ఛాయ సాహిత్యోత్సవం — 2025

నడిచొచ్చిన దారులను సమీక్షించుకోవడానికీ, నడవాల్సిన దారులను ముందుంచుకుని ప్రయాణానికి సమాయత్తం కావడానికీ ప్రయాణం పట్ల శ్రద్ధ కావాలి. కొత్త నీరు పుష్కలంగా తుళ్ళిపడుతోన్న తెలుగు సాహిత్యరంగంలో, ఇప్పుడిది సమీక్షా సమయం. ప్రచురణారంగంలోనూ, రచయితల చూపుల్లోనూ, రచనా వైఖరిలోనూ మునుపెన్నడూ చూడనంత వైవిధ్యతను చూస్తున్నాం. ఈ వైవిధ్యతను ఉత్సవం చేసుకోవడంతోపాటు, దాన్ని తెలుగు సాహిత్య ప్రయాణానికి అదనపు దన్నుగా చేసుకోవడం పట్ల కూడా దృష్టి సారిస్తూ, తెలుగులో తొట్టతొలిసారిగా — ఒక సాహిత్యోత్సవాన్ని జరపడానికి ‘ఛాయ’ సంకల్పించింది. కన్నడ-మళయాళ-తమిళ-దక్కనీ భాషల సాహిత్యచర్చలను సైతం ఇందులో కలుపుకుంటూ, 50 మంది వక్తలతో, నాలుగు వేదికల మీద, రోజంతా సాగే 16 సమావేశాలకు ఈ అక్టోబరు 25న, అంబేద్కర్ యూనివర్సిటీ వేదిక కానుంది.

వచ్చే మూడేళ్ళ సాహిత్యోత్సవాలకు అంబేద్కర్ యూనివర్సిటీ వెన్యూ పార్ట్నర్‌గానూ, Roots Collegium టైటిల్ పార్ట్‌నర్‌గానూ వ్యవరించడానికి ఒప్పదం చేసుకోవడమే, ఈ ఉత్సవపు కొనసాగింపుకొక హామీ. చర్చా విషయకాలన్నీ సమకాలీన సాహిత్యపటాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించేవిగా ఉండటం గమనించదగ్గది. ఉదాహరణకి, డిజిటల్ యుగంలో సాహిత్య ప్రయాణం. ఈ డిజిటల్ యుగం ఒక్క తెలుగు భాషకు సంబంధించి మాత్రమే కాక, మొత్తం సాహిత్య ముఖచిత్రాన్నే మార్చేసింది, దాని ప్రభావము, అది సాహిత్యానికి ఉపకరిస్తున్న తీరు లోతుగా చర్చించదగ్గ విషయం. రెండవది, తెలుగులో బాలసాహిత్యరంగంలో మరింత పరిశ్రమ జరగాల్సి ఉంది. ఆ అవసరాన్ని గుర్తుపడుతూ, పిల్లల పుస్తకాల రూపకల్పనలో బొమ్మలు, వాటి తాలూకు ఊహల ప్రభావాలు అన్నది ఇంకొక సెషన్ లో చర్చకు రాబోతోంది. చేజారిపోతోన్న లేదా పక్కదారి పడుతోన్న మరొక రంగం, సాహిత్య విమర్శ. అయితే, విమర్శకూ ఏ ప్రశంసా లేదన్న గమనింపు మీద ఆలోచనలను మరొక వేదిక ఆహ్వానించబోతోంది. గురజాడ, కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి మీదుగా ఎందరెందరో పుష్టి కలిగించిన తెలుగు నాటక ప్రక్రియ ఈ రోజున మరుగునపడే ప్రమాదంలో ఉంది. ఆ విషయం మీద విస్తృతంగా విశ్లేషణ జరగాలి. అందులో భాగంగా, నాటకప్రక్రియ ఈవేళ ఎలా ఉందో సమాలోచించుకునే చర్చ మరొక వేదిక పైన జరుగుతుంది. ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోయే ఈ కాలంలో కూడా, అనువాదాలకు సంబంధించి తెలుగు ఇంకా వేగాన్ని అందుకోవలసే ఉంది. ఆ అనువాద ప్రక్రియ మీద, మిగతా భాషల సాహిత్యంమీద స్పాట్ లైట్ పెడుతూ రెండు సెషన్స్ రూపొందాయి. కొత్త రచయితలతో సంభాషణ, ప్రచురణకర్తలతో చర్చ, తెలంగాణా అస్తిత్వం, దక్కనీ వారసత్వం మీద ప్రసంగాలు, ఇవన్నీ తెలుగు సాహిత్య ప్రపంచపు కొత్త పంథాలను కొత్త వెలుగులో చూపించే ప్రయత్నాల్లో భాగమే. పదముగ్గురు ప్రచురణకర్తల పద్నాలుగు పుస్తకాల ఆవిష్కరణలు, సాహిత్య అభిమానుల ములాఖాత్, గోరటి వెంకన్న పాటా చిందూ, పుస్తక ప్రదర్శన-అమ్మకాలు, ఫుడ్ స్టాల్స్ .. వెరసి ఇదొక నిండు పండుగ.

‘ఆప్ కీ యాద్ ఆతీ రహీ…’ అంటూ గుండెల్లో తిష్ట వేసుకున్న మఖ్ధూం నుండి, ‘సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’ అని ఏనాడో నమ్మి పలికిన జాషువా దాకా; దళిత స్త్రీవాద సాహిత్యానికి కొత్త ఊపిరులూదిన తాడి నాగమ్మనుండి, ఆంధ్రుల సాంఘికచరిత్రను అక్షరాల కెక్కించిన సురవరం దాకా, మహామహుల్ని స్మరించుకుంటూనే, అలల పయ్యెత్తుల మీదే నిలిచి, ప్రపంచాన్ని ఢీకొనే ఉత్సాహంతో వస్తోన్న 40 యేళ్ళ లోపటి తరాన్ని కలుపుకుంటూ సాగనున్న ఈ సాహిత్యోత్సవ కోలాహలం, తెలుగునాట జరగాల్సిన ఇలాంటి మరెన్నో వేడుకలకు ప్రేరణ. కొత్త కార్యాచరణకు ముందడుగు వేయించే ఉత్సాహం. కొత్త గొంతుకలకు నెలవయ్యే వేదిక. రానున్న ఎన్నో ప్రయోగాలకిది ప్రారంభపదం.

మరిన్ని వివరాలకోసం — ఛాయ సాహిత్యోత్సవం – 2025 చూడండి.