పద్యం కాలు విరిగిందంటే
పరామర్శించడానికి వెళ్ళాను
మైళ్ళ దూరాల్ని దగ్గర చేసిన పాదాలతో
కుంటుకుంటూ కనబడుతుందేమో అనుకున్నాను
బలిష్టమైన వాక్యం వంటి వెన్నుపూస వల్ల
అప్పటిదాక నిల్చున్న జైన మహావీరుడు కాస్తా
నిటారుగా కూర్చీలో కూర్చున్నట్టుంది
తన్ని తాను
రెండు వేళ్ళ మధ్య పెట్టుకుని
జాగ్రత్తగా పెన్సిలు ములుకులా చెక్కుకునే
పద్యానిది–
నగరం నడిమధ్య చివుర్చే అరణ్య రూపం
ఎత్తైన కొండల బిడారు
మలమూత్రాదుల రొంపిలో పడి
గది మందుల వాసన వేస్తుందనుకున్నాను
దిల్షుక్ నగర్ నలభయ్యో నెంబరులోని
పద్యం ఇల్లు–
నిట్టాడి వొంగిపోయి ఉంటుందనుకున్నాను
తల్లి మాట వినకుండా
వర్షం నీళ్ళలో నానే పిల్లల కేరింతల మధ్య
చిత్తడి చిత్తడిగా
పద్యం –
తెగ పారిం తర్వాత ఆరుతున్న
దిసమొల జలపాతంలా కనిపించింది
వేడి వేడి మిరియాల పొంగలి ముద్ద తిన్న నోటితో
‘ఏ య్యా అమ్మాయీ పిల్లలూ బావుండారా’ అని నోరారా పిలిచింది
పద్యం కళంతా,
కొత్తగా వేసిన గొట్టం బావిలోంచి తన్నుకొచ్చే
నీటి గొంతులో ఉంటుంది
తెనాలి సత్యనారాయణ టాకీసు ఎదురు వండే
బెల్లం జిలేబీలో ఉంటుంది
పద్యం, కూతురి కోసం నాన్న కొనితెచ్చే
ఇసుకలో వేయించిన వేరుశనక్కాయల పొట్లం
పద్యం జున్ను ముక్క
ఉప్పు తేగల కట్ట
రాసినోడికీ చదివినోడికీ ఉనికినిచ్చిన పద్యం
వయసైపోయింది కదా
కోలుకోవడం కష్టమనుకున్నాను
మానవ సౌందర్యాన్నంతా నిండా అరచేతుల్లోకి తీసుకుని
క్షణ క్షణం విరుగుతున్న లోకం కీళ్ళని
సుతారంగా అతుకుతున్న
పుత్తూరు నాటు వైద్యుడు కనిపించాడు
బ్బే పద్యం, ఒఠ్ఠి ఎడ్డిమనిషి
ప్రియమైన పల్లెటూరి బైతు
(ఆగస్టు 31 2025 న శివారెడ్డిని చూసొచ్చాక)