నీవు గొంతెత్తి పాడితే

నీవు గొంతెత్తి పాడితే-
కంటినుండి
కారి పడిన కన్నీటి బొట్టు,
దుఃఖమంతా తుడిచినట్టు

కొండవాలు
అలవోకగా
సెలయేరు జారినట్టు,
కొసరు ఎండలో
ఇంద్రధనువు
వెలిగినట్టు

ఒక్కసారిగా
కలకలం!
ఎక్కడి నుండో-
ఎగిరివచ్చిన పిట్టలు,
గుంపులుగా మూగినట్టు
కొమ్మలపై వాలినట్టు
॥ నీవు గొంతెత్తి పాడితే ॥

చిరుజల్లుగా మొదలై
చినుకులతో వాన తరిమినట్టు,
అనుకోని ఎడారిలో
పెనుతుఫానుగా మారి,
ఉరుములతో మెరుపులతో
కూడి, చివరికి నిలువునా-
తడిచి ముద్దయి పోయినట్టు
॥ నీవు గొంతెత్తి పాడితే ॥

కంటినుండి
కారి పడిన కన్నీటి బొట్టు,
దుఃఖమంతా తుడిచినట్టు

నీది కానిదేదీ మిగలనట్టు,
దారి తప్పిన నౌక
తీరాన్ని చేరినట్టు!

(కచ్, గుజరాత్‌కు చెందిన మూరలాలా మార్వాడా(મૂરાલાલા મારવાડા) అన్న గాయకుడు శివరాత్రి 2024 సందర్భంగా చేసిన గానం విన్నాక రాసిన కవిత ఇది. పాటకు ముందు గాయకుడు అన్నాడు: కచ్ నై దేఖా తో కుచ్ నై దేఖా — రచయిత)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...