ఈ సంచికలో మరికొన్ని అరుదైన పాటలు విందాం. ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోని ఒక కోరస్ పాట. దీనిలో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు. అంతకు ముందు ఆయన కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో నాటక సమాజాల్లో నాటకాలు ఆడేవారన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తరవాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో – ఉదాహరణకి. మాయాలోకం (1945), ముగ్గురు మరాఠీలు (1946), పల్నాటియుద్ధం (1947), బాలరాజు (1948) – తనపై చిత్రీకరించిన పాటల్ని తానే స్వయంగా పాడుకున్నారు. ఈ సినిమాకి సంగీతం నిర్వహించింది ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు. ప్రభల తెలుగు సినిమా తొలి సంగీత దర్శకుల్లో ఒకరు, 1934లో వచ్చిన లవకుశ సినిమాకు ఆయనే సంగీత నిర్వహణ చేశారు.
- కౌసల్యా సుప్రజారామా Audio Player
- రఘుపతి రాఘవ రాజారామ్ Audio Player
- వైష్ణవజనతో Audio Player
- శివోహం Audio Player
- డూడూ వెంకన్న Audio Player
- అన్నాడే వస్తానన్నాడే Audio Player
- మధూదయంలో మంచి ముహూర్తం Audio Player
- జాబిల్లి వస్తున్నాడు
కౌసల్యా సుప్రజారామా: ఈ రికార్డులో మొదటి భాగం విశ్వామిత్ర పాత్రధారిపైనా (బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి, హరిశ్చంద్ర నాటక రచయితగానూ సినిమా పాటల రచయితగానూ సుప్రసిద్ధులు!) తరువాతి భాగం, గురుబ్రహ్మ రామలక్ష్మణుల పైనా (అక్కినేని, B.N.రాజు) చిత్రీకరించబడ్డాయి.
తరువాతి 4 పాటలు టంగుటూరి సూర్యకుమారి పాడినవి. రఘుపతి రాఘవ రాజారామ్, వైష్ణవజనతో (నరసి మెహ్తా లేక నరసి భగత్ 1414-1481 రచన) పాటలు 1947-48 ప్రాంతంలో కొలంబియా లేబుల్ రికార్డుపై వచ్చాయి కానీ నాకు తెలిసినంతలో ఇంతవరకు సూర్యకుమారి పాటల సంకలనాల్లో ఎక్కడా చేర్చబడలేదు. మిగిలిన రెండు పాటలు The songs of India – Suryakumari అన్న లాంగ్ ప్లే రికార్డు పైన వచ్చినవి (Polydor కంపెనీ, 1973). సూర్యకుమారి ఇంగ్లండులో స్థిరపడిన తరువాత రెండే రికార్డులు చేశారు. మరొకటి Columbia లేబుల్‌పై 1973 లోనే వచ్చింది. ఇక్కడ మీరు వినబోయే శివోహం పాట మరొక వర్షన్, ఆకాశవాణి భక్తిరంజనిలో (1975) పాడింది, ఈమాట మార్చ్, 2012 సంచికలో విని వుంటారు. అలాగే, డూడూ వెంకన్న అన్న పాట ఆమె 1948-1950 కాలంలో 78rpm రికార్డుపైన ఇవ్వడం జరిగింది. ఆ వర్షన్ తేలికగానే అందుబాటులో ఉంది కాబట్టి మరల ఇక్కడ వినిపించడం లేదు.
చివరి మూడు పాటలు సీత, అనసూయగార్లు పాడినవి. వీటిలో, మధూదయంలో మంచి ముహూర్తం అన్న దేవులపల్లి రచన చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాటని దేవులపల్లి బెజవాడ గోపాలరెడ్డి వివాహ సందర్భంలో రాస్తే, అనసూయగారు బాణీ కట్టి పెళ్ళిలో పాడారని విన్నాను. ఇది నిజమో కాదో తెలిసిన వారు చెప్పగలరు. జాబిల్లి వస్తున్నాడు అన్న పాట రజనీకాంతరావుగారి రచన.
శివోహం, డూడూ వెంకన్న పాటల్ని తప్పిస్తే మిగిలినవన్నీ మట్టి (78rpm) రికార్డులపైన వచ్చినవి.
Audio Player