(మధ్య భారత చరిత్రలో జరిగిన కొన్ని చారిత్రక ఘటనల చుట్టూ కల్పన జోడించి అల్లిన కథ)
నేను మహారాణిని. ఒక రాజ్యానికి కాదు. ఒకదాని తర్వాతొకటిగా రెండు రాజ్యాలకు. వాటిలో ఒకటి మహా సామ్రాజ్యం. ఐనా చిన్నప్పుడు పుట్టింట్లో తప్ప నేను జీవితంలో అసలెప్పుడైనా సంతోషంగా ఉన్నానా? నాకు తెలియడం లేదు. అన్నట్టు నాకొక కూతురు కూడా ఉంది. మా పెండ్లిళ్ళ కథ విని మీరే చెప్పండి.
మా కాలపు ఇతర రాకుమార్తెల మాదిరే నాకూ ప్రాయంలో పెండ్లి కుదిరింది. రాజవంశాల్లో కూడా స్వయంవరాల కాలం పోయింది. వధూవరుల ఈడూ జోడూ కంటే వంశ ప్రతిష్ఠలే ప్రధానంగా పెండ్లిళ్ళు జరిగే కాలం వచ్చింది. చాలా మంది ఆడపిల్లల జీవితాల్లో పెండ్లి ఊహకందనంతటి మార్పు తీసుకొస్తాది. పెండ్లితో నా జీవితం ఏ రకమైన మలుపు తిరగబోతున్నదో అని నాకిప్పుడే ఆందోళన మొదలైంది.
ఇతర రాజపుత్ర వంశాల ఏలుబడిలోని రాజ్యాలు ఒక్కొక్కటే పరాధీనమౌతూ వస్తున్నా, కొడిగడుతున్న రాజపుత్రవీరుల శౌర్యపరాక్రమాల గతవైభవ దీప్తులకు ప్రతీకగా నిలిచింది వాఘేల రాజవంశం ఒక్కటే. ఆ వంశానికి చెందిన రాజు సారంగదేవుడు. అతడి తమ్ముడి కొడుకైన కర్ణదేవుడే పెండ్లికొడుకు.
రాజుకు కొడుకుల్లేరు, పెండ్లికొడుక్కు తండ్రి లేడు. రేపు సారంగదేవుడికి కొడుకు పుడితే రాజ్యాధికారం అందని మ్రాని పండే అంటున్నారు అందరూ. రాజ్యానికి రాణిని కావాలనే ఆశ లేదు నాకు. నా భర్త హృదయ సామ్రాజ్యానికి రాణిని అవగలిగితే చాలు. కర్ణదేవుడు ఎట్లా ఉంటాడో తెలియకపోయినా అతడి నడత గురించి కర్ణాకర్ణిగా విన్న ఫిర్యాదుల గురించే ఆందోళనగా ఉంది.
ఇప్పుడు నేను ధవళక నగరపు యువరాజుకు భార్యను. పెండ్లికి ముందు పెండ్లికొడుకు నడత గురించి విన్నదాని కంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నది పదింతలు ఘోరంగా ఉంది. కర్ణదేవుని కాముకతకు హద్దూపద్దూ లేకుండా ఉంది. కన్ను పడిన పడతిని అనుభవించకుండా వదిలిపెట్టని అతడి దౌష్ట్యాన్ని కనీసం మహారాజు సారంగదేవుడైనా అదుపు చేస్తాడనుకుంటే ‘తండ్రి లేని బిడ్డ’ అన్న జాలితో కఠినంగా మాట్లాడలేని బలహీనుడైనాడు. నా వేదన అరణ్యరోదనే అవుతూవుంది. కాలమే అతణ్ణి మార్చాలిక.
ఇప్పుడు నేను రాణి కమలాదేవిని. మహారాజు సారంగదేవుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల కర్ణదేవుడే సింహాసనం ఎక్కినాడు. ఇక నుంచి అతడు ఆడింది ఆట, పాడింది పాట. యువరాజు హోదాలో ఉన్నప్పుడే పట్టపగ్గాలు లేవు అతడికి. ఇప్పుడు ఏకంగా మహారాజు.
రాజ్యభారం నెత్తిన పడినందుకైనా బాధ్యతగా వ్యవహరిస్తాడనుకుంటే అదీ అడియాసే అయింది. మందలించి మంచి త్రోవలో నడిపించడానికీ ఎవరూ లేరు. అతడికిప్పుడు పూర్తిగా పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. పోగాలం దాపురించినట్టే ఉంది. నాకు రాణి అన్న హోదా పేరుకు మాత్రమే. నేను కేవలం రాజు లాంఛనంగా తాళి కట్టిన భార్యల్లో ఒకరిని మాత్రమే. కాకపోతే పెద్ద భార్యను.
ఇప్పుడింకొక కొత్త సమస్య వచ్చి పడింది. మంత్రి మాధవవర్మ ధర్మపత్ని రూపసుందరి సార్థక నామధేయురాలు. కర్ణదేవుడు రాజు కానంతవరకు, ప్రత్యేకించి రూపసుందరి అతడి కంట పడనంతవరకు ఆమె అందం ఒక సమస్య కాలేదు. రాకుమారి చిన్నారి దేవలదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రూపసుందరి రూప లావణ్యాలు కర్ణదేవుడి మతిపోగొట్టినట్టున్నాయి.
అప్పటి నుంచి తరచూ ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని ఆమెను అంతఃపురానికి పిలవనంపడం, అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని బయటపెట్టడం మొదలైంది. రూపసుందరికే కాదు, కళ్ళూ చెవులూ ఉన్నవాళ్ళందరికీ రాజు ఉద్దేశం అర్థమౌతూనే ఉంది. ఇది చివరికి ఎక్కడికి దారితీస్తాదో అన్న దిగులు నాది. కర్ణదేవుడికి పరస్త్రీల మీద కోరికతో పశువుగా మారొద్దని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది.
యుద్ధాల్లో పట్టుబడిన శత్రురాజ్యాల రాణీవాసపు స్త్రీలను, సొంత రాజ్యంలోని సాధారణ స్త్రీలను చెరబట్టిన రాజులు ఉన్నారు. ఎంత బరితెగించినవాడైనా తన సొంత మంత్రి భార్యను కామించేటంత దుర్మార్గుడు ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఇన్నాళ్ళకు ఆ లోటు తీర్చడానికా అన్నట్టు వచ్చినాడు కర్ణదేవుడు.
అది జరగకూడదనే ఒకరోజు నేను గట్టిగా చెప్పబోతే పెద్ద గొడవే జరిగింది. పర్యవసానంగా పొద్దున్నే ఘోరమైన వార్త వినవలసి వచ్చింది. బహుశా ఆరోజు కాకపోతే ఇంకొకరోజైనా జరగబోయేదేనేమో. కాకపోతే ఇంత బీభత్సంగా ఉండకపోవును. పరిచారికలు చెప్పినదాని ప్రకారం:
ఆ రోజు వేకువఝామునే రాజు మాధవుడికి వర్తమానం పంపినాడు – అత్యవసరమైన పని మీద వెంటనే దూరప్రాంతానికి బయలుదేరమని. ఎప్పుడూ లేనిది వేళగాని వేళలో ఈ వర్తమానమేమిటా అని మాధవుడు అనుమానపడినట్టు వార్తాహరుడు వెల్లడించిన సమాచారం. రాచకార్యాలకు వేళా పాళా ఉండని మాట నిజమే గానీ ఈ రాజు ఏ రోజూ రాచకార్యాల మీద శ్రద్ధపెట్టినవాడు కాదే? దేనికోసం పిలిపించినట్టబ్బా? దీని వెనుక ఏదో మర్మముండి ఉండాలని అనుకుని ఉంటాడు తెలివైనవాడు కాబట్టి.
మాధవుడి తక్షణ సమస్య రూపసుందరికి రక్షణ ఎట్లా అన్నదేనని వేరుగా చెప్పనవసరం లేదు. ఉండేదేమో అత్యంత సురక్షితమైన భద్రతావలయంలో కోట లోపలి రాచనగరులో. అనుమతి లేకుండా బయటి నుంచి ఒక్క పురుగు కూడా చేరలేదు. ఐతే అపాయం ఆ కోటనేలే రాజు నుంచే అయితే భద్రత ఏమున్నట్టు?
మాధవవర్మ ముందుగా తన తమ్ముడు రాఘవవర్మ ఇంటికి పోయి, రూపసుందరి రక్షణ గురించి అతడ్ని అప్రమత్తం చేసిన తర్వాతే రాచకార్యం మీద బయలుదేరినాడు.
రాఘవవర్మ తన భార్య గుణసుందరిని వెంటబెట్టుకుని సాయుధుడై వెంటనే మాధవవర్మ ఇంటికి బయలుదేరినాడు. త్రోవలో రాజు నియమించిన సైన్యం ఆపి చీకాకు పెట్టడంతో కొంత కాలహరణం జరిగింది.
రాఘవవర్మ గుణసుందరితో కలిసి మాధవవర్మ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి లోపల పెనుగులాట జరిగిన గుర్తులు స్పష్టంగా కనబడినాయి.
ఇంకొకసారి ఆలస్యం చెయ్యదలచుకోని రాఘవవర్మ గుణసుందరిని అక్కడే వదిలి గుర్రాన్ని రాజభవనం దిక్కు దౌడు తీయించినాడు. ప్రవేశ ద్వారం దగ్గరే భటులు చుట్టుముట్టినారు. సంకుల సమరం జరిగింది. పటాలమంతా ఒక పక్క, రాఘవుడొక్కడూ ఒక పక్క. చివరికి వందమంది ఒక్కుమ్మడిగా మీదపడడంతో రాఘవుడు అభిమన్యుడే అయినాడు.
మాధవుడు తిరిగొచ్చేసరికి ఇంటి ముందు మూడు శవాలు! ఆతతాయికి అందకూడదని ఆత్మార్పణ చేసుకున్న రూపసుందరి, ఆమెను కాపాడబోయి సైనికుల చేతిలో హతమైన రాఘవ, నిర్జీవుడైన రాఘవుణ్ని చూసి గుండె పగిలిన గుణసుందరి.
“పట్టపగలే, నట్టివీధిని
పట్టబోరే జారచోరులు,
పట్టదలచితి వింక నీవొక
పట్టమేలే రాజువట!
కండకావర మెక్కి నీవీ
దుండగము తలపెట్టినందుకు
వుండడా వొక దైవమంటూ,
వుండి వూర్కొనునా?”
ఆరోజు అమావాస్య. పగలు సూర్యగ్రహణంతో చీకటి, రాత్రి వెన్నెల ఎరుగని చీకటి. బహుశా మాధవవర్మ జీవితమంతా చీకటి. ఇటు నాకు భవిష్యత్తేమిటో అర్థం కాని చీకటి.
కర్ణదేవుడు ఈ నడుమ రాణివాసానికే రాకపోవడం నాకు పెద్ద ఉపశాంతి. జరిగిన మారణ కాండకే గుండె నీరవుతూంటే, అంత్యక్రియలైన తర్వాత మంత్రి మాధవ వర్మ జాడ తెలియలేదట. ఎక్కడికి పోయి ఉంటాడు? నైరాశ్యంలో మునిగి అజ్ఞాతంలో ఉన్నాడా? విరాగి అయి, ఊరొదిలిపెట్టి ఉంటాడా? లేక… ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నద్ధుడౌతున్నాడా?
అదే నిజమైతే అసాధారణ మేధాసంపత్తి, చాకచక్యం, పోగొట్టుకోవడానికి ప్రాణాలు తప్ప ఇంకేమీ లేనివాడు కాబట్టి ఎంతకైనా తెగించగలడు. ఆ విషయం కొన్ని వారాల్లోనే తేటతెల్లమైంది.
దిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన దళపతులు ఉలుఘ్ ఖాన్, నస్రత్ ఖాన్లు మాధవుడు దారి చూపగా పటాలంతో బయలుదేరి ఒక్కసారిగా ధవళక నగరమ్మీద విరుచుకుపడినారు.
ఊహించని మెరుపుదాడితో కర్ణదేవుడి సైన్యం కకావికలైంది. రాజు ఉన్మత్తత – సైన్యం ఉదాసీనతతో దిల్లీ సైన్యం పని మరీ సులువైపోయింది. నగరంలోని సైనిక స్థావరాలను, ఆయుధాగారాలను దగ్గరుండి కసిదీరా నేలమట్టం చేయించినాడు మాధవుడు.
కర్ణదేవుడు చేసిన పాపానికి తగిన శాస్తే జరిగింది. తీవ్ర పరాభవం పాలై, కోట నుంచి తప్పించుకునే త్రోవలు వెతుకుతూ అంతఃపురానికి వచ్చిన అతడి పిరికితనాన్ని సహించలేక “రాజ్యాన్ని ఒకపక్క శత్రువులు కొల్లగొడుతూ ఉంటే పిరికిపందలా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోను సిగ్గు లేదా? రాజపుత్రుల పరాక్రమం, మృత్యువే ఎదురొచ్చినా తలొగ్గక ఎదిరించే పోరాట పటిమ చూపించి శత్రువులను ఎదుర్కో” అని చెప్పిన నాకు కంఠశోషే మిగిలింది.
ప్రాణభయం తరుముతూంటే నా మాటలను పెడచెవిన పెట్టి, ఊహించని విధంగా ఉయ్యాలలోని కూతుర్ని ఎత్తుకుని మెరుపువేగంతో మాయమైనాడు కర్ణదేవుడు. కూతుర్ని ఎత్తుకుపోతాడని ఊహించని నాకు తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.
ఆలోపే కర్ణదేవుడు దొడ్డిదారిన తన చిరకాల మిత్రుడు, దేవగిరి పాలకుడు రామచంద్రదేవుని దగ్గర ఆశ్రయం పొందడానికి కూతురితో సహా పయనమైనాడు.
నన్ను యుద్ధఖైదీగా దిల్లీకి తెచ్చినారు. బందీలుగా తెచ్చిన రాచకుటుంబీకులను నవాబు సమక్షంలో హాజరుపరచడం రివాజు. జరిగిన పరిణామాలతో దిల్లీకి వచ్చినా దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోని నన్ను సుల్తాను ఎదుట నిలబెట్టినారు.
నన్ను చూసి ఏమనుకుంటున్నాడో తెలియదు. అసలు నా మనసు ఎట్లుందో నాకు మాత్రం తెలుసునా? రాజ్యం కోల్పోయినందుకు వైరాగ్యమేమీ లేదు గానీ దుష్టుడి చెర వదిలిందన్న సంతోషమో, చెర విడిపించిన ఏలిక పట్ల కృతజ్ఞతో, భవిష్యత్తేమిటో తెలియని ఆందోళనో… నా ఆలోచనల్లో నేనుండగా ఎక్కడి నుంచో చెవులను చేరింది ఊహించని ప్రశ్న:
“రూపసుందరి నీ కంటే అందమైనదా?”
“పంచదార కన్న పరదార తీపి. కండ్ల ముందు పెట్టి అందుకోరాదన్నప్పుడే ఆకలెక్కువ.” నా అసంకల్పిత సమాధానం.
“వహ్వా! నీలాంటి మేలిమి వజ్రాన్ని ఇంట్లో పెట్టుకుని రంగురాళ్ళ వెంట పరుగులు తీస్తాడే?” అనుకోని పొగడ్తకు బోల్తా పడినానేమో, మళ్ళా అసంకల్పిత సమాధానమే:
“రత్నాల విలువ తెలిసిన రత్నకారుడు కాదు కాబట్టి.”
“నేను రత్నకారుడినేనా?”
ఊహించని ఆ ప్రశ్నతో నా నోట మాట రాలేదు. బలవంతంగా కళ్ళెత్తి చూస్తే…
“నాకు నువ్వు కూడా పరదారవే.” నవ్వుతూ అన్నాడు ఖిల్జీ.
ఆ మాటతో కాలమే స్థంభించినట్టైంది. ఏమంటున్నాడితను? నా మాటలతో నన్నే బందీ చేసేటంత చతురుడా?
నేను ఇప్పుడు దిల్లీకి రాణిని. నన్ను కర్ణుడి చెర నుంచి విడిపించినందుకు ఖిల్జీ మీద మొదట్లో కేవలం కృతజ్ఞతాభావం మాత్రమే ఉండేది. కర్ణుడితో పోలిస్తే బహుశా ఎవరైనా మెరుగేనేమో!
నాకు ఇప్పుడు ఒక్కటే దిగులు – నా కూతురు దేవలదేవి గురించి. ఆడవాళ్ళకు మనసుంటాదని, దానికి విలువ, గౌరవం, స్వేచ్ఛనివ్వాలని తెలియని కర్ణదేవుడిలాంటి మూర్ఖుడు, మదాంధుడి దగ్గర పెరుగుతున్న దేవలదేవిని అతడి దగ్గరి నుంచి తప్పించి దగ్గరికి రప్పించుకోవలె. మంచి సమయం చూసి ఖిల్జీని అదే కోరినాను. ఫలితంగా-
పదేండ్ల తర్వాత నా బిడ్డ దేవలదేవిని చూసిన ఉద్వేగంతో నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. ఇక చూస్తానో చూడనో అనుకున్న నా కూతుర్ని పదేండ్ల తర్వాత కళ్ళారా చూసుకుని ఒక కంట ఆనందబాష్పాలు, ఇన్నేండ్ల ఎడబాటును తలుచుకుని మరొక కంట దుఃఖం పొంగుకొచ్చినాయి. తనను ఇక్కడికి తీసుకుని రాక ముందు ఏం జరిగిందో దేవలదేవి నుంచి, ఇతరుల నుంచి తెలిసిన వివరాలు:
దేవలదేవిని తన కొడుకు శంకరదేవుడికి చేసుకోవాలని ఉన్నట్టు రామచంద్రదేవుడు గతంలో ఒకటి రెండు సార్లు కర్ణదేవుడిని అడిగి ఉన్నాడట. ఘనతకెక్కిన రాజపుత్ర వంశానికి చెందిన క్షత్రియుడిననే దర్పం ఇంకా వదలని కర్ణదేవుడికి తన కూతుర్ని ఎంత స్నేహితుడైనా, సమయానికి తనకు ఆశ్రయమిచ్చి కాపాడినా తక్కువ జాతికి చెందిన యాదవుడికివ్వడానికి మనసొప్పలేదట. కుంటిసాకులు చెప్పి కుదరదన్నాడట.
ఈలోగా ‘దేవలదేవిని అప్పగించమని, లేదంటే దిల్లీ సైన్యం దేవగిరి మీద దాడి చేయ్యాల్సి వస్తాద’ని ఖిల్జీ నుంచి రామచంద్రదేవునికి హెచ్చరిక అందింది. నిర్ణయం కర్ణదేవుడికే వదిలివేసినాడు రామచంద్రదేవుడు. కర్ణదేవుడు ఇరకాటంలో పడినాడు. దేవలదేవిని ఖిల్జీ సైన్యానికి అప్పగించడమా లేక శంకరదేవుడికిచ్చి పెండ్లి చెయ్యడమా?
వర్ణాంతర సంబంధం చెయ్యాలంటే ఇప్పటికీ దుస్సహంగానే ఉంది. కానీ ఆలస్యం చేస్తే తురక సైనికులు గతంలో తన భార్యను ఎత్తుకుపోయినట్టే ఇప్పుడు కూతుర్ని కూడా ఎత్తుకుపోతే…? అది మరీ అవమానకరం. ఇప్పుడు ముంచుకొస్తున్న తురుష్కుల దాడి నుంచి కాపాడుకోవాలంటే దేవలదేవిని శంకరదేవుడికిచ్చి పెండ్లిచెయ్యక తప్పదు.
పైగా సైతాన్లు ఎత్తుకుపోయిన తర్వాత ఆమె పెండ్లి కులీనుడితో జరగడం అసంభవం. కచ్చితంగా తురకవాడికే కట్టబెడతారు. దానికంటే శూద్రవంశమే అయినా హిందువైన దేవగిరి యువరాజుకే ఇచ్చి చెయ్యడం మంచిది.
స్వరాజ్యాన్ని, సొంతభార్యను కూడా వదిలిపెట్టి పారిపోయి వచ్చిన తనకు ఆశ్రయమిచ్చింది ఆ శూద్రుడేనని, అప్పుడే తన వీరత్వం, పరువు, మర్యాద అన్నీ ఏట్లో కలిసినాయని గుర్తించడానికి నిరాకరిస్తున్నది అతడి అహం. ఇప్పుడే కొత్తగా తానొక మెట్టు దిగుతున్నట్టు బాధపడుతున్నాడు.
దేవలదేవి పెండ్లిపల్లకీ కర్ణదేవుడి ఇంటి నుంచి దేవగిరి కోట వైపు మెల్లగా సాగుతూవుండగా దుమ్మురేపుకుంటూ వచ్చిన దిల్లీ సైన్యం నిమిషాల్లో పల్లకీతో సహా దేవలదేవిని స్వాధీనం చేసుకుని తమతో తీసుకుని పోయింది.
“నిఖా జరగవలసిన పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చిన దేవలదేవికి వెంటనే నిఖా చేసేద్దాం.” అన్నాడు అల్లావుద్దీన్.
“నిఖా చెయ్యాలంటే సంబంధం చూడాల గదా? ఇప్పటికిప్పుడు పెండ్లంటే…?”
“సంబంధం గురించి ఫికర్ దేనికి? ఖిజ్ర్ ఖాన్ ఉన్నాడు గదా?”
“వాడెవడు?” అనడగబోయి, ఏదో అపశకునం తోచి “ఎవరితో…?” అని అడిగినాను నిర్ధారణ కోసం.
“నా కొడుకు ఖిజ్ర్ ఖాన్. దిల్లీ సింహాసనమ్మీద కూర్చోబోయే నా వారసుడు.”
“ఏమిటీ?” నా గొంతు నేనే భరించలేనంత కీచుగా వినబడింది. “వాళ్లిద్దరికీ వరసెట్లా? అన్నాచెల్లెళ్ళు గదా?”
తాపీగా సమాధానమిచ్చినాడు అల్లావుద్దీన్: “పదేండ్లుగా నువ్వు ముస్లిమ్ సంప్రదాయాలను చూస్తున్నదానివి. వాడు ‘నా’ కొడుకు. నీ రక్తసంబంధం కాదు. అది ‘నీ’ కూతురు. నా రక్తసంబంధం కాదు. నీదీ నాదీ రక్తసంబంధం అసలే కాదు. వాళ్లది మాత్రం ఎట్లయితాది? ఎవరిదీ రక్తసంబంధం కానప్పుడు అభ్యంతరమేముంది?”
“ఐతే మాత్రం? నువ్వే నన్ను పెండ్లి చేసుకుని, నీ కుటుంబం నాదైనాక, నీ కొడుకు, నా కూతురు ‘మన’ పిల్లలైతారుగానీ, ఇదేమి విపరీతం?”
“ఇది విపరీతం ఎంత మాత్రమూ కాదు. దక్షిణ భారతదేశంలో కాఫిర్లు కూడా సొంత భాయీ బెహన్ల పిల్లలకు పెండ్లిండ్లు చేస్తారు తెలుసా? దానికంటే పెద్ద తప్పా ఇది?”
“అదీ ఇదీ ఒకటే ఎట్లా అయితాది?”
“ఒకటి కాదు. కానీ కాఫిర్లలోనే దక్షిణదేశంలోని ఆచారం ఉత్తరదేశంలో అనాచారం. మన ఆచారం కాఫిర్లకు అనాచారం. కాఫిర్ ఆలోచనలు వదిలేసి పెండ్లిపనులు చూడు.” అని, వచ్చిన పని అయిపోయినట్టు వెనుదిరిగినాడు.
కర్ణుడితో ఉన్నదానికంటే మెరుగైన జీవితం అనుకుంటే భౌతికంగా భద్రమైనదే కానీ దిల్లీకి రాకముందు తను నమ్మి, పాటించిన నీతి వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. ఏది నీతివంతం? ఏది నీతిబాహ్యం? నిన్నటి వరకూ నీతిబాహ్యం అనుకున్నదాన్ని నేడు తనలో కలిపేసుకుంటూ విస్తరిస్తాందే నీతి? ఇది రానురానూ ఇంకెట్లా పరిణమించబోతూ ఉందో, నైతికంగా ఎన్ని మార్పులను అంగీకరించాలో, ఇంకా ఎన్ని మెట్లు దిగాలో, ఈ చీకట్లు ఎప్పటికి తొలగుతాయో!
ఒకరి నైతికత ఇంకొకరికి అనైతికంగా పరిణమిస్తున్న ఈ సువిశాల దేశంలో అందరూ ఒకే నీతి పాటించాలంటే అది సాధ్యమా? ఒకవేళ సాధ్యమే అనుకున్నా అది సబబా?? నైతికత – అనైతికతల మధ్య ఉన్నవి నీటి మీది గీతలా లేక దాటరాని లక్ష్మణరేఖలా???
ఇన్ని చిక్కుముడుల మధ్య ఈ పెండ్లి గురించి పెండ్లికూతురు దేవలదేవి అభిప్రాయం ఏమిటన్నది ఎవరికీ అక్ఖర్లేకుండా పోయింది. నాకు కూడా ఆలోచించే శక్తి, అడిగే శక్తి లేకుండా పోయినాయి. చివరికి తన పెండ్లి యాంత్రికంగా నా చేతుల మీదుగా జరిగిపోయింది. తన భర్తకు తండ్రైన నా భర్త ఇప్పుడు నా కూతురికి ఏమౌతాడు?
ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామాలకు ఎట్లా స్పందించాలో కూడా అర్థం కానంత వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లావుద్దీన్ అకాల మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో నా సవతి కొడుకు ముబారక్ షా గద్దెనెక్కినాడు. అతడు రాచరికం కోసం తన మీద కుట్ర పన్నినాడని ఖిజ్ర్ ఖాన్ను చంపి అతడి భార్య దేవలదేవిని బలవంతంగా పెండ్లి చేసుకున్నాడు.
ఆ వాస్తవాన్ని జీర్ణించుకునే లోపు ఖుస్రూ ఖాన్ అనేవాడు ముబారక్ షాను చంపించి రాజ్యాన్ని, దేవలదేవిని చేపట్టినాడు. ఐతే ఈసారి బలవంతపు చెర వదిలినందుకే గాక ఇంకొకందుకు కూడా దేవలదేవి కొంతలో కొంత సంతోషించింది. రాజపుత్రుడిగా పుట్టి, చిన్నప్పుడే ఖిల్జీ సైన్యం ద్వారా దిల్లీకి రప్పించబడి, ముస్లిమ్గా పెంచబడిన ఖుస్రూ ఖాన్ ఖిజ్ర్ ఖాన్ కంటే కూడా మేలే అని భావించింది.
ఐతే మనం ఆగమన్న చోట కాలం ఆగదు కదా? తర్వాత ఐదేండ్లకే ఖుస్రూ ఖాన్ను ఘియాసుద్దీన్ తుఘ్లక్ అంతమొందించి ఖిల్జీ వంశానికి చరమగీతం పాడినాడు. ఆ తర్వాత నేనైనా, దేవలదేవైనా బతికే ఉన్నామో చచ్చామో కూడా ఎవరికీ పట్టలేదు.
ఇప్పుడు చెప్పండి: రాజవంశాల్లో పుట్టి రాణులుగా హోదా అనుభవించిన నేనైనా, నా కూతురైనా పట్టుమని నాలుగు రోజులు సుఖంగా, సంతోషంగా ఉన్నామా?