గాలి వీస్తుంది
రాలిపోతాయి కొన్ని;
గాలి స్తంభిస్తుంది
అపుడూ రాలిపోతాయి కొన్ని;
సమయమొచ్చినపుడు మెలమెల్లగా
సద్దుచేయకుండా ఒక్కొక్కటీ.
మట్టిపొద్దులు మౌనంగా నిర్మించిన
సుగంధాల పడవలు
మట్టికొలనులో మునిగిపోవడానికి
పెద్ద పెద్ద అలలతో పనిలేదు
సుతారపు గాలితరగల
తాకిడే చాలు.
కథ ముగిసే వేళకి ఒక్కొక్కటిగా
వేటికవే నిష్క్రమిస్తాయి.
రాలిపోగా… రాలిపోగా…
ఒకానొక సమయంలో
పూతకొచ్చే పూవులేమీ ఉండవు
పచ్చని పరవళ్ళు నిగనిగ మెరిసే
నూగు ఆకులే మిగులుతాయి
వనం లాంటి చెట్టు కొన్నాళ్ళు
ఆకుపచ్చ రాత్రిలో జాగారం చేస్తుంది
చేజారి కనుమరుగైపోయిన
వెన్నెల తునకల కోసం తపిస్తుంది
అదృశ్య హస్తమేదో మళ్ళీ
ఏ మంచు రుతువులోనో
కొన్ని రంగు తుంపర్లను
తొడిమలపై చిలకరించినపుడు
కొమ్మల నిండుగా నవ్వులు
దివ్యమైన దీపాల్లా మెరుస్తాయి
ఆ పూలసొగసుల కాంతిలో
కంటితోటంతా వెలుగుతున్నపుడు
పుడమికి పగలైనా
పూల చెట్టుకు రాత్రయినా
పులకిసలయల గుండె తీరమంతా
పూమొలకల వెన్నెల!