3549 మీటర్ల ఎత్తున ఉన్న మనాంగ్ పట్టణం అదే పేరిట ఉన్న జిల్లాకు ముఖ్యపట్టణం. అన్నపూర్ణ సర్క్యూట్‌లో ఇది కేంద్ర బిందువు. రెండువేల రెండువందల జనాభా – సర్క్యూట్‌లో ఉన్న అన్ని ఊళ్ళలోనూ ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశం. అంతకన్నా ముఖ్యంగా అన్నపూర్ణ ట్రెక్ మార్గంలో మనాంగ్ దాటాక మరో మూడు రోజులపాటు నలభై కిలోమీటర్లు నడిచి ముక్తినాథ్ చేరేదాకా మనకు ‘నాగరికత’ ఛాయలు కనిపించవు. అంటే ఆ ఛాయలు కలిగిన చిట్టచివరి ప్రదేశం మనాంగ్ అన్నమాట. అలాగే మనాంగ్ వరకూ మనం మరీ కావాలనుకుంటే జీపుల్లో రావచ్చు – ఇక ముందున్న 40 కిలోమీటర్లూ కాలినడకన తప్ప మరే విధంగానూ అధిగమించలేం.
అక్టోబర్ 7. మా యాత్రలో ఏడవ రోజు. ట్రెక్ మొదలెట్టి నాలుగవ రోజు. ధారాపానీనుంచి మనాంగ్ వరకూ దాదాపు 1700 మీటర్లు ఎగువకు చేరుకున్నాం. అంచేత ఒక రోజు నడకలు నడవడం, ఎత్తులు చేరడం ప్రస్తావన లేకుండా ఎక్లమటైజేషన్ కోసం కేటాయించడం అన్ని విధాలా అవసరం.
ఆ శనివారపు ఉదయాన నేను తీరిగ్గా నిద్ర లేచాను. ట్రెక్‌లో సగభాగం ముగిసిందన్న సంతోషం. మిగిలిన సగం హిమరాశుల నడుమ సాగుతుందన్న ఉత్తేజం. ఐదువేల మీటర్ల కన్నా ఎగువన గంటలకొద్దీ గడపడంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి చిరు ఆందోళన. కొత్తా పాతా అన్న తేడా లేకుండా 34మంది సహట్రెకర్లూ మూడంటే మూడే రోజుల్లో ఎండనకా, వాననకా, చలి అనకా రాటుదేలిన విధానం చూసి నమ్మకం పెరగడం – బాధ్యత అన్నది మనిషిని మానసికంగా పటిష్టపరుస్తుందన్న సంగతి ప్రత్యక్షంగా అనుభవమవుతోన్న తీరు.
మనాంగ్ ఊరి నడుమన సన్నటి పొడవాటి దారి. ఒకవేపు టీ హౌసులు, దుకాణాలు, బేకరీలు – మరోవేపు స్థానికుల ఇళ్లు. ఊరు ఊరంతా విశాలమైన కొండచరియ మీద ఉంది. కుడివేపున మరీ నిడుపాటిగా లేని కొండలు. ఎడమన, ఒకటి రెండు తాళ్ల దిగువన అతి విశాలమైన మర్శియాంగ్దీ నదీ లోయ. ఆ లోయనిండా పంట పొలాలు – బంగాళాదుంపలు, కాలీఫ్లవర్లు, క్యాబేజీలు, ఇతర ఆకుకూరలు. బక్‌వీట్ సాగు సరేసరి. మా హోటలు ఊరికి తూర్పు వేపున ఉంది. ముందుకు సాగి పశ్చిమ ప్రాంతానికి చేరాక, స్థానిక బాణీలో కలపా రాళ్ళతో కట్టిన, కుదిమట్టంగా ఉన్న, బల్లపరుపు పై కప్పుల ఇళ్లు.
మేమంతా చిన్న చిన్న బృందాలుగా విడివడి ఊరు చూడ్డానికి హోటల్లోంచి బయటపడ్డాం. ఉదయం ఎనిమిదిగంటల సమయం. చక్కని చిరు ఎండ వెలుగు. మేఘాలూ మంచూ తాకిడి లేకుండా స్పష్టమైన వాతావరణం. నింపాదిగా తిరిగి రావడానికి ఎంతెంతో అనువైన సమయం. ఉమ, పద్మజ, అనితారాణి అప్పుడే ఊళ్ళోకి వెళుతూ కనిపించారు. నన్నూ తమతో రమ్మన్నారు. చేరాను.
ట్రెకింగ్ పరికరాలు, ఉన్ని దుస్తులు, చిరు జ్ఞాపికలు అమ్మే దుకాణాల తలుపులు మెలమెల్లగా తెరుచుకుంటున్నాయి. వాటితోపాటు బేకరీలు కూడా పరిమళాలు వెదజల్లుతూ మేమున్నాము రమ్మంటున్నాయి. అపుడే ఓవెన్‌లోంచి తీసి ప్రదర్శిస్తోన్న తాజా తాజా రొట్టెలు పిలవనే పిలిచాయి. ఇక కాఫీ పరిమళమయితే కట్టి పడేసింది. కనిపిస్తోన్న యాపిల్ పై లు, క్రొసాంట్లు ఇంకెందుకూ ఆలస్యం అన్నాయి. వెళ్ళి బుద్ధిగా తలా ఒకటి అడిగి పుచ్చుకున్నాం. బేకరీ వాళ్ళు ఎక్కువెక్కువ మోతాదులో అవన్నీ సరఫరా చేసారు.
సీ బక్‌థార్న్ పళ్ళు అక్కడ విరివిగా పండే శీతాకాలపు పంట. స్థానికులకు ఆ పళ్లరసం అంటే ఆరోగ్యపరంగా ఎంతో గురి. అందులో విటమిన్లూ ఫాటీ యాసిడ్లూ పుష్కలంగా ఉండే మాట నిజం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అక్కడివారికి ఔషధంలా కూడా ఆ పళ్ల రసం ఉపయోగపడుతుంది. వయసు పెరిగినా శరీరాన్ని పటుత్వం తగ్గకుండా ఉంచుతుందని వాళ్ళు చెపుతారు – నిజమే కావచ్చు. ఆ పళ్లరసం కనిపించగానే తలా కాస్త పుచ్చుకున్నాం. వగరువగరుగా అనిపించింది.
ముందే చెప్పుకున్నట్టు ఆక్లండ్‌కు చెందిన పద్మజ, వాళ్ళ తమ్ముడు శ్రీని న్యూజిలాండ్‌లో ఎన్నో ట్రెక్‌లు చేసిన అనుభవం ఉన్న వాళ్ళు. ఆ ‘శెలవు’ రోజున శ్రీని మరికొంతమందితో కలిసి ఆ ప్రాంతంలో ఉన్న ‘ఐస్ లేక్’కు విహారానికి వెళ్ళాడు. పద్మజా నేనూ న్యూజిలాండ్ జీవితం గురించీ అక్కడి ట్రెకింగ్‌లాంటి ప్రక్రియలకు ఉన్న అవకాశాల గురించీ మాట్లాడుకున్నాం. ఆ విషయంలో న్యూజిలాండ్‌కూ, నేపాల్‌కూ మధ్య ఉన్న సారూప్యాలు, పటిష్టమైన సంబంధబాంధవ్యాల గురించి పద్మజ చెప్పుకొచ్చారు. ఆ బాంధవ్యాలకు మూలం హిల్లరీ-నార్గేల ఎవరెస్ట్ అధిరోహణలో ఉందట. హిల్లరీ సాధించిన ఆ మహత్తర ‘విజయం’ తర్వాత మొత్తం దేశమంతటికీ ట్రెకింగ్ మౌంటెనీరింగ్‌లను అభిమానించి కౌగలించుకునే ప్రేరణ కలిగింది. తన కొలీగ్స్‌లో చాలామంది ఇప్పటికే హిమాలయాలలో విరివిగా ట్రెకింగ్‌లు చేసారనీ, వారి ప్రోత్సాహంవల్లనే తాను ఈ అన్నపూర్ణ ట్రెక్‌లో చేరాననీ చెప్పారు పద్మజ. పైగా ఆ మధ్యే వాళ్ళ నాన్నగారు పోయారట – ఆయనకు నివాళి చిహ్నంగా కూడా ఈ అన్నపూర్ణ యాత్ర ఉంటుందన్నది ఆ అక్క తమ్ముళ్ల అభిమతం.
మాలాగా ఎంతోమంది ట్రెకర్లు మనాంగ్ లో రెండు రాత్రుళ్లు గడుపుతుంటారు. ఊరికే ఎక్లమటైజేషన్ విరామం అనే కాకుండా మనాంగ్‌లో ట్రెకర్లకు సాయపడే విషయాలు మరికొన్ని ఉన్నాయి. హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ అన్న వాలంటరీ సంస్థ అక్కడ ఓ ఆరోగ్య కేంద్రం నడుపుతోంది. అందులో పాశ్చాత్యదేశాలనుంచి వచ్చిన డాక్టర్లు సేవాభావంతో పనిచేస్తూ ఉంటారు. అందరికీ తమ సేవలు ఉచితంగా అందిస్తూ ఉంటారు. ఇటు ట్రెకర్లూ వారి సహాయక బృందాలకు వైద్యసదుపాయం అందడంతోపాటు, ఆ సదుపాయం అందించడానికి వచ్చిన యువవైద్యులకు హిమాలయాలలో పని చేయడం అన్న విషయమే గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. అలా ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఇరు పక్షాలకూ ఎంతగానో సాయపడుతోందన్నమాట. మా బృందంలోని వారు కొంతమంది ఆ ఆరోగ్యకేంద్రం చూసి వచ్చారు. అక్కడి పనితీరు చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ముఖ్యంగా వీళ్ళు వెళ్ళినపుడు అక్కడ పనిచేస్తూ అన్ని విభాగాలూ తిప్పి చూపించిన ఓ ఆస్ట్రేలియన్ యువ డాక్టర్ వీరిని ఎంతగానో ఆకట్టుకొంది. వచ్చిన వారికి వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా ఎక్యూట్ మౌంటెన్ సిక్‌నెస్‌లాంటి ముఖ్యమైన విషయాల మీద అవగాహన కలిగించడానికి ఆ క్లినిక్‌లో ప్రసంగాలూ ఏర్పాటు చేస్తున్నారట.
డిన్నర్ టేబుల్ కబుర్లలో సహజంగానే ఊళ్ళోని క్లినిక్ మా మాటల్లో దొర్లింది. “నేను వైద్యవృత్తి ఆరంభించిన తొలి దినాలలో ఇలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకుని ఉంటే ఎంత బావుండేదో?” జనాంతికంగా అన్నాడు నవీన్. అతని మాటలు మా అందరి మనసుల్లోనూ ప్రతిధ్వనించాయి. విషయాన్ని మరికాస్త ముందుకు తీసుకెళుతూ, “మరి కొన్నేళ్లలో రిటైరయిపోతాను గదా, అప్పుడు తప్పకుండా వచ్చి ఇలాంటి ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తాను,” అన్నాడు సుధీర్.
మనాంగ్‌లో మా గైడ్ ప్రకాశ్ గురంగ్ మా నుంచి విడివడ్డాడు. ఖాట్మండూ వెళ్ళి మరో బృందాన్ని ఎవరెస్ట్ బేస్ కాంప్‌కు తీసుకువెళ్ళే బాధ్యత అతని మీద ఉందట. గత ఏడాది మా ఈబీసీ ట్రెక్‌కు ఈ ప్రకాశ్ గైడ్‌గా వచ్చాడు. అతను మాతో కలసి కాలాపత్థర్ శిఖరానికి రావడం, చక్కచక్కని ఫోటోలు తీసిపెట్టడం నాకు బాగా గుర్తుంది. నాకే కాకుండా ఈబీసీ ట్రెక్‌కు వచ్చిన ఇతర సహట్రెకర్లకూ ప్రకాశ్ అభిమానపాత్రుడు. గత మూడు నాలుగు రోజులుగా మా ఇప్పటి అన్నపూర్ణ బృందమంతటికీ ఇష్టమైన వ్యక్తి అయ్యాడు. అందరం కలసి అతనికి వీడ్కోలు పలికాం. పాపం ఈ గైడ్‌లకూ షెర్పాలకూ ఏడాదిలో రెండే ఋతువుల్లో చేతినిండా పని ఉంటుంది. వసంతకాలం, ఆకురాలు కాలం ట్రెకింగ్‌కు అనువైన ఋతువులు. మిగిలిన ఋతువుల్లో పెద్దగా పని ఉండదు. కొందరు అతి సాహసికులు శీతాకాలంలోనూ వింటర్ ట్రెకింగ్ కోసం అపుడపుడు వస్తూ ఉంటారు. వీరికి కాస్తంత పని దొరుకుతుంది.
ఎక్లమటైజేషన్ విరామదినం అంటే రికామీగా ఉండిపోవడం కాదు కదా? మా ట్రెకింగ్‌లో నాలుగవ రోజున ఉదయం పదిగంటలకు అందరం మనాంగ్‌కు కాస్తంత దూరాన ఉన్న గంగపూర్ణ లేక్‌కు చిన్నపాటి ట్రెక్ ఆరంభించాం. ఆనాడు చక్కగా ఎండ కాసింది. సంబరపడ్డాం. “ఎండ కాసినంత మాత్రాన మీ జాగ్రత్తలు మానుకోవద్దు” అని ఆ సమయంలో వీస్తోన్న చల్లని గాలి హెచ్చరించింది. అందరం బుద్ధిగా మరి కాసిని ఉన్ని దుస్తులు మాతోపాటు తీసుకువెళ్లాం. మెల్లగా మర్శియాంగ్దీ నది దాటి అవతలి వేపుకు వెళ్ళాం. సన్నటి మనాంగ్ లోయలో నడక సాగించాం. రైతులంతా బార్లీ, బక్‌వీట్ పంటల ఫలసేకరణలో నిమగ్నమై కనిపించారు. ‘ఇక్కడ గోధుమ, బంగాళాదుంపలు కూడా పండిస్తారు,’ అని వివరమందించాడు బాబు గురంగ్.
ముందే చెప్పుకున్నట్టు మాలాంటి బృందాల్లో అందరు సభ్యులూ ఒకే వేగంతో ముందుకు సాగరు. కొంతమందిది అమిత వేగం; కొంతమందిది నింపాదితనం; కొంతమంది సూటిగా సాగిపోతూ ఉంటారు. కొంతమంది పరిసరాలను మనసులో నింపుకుంటూ ఆగి ఆగి నడుస్తారు. అందరూ ఏకతాటిన నడవడం ఎంత అవసరమో, భిన్నధోరణివారికి అవసరమైనంత వెసులుబాటు ఉండేలా చూడటమూ అంతే అవసరం. ఈ రెండింటినీ సమన్వయపరచడం ఏ బృందం నాయకుడికైనా నిజమైన సవాలే. మా బృందంలో అందరూ పరిణితి చెందిన వ్యక్తులే ఉండటం నాకు గొప్ప వెసులుబాటు. తమ తమ ధోరణితో సారూప్యం ఉన్నవాళ్ళందరూ ఉపబృందాలుగా ఏర్పడటం, ఆ ఉపబృందాలన్నీ మళ్ళా ఏదన్నా విరామస్థలంలోనో, లంచ్ సమయంలోనో కలసిపోవడం సహజంగా జరిగే పని. ప్రతిరోజూ ఎక్కడ లంచ్‌కి ఆగాలి అన్న విషయంలో బాబుకు స్పష్టత ఉంటుంది. ఆరోజు ఎక్కడ భోజనానికి ఆగబోతున్నామో బాబు అందరికీ ముందే చెప్పి ఉంచుతాడు. అలా చెప్పి ఊరుకోవడమే కాకుండా ఒక గైడ్‌ను బాగా ముందుగా వెళ్ళి ఆ టీ హౌస్‌లో భోజనం ఆర్డర్ చేసి ఉంచమని పురమాయిస్తాడు. ఈ గైడ్‌లందరూ అవసరమయినపుడు శరవేగంతో సాగిపోయే సత్తా ఉన్న మనుషులు. మాలోని ఏ ట్రెకరూ వాళ్ళతో వేగంలో పోటీపడడమన్న ప్రసక్తే లేదు. అలా వాళ్ళు ముందే వెళ్ళి ఆర్డర్ చేయడంవల్ల మా బృందంలోని వేగవంతులకు వెళ్ళగానే భోజనం దొరకడం, రిలాక్సవడానికి అదనపు సమయం దొరకడం జరుగుతుంది. ఏదేమైనా అందరం కలిసి భోజనం ముగిస్తాం. కలసి తదుపరి నడక ఆరంభిస్తాం. క్రమక్రమంగా ఉపబృందాలుగా విడివడతాం.
ఈ వేగాలూ, దూరాలు, విడివడడాలూ అవసరంలేని విరామదినం గదా – గంగపూర్ణ సరోవరానికి అందరం కలసి నడిచాం. నవీన్‌తోనూ, అతని హైదరాబాద్ కజిన్ పవన్‌తోనూ, సుధీర్ రామకృష్ణలతోనూ మరికాస్త దగ్గరగా ఉండి నడిచాను. వారితో బాగా కబుర్లు సాగాయి. పవన్ తప్పించి మిగిలిన ముగ్గురూ మాంచెస్టర్ ప్రాంతంలో ఉంటోన్న వైద్యులు. అందులో సుధీర్ నాకు మెడికల్ కాలేజ్‌లో క్లాస్‌మేట్. మంచి స్నేహితుడు. కాలక్రమేణా ఊపిరితిత్తులకు సంబంధించిన నిపుణునిగా పరిణమించాడు. మా బృందపు ‘టీమ్ డాక్టర్’గా ఉండటానికి సంతోషంగా ఒప్పుకున్న మనిషి. నవీన్ విషయానికి వస్తే, నేను 1997 లో ప్లాబ్ (PLAB) పరీక్ష రాయడానికి లండన్‌లో కొంతకాలం ఉన్నపుడు ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం. అప్పట్నించీ అతనికీ నాకూ చక్కని స్నేహం కుదిరింది. కలసి నడుస్తోన్న మా ఐదుగురిలోనూ పవన్, రామకృష్ణ నాకు కొత్త మనుషులు. అప్పటిదాకా వాళ్ళతో కలసి కాస్తంత దగ్గరగా గడిపే అవకాశం కలగలేదు. ఆరోజు ఆ లోటు తీరింది.
అదే ఊపులో బర్మింగ్‌హామ్‌కు చెందిన జీకే, కిషోర్, వేణులతో కూడా కొంత సమయం గడిపాను. వీళ్ళంతా ఆర్థోపెడిక్ సర్జన్‌లు. నాకు చిరపరిచితులు. మళ్ళా వీళ్ళల్లో జీకే నాకు మెడికల్ కాలేజీలో ఒక సంవత్సరం జూనియర్. కిషోర్ నాతోపాటు ఈబీసీ ట్రెక్ చేసిన మనిషి. వీళ్ళిద్దరూ మా ఇప్పటి బృందానికి ట్రెజరర్లు కావడంవల్ల రోజూ ఏదో ఒక విషయంలో వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈ బర్మింగ్‌హామ్ త్రిమూర్తులు ఇక్కడేగాదు – వాళ్ళ ఊళ్ళోనూ కలసిమెలసి ఉంటూ ఉంటారు. నేను అటు వెళ్ళినప్పుడల్లా మేమంతా కలుస్తూ ఉంటాం.
కాస్తంత ఎగుడుబాటలో ముందుకు సాగాక గంగపూర్ణ సరోవరం చేరుకున్నాం. చివర్లో ఎగువ బాట వచ్చినా ఈ సరోవరం మనాంగ్‌తో పోలిస్తే 800 మీటర్ల దిగువన, 3200 మీటర్ల ఎత్తున ఉంది. గంగపూర్ణ గ్లేషియర్ నుంచి వచ్చే అతి స్వచ్ఛమైన నీళ్ళతో నిండిన సరోవరమది. ఆ సరోవరంలో పురుడు పోసుకుని బయటకు పారే చిన్న చిన్న సెలయేళ్లు బాగానే కనిపించాయి. అవన్నీ మళ్ళా వెళ్ళి మర్శియాంగ్దీ నదిలో కలుస్తాయట.
చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్‌కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం. దీని ఎత్తు 3750 మీటర్లు. కొంచెం కష్టపడాల్సివచ్చింది. కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి. వీటికి తోడు అతి చేరువలో ఉన్నట్టు కనిపిస్తోన్న 7,445 మీటర్ల గంగపూర్ణ శిఖరం – దానితో ముడిపడి ఉన్న గంగపూర్ణ గ్లేషియర్. ఈ శిఖరాల నడుమ ఛోంగ్‌కోర్ వ్యూ పాయింట్ వద్ద మా కోసమే కనిపెట్టుకుని ఉన్నట్టున్న ఒక టీ దుకాణం! చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది. మనసు శృతి అయితే ప్రపంచమంతా స్వర్గసీమ అనిపిస్తుంది – తాగుతోన్న టీ కూడా అమృతం అనిపిస్తుంది – రెండో కప్పు కూడా అడిగి పుచ్చుకుని ఆస్వాదించాను.
అంతా బావుందిగానీ ఒకటవ అన్నపూర్ణ ఎక్కడా? నాలుగురోజులయినా కనబడదేమీ?! వ్యూ పాయింట్ నుంచి తిరిగి వస్తున్నపుడు ఈ విషయం బాబు, రేషమ్, ప్రేమ్‌ల దగ్గర ప్రస్తావించాను. అనేక భౌగోళిక కారణాల వల్ల ఒకటవ అన్నపూర్ణ శిఖరం మనకు ట్రెక్‌లో అంతిమ పాదం, జోమ్‌సోమ్ చేరేదాకా కనిపించదని బాబు వివరించాడు. అక్కణ్ణించి పొఖారా వెళుతున్నపుడూ చక్కగా కనిపిస్తుందట.
‘ఒకటవ అన్నపూర్ణ శిఖరం ఎక్కడం అన్నది ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, ప్రమాదభరితమైన ఆరోహణ క్రీడ’ అని చెప్పుకొచ్చాడు బాబు. ఎనిమిదివేల మీటర్ల ఎత్తును దాటిన శిఖరాలు ప్రపంచంలో అంతా కలసి పద్నాలుగు ఉంటే అందులో 8091 మీటర్ల ఎత్తైన ఒకటవ అన్నపూర్ణది పదవ స్థానం. కానీ శిఖరారోహణలో ప్రాణాలు అర్పించడం విషయానికి వస్తే అన్నపూర్ణదే ప్రథమస్థానమట. ఎక్కాలని వెళ్ళే ముగ్గురిలో ఒకరు ప్రాణాలతో తిరిగి రారట. ఈ ప్రాణనష్టం విషయంలో పాకిస్తాన్‌లో ఉన్న K2, నంగ పర్బత్ శిఖరాలు రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయట.
ఆనాటి మా ఎక్లమటైజేషన్ ప్రక్రియలో మేమంతా మనాంగ్‌కు 210 మీటర్ల ఎగువన ఉన్న ఛోంగ్‌కోర్ వ్యూ పాయింట్ దాకా వెళ్ళి వచ్చాం. ఇలాంటి ఉన్నతశ్రేణి పర్వతాల ట్రెక్‌లలో “ఎత్తులు అధిగమించు; దిగివచ్చి రాత్రి విశ్రమించు” అన్న నానుడి ఉంది. దానికి సరిగ్గా సరిపోయే పనులు ఆరోజు మేము చేసామన్న మాట. తిరిగి మనాంగ్ చేరేసరికి మధ్యాహ్నం రెండేయింది. ఆరు కిలోమీటర్ల దూరం – నాలుగు గంటల నడక. ఆవురావురుమంటూ అంతా భోజనం మీద పడ్డాం.
1950 వరకూ యూరోపియన్ పర్వతారోహకులు హిమాలయాల శిఖరారోహణకు ఉత్తరాన ఉన్న టిబెట్‌ను స్థావరంగా చేసుకుంటూ వచ్చారు. అప్పట్లో నేపాల్‌ను రాణా వంశీకులు పాలించేవారు. దాదాపు వందేళ్లపాటు ‘యూరోపియన్లు నేపాల్‌లో అడుగు పెట్టడానికి వీల్లేదు’ అన్న పాలసీని ఈ రాణా వంశీకులు ఆచరణలో పెట్టారు. 1950 లో టిబెట్‌ను కమ్యూనిస్ట్ చైనా ఆక్రమించి, విదేశీయులకు అక్కడ అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. అదే సమయంలో నేపాల్ దొరతనం తమ సరిహద్దుల్ని విదేశీయులకు తెరచి ఆహ్వానించింది. ఆ పరిణామం జరిగిన వెంటనే బ్రిటిష్ సాహసికులు ఎవరెస్ట్ మీద తమ దృష్టి నిలిపారు. ఎవరెస్ట్ శిఖరారోహణకు నేపాల్ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తుకున్నవారిలో బ్రిటిష్, స్విస్ బృందాలు మొదటివి. అన్నపూర్ణ విషయానికి వస్తే ఆ శిఖరం మీద ఆసక్తి చూపిన వారిలో ఫ్రెంచి వారిది ముందంజ. ఈ అన్నపూర్ణ పూర్తిగా నేపాల్ దేశంలో ఉంది. ఎవరెస్ట్ శిఖరపు ఉత్తరప్రాంతం టిబెట్‌లోనూ దక్షిణప్రాంతం నేపాల్‌లోనూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎనిమిదివేల మీటర్లను మించిన ఎత్తు ఉన్న శిఖరాలలో మానవుని పాదస్పర్శ సోకిన మొదటి శిఖరంగా ఒకటవ అన్నపూర్ణ నిలిచింది. 1950 జూన్ 3 న మారిస్ హెర్‌జోగ్ అనే ఫ్రెంచి పర్వతారోహకుడు తన సహసాహసి లూయిస్ లచెనవ్‌తో కలసి ఒకటవ అన్నపూర్ణ మీద కాలుమోపాడు. తమ గమ్యం చేరుకోవడానికి వీళ్ళిద్దరూ అష్టకష్టాలు పడవలసి వచ్చింది. అయినా పట్టు విడవకుండా శిఖరం చేరారు. ఆ ప్రయత్నంలో శీతల గాయాలకు – ఫ్రాస్ట్ బైట్‌కు గురియై ఇద్దరూ తమతమ వేళ్ళు కోల్పోయారు. తిరిగి ఫ్రాన్స్ చేరుకున్నపుడు వారికి ఘనస్వాగతం లభించింది. తన అనుభవాలను హెర్‌జోగ్ “అన్నపూర్ణ’ అన్న పుస్తకంలో వివరంగా రాశాడు. పాఠకుల ఆదరణ పొందిన పుస్తకమది.
అన్నపూర్ణను అధిరోహించిన మహిళల విషయానికి వస్తే 1972 లో ఎర్లీన్ బ్లమ్ అన్న అమెరికన్ మహిళ నేతృత్వంలో మొదటిసారిగా ఆ ప్రయత్నం చేసిన మహిళా బృందం గురించి చెప్పుకోవాలి. ఆ బృందంలోని వేరా కొమర్కోవా, ఐరీన్ మిల్లర్ అన్న మహిళలు అన్నపూర్ణ మీద కాలుమోపిన మొదటి మహిళలుగా చరిత్రకెక్కారు. దురదృష్టవశాత్తూ ఈ బృందానికే చెందిన ఏలిసన్ ఛాడ్విక్, వేరా వాట్సన్ అన్న ఇద్దరు మహిళలు అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఎర్లీన్ బ్లమ్ తమ అన్నపూర్ణ అనుభవాల గురించి రాసిన ‘అన్నపూర్ణ – ఎ వుమన్స్ ప్లేస్’ అన్న ఆసక్తికరమైన పుస్తకాన్ని, హిమాలయాల్లో ట్రెకింగ్ ఆరంభించడానికి ముందు, కోవిడ్ సమయంలో చదివాను. అందరూ మహిళలే ఉన్న తమ బృందం మొదట్నించీ ఎదుర్కొన్న సవాళ్ళు, ఆర్థిక సమస్యలు, సభ్యులందరినీ సమకూర్చుకోవడం, అనేకానేక క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసిరావడం, కష్టాలన్నీ దాటుకుని విజయం సాధించడం, ఆ విజయం వెనకనే ఉన్న సభ్యుల మరణపు విషాదం – ఇవన్నీ ఎంతో ఆకట్టుకొనేలా తన పుస్తకంలో చెప్పారు ఎర్లీన్. మరోసారీ మరోసారీ చదవడానికి నేను ఎంచుకున్న పుస్తకాలలో ఇదీ ఒకటి.
ఇహ ట్రెకింగ్ విషయానికి వస్తే ప్రపంచంలోని ట్రెకింగ్ మార్గాలలో అత్యంత సుందరమైనదిగా పేరుపొందిన అన్నపూర్ణ సర్క్యూట్ – ముందే చెప్పుకున్నట్టు 1977 వరకూ అధికారపూర్వకంగా ట్రెకర్లకు అందుబాటులో లేదు. ఆ మాట మొదటిసారి విన్నపుడు నాకు ఆశ్చర్యం కలిగింది. కాస్తంత వివరాల్లోకి వెళితే విషయం అర్థమయింది. ఆ ప్రాంతంలోని గ్రామాలను కలుపుతూ ఎప్పట్నించో కాలిబాటలు ఉన్నాయి. అవి వాణిజ్యప్రయోజనాలకు ఉపయోగపడుతూ వచ్చాయి. కానీ నేపాల్ రాణాలు విదేశీయులమీద పెట్టిన ఆంక్షలు, టిబెట్ సరిహద్దుల్లో రాజకీయ పరిణామాలవల్ల ఏర్పడిన అస్తవ్యస్తత, ఆ తర్వాత పరిస్థితులు మెరుగై టూరిస్ట్‌లు నేపాల్ రావడం – ఈ నేపథ్యంలో ఆ అందాల నడకమార్గం చాలాకాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. 1970 ల ఆరంభంలో మొదలయిన హిప్పీల రాకపోకలు ఒక రకంగా అన్నపూర్ణ సర్క్యూట్‌కు ప్రాణం పోశాయి. ఆధునిక ప్రపంచపు వస్తుకేంద్రిత జీవనవిధానాన్ని అంగీకరించని అమెరికన్ – యూరోపియన్ యువతరం తమదైన జీవనమార్గాలను వెతుక్కుంటూ 1960 లలో యూరప్‌నుంచి బయటపడి, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశాలమీదుగా నేపాల్ చేరుకుంది. అలా చేరుకోవడానికి హిచ్ హైకింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లాంటి సరళ మార్గాలను ఎంచుకుంది. తాము చేరవలసిన గమ్యానికి చేరుకున్నామన్న నిర్ధారణకు అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌ను ఒక ప్రతీకగా రూపొందించుకుంది. అప్పటిదాకా పర్వతారోహకులూ, స్థానికులూ ఉపయోగించిన గ్రామాల్లోని కాలిబాటలు సుందరమైన, అందరూ ఇష్టపడే అన్నపూర్ణ ట్రెక్ మార్గంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కూడా 1977 లో అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌ను అధికారికంగా ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
అప్పటిదాకా అమితోత్సాహంతో సాగిన హిప్పీల రాకపోకలకు 1979 లో రెండు అంతర్జాతీయ పరిణామాలవల్ల హఠాత్తుగా గండి పడింది: ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం; సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణ. అలా హిప్పీల రాకపోకలు నిలచిపోయినా అన్నపూర్ణ సర్క్యూట్ ప్రాచుర్యానికి భంగం కలగలేదు. అప్పటికే ఆ ట్రెకింగ్ మార్గం ప్రపంచంలోని ట్రెకర్లందరికీ తెలిసి వచ్చింది. వారిని ఆకర్షించసాగింది. హిమాలయాల అంతర్భాగపు సౌందర్యాలను చూడడానికి ప్రపంచపు నలుమూలల నుంచీ ట్రెకర్లు రావడం కొనసాగింది. కొనసాగుతోంది. స్థానికులూ ఎప్పట్నించో వాడుతోన్న కాలిబాటలన్నిటినీ అనుసంధించగా అన్నపూర్ణ ప్రాంతపు పర్వతబృందాన్ని కలుపుకుంటూ ఒక సర్క్యూట్ ఏర్పడింది. తూర్పున ఉన్న మర్శియాంగ్దీ నదీలోయగుండా సాగి ఉత్తరశీర్షాన ఉన్న థోరోంగ్‌లా కనుమను దాటుకుని పశ్చిమాన ఉన్న కాలీగండకి నదీలోయలోకి చేరుకొనేలా ఏర్పడిన మార్గమది.
సుందరమైన ప్రకృతి, ఆకర్షణీయమైన హిమశిఖరాలు, పదిమందిలోనూ ప్రాచుర్యం – ఇవి అన్నిమార్లూ ఆరోగ్యకరమైన పరిణామాలకే దారితీయవు. తూర్పున ఉన్న బేసిషహర్‌నుంచి పశ్చిమాన ఉన్న నయాపూల్ వరకూ దాదాపు 220 కిలోమీటర్లపాటు విస్తరించి ఉన్న ఒకప్పటి కాలిబాటలు క్రమక్రమంగా మోటారు వాహనాలకు దారి ఇచ్చాయి. తూర్పున బేసిషహర్‌నుంచి మనాంగ్ దాకానూ అటు పశ్చిమాన నయాపూల్‌నుంచి ముక్తినాథ్ దాకానూ 4×4 జీపులు తిరిగే మార్గం ఏర్పడింది. అంతా కలసి 40 కిలోమీటర్లు మాత్రమే కాలినడకన వెళితే సరిపోయే పరిస్థితి రూపొందింది. అంటే ఒకప్పుడు 16-17 రోజులు పట్టే నడక ప్రయాణం ఇపుడు మూడు-నాలుగు రోజుల్లో ముగించవచ్చన్నమాట.
ఈ పరిణామాలను చూసి, ‘అన్నపూర్ణ సర్క్యూట్ తన పూర్వపు అమాయక వైభవాన్ని కోల్పోయింది’ అని బెంగపడే వారికేం కొదవలేదు. ‘అదేం మాటా? ఈ రోడ్లవల్లే గదా అప్పటిదాకా ఏ సౌకర్యాలూ లేకుండా మారుమూల కునారిల్లుతోన్న గ్రామాలకు విద్యావైద్య సౌకర్యాలూ, తమ పంటలను సులువుగా మార్కెట్‌కు చేర్చే సదుపాయం ఏర్పడుతోందీ’ అనే వాళ్ళూ ఎక్కువగానే ఉన్నారు.
ఈ అభిప్రాయాలూ వాగ్వివాదాల సంగతి ఎలా ఉన్నా మోటార్ జీపులు నడిచే మార్గంలో ధారాపానీనుంచి మనాంగ్ వరకూ మూడురోజులపాటు 54 కిలోమీటర్లు ట్రెక్ చేసిన మనిషిగా నా అనుభవం చెపుతాను. ధారాపానీలో నడక ఆరంభించిన దగ్గర్నించి మనాంగ్ దాకా మేము నడచిన దారిలో మాకు వాహనాలు కనిపించనే కనిపించలేదు. మేము నడచింది మహా ఇరుకు దారి. కాలి నడకకే తప్ప జీపులో ప్రయాణానికి తగిన దారి కానే కాదు. బహుశా జీపులు వెళ్ళే దారి వేరుగా ఉండి ఉండాలి. మా దారిలో అక్కడక్కడ మోటార్ సైకిళ్ళు కనిపించాయి. పాపం ఆ మోటార్ సైకిల్ వాళ్ళు, ‘మీ బృందంలో అలసిపోయిన వాళ్ళని ఎక్కించుకుని తీసుకు వెళ్లమా’ అని అడిగారు కూడానూ. చెప్పొచ్చేది ఏమంటే మేము ఇప్పటిదాకా నడచిన బాట నాగరికత దుష్ఫలితాలు ఏమాత్రమూ సోకని స్వచ్ఛమైన బాట. ఇహ ఇపుడు ఎలాగూ మనాంగ్ చేరాం గదా – ఇహ ముక్తినాథ్ దాకా వాహనాలు, కాలుష్యాలు అన్న మాటే ఉండదు!
మనాంగ్‌లో యెతి గెస్ట్ హౌస్ అన్న హోటల్ మా 35మందికీ వసతి కల్పించింది. చక్కటి సదుపాయాలు ఉన్న ప్రదేశమది. అన్నిటికన్నా ముఖ్యంగా చక్కని వేడినీళ్లు వచ్చే షవర్ రూములు ఉన్నాయి. తనివిదీరా స్నానమాడాం. మళ్ళా మూడురోజుల తర్వాత ముక్తినాధ్ చేరితేగానీ దొరకని విలాసమది.
నేను ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఉన్నా పై అంతస్తులోని గదులు మరికాస్త విలాసవంతంగా ఉన్నాయి. హోటల్ గోడల మీద అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రాల ఫోటోలు ఉన్నాయి – ‘ఊంచాయీ’ అన్న ఎవరెస్ట్ బేస్ కాంప్ ట్రెక్ అనుభవాల గురించి తీసిన హిందీ సినిమా షూటింగ్ కోసం వాళ్ళంతా ఆ మధ్యే మనాంగ్ వచ్చి (ఈబీసీ ట్రెక్ షూటింగ్ కోసం ఏసీటీకి రావడం ఏమిటీ’ అనకండి – సినిమాల్లో ఇవన్నీ సామాన్యమే!) ఈ హోటల్లో ఉన్నారట. అరవైలు నిండిన ముగ్గురు స్నేహితులు (ఆ మూడో మనిషి అమితాబ్ బచ్చన్) తమ గతించిన, సాహసం నిండిన స్నేహితుడికి నివాళిగా అతని చిరకాల కోరిక – ఈబీసీ ట్రెక్ చేయడం – తీర్చడానికి, ఆ ట్రెక్‌ను తామే చేపట్టి విజయవంతమైన వైనం ‘ఊంచాయీ’లోని కథావస్తువు. హోటల్ మానేజర్‌తో కబుర్లు కలిపినపుడు అతను కన్నుగీటి – ‘అవునవును, ఈబీసీ దృశ్యాలు ఏసీటీతో తీసేసారు,’ అని నవ్వేసాడు.
హోటల్ గదిలో ఓ గంటసేపు ఒత్తిగిల్లిన తర్వాత కొంతమంది టీమ్‌మేట్‌లతో కలిసి మనాంగ్ మ్యూజియం చూడటానికి వెళ్ళాను – శనివారాలు శెలవట. మూసేసి ఉంది. అదో నిరాశ. మర్నాడు ఉదయం పదింటికి తెరుస్తారట – అప్పటికి మేమంతా మనాంగ్ వదిలి వెళ్ళి పోతాం.
ఎలానూ మ్యూజియం చూసే పని లేదుకదా, అందరం బజారు వీధి చివరిదాకా నడక సాగించాం. ఆ వీధి ‘పాత’ ఊళ్ళోకి దారి తీసింది. దారిలో చోర్టెన్లు నిండిన చిన్న కుడ్యం కనిపించింది. ప్రార్థనా స్తూపాలు సరే సరి. ఆ ఊర్లో తిరుగుతోంటే మేమంతా హిమాలయాల అంతర్భాగంలో ఇమిడిపోయినట్టూ, నాగరికతకూ దాని విన్యాసాలకూ అందనంత దూరం చేరుకున్నట్టూ అనిపించింది.
ఒక రకంగా చూస్తే నేను మనాంగ్‌తో ప్రేమలో పడ్డాననాలి. కనీసం మరొక్క రోజు ఆ ఊళ్ళో ఉండిపోయి ఊరితో మరింత మరింత స్నేహం చెయ్యాలనిపించింది. అది సాధ్యం కాదని తెలుసు. అసలక్కడ రెండు రాత్రుళ్లు గడపగలగడమే ఒక వరం. ఎన్నో అనుభవాలనూ జ్ఞాపకాలనూ మూటగట్టుకోగలిగాను. నేనే కాదు – అన్నపూర్ణ ట్రెక్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ మనాంగ్ అన్న ఉన్నతశ్రేణి హిమాలయ ప్రాంతపు చిన్న పట్టణం సేదదీర్చి సత్తువ నింపే ఒయాసిస్సు. రాబోయే మూడురోజుల కఠిన సాహసయాత్రకు మానసికంగా సిద్ధపరచే చల్లని తల్లి.
మనాంగ్‌లో ఉన్న మొదటి రోజు మేమంతా సరళంగా గంగపూర్ణ సరోవరం ట్రెక్ పెట్టుకున్నామన్న మాటేగానీ వెళ్లాలంటే ఇంకా ముఖ్యమైన డే ట్రెక్ అవకాశాలు చాలానే ఉన్నాయి. మా బృందంలోని శ్రీని, రమణ, సుభ్ర, సింహం, ‘ఐస్ లేక్’ అన్న ప్రదేశానికి వెళ్లారని చెప్పాను గదా – రోజంతా పట్టిన ట్రెక్ అది. వాళ్ళంతా అలసిసొలసి వచ్చిన మాట నిజమేగానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం లభించిందని ఎంతో సంబరంగా చెప్పుకొచ్చారు. మరువలేని దృశ్యాలట. మరపురాని అనుభవమట. నా వరకూ వస్తే నేను ఇలా తక్కువ సమయం తీసుకునే గంగపూర్ణ వెళ్ళిరావడం, మధ్యాహ్నమంతా ఊరుని ప్రేమించడంలో వెచ్చించడం – బాగా సంతృప్తినిచ్చిన విషయమది. అంటారు గదా – లోకో భిన్న రుచి!
అంతా కలసి భోజనాలు చేసాం. మా గంగపూర్ణ అనుభవాలు, వాళ్ళ ఐస్ లేక్ అనుభవాలు కలగలసి పంచుకున్నాం.
మా పెద్ద గురువు బాబు గురంగ్ మర్నాటి కార్యక్రమ సరళి వివరించాడు. ట్రెక్‌లో ఐదవ రోజున ‘హాయిగా నింపాదిగా పది కిలోమీటర్లు మాత్రమే నడవబోతున్నాం’ అని విని అందరం సంతోషపడ్డాం.
(సశేషం)







