బాల్కనీలో బచ్చలిమొక్క

బాల్కనీలోబచ్చలిమొక్కభలేబాగాపెరుగుతోంది.
మేమెవరమూ నాటకుండానే తనకై తానే పుట్టుకొచ్చిందీ బచ్చలి-
ఈ బచ్చలికీ మాకూఏదో ఋణానుబంధం వున్నట్లే వుంది!
చిన్నప్పుడు మా వాకిట్లో నేనొక బచ్చలిమొక్కను నాటినందుకు కాబోలు…
అంతరిక్షంలోకి తొంగి చూస్తున్నైరవై అయిదో అంతస్తులోని
బాల్కనీలోకి వచ్చిపడింది బచ్చలి విత్తనం-ఎంతచిత్రం-
ఈ బచ్చలికి నా మీదెంత ప్రేమో!
బాల్కనీలో నిల్చున్నపుడల్లా పచ్చని నగవులు చిందిస్తుంది.
చెంబెడు నీళ్ళైనా పోయందే తాను మాత్రం
గంపెడాకుల తీగలతో గగనానికి ఎగబ్రాకుతోంది.
బాల్కనీలో బట్టలారవేసే తీగలపై కెగబాకి
బరువుగా ఆలపించిన దరువులా సాగుతుంది.
ముత్యాల్లాంటి పూలు పూసి పగడాల్లాంటి పళ్ళు కాసి
పండగనాటి తోరణమై బాల్కనీ నిండుగా పందిరి వేసింది.
తానుగా ఒక్కగానొక్క మొక్కగా మొలిచి తీగలై పెరిగి
తన నిస్వార్థమైన అలౌకికానుబంధంతో ఆనందింపజేస్తోంది.
నా మానవజాతి ఈ హరితారణ్య శోభిత ధరణికి చేసిన
ద్రోహాన్ని తలుచుకొని సిగ్గుపడేలా చేస్తోంది.
మహావృక్షాల్ని పెంచకపోయినా మొక్కలోనె తుంచకూడదనీ
పెద్దచెట్టైనా చిన్నమొక్కైనా అది సకలజీవులకు ఆధారమేనని
జ్ఞానోదయమైంది నాకీ బచ్చలిపందిరి కింద.
తరతరాలుగా తన పచ్చదనాన్ని ఆహారంగా ధారబోసిన
ఈ బచ్చలి సంతతి చల్లగా వర్ధిల్లుగాక!