ఎన్నున్నా
ఆదిమధ్యాంతరాలు లేని ఆకాశంలో
వేలలక్షల నక్షత్ర మండలాల్లో
ఒక పాలపుంత
పాలపుంత వేలకోట్ల నక్షత్రాలలో
ఒక సూర్య నక్షత్రం
నక్షత్ర మండల వేలలక్షల గ్రహాలలో
ఒక భూగ్రహం
ఆ గ్రహంలో
శ్వాసే ప్రాణంగా
అనేక అవయవాల
అనంతకోటి జీవాలు
ఏ జీవదేహాలకు
ఎన్ని శ్వాసలో?
ఎన్నున్నా
ఆటుపోట్ల
దేహాల సముద్రంలో
అసంఖ్యాక శ్వాసల నౌకలు
ఏవి ఎంత ముందుకు పోగలవో
తెలియని నౌకల
గమ్యం
దూరం
ఒక నిగూఢ రహస్యం!
రచయిత వై. ముకుంద రామారావు గురించి:
9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.