యపాదాల విరుపులు కానీ గుర్తింపబడి వుండవు. తాటాకు ఎంత పొడవుంటే అంత పొడవూ పంక్తులు రాసుకుంటూ వెళ్ళి తాటాకు ఎక్కడ అయిపోతే అక్కడ రెండవ తాటాకులోకి వెళ్ళటం లేఖకుల అలవాటు. దీనితో పాటు లేఖన సంప్రదాయాలు కొన్ని వున్నాయి. అవి పుస్తకం పుస్తకానికి మారుతూ వుండేవి కూడా. ఇవి కాక లేఖక రీతులు కొన్ని ఉండేవి. అంటే ఒక ప్రత్యేక లేఖకుడు తానై స్వయంగా యేర్పరుచుకున్న కొన్ని సంకేతాలు. ఇవి తెలియడానికి పాఠకులకు శిక్షణ కావాలి.
పైగా తెలుగు పద్యంలో సంస్కృతంలో మల్లే చక్కగా ఏ పాదానికి ఆ పాదం చివరిలో విరిగిపోవడం, ప్రతిపాదం విశ్రమ స్థానం దగ్గర ఆగడం వుండదు. సంస్కృత శ్లోకం ఒకటి చదవటం అలవాటైతే రెండోది కూడా అలానే చదవచ్చు. పాదాంతాల దగ్గర విరుపు, విశ్రమస్థానం దగ్గర విరుపు సంస్కృత శ్లోకాలకి తప్పని సరి. (ఈ నియమం చాలా తరవాత కాలంలో అక్కడక్కడ కొద్దిగా అతిక్రమించబడినా మొత్తం మీద సంస్కృత సాహిత్యంలో ఇది పాటించబడింది.) ఈ స్థానాలను లేఖకులు పాదాంతాల దగ్గర ఒక నిలువు గీత తోను శ్లోకాంతాల దగ్గర రెండు నిలువు గీతల తోను సూచించేవారు. అందుచేత సంస్కృత శ్లోకం చదవటం కొంత తేలిక అయ్యేది. ఉదాహరణకి:
మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్|
ప్రాంశులభ్యే ఫలే లోభా దుద్బాహురివ వామనః|| (కాళిదాసు రఘువంశం, 1-3)
(తెలివితక్కువ వాణ్ణి, కవి అనే పేరు కావాలనే కోరిక కలవాణ్ణి, నన్ను చూసి లోకంలో అందరూ నవ్వుతారు. పొడుగైన వాళ్ళకు మాత్రమే అందే పళ్ళు అందుకోవాలని చేతులు పైకెత్తే పొట్టివాడిని చూసి నవ్వినట్టు).
ఈ శ్లోకం చక్కగా ఒంటి నిలువు గీత పెట్టిన చోట కొద్దిగా ఆగుతూ చివరికి శ్లోకాంతాన రెండు నిలువు గీతలు పెట్టిన చోట పుర్తిగా ఆగిపోతుంది. అసలు శ్లోకాలని ఎక్కడా ఆపకుండా చిట్టచివర వరకూ ఒకే గుక్కలో చదవాలని కూడా కొందరు గురువులు అనేవారు. కాని, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిలువుగీతలు ఉన్నచోట్ల పదం విరిగి తీరాలి. దీన్నే విశ్రమ స్థానం అంటారు. సంస్కృతంలొ యతి స్థానం లేదు, విశ్రమ స్థానమే ఉంది. తెలుగులో వున్నది, యతి స్థానం, అది విశ్రమ స్థానం కాదు.
తెలుగులో నన్నయ్య రాసిన మొదటి పద్యం నుంచి ఆధునికుడు విశ్వనాథ సత్యనారాయణ రాసిన పద్యాల వరకూ యతి స్థానం దగ్గర పాదాంతాన విరుపు ఉండి తీరదు. సంస్కృతపు మర్యాద వల్ల కాబోలు తెలుగు పద్యాల్లో యతి స్థానం దగ్గర ఒక మామిడి పిందె గుర్తు వెయ్యడం లేదా ఇంకొక గుర్తు పెట్టడం వావిళ్ళ వారి దగ్గరనుంచి ప్రామాణిక గ్రంథ ప్రచురణకర్తలు అందరూ అలవాటుగా పెట్టుకున్నారు. కానీ, ఆ గుర్తుకి పద్యం చదవటం మీద ఏ రకమైన ప్రభావమూ ఉండదు. పైగా పాదాంతాన, యతి స్థానం దగ్గర విరక్కొట్టి పద్యాన్ని చదివితే స్కూలు పిల్లాడు చదివిన పద్యంలా వుంది అని పెద్దవాళ్ళు వేళాకోళం చేస్తారు. పద్యం ఎత్తుగడ, విరుపు, స్వరం హెచ్చించడం, తగ్గించడం ఇవన్నీ తెలిసినవాళ్ళే పద్యాన్ని బాగా చదవగలరు. అంటే తెలుగు పుస్తకాల పాఠకుడికి ప్రత్యేకమైన తర్ఫీదు గురువు ద్వారా కావాలన్న మాట. (పద్యాన్ని, నాటక ఫక్కీలో రాగయుక్తంగా, ఈలపాట రఘురామయ్య లాగో, ఘంటసాల లాగో పాడడం గురించి మేం మాట్లాడడం లేదు. అది వేరు.)