జేబు దొంగ

ఆద్యంతాలులేని మహాసముద్రపు హోరు.

మరఫిరంగుల జోలపాట, మత్తుగల మేలుకొలుపు చీకట్ల కోనేట్లో పసరు నీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తిక్షణమా!

మెలకువలోను నిద్దురలోనూ, నీ హృదయపు చీకటి గదిలో మేలుకొన్నవాడు నీ కళ్ళు కునకడం, నీ మెటికలు విరగడం, నీ మెడక్రింద లోయలో చిన్న చిట్టినరం నీడలా చలించడం, ఇవన్నీ గమనించినవాడు అతడే. నీవు నవ్వుతున్న విధంగా నవ్వడం, నీవు ఏడుస్తున్న విధంగా ఏడవడం, ఏమీ తోచనప్పుడు కాళ్ళాడిస్తూ కూచోటం, నీకు నేర్పినవాడు అతడే. ప్రపంచమంతా చీకటి చెరగుకింద నిద్దురలో, దద్దరిల్లిన క్షణాల్లో నీ ఎడమ చేతిని కుడిచేయి ఎరుగని రోజుల్లో అంతా అయోమయంగా వున్నప్పుడు కూచుని కాపలాకాసినవాడు అతడే. ఆకాశంలో నక్షత్రాలూ, భూమిమీద దీపాలూ, రాత్రిరాల్చిన మంచుబొట్లూ, కునుకెరుగని కన్నులలోని కన్నీటిచుక్కలూ, లెక్క బెట్టిన గణితశాస్త్ర పారంగతుడు అతడే. అతడే నీవు సిద్ధంగాలేని సమయాలలో వస్తాడు. నీవు సిద్ధంకాకముందే వెళ్ళిపోతాడు. నీవు స్వాగతపత్రం ఇచ్చిందాకా, కాళ్ళకు నీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసిందాకా ఆగడు. అతడు వచ్చినక్షణం మెరుపు మెరుస్తుంది. ఉరుము వురుముతుంది. తప్ప త్రాగిన తుపానులో ప్రపంచపు పర్వతశిఖరాగ్రాలపై పాలుగారే పసిపాపలు సెలయేళ్ళ జలజలలా పకపకా నవ్వుతూ పరుగెత్తుతారు. ఒక్క క్షణం అంతా వుంటుంది. ఏదీ లేకపోదు. ఆ మనిషి. అతడే మనిషి. మనుష్యమాత్రుడు కాదు గాని కేవలం మనుష్యుడు. ఈ క్షణం ఆకాశం క్రింద ఈ ప్రదేశంలో రెండడుగుల మేర మానవుడా! మానవుడా! కొంచెం కరుణ కావాలికదూ?

అతను తెనాలి స్టేషనులో ప్లాట్‌ఫారం మీద కూచుని వున్నాడు. అతని పేరు ప్రసాదరావు. అతను మెడ్రాసు వెళ్ళే మెయిలు బండి కోసం ఎదురుచూస్తున్నాడు. కాని అతను మెడ్రాస్ వెళ్ళటంలేదు. అతను ఎవరినో పంపించటానికి వచ్చాడు.

రాత్రి తొమ్మిదిగంటలవుతున్నది. బండి రావటానికి ఇంకా అరగంట టైమున్నది. కొంచెం ముందుజాగ్రత్త వున్న ప్రయాణీకులు అప్పుడే ప్లాట్‌ఫారం మీద నిండారు. నిండుతున్నారు. బండి చాలా ఒత్తిడిగా వుండేట్టుంది. పెట్టెలు, పక్కచుట్టలు క్రిందపెట్టి వాటిమీద జనం కూచునివున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది చుట్టలు, సిగరెట్లు కాలుస్తున్నారు. ఇంకా కొంతమంది తీరిగ్గా వేరుసెనగలు, బటాణీలు తింటున్నారు. మధ్య మధ్య పెద్దగా స్టేషన్ గుమాస్తాల, కూలీల కేకలు వినపడుతున్నయ్. ప్లాట్ ఫారాన్ని ఉద్యానవనం అనుకొని పక్కలు చూస్తూ వినోదంగా షికార్లు కొడుతున్నవారు కూడా లేకపోలేదు.

ప్రసాదరావు నేలమీద ముడ్డి ఆనించకుండానే గొంతుకు కూర్చుని వున్నాడు. పై నుంచి ప్లాట్‌ఫారం దీపం కాంతి వలయంగా పడుతున్నది. ఆ కాంతిలో ఎగురుతున్న పురుగులు చుట్లు చుట్టివచ్చి అతని జుట్టుమీద, చొక్కాకు కాలరుసందున వాలుతున్నాయి. అతను విసుక్కొని వాటిని తీసి దూరంగా పారేస్తున్నాడు. కాని పురుగుల పట్టుదలకు హద్దులేదు. అవివచ్చి మళ్ళీ మళ్ళీ వాలుతున్నాయ్. అతను మళ్ళీ మళ్ళీ తీసేస్తున్నాడు.

అతనికి కొంచెం దూరంలో పక్క చుట్టమీద కుదురుగా కూర్చుని వున్నారు పూర్ణచంద్రరావుగారు. ఆయనకు కొంచెం దూరంలో ఆయన భార్య చతికలబడి వున్నది. పూర్ణచంద్రరావుగారికి నలభైఏళ్ళు ఉన్నయ్. భార్యకు కొంచం తక్కువ. కాని ఆయనకంటే ఆమే ఎక్కువ లావుగా వయస్సు వున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె ఒక మాంసపు ముద్ద. ముక్కూ, కన్నులూ అన్నీ పూడిపోయాయి. ఆమె భర్త అంత లావుకాదు. వాళ్లిద్దరిని చూడగానే లక్ష్మీదేవి దయ వాళ్ళమీద లేకపోలేదని తోస్తుంది. ప్రస్తుతం మెడ్రాస్ వెళ్లబోతున్నది పూర్ణచంద్రరావుగారూ, ఆయన భార్య. పూర్ణచంద్రరావుగారికి మెడ్రాసులో ఏదో మంచి ఉద్యోగం అయిందట. అందువల్ల గంపెడు సామాన్లతో బండి ఎక్కడానికి సిద్ధంగా వున్నారు.

పూర్ణచంద్రరావుగారు ఇందాకటి నుంచీ ఏదో మాట్లాడుతూనే వున్నారు. అతను ఊఁకొడుతూనే ఉన్నాడు. ఆయన చాలా సంగతులు చెప్పాడు. మద్రాసులో తను చేయబోయే ఉద్యోగం సంగతి, అందులో ఎంత జాగ్రత్తగా మసలుకోవలసిందీ, లేకపోతే ఎటువంటి చిక్కులు వచ్చేదీ ఇవ్వన్నీ చెప్పాడు. ఇళ్ళ అద్దెలు, ఇళ్ళు దొరకటం ఎంత కష్టమో కూడా హెచ్చరించాడు. ఆంధ్రుల అరవల తగాదాల సంగతి చెప్పి, ప్రస్తుతం అక్కడ ఆంధ్రుల్ని ఎంత హీనంగా చూస్తున్నది కూడా చెప్పాడు. ఇంకా ఏవో చెప్తూనే ఉన్నాడు. ఆఖరుకు ఆయన ఏం చెబుతున్నది కూడా వినటం మానేశాడు అతను. ప్రస్తుతం అతని ధ్యాస అంతా అతని మనసులో ఒక బలవత్తరమైన సమస్యపై కేంద్రీకరించబడి ఉన్నది. ఆ సమస్య కొత్తదేమీ కాదు. అందరికీ తెలిసిందే. అతనికి వయస్సు వచ్చిన దగ్గర్నించీ అతన్ని బాధిస్తున్న సమస్యే అది. అతనికి అర్జెంటుగా కొంత డబ్బు కావలసి ఉన్నది. డబ్బు ఎప్పుడూ కావలసిందే! కాని ఇప్పుడు ప్రత్యేకంగా దానితో అవసరం వచ్చింది.

అతను ఆ సాయంత్రమే వెళ్ళి పూర్ణచంద్రరావుగారిని డబ్బు అడిగాడు. ఆయన ఇస్తాననిగానీ, ఇంత ఇస్తాననిగానీ చెప్పలేదు. అయినా లేదనీ చెప్పలేదు. అందువల్ల అతను ఆశ పెట్టుకొనే ఉన్నాడు. కాని పక్షంలో లేదని చెప్పేవాడేగా? ఈ ఆశతోనే అతను ఆ సాయంత్రమంతా ఆయనతో గడిపాడు. కాని మళ్ళా డబ్బు ప్రస్తావన రాలేదు. పూర్ణచంద్రరావుగారు డబ్బు విలువను గుర్తించినప్పటికీ, దాన్ని ఒక తప్పనిసరి చెడుగుగా, దాని అవసరాన్ని నిర్లక్ష్యంగా చూడాలనే పెద్దమనిషి ధోరణిలో ఉన్నారు. అతనికి మళ్ళా ఆ ప్రస్తావన తెచ్చే సాహసం లేదు. అసలు వచ్చి అడిగినందుకు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నాడు. అందువల్ల అతను మనస్సు ఎక్కడో పెట్టుకొని సాయంత్రమంతా అవకాశం దొరక్క కాళ్ళు గుదులు పట్టిన గుర్రంలా, ఉరకలెత్తుతున్న పూర్ణచంద్రరావుగారి వాగ్ధాటిని భరించాడు. అప్పటికీ చాలక పూర్ణచంద్రరావుగారు అతన్ని తమతోబాటు స్టేషనుకు కూడా రమ్మన్నారు. అతను విసుగెత్తి తప్పుకపోదామని చూశాడు గానీ వీలుపడలేదు. డబ్బులేక, ఉద్యోగం లేక బాధపడుతూ అవసరముండి డబ్బు అడగటానికి వచ్చినవాడి మీద, డబ్బు ఉండి, మంచి ఉద్యోగం ఉండి, అప్పు పెట్టగలిగిన వానికుండే ఆధిక్యత పూర్ణచంద్రరావుగారికి అతనిమీద ఉంది.

సాయంత్రమంతా అతను ఒక రకమైన జ్వరపు మగతలో గడిపాడు. పూర్ణచంద్రరావుగారు మాట్లాడుతున్నంత సేపూ అతను వేటి వేటిగురించో ఆలోచిస్తున్నాడు. అతను ఒకదాని మీద ధ్యాస నిలపలేక పోతున్నాడు. జరుగుతున్నదంతా అతనికి ఒక కలమాదిరిగా ఉంది. అతని డబ్బు అవసరం. డబ్బు దొరక్కపోతే వచ్చే చిక్కులు, అతను డబ్బుకోసం పూర్ణచంద్రరావుగారికి ఇంటికి వెళ్ళటం, అక్కడ ఆయన మాటలు వింటూ కూర్చోడం ఇవన్నీ నిజమే. కాని ఒక రకంగా నిజంకాదు. ఎందువలనోగాని అతను ఆ డబ్బు అడగడానికి వచ్చింది, డబ్బు అవసరం కలిగి ఉన్నదీ, డబ్బులేక వచ్చే కష్టాలు అనుభవించపోతున్నదీ తానేనని భావించలేక పోతున్నాడు. జరుగుతున్నదంతా అతనికి దూరంగా ఎక్కడో ఉన్నట్టు తట్టసాగింది. తనకేమీ ప్రసక్తిలేనట్టు అనిపించ సాగింది. కాని ఒక ప్రక్క ఇదంతా తనకు సంభవించిందేనని అతనికి తెలుసు. ఈ విధంగా అతను కొంత కాలం నుంచి రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నాడు. అందులో ఒక ప్రపంచం రెండోదాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది. ఈ రెండు ప్రపంచాలకూ మధ్య వంతెనలాగా అతని డబ్బు అవసరం. అది ఒక బ్రహ్మాండమైన నీడలా రెంటినీ తనలో లీనం చేసుకొంటున్నది. బాహ్య ప్రపంచంతో అతనికి సంపర్కాన్ని కలిగిస్తూ గూడా, ఆ సంపర్కాన్ని తనతో నింపివేసి కల్మష పరుస్తున్నది. అతను ఆవేశంలోగాని ఉద్రేకంలోగాని లేడు. అతనికి ఏదో లోపలినుంచి విపరీతమైన తొందర పట్టుకొన్నది. ఆ తొందర నుంచి ఎంత తొందరగా బయటపడదామా అని అతను తొందర పడుతున్నాడు. అందువలన అతనికి ప్రపంచంలో మిగతా వ్యవహారాలూ, మామూలు సంగతులూ మాయగా తనకు పట్టనట్టుగా కనిపిస్తున్నయ్.

సాయంత్రం పూర్ణచంద్రరావుగారి మాటలు వింటూనే అతను డబ్బు దొరకటానికి ఇతర మార్గాలన్నీ ఆలోచించాడు. అతను ఒక్కొక్కమార్గాన్నీ తీసుకొని పూర్వపరాలన్నీ ఆలోచించి, ఎంతో నిదానంగా, బుద్ధిపూర్వకమైన ప్రశాంతితో ఒక్కొక్కదానికీ నీళ్ళు వదులుకున్నాడు. అప్పుడప్పుడు అతని మనసులో ఏదో మూలనుంచి ఇలా అయితే బాగుండునని, అందువల్ల ఇలా అవుతుందని, మారువేషం వేసుకొన్న ఆశ దొడ్డిగుమ్మంలోంచి ప్రవేశించాలని చూసింది. కాని అతను ఎంతో నిర్దయతో దానిని అణచివేశాడు. అతనికి తననుతాను మోసపుచ్చుకోవటంలో నమ్మకం లేదు. ఆఖరుకు ఏమార్గం అనుసరించినా లాభంలేదని తెలుసుకున్న తరువాత అతను ఒకరకమైన ప్రశాంతిలో పడ్డాడు అతని చికాకులూ, దిగుళ్ళూ వదిలిపోయినట్టు తోచింది. అప్పుడు అతని మనస్సు ఇదివరకు అతను ఎన్నడూ గమనించని విషయాలు గమనించసాగింది. మాట్లాడేటప్పుడు పూర్ణచంద్రరావుగారి మూతి వంకరగా ఒక ప్రక్కగా ఎందుకుపోతుందా అని ఆశ్చర్యపడసాగాడు. అతను ఈ విషయాన్ని ఇదివరకు ఎందుకు గమనించలేదా అనుకున్నాడు. మూతికి అవతల వేపున కూడా ఒక గీటులా ఉంది. కాని అది అంతలోతుగా లేదు. ఒకవైపు బుగ్గ కొంచెం ఎత్తుగా లేచింది. అందువల్ల పెదిమలు ఎత్తుగా పైకి, ఒక పక్కకు కదలినయ్. మధ్యలో లోతుగా అర్ధచంద్రాకారంగా ఒకగీటు ఏర్పడింది. అది ఒక చిరునవ్వు కావచ్చు. లేక నిర్లక్ష్యంతో కూడుకొని వ్యంగ్యపూర్వకమైన ఒక సూచన మాత్రం కావచ్చు. తన త్రోవ తాను కనుక్కోగలననే ధీమా!

అతని అవ్యక్తంలో కదులుతున్న నీడ కొంచెం చిక్కనయింది. అతనికి తన ఇంటివాడిముఖం కనబడింది. ‘ఏమండీ రెండు నెలల అద్దెబాకీ! ఇంకా ఎన్నాళ్ళని వూరుకోను? ఎప్పుడు వచ్చి మాట్లాడుదామన్నా గది తాళం వేసి ఉంటుంది. పోనీ, ఊరకే ఉండకపోతే, మరేదైనా ఉద్యోగం చెయ్యగూడదటండీ!’ కానీ అది అంత కష్టమైన విషయం కాదు. ఇంటివాణ్ని ఎలాగో అలామాటలతో సరిపుచ్చవచ్చు. మంచిగా నాలుగు కబుర్లు చెప్పితే ఇంకా కొన్నాళ్ళ దాకా ఊరుకుంటాడు. ఇబ్బంది కిళ్ళీకొట్టువాడితోనే. ఇరవై ఏడు రూపాయలు. అసలు వాడి కొట్టెంత కొట్టు? వాడికి తన మీద ఎంత నమ్మకం! ఉలకడు. పలకడు. మొన్నమాత్రం “బాబుగారూ! లెక్క యిచ్చారు కారు. కొంచెం ఇబ్బందిగా ఉంది’ అన్నాడు. వాడు ‘కొంచెం’ అన్నాడంటే ఎంత ఇబ్బందిగా ఉండి ఉండాలి!

అతను గొంతుక్కూర్చున్నవాడల్లా కదిలాడు. నడుము నొప్పిపట్టినట్టుంది. కాళ్ళు పీకుతున్నయ్. భారమంతా మోయటంవల్ల కుడికాలు బొటనవ్రేలు నరంలాగుతున్నది.

అకస్మాత్తుగా మెరుపులవరదలా, బ్రహ్మాండమైన కెరటంలా బాహ్య ప్రపంచస్మృతి అతనిమీద విరుచుకుపడింది. బండి వస్తున్నట్టుంది. ఫ్లాట్‌ఫారం రూపం అకస్మాత్తుగా మారిపోయింది. వందలకొలది తలకాయల లేచినుంచున్నాయి. క్రిందకూచున్న అతనికి తనచుట్టూ భూమిలోంచి లెక్కలేనన్ని చెట్లు మొలచుకొచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దవై ఆకాశమంత ఎత్తయినట్టు తోచింది. పిల్లవాడు కళ్ళు తెరచి చూచేటప్పటికి తనచుట్టూ మహారణ్యమయినట్టు అనిపించింది. ఒక్క అరక్షణంలో అతనికీ, ఆ సాయంత్రం గడచిన గడియలకూ, సంబంధం తెగిపోయి మధ్య అఘాతం ఏర్పడింది. పూర్ణచంద్రరావుగారు సాయంత్రమల్లా చెప్పినమాటలూ ఆతని ఆలోచనలూ, ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అతిథిలా ఒక్క క్షణం వాకిలి దగ్గర ఆగి, ఒక యిష్టంలేని వెనకచూపుతో మనస్సులో ప్రతిధ్వనులతో సహా చెరిగిపోయాయి. ఫ్లాట్‌ఫారం కూలీల అరుపులూ, ట్రాలీబండివాళ్ళ తొలగమనే కేకలూ, యాత్రికుల, ఆడవాళ్ళ కేకలూ, అరుపులూ నానాజాతుల నానా భాషల ఆక్రందనంలా అతని యింద్రియానుభూతిని ముంచేశాయి. ఆ హడావుడి, ఆ తొందర అతన్ని కూడా పట్టుకొంది. పూర్ణచంద్రరావుగారి ‘బండి వస్తున్నది. లే’ అని కేకతోపాటు, అతను తనంతటతానే లేచి నుంచున్నాడు. బండి వచ్చింది కొన్నివందల కాళ్ళు చేతులూ పెట్టెల దరవాజాల దగ్గర కొట్టుకోసాగినై. అతను నడవనవసరం లేకపోయింది. జనమే అతన్ని ముందుకు తోసుకుంటూపోయారు. అతను గట్టిగా ఊపిరిపీల్చి తెప్పరిల్లి చూచేటప్పటికి తను రెండవ తరగతి పెట్టె ముందు కమ్మీలు పట్టుకొని నిలబడివున్నాడు.

లోపల ఒక సీటు మీద బెడ్డింగు సగం పరుచుకొని పూర్ణచంద్రరావుగారి భార్య నిండుగా కూచుని వున్నది. పూర్ణచంద్రరావుగారు వాకిట్లో నిలబడి ఏదో చెపుతూ జేబులో చెయ్యి పెట్టాడు. ఆయన చెయ్యి బయటకు వచ్చింది. అతని దృష్టంతా చేతిమీదే వున్నది. ఆ చేయి మెల్లగా తన చేతిలో ఏదో పెట్టింది. ఒక ఐదురూపాయలనోటు. అతను ఏమీ మాట్లాడలేకపొయ్యాడు. అతని మనసులో మొట్టమొదట కలిగిన భావం వద్దందామని. కానీ వద్దనలేకపొయ్యాడు.

డబ్బుమీద ఆశవలన కాదు. ఐదురూపాయలు అతన్ని గట్టెక్కించలేవు. అతను వద్దనే శక్తి లేకనే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇది ఒక అవమానంకింద లెక్కగాదు. ఇప్పుడు ఆయన ఐదు ఇచ్చినా వంద ఇచ్చినా ఒకటే. ఆ ఐదు తను తేలిగ్గా తిరిగి ఇచ్చివేయొచ్చు. కాని అందువలన ఇచ్చినాయన బాధపడినట్టు మొఖం పెట్టడం, తమ కోపం ప్రదర్శించడం, ఇద్దరి మధ్యా తప్పనిసరిగా పెంచుకోవలసిన ద్వేషం, ఇవన్నీ తలచుకొనేటప్పటికి అతనికి పరమ అసహ్యం వేసింది. ఆ పరిస్థితిలో అభిమానం ఒక ఆడంబరంగా తోచింది. ఇంకొకప్పుడయితే ఇలాంటిది జరిగినపక్షంలో అతను చాలా నొచ్చుకొని కోపగించుకొని ఉండేవాడేమో? కాని ఇప్పుడు అలా అనిపించలేదు. సాయంత్రం నుంచి జరుగుతున్న దానికి అది అనివార్యమైన, క్రమాగతమైన చరమ పర్యవసానంలా తోచింది. ఇలా జరగవలసిందే ననుకున్నాడు అతను. పెదవికూడా కదల్చలేకపొయ్యాడు.

రైలు కూతవేసింది. పూర్ణచంద్రరావుగారు వెళ్ళొస్తానని చెప్పారు. అతను జవాబు కూడా చెప్పలేకపొయ్యాడు. చెయ్యి ఊపటానికి కూడా సిగ్గువేసింది. దూరంగా కనుపించిన సినిమా బొమ్మల్లా కదలిపోతున్న రైలు కిటికీల్లోంచి కనిపించి, చీకట్ల సుడిగుండంలో ఒక్కొక్కటే మాయమవుతున్న మొఖాలను చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఒక నిమిషం తరువాత అక్కడ ఏమీ లేదు. ఎదురుగా షెడ్డు మీద నుంచి అకస్మాత్తుగా తెరతొలగించినట్టు, నక్షత్రజటితమైన సఘన నీలాకాశం కనుపించసాగింది. కూలీలు రైల్వే వంతెన నీడల క్రింద, తమ విశ్రాంతి స్థలాలకు కదలిపోసాగారు. అతను వెనక్కు తిరిగి, ఉన్న కొద్దిమంది జనాన్నీ తప్పుకొని, గేటు దగ్గర ఫ్లాట్‌ఫారం టికెట్టు ఇవ్వాలన్న సంగతికూడా మరిచిపోయి వెళ్ళసాగాడు. టిక్కెట్టు అడిగేటప్పటికి అతని చేతులు తొందరలో జేబులు తుడుముతూ బయటకు రాలేకపోతున్నయ్. ఎలా అయితేనేం ఆ యాతననుంచి బయటబడి వంతెన మెట్లు ఎక్కసాగాడు. అతని మనస్సులో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడదామా అనే భావమొక్కటే పనిచేస్తున్నది.

కాని మెట్లమీద కాళ్ళు తేలిపోతున్నయ్. తేలుతున్నట్టు ఉన్నప్పటికీ కాళ్ళు ఎంతో బరువుగా లేవలేనట్టుగా కూడా ఉంది.

వంతెనదిగి గుర్రపు బండివాళ్ళనూ రిక్షావాళ్ళనూ తప్పించుకొని, అతను చల్లగాలిలో ఒకసారి అప్రయత్నంగా, గట్టిగా ఊపిరిపీల్చి ఇనుప చువ్వల రైల్వే ఫెన్సింగు పక్కనే మెల్లగా నడవసాగాడు. ఇక ఇప్పుడు తొందరలేదు. అతను మెల్లగా ఇష్టం వచ్చినప్పుడే తన గదికి చేరుకోవచ్చు.

చల్లని దమ్ములో, ఉమ్ముల మధ్య, గుర్రపు లద్దెల పేడ కుప్పల మధ్య, నడుస్తూ అతను అకస్మాత్తుగా రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స్పర్శ అనుభవించాడు. ముందురోడ్డుకు కుడివైపున వరుసగా షాపుల్లోని విద్యుద్దీపాలు మెరుస్తున్నయ్. ఎడమవైపున స్టేషన్ లైట్లకు దూరంగా, నీడల్లో నల్లనిచెట్లు కొంచెం కొంచెంగా ఊగుతున్నయ్. ఒక ప్రక్కగొందిలో ‘శివాజీహోటల్’ లోంచి గ్రామఫోన్ ధ్వని వినిపిస్తోంది. సముద్రపు నిలవనీరుకంటేగూడా ఎక్కువ నీలంగా వుంది ఆకాశం నక్షత్రాలు నల్లని మొఖమల్ మీద బంగారపు పూలలా మెరుస్తున్నయ్. నగరమంతా మెలకువకూ నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా వుంది. ఈపాటికి ఎక్కువమంది నిద్రపోయి వుండరు. కాని అంతా నిద్రపోదామని ఆశిస్తూ వుండి వుంటారు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి వుంకిస్తూ వుండి వుంటారు. ఈ నీడల నాటకరంగం మీద కలల కాంతిలో జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చినవాళ్ళందరూ ఒకే ఒక హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచనలేదు. లేదనటంలేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చిన వాడెవ్వడూ ఉత్తచేతులతో తిరిగి వెళ్ళడు. ఇదే రోజువారీగా చేసే యాత్రల గమ్యస్థానం.

ఒక కుక్క అతని ఎదురుగా కుంటుకుంటూ వెళ్ళింది. దాన్ని వెళ్ళిపోనివ్వటానికి అతను ఆగవలసి వచ్చింది. వెనక ఏదో సన్నగా అడుగుల సవ్వడిలా వినిపించింది. మరో కుక్కేమో? అతను తల తిప్పి చూడవలసినంతగా లక్ష్యపెట్టలేదు. అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి. అతను ఠక్కున ఆగి మెరుపులా వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతట అదే ముందుకు దూసుకొని అనాలోచితంగా, ఏదో వస్తువునో జంతువునో పట్టుకొన్నది. ఒక్కక్షణం అతను తన చేతికి చిక్కింది, జంతువో మనిషో ప్రాణంలేని వస్తువో కూడా కనుక్కోలేకపోయాడు. ఆ గుడ్డి వెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడిచెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు.

ఆ కుర్రవాడికి 14, 15 ఏళ్ళుంటాయ్. నల్లగా, అతను నడచివచ్చిన చీకటంత నల్లగా వున్నాడు. వాడు చాలా సన్నగా చూస్తే వీడికేదో జబ్బు అనుకొనేటంత సన్నగా వున్నాడు. ఆకలి అతని మొఖంమీద తాటికాయంత అక్షరాలలో రాసివున్నది. చిరిగిన చొక్కా వేసుకొని వున్నాడు. భుజం దగ్గర చిరుగులోంచి ఎముక పొడుచుకొనివచ్చింది. తల జీబురు జీబురుగా వున్నది. చాలా రోజుల నుంచి మంగలి వాడి ముఖం చూచినట్టులేదు. వాడి నుదురు ఎత్తుగా వెడల్పుగా తారురొడ్డులా మెరుస్తున్నది. పై నుంచి సన్నగా వచ్చిన ముక్కు, కిందకు వచ్చి ఒక బుడిపె మాదిరిగా కట్టింది. ఆశ్చర్యాన్ని భయాన్ని ప్రకటిస్తూ అరవబోయినట్టుగా తెరుచుకొన్ననోరు అలాగే ఉండిపోయింది. అతని కళ్ళు గుండ్రంగా చాలా పెద్దవి. కొత్తగా వాడిమొఖం చూచినవాడికి ముందు ముఖ్యంగా కనుపించేవి అవ్వే! వాడి కుడిచేతిలో అతని జేబులోంచి ఇప్పుడే తీసిన ఐదు రూపాయలనోటు నలిగి ముడతలుబడి గట్టిగా చిక్కుకొని వున్నది. వాడు దాన్ని ప్రపంచమంతా లాక్కోటానికి వచ్చినా వదలకుండా వుండేటంత దృఢనిశ్చయంతో పట్టుకొని వున్నాడు.

అతను ఇదంతా ఒక్క తృటిలో చూచాడు. ఈ వివరాలన్నీ అతని కళ్ళు గమనించకుండా ఉండివుండవు. కాని అతని చూపు వాడి కళ్ళలో లగ్నమయింది. క్రమంగా వాడి చూపు అతని మనసులో క్షణమాత్రం నిలచిన ఇతర వివరాలన్నిటినీ చెరిపివేసి అతను ఇంకా వేటినీ చూడకుండా చేసింది. వాడి కళ్ళు మొఖాన్నంతా ఆక్రమించుకొన్నట్టయి అతను వాటిని తప్ప ఇంకేమీ గమనించలేకపోతున్నాడు. అతను మంత్ర ముగ్ధుడిలా, అలాగ వాటిలోకి చూస్తూ నిలబడ్డాడు. ఆ కుర్రవాడు క్రమంగా అతని దృష్టిలోంచి కరిగిపోయి, ఆ మసక వెలుతురులో రెండు నల్లని, గుండ్రని పెద్ద కళ్ళలో లీనమయి, రెండు బ్యాటరీలైట్ల కాంతిలా, జాలినీ, భయాన్నీ, ఆశ్చర్యాన్నీ, చెప్పతరంగాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ, అతని నిర్దాక్షిణ్యాన్నీ, క్రూరత్వాన్నీ దూషిస్తున్నట్టూ, నిందిస్తున్నట్టూ, చూస్తూ అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఎంతకాలం గడిచిందో తెలియదు. ఆ వ్యవధిలో అతను ఆ రెండు కళ్ళలోని అగాధమైన నిరాశల కారుణ్యాన్ని తప్ప, అన్నిటినీ మరిచిపోయాడు. ఒక్కక్షణం అతను ఆ ఐదురూపాయల నోటు తనదేననీ, వాడు దాన్ని తన జేబులోంచి కొట్టేశాడనీ గ్రహించాడు. కాని మరుక్షణమే ఆతను అంతా మరచిపోయాడు. భూత వర్తమానాలు చెడిపోయి అతని కళ్ళముందు ఒక తెల్లని గోడ నిలబడింది. ఆ గోడమీద రెండు మచ్చల్లావున్న ఆ కళ్ళకేసి చూస్తూ నిలుచున్నాడు.

తన చేతిలో ఆ నల్లని కర్రపుల్లలాంటి చెయ్యి ఎందుకున్నదో, తను ఎందుకక్కడ నిలబడ్డాడో కూడా అతనికి తెలియలేదు. అతని మనస్సు ఒక్క క్షణం దిమ్మదిరిగిపోయి గాలివానల తరువాత పూలతోటలాగుంది.

క్రమేపీ ద్వేషం లేనికోపం, ప్రత్యేకమైన లక్ష్యంలేని జాలి, జాలితో కూడుకున్న అసహ్యం, ఇంకా విడమర్చి చెప్పలేని అనేక మనోభావాలు దూరాన్నుంచి దగ్గిరగా వస్తున్న మహత్తర సంగీతంలా, మెల్లగా పైకి పొంగుతున్న ఉత్తుంగ తరంగంలా లేచి, విరుచుకపడి అతని మనఃస్థితిని ముంచెత్తాయి. వాటి బరువు క్రింద అతను అల్లల్లాడిపొయ్యాడు. వాటి బ్రహ్మాండమైన ఆకారం ముందు అతను విశ్వరూపాన్ని సందర్శించినవానిలా తన అల్పత్వాన్ని గుర్తించాడు. అతని మనసు ఒకరకమైన సంచలనంతో నిండిపోయింది. అది ఆనందంకాదు. విషాదం కాదు. నిర్లక్ష్యం కాదు. అది ఒకరకమైన మత్తుతో కూడుకొన్న ప్రశాంతి. అది విశాలమైన నిశ్శబ్దం. కాని అందులో వేలకొలది తంత్రులు జీవస్మరణాల చరమ సంఘర్షణలో అత్యంతికానందంతో స్పందిస్తున్నయ్. ఒక్కక్షణం అతను దారిద్ర్య సంపదలూ, జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ, ఆస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ, వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ, అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో, ఒక మానవ జీవిమాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు. ఒక్కక్షణం అతను తనే జేబుదొంగననీ, ఆ కుర్రవాడి జేబు తనే కొట్టినట్టూ అనుకొన్నాడు. ఈ భావం అతని ముఖంమీద అస్పష్టమైన చిరునవ్వు తెప్పించింది. అతని మనస్సులో ఒక అనూహ్యమైన మార్దవం, సర్వాన్నీ భక్షించి వేయగలిగిన వాత్సల్యం ప్రవేశించింది. ఈ విశాల భూతలంమీద కళ్ళు తెరచిన మొట్టమొదటి రోజునుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తిలేదు. ఈ భూమిమీద తను బ్రతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు.

అకస్మాత్తుగా అతనిలో, ఆ కుర్రవాడి బుజంమీద చెయ్యివేసి తట్టి బుజ్జగించాలనీ, దగ్గరకుతీసి లాలించాలనీ ఒక బలీయమైన కోరిక కలిగింది. అతను కుర్రవాడి చెయ్యి వదిలిపెట్టి భుజంమీద వెయ్యటానికి చెయ్యిజాచాడు. కాని ఇంతలోనే కుర్రవాడు గిరుక్కున మరలి పిల్లిలా ఒక్క గెంతులో విడిపోయి రివ్వున దూసుకొని, వెనక్కు తిరిగి చూడకుండా చీకటిలో మాయమయ్యాడు. వాడు ఇంకా ఆ ఐదు రూపాయల నోటును గుప్పెటతో అలాగే గట్టిగా పట్టుకొని ఉన్నాడు.

అతను నిశ్చేష్టుడై ఆ కుర్రవాడు పారిపోయి మాయం కావడం అలాగే చూస్తూ నిలబడ్డాడు. తరువాత మెల్లగా వెనక్కు తిరిగి నడవసాగాడు. అతని అడుగులు అలసిపోయినవాడిలా, తాగినవాడిలా, తడబడుతూ పక్క పక్కకు పడుతున్నయ్. విపరీతమైన నిద్ర- దిగిపోతున్న పోటులా హృదయపుటిసుకతిన్నెలను చదును పరచసాగింది. అతను తిన్నగా తన గదివైపు నడవసాగాడు.

వెళ్ళు. అబ్బాయీ! వెళ్ళు, నీ గదిలోకి, రాత్రి చీకటుల చల్లని చెరుగుక్రిందకు, కునుకుతున్న ఆశాదీపాల కెంజాయల క్రీనీడల్లోకి, దుమ్ములోకి, ఉమ్ముల్లోకి వెళ్ళు. భరత నాట్యాల సినిమాపోస్టర్ల, ఆహార ధాన్యాల సరఫరా సమస్యల, వివాహాల, విడాకుల, ఆస్తిహక్కుల, నమ్మశక్యంగాని హాస్యాస్పదమైన వాస్తవిక ప్రపంచంలోకి వెళ్ళు. ఈగలు ముసురుతున్న కోరికల కూపంలోకి, జననమరణాల పేడ కుప్పల్లోకి తిరిగిపో. నీవు ఒక్కక్షణం రాత్రిపూట వచ్చినవాణ్ణి, నీ వాకిటిముందు ముగ్గులు పెట్టి పోయినవాణ్ణి, నీవు నిదురపోతున్నప్పుడు చల్లగా మెల్లగా, తల్లిలా వచ్చి నిశ్శబ్దంగా నీ నొసలు ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయినవాణ్ణి చూచావు. ఒక్కక్షణం అతడు నీ నీరసతధ్యాల చింకిబట్టలు విప్పి దూరముగా పారేసి, స్వీయ తేజస్సుతో నిజస్వరూపంతో నిలబెట్టాడు. బహుశా నీవతన్ని మళ్ళా చూడలేవేమో? అయితేనేం? అతడు ఎల్లప్పుడూ నీ వెంటనే ఉంటాడు. నీ దైనిక జీవితపు భయంకర నిద్రలో అతని ముద్దుల స్పర్శ సహస్రరూప రసగంధ పులకిత స్వప్నసుమాలుగా వికసించి, మానవుణ్ని మానవుణ్ణిగా చేయకలిగిన కళాసాహిత్యాలూ, వేదాంత విజ్ఞానాలూ సృష్టిస్తుంది. బ్రతుకుల ఊబిలోంచి నిన్ను పైకెత్తుతుంది. దేవతుల్యుణ్ణిగా చేస్తుంది.

జాలిగల సంగీతం. ప్రళయ ప్రభవంజనంలో ప్రపంచ పర్వతాగ్రంపై పసిపాపల పకపకలు. ఆటంబాంబుల సన్నజాజులు. అగ్ని పర్వతాల రోజాపూలు. ఈ భూమి చంటిబిడ్డ తూగుటుయ్యెల, యువకుని పల్లకీ, ముసలివానికి తెల్లనిపక్క, వెంబడిస్తున్న స్వప్నంలోని సత్యం.

అహో, జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!