[చలం “స్త్రీ” నూరేళ్ళ పండగ సందర్భంగా ఒంగోలు పుస్తకాల పండుగలో చంద్రలతగారు ఆగస్టు 20, 2025 నాడు చేసిన అధ్యక్షోపన్యాసానికి వ్యాసరూపం — సం.]
ముందుగా ఒక చిన్న ప్రశ్న.
మీ సర్వనామం ఏమిటి?
“అతడు,” “ఆమె,” “అది.”
మిమ్మల్ని ఏ సర్వనామంతో సంబోధించాలి?
ఈనాటి లైంగిక స్పృహ ఎవరి సర్వనామం వారు ఎంపిక చేసుకునే స్వేచ్ఛదాకా ప్రస్థానించింది. లైంగికత శరీరానికి అతీతమైనది అన్నది ఈనాటి లైంగిక చేతన.
చలం మాట ఎత్తగానే, కొన్ని ఏనుగులు వచ్చి నుంచుంటాయి. గదంతా నిండిపోతాయి. అడ్డదిడ్డంగా. వీటిలో కనిపించేవి కొన్నైనా, కనిపించనివి ఎన్నో. ఇప్పుడీ వేదిక ముందూ ఉండే ఉంటాయి ఏనుగుల గుంపులు. ఆ ఏనుగులేమిటో మీకూ కనబడే ఉంటాయి. అవి మీ లోలోనికి చొరబడే ఉండొచ్చు. ఆ ఏనుగులు ఏమిటో మీరీపాటికి గ్రహించే ఉంటారు. పడికట్టు అభిప్రాయాలు. బిగదీసుకున్న ఛీత్కారాలు. నిగడదన్నుకున్న నిర్ధారణలు. విశృంఖలత, విచ్చలవిడితనం, చెడగొట్టే రాతలు, చెడిపోయిన పాత్రలు, ఎగుడు దిగుడు మైదానాలు.
ఇక, చలం తత్వం మాటెత్తితే, ఊడలు దిగిన మర్రిచెట్లు కళ్ళ ముందు మెదలక మానవు. అట్టహాసంగా. నలుసంత మర్రివిత్తు అడవంత చెట్టయినట్టు, నలుసంత చలంతత్వం అసంకల్పితంగా తలలో నాటుకుందంటే, హమ్మో… ఇక చెప్పేదేముంది? అది మంత్రాలమానా, దాని తొర్రలో మాంత్రికుడి పంచప్రాణాలు దాచిపెట్టిన పంచవన్నెల చిలక ఉన్నదా లేదా అన్న వివరాలు ఇప్పుడు అప్రస్తుతం. ఆ ఊడలమర్రే కదా, మన లోలోపలకి ఎక్కడ చొచ్చుకుపోతుందో అన్నభయంతో, గత వందేళ్ళుగా మన మర్యాదాలోకం ముందస్తు జాగ్రత్త ప్రమాదహెచ్చరికలు జారీ చేస్తున్నది. నిజానికి అది మనతో దోబూచులాడుతున్న, మన అంతరాంతరాల్లోని భయం, అభద్రత, సంకోచం, బిడియం.
అయితే, నేలమీద జారి పడ్డ సన్నని సూదినైనా తొండంతో ఎత్తగల సూక్ష్మం, ఆ కొండంత ఏనుగుకే తెలుసంట. విశాలమైన మర్రిచెట్టు నీడలలోనే, మన తెలుగునాట అమోఘమైన తత్వబోధలు, అద్వితీయమైన విద్యావనాలు విరిసాయి కదా. అలాంటి విభిన్న విద్యాతత్వాలతో చలంగారికీ సాన్నిహిత్యం ఉన్నదని గ్రహించాక, మరింత తెలుసుకోవాలని అనిపించింది. నా మటుకు నాకు.
ఇవ్వాళ, చలం ‘స్త్రీ’కి వందేళ్ళని మనం పుస్తకాల పండగలో చర్చించుకోవడానికి సమావేశమయ్యాం. ఒక పుస్తకాన్ని వందేళ్ళ తరువాత తలుచుకొంటున్నాం అంటేనే, మనమెంతో మాట్లాడుకోవాల్సి ఉందన్నమాట. ప్రధానవక్తలు, విదుషీమణులు అరుణ తేళ్ళగారు, మహిళా చేతనకు పూనుకొన్నవారు. తమ స్వచ్ఛందసంస్థతో వారు రచయితగా, సామాజిక ఉద్యమకర్తగా పరిచయం కావడానికి మునుపే, ఒక మంచి మనిషిలా పరిచయం అయ్యారు. ఇక, మరొక వక్త, కాట్రగడ్డ దయానంద్ గారు చిరపరిచిత కథయిత. మంచి పాఠకులు. అభ్యుదయవాది. వారి వారి రంగాలలో నిబద్ధ కార్యాచరణలో నిమగ్నమైన వారు. వారిద్దరూ, చలంగారిని, వారి రచనలని చక్కగా పరిచయం చేయగలవారు. నాకే మాత్రం తెలుసని? అందులోనూ, జగమెరిగిన చలం. వందేళ్ళ అచలాంచల “స్త్రీ”! అయినా, పెద్దలు వల్లూరి శివప్రసాద్‌గారికి ఇచ్చిన మాట ప్రకారం, నా మటుకు నాకు అర్థమయిన చలం కలం గురించి, మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను.
చలం పుస్తకాలను మళ్ళీ చదువుతుంటే, కొత్త వెలుగులు కనబడ్డాయి. కొత్త ఆలోచనలు వచ్చాయి. చలం రచయితగా, తాత్వికుడిగా మనకు తెలుసు. నాకు ప్రధానంగా, ఒక విద్యావేత్తగా కనిపించారు. బిడ్డల శిక్షణ (1924), స్త్రీ (1925) రెండూ కవల రచనలుగా అనిపించాయి. ఒకే పుస్తకంలోని రెండు అధ్యాయాలుగా తోచాయి. ఏ రచనలనైనా, స్థల కాల దేశ సీమితమై ఉంటాయన్న, మౌలిక అవగాహనతో, ఆయా పరిమితులను అర్థం చేసుకొంటూ, ఇవ్వాళకు, రేపటికి అన్వయించుకోగల అంశాలేమైనా ఉన్నాయేమో గ్రహించడానికి ప్రయత్నిద్దాం.
చలం వర్ణార్నవ వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలిసినంతగా, ఆయన వృత్తి జీవితాన్ని గురించి తెలియదు. ఉపాధ్యాయ శిక్షణ పొందాడనీ, స్కూల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయనది సుదీర్ఘ వృత్తిజీవితమని తెలుసు. ఆయన ఈ క్రమంలో ఆనాటి తెలుగునాట ఉన్న బడులెన్నిటినో సందర్శించారు. వాటన్నిటి బాగోగులకు ప్రత్యక్షసాక్షి. చలం వృత్తి కొరకై పొందిన శిక్షణ వివరాలు, వృత్తి నిర్వహణలోని ప్రత్యక్ష అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్ళు, దాటివచ్చిన కంచెలు, పరిష్కరించిన సమస్యలు, ప్రతిపాదించిన ప్రణాళికలు, అవి ఆయన ఆలోచనలపై చూపిన ప్రభావాలు మనకు తెలియదు. ఆయన తెలియజేయలేదు. బహుశా ఆ మౌనం ఆనాటి ప్రభుత్వఉద్యోగికున్న పరిమితులకు లోబడినదేమో.
అది మద్రాసు ప్రెసిడెన్సీ. బ్రిటిష్ రాజ్యం. సర్వత్రా విక్టోరియన్ ప్యూరిటన్ విలువలు. వాటికి అనుగుణంగానే, అటు బ్రహ్మసమాజంలోనూ, ఇటు జాతీయోద్యమంలోనూ, స్వచ్ఛ నైతిక నిబద్ధత మూలస్థంభం. అందులోనూ, పిల్లలన్నా బడిపాఠాలన్నా క్రమశిక్షణ, మర్యాదాబద్ధ నీతిబోధలే కదా. సరిగ్గా అప్పుడే, ఆ మర్యాదాబద్ధ విక్టోరియన్ విలువల్లో వ్యవస్థీకరించబడిన, నైతిక బోలుతనాన్ని పాశ్చాత్య మేధావులు, ఆలోచనాపరులు, అరాచకవాదులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఆనాటి అరాచకవాది ఎమ్మా గోల్డ్‌మన్ (1868-1941) వాదనతో సమాంతరంగా చలంతత్వాన్ని పోలుస్తూ, తులనాత్మక అధ్యయనం చేసారు, డా.భారతి (నూరేళ్ళ చలం, 1994). వారిరువురూ, స్వేచ్ఛావాద రచయితలైన షెల్లీ, ఇబ్సన్, షా, ఎడ్వర్డ్ కార్పెంటర్ వంటి వారిని అభిమానించారు. వారే కాకుండా, చలం మరికొందరు ముఖ్యమైన ఆలోచనాపరులను ప్రస్తావిస్తారు. వారు: ‘జీవితానికి అర్థమేమిటని’ అన్వేషించిన మోరీస్ మెటర్లింక్ (1862-1849), మానవ లైంగికత (హ్యూమన్ సెక్సువాలిటీ, హోమో సెక్సువాలిటీ, ట్రాన్స్ జెండర్ తదితరాంశాలు) మీద అధ్యయనం చేసిన హావెలాక్ ఎల్లిస్ (1859-1939, మానసిక వైద్యంలో కొత్త ఆలోచనలను ప్రాచుర్యంలోకి తెచ్చిన సిగ్మండ్ ఫ్రాయిడ్‌లతో (సైకో అనాలిసిస్, 1856-1939) పాటు… చలంగారిపై, మార్క్స్ ప్రభావం కూడా ఉన్నది.
వీరందరి రచనల ప్రభావం ఒక ఎత్తు. చలంగారెంతో అభిమానంతో తరుచు ప్రస్తావించే, బెర్నార్డ్ రస్సెల్, తొలినాటి ఎల్జిబిటి ఉద్యమకారుడు, ఎడ్వర్డ్ కార్పెంటర్‌ల ప్రభావం మరో ఎత్తు. వారిద్దరి మేధోచింతనలే గాక, వారి వ్యక్తిగతజీవితంలోని ప్రయోగాలు, దాని వలన ఆయన చేయవలసి వచ్చిన సామాజిక ఎదిరింపులు కూడా చలంకు ప్రేరణ అయ్యాయేమో. లైంగిక రాజకీయాలను ఖండించి, విక్టోరియన్ ప్యూరిటనిజపు కుహానా నైతికతను ప్రశ్నించిన వీరందరూ … చలం విస్తృత అధ్యయనం చేసిన ప్రభావం ఈ రెండూ రచనల్లోనూ స్పష్టంగానే కనబడుతుంది.
ఆ తరపు మేధోమధనాన్ని వడపోసి, తేల్చి చెప్పిన సారాంశం ఈ చిన్ని పుస్తకాలు. ఆ మాట స్వయంగా చలంగారే తెలియజేశారు:
“ఈ పుస్తకంలో వ్రాసిన యీ నూతనవిధానంలో చాలా భాగము నేను కనిపెట్టింది కాదు. ఎన్నేళ్ళో శ్రమ పడి, ఎందరెందరో మహామహులు ఆచరణలో పెట్టి, అనుభవానికి తెచ్చుకొన్నారు. నేను పూర్తిగా యీ పద్ధతుల్ని అనుష్టానములో పెట్టలేకపోయినాను.”
“దీనిలో వ్రాసిన పద్ధతులకు కారణాలు వ్రాయాలంటే చాలా శాస్త్రం వ్రాయవలసి ఉంటుంది. చాలా మందికి దానిలో అభిలాష ఉండదని నేను ఆ ప్రయత్నం చేయలేదు” (మొదటి మాటలు, బిడ్డల శిక్షణ, 1924)
మానవ లైంగికత గురించి అంత వివరంగా రాసిన చలం, హావెలాక్ ఎల్లిస్, ఎడ్వర్డ్ కార్పెంటర్ ఉద్యమించిన స్వలింగ సంపర్కత్వం గురించి, స్వలింగ సంపర్క హక్కుల గురించి దాటవేసారెందుకో. ఆనాటికి ఆయా ఆలోచనాపరుల రచనలు ఎంతమేరకు చలంగారికి అందుబాటులోకి వచ్చాయో ఆ సమాచారం లేదు. పైనుంచి, బ్రిటిష్ ప్రభుత్వ సెన్సార్ లను దాటుకొనివచ్చిన రచనలెన్నో సంక్షిప్తంగాను సరళంగాను వచ్చేవి. ఆయా పరిమితులను అర్థం చేసుకొంటూనే, చలం వ్యక్తిగత జీవనం, వృత్తిజీవితాల్లో ఆయనకు ఎదురయిన అనుభవజ్ఞానం, అపార దార్శనికత ఆయన పటాటోపం లేని రచనల్లో కనబడతాయి. ముసుగుల్లేని సత్యాన్ని ముందు నిలుపుతాయి. పైగా, డా.రంగనాయకమ్మ వలన స్త్రీ శిశు వైద్యము, శరీరశాస్త్రాలు ఆయనింటి పుస్తకాలే. ఆయా శీర్షికలను రాయడంలో, ఆ వైద్యజ్ఞాన ప్రభావాన్ని, వైద్యుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని గుర్తించాలి.
వైద్యశాస్త్రం శరీరధర్మాలను సిగ్గుగా, ఎబ్బెట్టుగా, మొహమాటంగా, చెప్పీచెప్పకుండా … చెబుతుందా? అది ‘స్త్రీ’లో శీర్షికల వరసను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కామోద్రేకం, గర్భనివృత్తి, గర్భ విచ్చిత్తి నుంచి సుఖరోగాల వరకు, ఒక్కో అంశాన్ని క్రమబద్ధంగా, చాలా తేటగా, తేలిక పదాలతో, వైద్యశాస్త్ర ధ్వనితో చెప్పారు. ఆ సందర్భాలలో చికిత్సలను, ముందస్తు నివారణా చిట్కాలను, గృహవైద్యాలను కూడా చెప్పడం గమనించాలి. బిడ్డకు పాలు పట్టించడం అయినా, సవాయి రోగమైనా.
ఈనాటి ఆసుపత్రులు వెలువరిస్తున్న పేషెంట్ ఇన్ ఫర్మేషన్ బ్రోచర్లలో ఈ ధోరణిని గమనించ వచ్చును. అయితే, ఈ ఆలోచనలు చలం కలాన్ని దాటి వందేళ్ళు అన్నదే అసలుసిసలు విశేషం! తల్లులలో ఎంతో మార్పు వచ్చింది. విద్యావంతులయ్యారు. విపరీతంగా సమాచారం లభ్యమవుతోంది. శారీరక మానసిక ఆరోగ్యం పట్లా, పిల్లలపెంపకం పట్ల, అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో, ఇలాంటి సున్నితసమాచారాన్ని శాస్త్రబద్ధంగా, సమయానికి తగ్గట్టుగా ఎలా అందజేయాలో విడమరిచి చెప్పే ఈ పుస్తకాలు రెండూ.. ఈనాటి పెద్దలకు పిల్లలకు అవసరం.
ప్రపంచాన్నే కుదిపేసిన సుప్రసిద్ధ రస్సెల్ రచన ‘మారేజ్ అండ్ మోరల్స్’ 1929లో వచ్చింది. అందులో, ‘మ్యారిటల్ రేప్’ అన్నమాటను రస్సెల్ మొదటిసారి వాడారు. అదే సంవత్సరం మనకి ‘శారదా బిల్లు’ వచ్చింది, బాలికా వివాహాలకు వయసుని నిర్దేశిస్తూ. 28 సెప్టెంబర్ 1929 నాడు బాలికలకు 14 ఏళ్ళు, బాలురకు 18 ఏళ్ళు కనీస వివాహ వయసుగా నిర్ణయిస్తూ, శారదా బిల్లు పాస్ అయింది. ఆ వయసు వారిని శిశు వైద్యం పిల్లలుగానే భావిస్తుంది. శారీరక, మానసిక ఎదుగుదల దృష్ట్యా వారు అడోలసెంట్స్ (కిశోర వయస్కులు).
అంటే, అంతకు ఐదేళ్ళ ముందే వచ్చిన ‘బిడ్డల శిక్షణ’ (1924) లోనూ, ‘స్త్రీ’ (1925) లోనూ, చలం ప్రస్తావించిన తల్లులు, బిడ్డలు అందరూ… చిన్నాపెద్ద పిల్లలే కదా!
ముక్కుపచ్చలారని వయసులో పెళ్లి, ఏడాది తిరక్కుండా బిడ్డ. అమ్మైనా నాన్నైనా… ఇద్దరూ బిడ్డలే. మర్యాదా చట్రాల్లో బిగించి, వాళ్ళ మీద జరిగినదంతా హింసే కదా. ఇప్పటి లెక్కలో చైల్డ్ అబ్యూజ్, పిల్లలపై అకృత్యం. ఇవన్నీ, ఏనాటి పురాతన కాలంలో జరిగినవో కావు. ఏదో ఓ మూలన, ఈనాటికీ జరుగుతున్నవే. మన అమ్మమ్మలూ, నాయనమ్మలూ, తాతయ్యల తరమేగా అది.
కందుకూరి, గురజాడ, రఘుపతి వెంకటరత్నం నాయుడు, తదితర సంస్కర్తలందరికీ ఇంటింటా నాలుగు గోడల నడుమ పిల్లలపై జరిగిన అకృత్యాలు, దారుణాలు తెలియకనా? వారి గుండెలవిసి పోబట్టే కదా, అంత సంస్కరణ ఉద్యమాలు చేశారు.
కాగా, “మోహం కలక్క ముందే, బాల్యమందే గర్భాదానాలు కానివ్వడం వల్ల అనర్థాలున్నాయి” అంటూ, మర్యాదను గట్టున పెట్టి, ఇంటా బయటా అని మాత్రమే కాక, పడకింటి నాలుగు గోడల మధ్య కూడా తన కలాన్ని ఝుళిపించే అరాచకపు పనిని చేసిన వారు చలం! అంతే కాదు, బిడ్డలకు, వారి పెద్దలకు మౌలిక లైంగిక జ్ఞానం ఎందుకు అవసరమో మాడు పగిలేలా చెప్పారు. బాలబాలికల శరీరాలపై సర్వత్రా సహజంగా… సమాజబద్ధంగా… యథేచ్ఛగా… సాగుతోన్న హింసను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు కళ్ల ముందు బిడ్డలపై జరుగుతోన్న హింసను గ్రహిస్తే, కోపంతో బద్దలవ్వకుండా ఉండగలమా? చలంగారైనా, మనమైనా?
అందుకే, చలంగారన్నారు, “నా జీవితానికి మూలసూత్రం బాధ.”
“స్త్రీ” లోని “చిన్నపిల్లలకు జ్ఞానం”, ‘బిడ్డల శిక్షణ’ లోని “సృష్టి జ్ఞానము”లలో చెప్పిన అంశాలు, వందేళ్ళ తరువాత కూడా మనం ఇంకా మన పిల్లలతో చర్చించడం లేదు. ఇప్పుడిప్పుడే, ‘గుడ్ టచ్… బ్యాడ్ టచ్’ అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం.
“…యవ్వనం అంకురించే సమయంలో పిల్లలలో (లైంగిక కుతూహలం) కనిపిస్తూ ఉంటుంది. నీతిపరులూ, మందుల వర్తకులు కలిసి, ఈ రెంటినీ చాలా ఘోరంగా చిత్రించారు. వర్ణనలూ, వాళ్ళు పెట్టే భయాలు చూస్తే గుండె బద్దలవుతుంది. కానీ, కామోద్రేకాన్ని ఏం చేసుకోవాలి పిల్లలు? ఆడపిల్లలకి గర్భాలు తెప్పించే కన్నా, ఏమీ తెలియని పసిపిల్లలని ‘రేప్’ చేయడం కన్నా, స్త్రీల నుంచి రోగాలు తెచ్చుకోవడం కన్నా, స్వయం తృప్తి (మాస్టర్బేషన్) నయం కాదా?” (కామోద్రేకం, 140 Pg)
బిడ్డలకు లైంగిక జ్ఞానం చెప్పవలసిన అవసరాన్ని విడమరిచి చెప్పారు. అవి ఇవ్వాళ మనకు ఎంత అవసరమో. లైంగిక స్పృహ మానవసహజం. పిల్లలకీ ఆ జ్ఞానాన్ని దాచిపెట్టినంత మాత్రాన వారు తెలుసుకోకుండా ఉండరు. అపరిచితుల ద్వారా అందుకునే అరకొర జ్ఞానం వారిని ప్రమాదంలో పడేస్తుంది. బాలలపై ఇప్పుడు జరుగుతున్నంత లైంగిక హింస, అకృత్యాలు మునుపెన్నడైనా చూశామా?
శాస్త్రీయమైన లైంగిక జ్ఞానాన్ని అందించినట్లయితే, ఆ తెలివిడి బిడ్డలను లైంగిక అత్యాచారాల గురించి కూడా అప్రమత్తం చేస్తుంది కదా. వందేళ్ళ క్రితమే విడమరిచి చెప్పిన ఆయన కంఠఘోష మనకెందుకు వినబడడం లేదు? పిల్లల పెంపకంలో వారి సూచనల్లో వీసమెత్తైనా, మనమెందుకు అమలు చేయలేకపోతున్నాం? పిల్లల క్షేమాన్ని, భద్రతని కోరే వాళ్ళం, చలం అభిప్రాయాలని ఎలా తోసిపుచ్చగలం? ఎలా కాదనగలం?
అలాగే, మందుల వ్యాపార రంగపు పెట్టుబడిదారీ స్వభావాన్ని, వ్యవస్థీకృతమై పోతున్న ఆయా వ్యాపారాల స్వార్థపన్నాగాల గురించి, భావోద్వేగాల పాచికల గురించి, చలం ఆనాడే పసిగట్టి, హెచ్చరిక చేశారు. అప్రమత్తం చేశారు. ఆ విషాదక్రీడను ఇప్పటికైనా మనం గ్రహించగలుగుతున్నామా?
స్త్రీల, బాలికల శరీరాలపై లైంగిక దోపిడీలోని అనేక సున్నితమైన పొరలను ఆయన కలంతో చీల్చి చెండాడి పారేశారు. ఒక మూఢనమ్మకం ఎంతటి విపరీత ధోరణికి దారితీసిందో ఈ ఉదాహరణలో గమనించండి.
“పిల్ల పాలు కుడుచుకుంటున్నన్నాళ్ళూ, గర్భం రాదన్న సంగతి కొంతమేరకే నిజం. పిల్లలు చచ్చిపోయినప్పుడూ, పాలు ఒదిలినప్పుడూ, పిల్లలకు బదులు తామే ఆ పనిని చేసే పురుషులున్నారు. ఇట్లాంటి నమ్మకాల వల్ల, పెద్ద వాళ్ళమని నీతులు బోధించే ప్రతివాడూ దొంగ.” (182, స్త్రీ)
వంటిమీద ఎటువంటి గాయం కనబడని ఇలాంటి బాలింత బాధితులు, నోరువిప్పి చెప్పలేరనేగా, అలా చేయగలుగుతున్నారు? ఆనాడైనా, ఈనాడైనా. అభాగ్యులపై దౌష్ట్యానికి ఇదొక వికృత పరాకాష్ట. చలం ఎంత సున్నితంగా చెప్పాడో గమనించండి. ఇలాంటి హృదయవిదారక ఉదంతాలు, గుండెను పిండే ఉదాహరణలు… ఈ రెండు పుస్తకాలలో ఎన్నో. అవి ఆనాటికి నిత్యం, సత్యం. ఇప్పుడు మాత్రం? లేనే లేవని తేల్చి చెప్పగలమా?
ప్రకృతి వాది ఫ్రీడ్రిచ్ షెల్లింగ్ చలం ప్రకృతి తత్వాన్ని ప్రభావితం చేస్తే, రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతన విద్యావిధానం, అడయార్ స్కూల్, రిషీవ్యాలీ విద్యావిధానమూ, ప్రకృతి బడుల ప్రభావం ఆయనపై ఉండి ఉండాలి. మాంటిస్సోరి విద్యావిధానం కూడా అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నది.
“పాఠశాలలు అనేవి అందరికీ తెరిచి ఉండాలి. ఈ లోకమే తెరిచి ఉన్నట్టు.”
“ఇంగ్లీష్ బడులకు కాన్వెంట్ అన్న పేరు ఎందుకు వచ్చిందో” అని ఆశ్చర్యపోతూనే, “అబద్ధపు పేరుతో ప్రారంభించిన” ఇలాంటి ఇంగ్లీషు కాన్వెంట్ బడుల నిర్వాకాలను దుయ్యబడతారు. జాతీయ పాఠశాలలలో నేర్పుతున్న సంస్కృతి, సంప్రదాయాల బూజును ఆయన నిర్మొహమాటంగా దులిపేస్తారు. రష్యన్ రెజిమెంటల్ స్కూల్స్ పట్ల సానుకూల భావన వ్యక్తపరిచారు. అవి, ఆయన తరహా బడులు కాబోవు కానీ, చలం బడి అచ్చంగా ప్రకృతి బడి.
చలం భావన చేసింది, ఈనాటి మన ఓపెన్ స్కూల్, హోంస్కూల్ బడుల తరహా గోడలు లేని ప్రకృతి బడి.
“ఒక చిన్న పువ్వు కోసం, గడ్డిపరక కోసం సృష్టి ఎంత ప్రయత్నిస్తుందో, జాగ్రత్త తీసుకుంటుందో (బిడ్డలకు) చూపాలి.”
“ప్రకృతి శాస్త్రంలో (సైన్స్) బిడ్డకు విశ్వాసం కుదర్చాలి. ప్రత్యక్షంగా ఎక్స్‌పెరిమెంట్ వల్ల కాక, మూర్ఖంగా నమ్మాలని అనే సంగతుల్లో చాలా అబద్ధాలుంటాయని తెలియజెప్పడం మంచిది. శాస్త్రాలు మనుషులు చెప్పడం వల్ల గాక, తనంతట తాను చూచి, స్వబుద్ధితో విచారించి తెలుసుకొనే అభ్యాసాన్ని కలుగజేయాలి.” “బిడ్డ ప్రశ్నలు వేస్తుంది. ఒకటే అడగడం.” వాటన్నిటికీ మన వద్ద జవాబులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం తెలుసుకొని పిల్లలకు తెలియజెప్పాలి. తెలియదని ఒప్పుకోవడమూ ముఖ్యమే.
విద్యాబోధనలోనే కాకుండా, పిల్లల పెంపకంలోని అనేక అంశాల్లో ఠాగూరు ప్రభావం కనబడుతుంది. అచ్చం ఠాగూరు లాగానే, నౌకర్లు భయపెట్టడం నుంచి పిల్లలను కాపాడుకోవాలని ఇద్దరూ గట్టిగా చెప్పారు. చలం మరింత గట్టిగా అంటారు:
“మా ఇల్లంతా నౌకర్లమీద, ముఠా వంటవాళ్ళ మీద నడిచేది. ఎన్నడూ ఒక్కరోజు కూడా తాము దగ్గర లేకుండా, పూర్తిగా నౌకర్ల చేతిలోకి వదలకూడదు. ఈ నౌకరుకి పిల్లల మీద స్వతంత్రం ఇచ్చామా, పిల్లల పాలిటి మృత్యుదేవతలే అయినారన్నమాట.”
నౌకర్లూ పిల్లలకు లేనిపోని కథలు కబుర్లతో భయభ్రాంతులకు గురిచేస్తారని అంటారు చలం. అచ్చం ఠాగూరు లాగానే. భయం గురించి ఆయన చాలా విపులంగా రాశారు.
“భయం పోగొట్టడానికి బడి మంచిది. కానీ, పిల్లలని కొట్టే బడికి పంపితే భయాలు ఎక్కువవుతాయి.”
వీళ్ళింత పిరికివాళ్ళుగా తయారయ్యారంటే, ఇలాగే కదా. అందులోనూ బాలికల పెంపకంలో భయం పాత్ర ఇంతంత అని చెప్పలేం.
“ఆడపిల్లలు భయపడడం సహజమనీ, అందమనీ చెప్పి, సిగ్గు, పాతివ్రత్యమూ ఈ పేర్లతో భయాలు స్త్రీలకి నేర్పి, వారిని తమ అధీనం చేసుకొన్నారు. మగవాళ్ళు మాటల్లో కూడా, ‘ఆడదాని మల్లే భయపడతావేం?’ అంటారు. అవన్నీ నశింపజేయాలి.”
ఏ విధంగా భయపెట్టని పెంపకమే ఆరోగ్యవంతమైన పెంపకం అని వారి ఉద్దేశం.
ద్వంద్వ భావనలంటే చలంగారికి అసలు గిట్టదు. ఆయన ఆ రెండు నాలికల ధోరణిని చక్కగా జాబితాలేసి మరీ, చివాట్లు పెడతారు! అది, స్త్రీ గురించయితే, ఇక అగ్గిమీద గుగ్గిలమే.
- అబల, బుద్ధిహీనురాలు, చపలచిత్త, నీచాత్మురాలు, నీచురాలు, కష్టజీవి, పిల్లలని కనే యంత్రం.
- అప్సర, ఈశ్వరాంశ సంభూత, జగన్మాత, పవిత్ర, నిర్మల, సుశీల, శాంత. పురుషునికి సీసం బొమ్మలాగ, నాజూకుగా, సొగసుగా బతకాలి.
‘స్త్రీ’ ఈ రెండు జాబితాలకు మించినదనేగా ఈ రెండు పుస్తకాలు తేల్చి చెప్పేది. ఆనాటి చలం ఈ మాటలు ఈనాటికీ అక్షరసత్యాలే కదా.
కోవెంట్రీ పాట్మోర్ “ది ఏంజెల్ ఇన్ ది హౌస్” సంతోషకరమైన వివాహం యొక్క విక్టోరియన్ ఆదర్శం అయితే, భారతీయ ప్రతిరూపమే గృహలక్ష్మి అయింది. ఇంటికి దీపం ఇల్లాలు అని కదా. ఆ ‘ఏంజెల్ ఇన్ ది హౌస్’ భావన ఎలా పాశ్చాత్య స్త్రీని నాలుగు గోడల నడుమ బందీని చేసిందో, అప్పటికే పాశ్చాత్యులు ప్రశ్నిస్తున్నారు.
“(బిడ్డలకు) శిక్షణ ఇవ్వడానికి ఉత్తమురాలు స్త్రీ. ….వీరు బాగుపడితే గానీ మానవకోటికి గతిలేదు.”
అందుకే కాబోలు ‘బిడ్డల శిక్షణ’, ‘స్త్రీ’ వెంటవెంటనే వచ్చాయి. ఇంటి, వంటింటి, పడకింటి… కిటికీలను తలుపులను బార్లా తీశాయి ఈ రెండు పుస్తకాలు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, తన జీవితకాల ప్రయత్నానికి మూలాలను చలంగారే తేల్చి చెప్పారు. “బడి చదువులకీ, వివాహాలకీ విరోధి అని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. మనిషిని పట్టి పీడించేవి రెండే. చదువు, పెళ్ళి.”
అలాగే, ఆయన అన్వేషిస్తున్న స్వేచ్ఛ ఎలాంటిదో కూడా ఆయనే చెప్పారు. “స్వేచ్ఛ రెండు విధాలు: లోపలిది. బైటది. లోపలి స్వేచ్ఛ ఉన్నవాడికి బయట స్వేచ్ఛతో పని లేదు. అతనికి అంతా స్వేచ్ఛే.”
ఇక, ఏకబిగిన చలం పుస్తకాలెన్నో చదివిన భావోద్వేగంతో పాటు, బోలెడన్ని సందేహాలతో ఆలోచనా స్రవంతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు, చలం తత్వానికి ఒక తాళం చెవిలా అందివచ్చింది, ‘సత్యాన్వేషి చలం’ అన్న పుస్తకం. వెంటనే ఆ పుస్తక రచయిత వీరలక్ష్మిగారితో చర్చించాను. ఆవిడ నా సందేహాలన్నిటినీ తీరుస్తూ, ఒక కాళిదాసు పద్యం నా చేతిలో పెట్టారు:
పురాణమిత్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవమిత్యవద్యమ్।
సంతః పరీక్ష్యాంతరత్ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః॥
(పాతవి కదా అని అన్నీ మంచివి కావు. కొత్తగా వచ్చిన కావ్యం కాబట్టి తక్కువ కాదు. వివేకం గల సజ్జనుడు స్వయంగా పరీక్షించి, నిర్ణయించుకొంటాడు. మూఢుడు బయటివారి మాట మీద ఆధారపడి ఉంటాడు.– కాళిదాసు, విక్రమోర్వశీయం, వాడ్రేవు వీరలక్ష్మి వివరణ)
స్త్రీ, శిశు వైద్యంలో ఈ వందేళ్ళలో ఎన్నో మార్పులు చేర్పులు. ‘నూరేళ్ళ చలం’ పుస్తకంలో, డా. హేమా పరిమిగారు 1994 నాటికి వచ్చిన వైద్యపరమైన మార్పులను వివరించారు. ఆ తరువాత వచ్చిన మార్పులను, చేర్పులను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటికి పాతికేళ్ళకు గానీ, ఫలప్రదం కాని టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగాల గురించి కూడా చలంగారికి తెలుసు.
స్త్రీ శిశు శరీర శాస్త్రాల అవగాహన, చదువు, వైద్యం, పిల్లల పెంపకం, శారీరక మానసిక ఆరోగ్యం, వాటన్నిటినీ గుప్పిట పట్టాలని నిరంతరం ప్రయత్నించే సాంస్కృతిక రాజకీయం, సామాజిక ఘర్షణ, విక్టోరియన్ ప్యూరిటనిజంపై ఎదిరింపు… వీటన్నిటి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ముఖ్యమైన చారిత్రక పత్రాలు ఈ రెండు పుస్తకాలు. ఉదాహరణకు, “గర్భ నివృత్తి”లో ప్రస్తావించిన విధానాల నుంచి ఎంతో పురోగమించింది శాస్త్రం. అలా కాలంతో వచ్చిన మార్పులను అర్థం చేసుకొంటూ, మళ్ళీ మళ్ళీ చదవవలసినవి ఈ రెండు పుస్తకాలు! ఒక్కసారిగా!
ఈ శీర్షికలోని ఏనుగు, మర్రిచెట్టూ కూడా చలంవే. వారంటారు, “అన్నా, వదినా, అత్తా ఎందుకు పూజ్యులంటే, పెద్దవారు కనుక. ఏనుగు, మర్రిచెట్టూ కూడా పెద్దతనం వలన పూజ్యులేనా?” (బిడ్డల శిక్షణ)
ఇప్పుడు చెప్పండి. గదిలోనూ మనలోనూ హఠమేస్తూ బైఠాయించిన మూఢ ఏనుగుల్ని, అడవిలోకి తోలేద్దామా? గుదిబండల్లా పెంచి పోషిద్దామా? జ్ఞానతత్వపు మర్రిచెట్టు నీడల్లోకీ పంపేయవచ్చు. ఎవరిష్టం వారిది. ఎందుకంటే, చలంగారన్నట్లుగా, “మనుష్య స్వభావాన్ని అభివృద్ధి పరిచేందుకు బాల్యమొక్కటే తగిన వయస్సు.”
“ఈ విషయం అంతం లేనిది. నేను చెప్పదలుచుకొన్నది చెప్పాను.” అని అంటోంది చలంగారే కాదండోయ్! నేను కూడా!
సంప్రదించిన పుస్తకాలు:
- స్త్రీ
- బిడ్డల శిక్షణ
- చలం
- నూరేళ్ళ చలం
- సత్యాన్వేషి చలం
- మనస్వి చలం.