బుడగ

బుడగ నిండా
గాలి ఉంటుంది

అది నచ్చినపుడు ఎగురుతూ
నలుగురినీ వెక్కిరిస్తుంది
నింగిని చుంబించానని
గర్వంగా తలెగరేస్తుంది
కింద పడినప్పుడు
లోకాన్ని నిందిస్తుంది

దానిలో కొందరు
ప్రేమా దయా నింపుతారు
కొందరు అసూయా ద్వేషాలు
లోనికి పంపుతారు

చక్కగా తిరిగే బుడగే
నిన్నటి వరకు
రంగులను ఆరబోసిందే
ఉన్నట్టుండి పేలిపోతుంది
మట్టిలో మాయమౌతుంది

కొన్నాళ్ళో కొన్నేళ్ళో
బుడగలోంచి బయటపడ్డ
ప్రేమలు దయలు
పదిమంది పెదవులపై దివ్వెలై వెలుగుతాయి
అసూయలు ద్వేషాలు
మరకలై మిగులుతాయి