నేల మీద కాలం
కాలుమోపక మునుపు బహుశా
మనం మరో తలం నివాసులం
అగ్గిలోనో బుగ్గిలోనో
మిణుకు మిణుకు మెరిసే
నిర్జీవ సూక్ష్మ కణాలం
ఊపిరి పూలేవీ
ఉనికిలోకి రాక పూర్వం బహుశా
కాంతి వేగాన్ని కావలించుకుని
నక్షత్రాల్లో వెలిగే ధూళి రేణువులం
అందుకేనేమో
మన గుండెల మీద చేయి పెడితే
ప్రవాస కాంతి పుంజాలదో
పసివెలుగు పాలపుంతలదో
ఎప్పటిదో ఈ ఎద సవ్వడి..
విశ్వం ఎన్నెన్ని వింతల పుంత!
కోటానుకోట్ల రోదసి గోళాల
ఒక్కుమ్మడి కల ఏమిటో ఎవరు చెప్పాలి?
బహుళ విశ్వాల వినమ్రశీలతకు
కొలతలేమిటో ఎక్కడ వెదకాలి?
పద్యం పరుపు మీద తలవాల్చి
ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తూ
ఆరుబయట బజ్జుంటుందా
మహా శూన్యం?
ప్రపంచం ఎంత పొడుగు పొడుపు కథ!
మట్టి కణంలో ప్రాణం నాటిన
నిసర్గ జీవసూత్రమేదో
మహావిశ్వానికి పురుడు పోయడం
ఏ అదృశ్య తెర మీద కనిపిస్తుంది?
నిన్నూ నన్నూ అనంతాన్నీ
ఒకే అద్వైత సత్యమేదో పెనవేసింది
ఏ ఛందో సమీకరణాల్లోనూ కుదురుకోని
గతితార్కిక బంధమేదో
జనక రాశుల్ని ముడివేయడం
ఏ దృగ్గోచర అవధుల్లో అగుపిస్తుంది?
సృష్టికీ సృజనకూ వేసే తూకంలో
తర్కం ఒక తూగుపత్రం!
కళ్ళుమూసి కర్తృత్వాన్నివ్వాలంటే
విశ్వం –
మన ఊహల ఊయలలోంచి
చప్పున జారిపడి గుక్కపట్టి ఏడ్చే శిశువు!
ప్రదర్శన మొదలైన యుగాల తరువాత
ప్రేక్షకులు పుట్టిన చోట
సూత్రదారి కోసం సాగే అన్వేషణలో
హేతువును మింగేసే
అనాది కృష్ణబిలాలను దాటగలమా?
సృజన కాంతి నృత్యం చూడగలమా?
